కూరాకులమడి

డా. ఎ. సీతారత్నం
(భూమిక వార్షిక కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ)

తలదువ్వుకొంటున్న కనకని చూసి తండ్రి వీర్రాజు ”తెల్లారిందా! ముస్తాబుకి, పాచిపనికివెళ్తున్నావా? పెళ్ళికి వెళ్తున్నావా?” అని విసుగ్గా పాకలోకి వెళ్లి 12000 రూ|| ఎట్టి పెళ్లి చేసా. 1000 రూ|| దాని మొగుడు దినానికి ఖర్చు ఎట్టా… పాపిష్టిది. ఏడాదికే మొగుడు పోవడమేమిటి?… గొణక్కుంటూనే ఉన్నాడు. కనకకి ఆమాటలు అలవాటయి పోయాయి.
”కనకా!” అంటూ వచ్చింది సత్యవతి.
”ఇదిగో వస్తున్నా! అని జడక్లిప్పు పెట్టుకుని వస్తూ- ప్లాస్టిక్‌ సంచీ చేతిలోకి తీసుకొంది.
”ఏంటే? అదీ”
”ఏవున్నాయి. డబ్బాలు. ఐస్‌క్రీమ్‌ డబ్బాలు ఖాళీవి. అమ్మగారు ఇచ్చారు. రోజూ పట్టుకుపోతాను. ఆళ్లు స్టీలు గిన్నెలు ఇవ్వడం.. తేలేదనడం.. ఎందుకొచ్చిన గొడవనీ…” అంటూ చెప్పులు వేసుకొని బయటకి వచ్చింది.
ఆ వూర్లో 12 డాబా ఇళ్ళు. మిగతావి పెంకుటిల్లు, పాకలు. పాకల్లో వాళ్లు పనమ్మాయిని పెట్టుకోరు. పెంకుటిల్లు వాళ్లు కేవలం గిన్నెలు తోమించుకుంటారు. డాబా ఇళ్లవారు తడిబట్ట పెట్టించుకొంటారు. అన్ని పనులూ చేయించుకొంటారు. వాళ్లు ఎక్కువ డబ్బులు ఇస్తారు. అందుకని డాబా ఇంటిపనికోసం పోటీపడతారు.
నడుస్తున్న సత్యవతి, మామిడిచెట్టున్న ఇంట్లో రేపు కొత్తగా ఎవరో దిగుతారు. తెల్లారగట్లే వస్తారు. మనం కాస్త ముందు లేచి వెళ్లి ఆ ఇంటిపని దొరకపుచ్చుకోవాలి. ఇద్దరి పిల్లల్నీ బళ్లో ఏసానా? ఫీజులు కట్టాలి. బావకి డబ్బు తాగడానికి చాలదు. ఆళ్లకి నేనే కట్టాలగదే… రోజూ ఆళ్లని సదువు మాన్పించేయమని గొడవే…”
”బావ మారడింక…”
”సర్లే, డబ్బు సదురుకోవాలి. వాళ్లని సదువు మాన్పించవద్దని గొడవాడాలి. పేనాలు విసిగి పోతున్నాయి”. అంది విచారంగా. మాటలు వింటున్న కనక తను పనిచేసే ఇల్లు రాగానే ఆగిపోయి ”పనయ్యాక నాకూరాకులమడికి వచ్చీ” అని చెప్పింది.
జ జ జ
మడిని దూరంగా చూస్తూనే మురిసిపోయింది. ఉత్సాహంగా, గబగబా అడుగులేసింది. మడి ముందున్న రెండు బంతిమొక్కలు విరబూసిన పెరుగు బంతిపూలతో తలలూస్తూ స్వాగతిస్తున్నాయి. కనకకి ఎంతోహాయిగా, ఆనందంగా అన్పించి ఆ రెండు మొక్కల్ని ఆప్యాయంగా, సున్నితంగా తడిమి మడిలోకి అడుగుపెట్టింది.
మడిచుట్టూ గట్టు. గట్టు మీద ఎనిమిది టేకుమొక్కలు. నాలుగు కొబ్బరి మొక్కలు. అవి టౌన్‌కి సినిమాకి వెళ్లినప్పుడు ఫారెస్ట్‌ ఆఫీస్‌కి వెళ్లి తెచ్చుకొన్నవి. అమ్మమ్మ కనక పేర రాసిన 20 సెంట్లు భూమే ఈ కూరాకుల మడి. మడి చుట్టూ జిల్లేడు మొక్కలు వేసింది. అవి పెరిగి ఫెన్సింగులా మారాయి. ఎవరూ చెప్పకపోయినా భూమాతని నమ్మి బ్రతికే కుటుంబంలోని కనక ‘జీవకంచె’ ని సునాయాశంగా వేసింది. ఆ కంచెమీదకి ఆనప పాదు, కాకరపాదు, దొండపాదులు రెండు.. దోస.. కంచెకి ఎక్కించింది. టమాటా నారు, గోంగూర, కొత్తిమీర.. వంగ, చేవ, గోరుచిక్కుడు నేలమీద ఉన్నాయి. అన్మీ మంచి కాపుమీద ఉన్నాయి. వారానికి ఒకమారు సంతకెళ్లి అమ్ముకొస్తుంది. మడి మీద 1200 రూ|| నెలకి వస్తాయి. అయితే కనక చాలా కష్టపడ్తుంది. రోజూ అయిదుగంటలు మడిలో ఉంటుంది. ఎక్కడ కనబడ్డా వానపాములు మట్టితో సయితం తