అన్యోన్యం -టి. సంపత్‌ కుమార్‌

‘‘నే వెళతానంటే మీరు వినరు. జాగ్రత్తగా వెళ్ళండి. శ్వాస సరిగ్గా ఆడటం లేదంటూ మాస్క్‌ని కిందకి జరుపుకోకండి. ఇంటికొచ్చేవరకు అట్టే ఉంచుకోండి’’.

‘‘ఎన్నిసార్లు చెబుతావే! తీయనంటే తీయను’’ సంచిని పట్టుకొని నెమ్మదిగా లిఫ్ట్‌ ముందరకి చేరి జేబుకున్న పెన్ను తీసి బటన్‌ నొక్కాడు. లిఫ్ట్‌లోకి దూరగానే అపార్ట్‌మెంట్‌ మెయిన్‌ డోర్‌ ముందర నిల్చొని చూస్తున్న రజని ఇంట్లోకి వెళ్ళి బాల్కనీలోకి అడుగులేసింది. ఆరవ అంతస్తు నుండి కిందకి తొంగి చూస్తుంది. రెండు నిమిషాల్లో గేటు నుండి బయటకి వెళ్తున్న భర్త కనబడేంతవరకు చూసి ఇంట్లోకి కదిలింది రజని. ‘‘నమస్కారం ప్రకాశ్‌రావు గారు, ఎలా ఉన్నారు?’’ మాస్క్‌ ధరించని నోటినుండి పలకరింపు.
మరీ దగ్గరికి వచ్చి పలకరించడంతో ప్రకాశ్‌ రావు ఉలిక్కిపడ్డాడు. ఒక్కసారే నాలుగడుగులు వెనక్కి జరిగాడు.
‘‘నమస్కారం. మీరెలా ఉన్నారు?’’ ప్రతి నమస్కారం చేసి ముక్తాయింపు ప్రశ్నతో అక్కడినుండి వేగంగా కదిలాడు. మాస్కు లేకుండా భౌతిక దూరాన్ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా కదులుతున్న తనకి పరిచయమున్న శరీరాన్ని చూడగానే ఆయనకి సర్రున కోపం వచ్చింది. ప్రతి నిమిషం అన్ని మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నా చదువుకొన్న నాగరికులకి ఎందుకర్థం కావడంలేదో దీర్ఘంగా ఆలోచించుకుంటూ పాల దుకాణం ముందరికి చేరాడు. అక్కడి దృశ్యాన్ని చూడగానే మరోసారి భయపడిపోయాడు ప్రకాశ్‌ రావు.
భౌతికదూరాన్ని పాటించడానికి గీసిన పది వలయాల్లో తొమ్మిది ఖాళీగా ఉన్నాయి. మొదటి వలయంలో నలుగురు ఒకర్నొకరు అంటుకొని పాల పాకెట్లను కొంటున్నారు. ఒక్కతనికే మాస్క్‌ ఉంది. చిరాకుతో ప్రకాశ్‌ రావు వెళ్ళి రెండవ వలయంలో నిల్చున్నాడు. అంతలోనే మరొకతను వచ్చి తన వెనకనున్న వలయంలో నిల్చున్నాడు.
‘‘బాబు రమేష్‌, దూరాన్ని పాటించమను. అందరినీ లైన్లో నిలుచోమను. గుమికూడద్దు.’’
‘‘చెప్పినా వినడం లేదు సార్‌. పాల షార్టేజ్‌ లేదు, సరఫరా పుష్కలంగా ఉంది, అందరికీ దొరుకుతాయి అని అరచినా లాభంలేదు సార్‌’’. ఆ నలుగురిలో చలనం లేదు. తలలు మాత్రం వెనక్కు తిరిగి మాస్కుతో సగం మొహం కప్పుకున్న అరవై ఎనిమిది సంవత్సరాల ప్రకాశ్‌ రావును చూశారు. కళ్ళల్లో కోపాన్ని, అసహనాన్ని గమనించారు. అయినా నాలుగు పాదాల జతలు ఒక వలయంలోనే
ఉన్నాయి. పోటీపెట్టినట్టుగా ఒక్క పాదం కూడా వలయం బయట లేదు!
… … …
రజని ఇంట్లో అసౌకర్యంగా తిరుగుతోంది. భర్త ఇంటికి చేరుకొనేంతవరకు బెంగ. ఏడు పదులకి దగ్గరగానున్న శరీరమాయనిది. నీకు తోడుగా ఉంటామని డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌ ప్రకాశ్‌ రావు కాయంలో పదేళ్ళ కిందే మకాం వేశాయి.
ఫోన్‌ మోగింది. న్యూజీలాండ్‌లో స్థిరపడ్డ కూతురు నుండి.
‘‘ఎలా ఉన్నారమ్మా?’’ రెండు రోజులకోసారి మాట్లాడే కూతురు మార్చి నెలనుండీ రోజుకోసారి చేస్తోంది.
ఐదు నిమిషాలు మాట్లాడాక ‘‘నాన్న కివ్వమ్మా’’ అంది. ‘‘పాలు తేవడానికి వెళ్ళాడే.’’ ‘‘అరగంట తర్వాత మళ్ళీ ఫోన్‌ చేస్తాను.’’
‘నాన్నతో మాట్లాడితే గాని దానికి తృప్తిగా ఉండదు’ అని మనసులో అనుకొంది రజని.
కెనడాలో ఉంటున్న కొడుకు మూడు రోజులకొకసారి ఫోన్‌ చేసేవాడు. నెల రోజుల నుండి రెండు రోజులకోసారి చేస్తున్నాడు.
ప్రకాశ్‌ రావు, రజనిల మధ్య తొమ్మిది సంవత్సరాలకి పైగా తేడా. మూడేళ్ళ క్రితం నలభై సంవత్సరాల పెళ్ళి రోజుని గ్రాండ్‌గా చేసుకున్నారు అంటే తప్పవుతుంది. పిల్లలు చేశారంటేనే కరెక్ట్‌. విదేశాల్లో స్థిరపడ్డ ఇద్దరు పిల్లలు కుటుంబాలతో వచ్చారు. గోల్డెన్‌ జూబ్లీ వరకు ఆరోగ్యాలెలా ఉంటాయోనని బయటకు అనకున్నా పిల్లలిద్దరూ బలపడ్డ డాలర్లతో చిక్కిన రూపాయల్ని ఇండియాలో ధారాళంగా ఖర్చు చేశారు. ఫంక్షన్‌ అయిన రెండు గంటల్లోనే హాలు ఎలా ఖాళీ అవుతుందో, ఈవెంట్‌ అయిన రెండు రోజులకే వారు పౌరసత్వం పుచ్చుకొన్న దేశాలకు వెళ్ళిపోయారు. దగ్గరి బంధువులు మరో రెండు రోజులు ఉండి పిల్లలు లేని వెలితిని తగ్గించారు.
ఇంట్లో ఇద్దరే! సీనియర్‌ సిటిజన్స్‌!!
‘‘వెధవలు ఒక్కరూ పాటించడంలేదు. భౌతిక దూరం కనబడితేనా? మాస్కులు లేవు. కనీసం జేబురుమాలన్నా కట్టుకోరు… ఛ… ఛ…’’ విసుక్కుంటూ కోపంగా రెండు లీటర్లతో ఉన్న సంచిని రజనికి అందించాడు ప్రకాశ్‌ రావు.
రజని గాభరా పడిరది. మహమ్మారి గురించి తెలిసినప్పటి నుండి ఇద్దరూ అలర్ట్‌ అయ్యారు. వయసు రీత్యా సీనియర్లు అతి జాగ్రత్తగా ఉండాలని పదేపదే చెబుతున్న మాటలు రజని ఆలోచనల్లో, చేతల్లో అంతర్లీనమయ్యాయి. ఇటలీ, స్పెయిన్‌ దేశాల పరిస్థితులను చూసి కదలిపోయారు. అగ్రదేశం పడుతున్న అవస్థలని బుల్లితెరపై చూసినా నమ్మలేకపోతున్నారు. ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా, తెలియకుండానే పిరికితనం వారి శరీరాల్లోకి ఇంకుతోంది. భర్త గ్రహించకుండా చాకచక్యంగా ఇంటి, బయటి పనుల్ని రజని ఉత్సాహంతో చేసుకుంటోంది. పరిస్థితులకు అనుగుణంగా లైఫ్‌ స్టైల్లో తెచ్చుకొన్న సర్దుబాట్లు, భర్త శరీరాన్ని బహిర్గతం కాకుండా కంటికి కనిపించని కణం నుండి కాపాడుకోడానికి రజని చేసుకొన్న రక్షణ చక్రం. మహమ్మారి పరిణామ క్రమం అత్యంత వేగంగా కదిలింది. డార్విన్‌ పరిణామ సిద్ధాంతం ప్రతిపాదన కొలత లక్షల కోట్ల సంవత్సరాల్లో ఉంటే మహమ్మారి కేవలం ఒక చోటినుంచి ప్రయాణించి మూడు, నాలుగు నెలల్లోనే 210 దేశాల్లో తన ప్రవేశాన్ని చాటుతూ, విస్తరిస్తూ కోలుకోలేని దెబ్బల్ని కొడుతోంది.
స్వేచ్ఛగా తిరిగేవారికి కొత్త ఆంక్షలు. ఒకరికి కాదు, ఒక ఊరికి కాదు, ప్రాంతానికి కాదు, రాష్ట్రాలకే పరిమితం కాదు, కణం దేశాలని, ఖండాలని చుట్టేసింది. బహు రూపాల్లో ఆంక్షల సంకెళ్ళు.
వయసుమీరిన వారిపై ఆ కణం ప్రభావం ఎక్కువే. రోగ నిరోధక శక్తులు బలహీనంగా ఉన్న వారిపై తన తడాఖా జోరుగా చూపుతోంది. వేలమంది కంటికి కనిపించని కణాలకి పీడితులై కనబడకుండా పోయారు. ఇంకా పోతూనే ఉన్నారు.
ఇంటికే పరిమితమైన రజనికి సంపూర్ణ అవగాహన వచ్చింది. ఎప్పుడూ తన చుట్టూ ఆవరించి ఉన్న పరిస్థితులు సవాలు చేస్తున్నాయి. వీటి గురించే ఆలోచనలు. పిల్లలు దేశంలో లేకపోవడంతో తానే మరింత బాధ్యతగా ఉండాలన్నది పీకుతూనే ఉంటుంది. ఆ కణాన్ని తన భర్తకు సోకకుండా చూడాలి. అదే ఇప్పుడున్న ఆశయం.
… … …
ప్రకాశ్‌ రావు దినచర్యల్లో మార్పు. రజని తనకంటే దాదాపు పది సంవత్సరాలు చిన్నది. అరవై అంచుల్లో. తాను జీవితాన్ని చాలానే చూశాడు. ఉద్యోగరీత్యా దేశవిదేశాలని తిరిగాడు. ఆ మాయదారి కణం తననెప్పుడు అంటుకొంటుందో తెలియదు. చెప్పి రాదు. అంకెల్ని చూస్తే వృద్ధులే తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయారు. ప్రతిరోజూ వెళ్ళిపోతూనే ఉన్నారు.
రజనిని ఎలాగైనా కాపాడుకోవాలి. ప్రకాశ్‌ రావు తనలో తానే ఎన్నిసార్లనుకున్నాడో. ఏ ఏ పనులకి రజని తరచుగా వెళ్తుందో సీరియస్‌గా గమనించడం మొదలుపెట్టాడు.
అందమైన అపార్ట్‌మెంట్‌ జీవితాల్లో అపశృతులు. మేనేజ్‌మెంట్‌ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. దినపత్రికలు లోపలికి రాకుండా చేసుకొన్నాయి. జీవితాలని సౌకర్యం చేసే పని మనుషులు, హెల్పర్స్‌ బంద్‌. పూర్తి నిషేధం. హోం డెలివరీలకు ఫుల్‌ స్టాప్‌. ఎవరి పని వారే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. తరాలుగా వస్తున్న జెండర్‌ పనులన్నీ మెల్లగా మారుతున్నాయి. తటస్థత వైపు అడుగులేస్తున్నాయి. సడలింపు సమయంలో సరికొత్త జీవన శైలులు… దూకుడు తనాలు…
… … …
ఓ ఇంగ్లీష్‌ ఛానల్‌లో ప్రపంచస్థాయిలో చనిపోయినవారి వర్గీకరణ విశ్లేషణలు ప్రసారం చేస్తున్నారు. రజని ఆకస్తికరంగా చూస్తోంది.
చనిపోయిన వారిలో డెబ్భై ఆరు శాతానికి పైగా మగవారట. గ్రాఫుల్ని చూపుతున్నారు. రంగుల్లో కదులుతున్న రేఖలు. తోడుగా నిపుణుల కామెంటరీ చర్చలు… హఠాత్తుగా రజని శరీరంలో గుబులు. గుండె వేగంగా కొట్టుకుంది. సోఫాలోంచి లేచి బెడ్‌రూమ్‌కి వెళ్ళింది. ప్రకాశ్‌ రావు నిద్రలో ఉన్నాడు. పెరిగిన పనులతో అలసట ఎక్కువైంది. రజని మెల్లగా అడుగులేస్తూ బెడ్‌ దగ్గరికి చేరుకుంది. ప్రకాశ్‌ రావు ముఖాన్ని ఆప్యాయంగా చూస్తూ నిలబడిరది. ముఖంలో ఎంత ప్రసన్నత.
రజనిలో పాజిటివ్‌ దృక్పథంతో ఆలోచనలు ముసురుకొన్నాయి.
‘‘కాపాడుకొంటాను. నా భర్తను కాపాడుకొంటాను. కంటికి కనబడని ఈ కణానికి పెద్దమనసున్న భర్త శరీరాన్ని దాడికి కానివ్వను’’ మనసులో అనుకొంటూ రజని నెమ్మదిగా గదినుండి బయటికొచ్చింది.
రజని గదిలోంచి వెళ్ళాక ప్రకాశ్‌ రావు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. కళ్ళు మూసుకొని ఉన్నా రజనిని చూశాడు. ఆమె ఉనికి వాసనని పసిగట్టాడు. ఆమె మనసులోని అంతర్మథనాన్ని స్పష్టంగా విన్నాడు.
టీవీలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. రజని వింటూనే ఉంది. నోట్‌ బుక్‌లో ఏవో అంకెల్ని రాసుకొంది.
ప్రకాశ్‌ రావు బెడ్‌పైన పడుకొనే రజని గురించి ఆలోచిస్తున్నాడు. పిల్లలంటే ఆమెకి అమితమైన ప్రేమ. పెళ్ళయ్యాక ఏడు సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు. పూజలకి కొదవలేదు. సంప్రదించని డాక్టర్‌ లేడు. నూతనోత్సాహానికి ఎన్నో కొత్త ప్రదేశాలకి వెళ్ళి సరదాగా గడిపారు. రిపోర్టులన్నీ సవ్యంగానే ఉన్నాయి. అంతుచిక్కని మిస్టరీగా మిగిలింది.
సంతానం పట్ల ఆశలు వదులుకొని అడాప్షన్‌ కేంద్రం వివరాలు, రూల్స్‌, రెగ్యులేషన్స్‌ తెలుసుకోవడం మొదలుపెట్టారు. దత్తత తీసుకొని కుటుంబంగా ఎదిగిపోతున్న కొన్ని కుటుంబాలతో లోతైన విషయాల గురించి వివరాలను తెలుసుకొంటున్న సమయం. … … …
రజనికి తాను ప్రగ్నెంట్‌ అని తెలిసిపోయింది. నిర్ధారణ కూడా చేసుకొంది. అడాప్షన్‌ ఫైల్‌ క్లోజయ్యింది.
మొదట కూతురు. రెండేళ్ళ తర్వాత కొడుకు.
ఆలస్యంగా పుట్టినందుకు పిల్లలంటే ఇద్దరికీ ప్రాణం. రజనికి మరీనూ! అపురూపంగా పెంచారు. చదువులు మంచి ఉద్యోగాలని తెచ్చాయి. వాటితోపాటు మంచి సంబంధాలు తలుపు తట్టాయి. అన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రవాసీ తెలుగువారయ్యారు. ఆ దేశాల పౌరసత్వపు తీర్థాలని పుచ్చుకొన్నారు.
కూతురు న్యూజీలాండ్‌లో. ఆమెకు పాప, బాబు.
కొడుకు కెనడాలో. అతనికి ఇద్దరు ఆడపిల్లలు.
మూడో తరం వారు ఇతర దేశస్థులు. గ్రాండ్‌ పేరెంట్స్‌కి వీరంతా అతిథులు.
రజని పిల్లలతో, వారి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ప్రకాశ్‌ రావు ముచ్చటగా చూస్తుంటాడు. స్మార్ట్‌ ఫోన్‌లో, స్కైప్‌లో తనివితీరా మాట్లాడుతూ, పెరుగుతోన్న పిల్లల ముఖాలను పరీక్షగా చూస్తూ సంబరపడిపోతుంది. ఆడపిల్లల మొహలపై కనబడే మొటిమల్ని గమనించి కూతురు, కోడల్ని మందలిస్తుంది. చిట్కాలు చెబుతుంది. మనవరాళ్ళతో వాత్సల్యంగా మాట్లాడుతూ చెప్పిన హోం వర్క్‌ వాళ్ళ మమ్మీలు ఆచరించారా లేదా అని ఆరా తీస్తుంది. బుజ్జగించి ప్రేమతో మనవరాళ్ళే అడిగి చేయించుకొనేలా చేస్తుంది. ప్రతి సంభాషణల్లో ప్రేమలు, నవ్వులు, గలగలలు, సంతోషం. రజనికి వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా ఒక పండగే!!
… … …
‘‘నేనే ముందు పోవాలి. రజనికంటే నేను ఎక్కువ జీవితాన్ని చూశాను, అనుభవించాను. రజనిని కాపాడుకోవాలి’’ గట్టిగా అనుకొన్నాడు ప్రకాశ్‌ రావు. లాక్‌డౌన్‌ మొదలయినప్పటి నుంచి రజనికి పనిభారం పెరిగింది. ముందస్తు జాగ్రత్తలు అందరికీ వర్తిస్తున్నాయి. కొత్త లోకమొకటి జన్మించింది. మార్పులు జీవితాల్లోకి వేగంగా ప్రవేశిస్తున్నాయి. వైరస్‌ ప్రపంచ యాత్ర ఇంకా దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది. మూడు బెడ్రూముల ఇంటిని మేనేజ్‌ చేయడం రజనికి సవాలైంది. రోజూ యెగా చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకొంటోంది. ఇద్దరి ఆరోగ్యాల పట్ల తానే మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రకాశ్‌ రావు వయసు పెరిగిన కొద్దీ రజనికి అదనపు బాధ్యతలు ప్రతి ఏడు దినచర్యల్లో చేరుతూనే ఉన్నాయి. ఈ మధ్య మోకాళ్ళ నొప్పులంటోంది. కుడికాలు మరీ ఎక్కువని బాధపడుతుంటుంది.
సడలింపు ప్రకటించినప్పుడల్లా ప్రకాశ్‌ రావు వెంటనే మార్కెట్‌కెళ్ళి రజనికి ఇష్టమైన పళ్ళు, ఇమ్యూనిటీ బూస్టర్లు తీసుకొస్తున్నాడు. గతంలో ఈ పనులన్నీ రజని చేసేది. డాక్టర్లు, నిపుణులు టీవీల్లో చెప్పిన సలహాలు జ్ఞాపకముంచుకొని సరుకుతో ఇంట్లో నిలువ చేసుకొన్నారు.
పొద్దున్నే లేచి ఇల్లంతా ఊడ్చి తడిగుడ్డతో ఫ్లోరంతా తుడిచాడు. పాత్రల్ని తోమాడు. అలవాటులేని పనులు. కొత్త అనుభవం. రజని పొద్దున్న లేచేలోపలే పూర్తిచేయాలన్న తపన. తాను ఎంత పని చేస్తే రజనిపై అంతవరకు భారం తగ్గుతుంది. రెస్టు దొరుకుతుంది. పాత్రల్ని తోమేటప్పుడు, కడిగేటప్పుడు ఏ మాత్రమూ చప్పుడు కాకుండా జాగ్రత్తలు పడేవాడు. మూడు రోజులు ఉత్సాహంగా పనుల్ని చేశాడు. మెళకువలు గ్రహించి రోజురోజుకీ పనిలో సామర్ధ్యం పెంచుకొన్నాడు. ఫ్లోర్‌ తుడవడమే చాలా ఇబ్బందిగా ఉంది. ఫర్నిచర్‌ కిందకి స్టిక్‌ తోసినప్పుడల్లా వంగడం, లేవడం శరీరానికి చాలా ఇబ్బంది కలిగిస్తోంది.
రజనిని గుర్తుచేసుకొని అలసటని ఆనందంగా మార్చుకొన్నాడు. కష్టాన్ని ఇష్టంగానూ… దినచర్యగా మారిన ఆరో రోజు ప్రకాశ్‌ రావు ఉత్సాహంతో మంచం దిగాడు. అసహజంగా ఉంది ఇంటి వాతావరణం.
మణిదీప వర్ణన వినిపిస్తోంది. మొహంపై నీళ్ళు చల్లుకొని నాలుగడుగులు వేశాడో లేదో చూపు ఫ్లోర్‌పై పడిరది. శుభ్రంగా మెరుస్తోంది. ఎందుకు చేశావని రజనిని అడుగుదామనుకొన్నాడు. మాటల్ని బయటకి రాకుండా బలవంతంగా ఆపుకొన్నాడు.
రజని ఓ కంట భర్తని గమనిస్తూనే పట్టుబడకుండా తెలివిని ప్రదర్శిస్తోంది. మణిదీప వర్ణన పాటలో గొంతు కలిపింది.
ప్రకాశ్‌ రావు చిన్నప్పుడు దాగుడు మూతలాట బాగా ఆడేవాడు. ఆ ఆట ఇప్పుడు తటాలున గుర్తుకొచ్చింది. ఎక్కడ దాక్కున్నా పట్టుకునేవాడని స్నేహబృందంలో పేరు సంపాదించుకున్నాడు. పసిగట్టే నైపుణ్యం చిన్నప్పటినుంచే వచ్చింది. ఇప్పుడు ఈ కళకి దుమ్ము దులిపి రజనిపై చాకచక్యంగా వాడుతున్నాడు. రజనికి ఖో ఖో ఆటంటే చాలా ఇఫ్టం. ఏ సామగ్రి అవసరంలేని ఆ ఆటపైనే మక్కువ పెంచుకొని మంచి ప్రావీణ్యాన్ని సంపాదించింది. స్కూలు, కాలేజీ పోటీల్లో, స్థానిక ప్రాంతీయ టోర్నమెంట్లలో ప్రైజులు తప్పనిసరి. శరీర కదలికలతో, చూపులని పసిగట్టి మైదానంలో చిరుతలా అలర్ట్‌గా ఉండేది.
దాడుగు మూతాట వర్సెస్‌ ఖో… ఖో…
ఖో…ఖో… వర్సెస్‌ దాడుగు మూతాట.
భర్త వర్సెస్‌ భార్య.
రజని వర్సెస్‌ ప్రకాశ్‌ రావు.
ఒకర్ని కాపాడుకోవడానికి ఇంకొకరు.
భర్తని మరింత కాపాడుకోవడానికి భార్య.
భార్యని మరింత కాపాడుకోవడానికి భర్త.
లాక్‌డౌన్‌ కొనసాగుతూనే ఉంది. ఇళ్ళల్లో అన్యోన్యత కొత్తరూపం పోసుకుంటూనే ఉంది. తెలుగు భాషలో తన అర్థాన్ని మరింత విస్తృతపరుచుకొంటూ ముందుకు సాగుతూనే ఉంది.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.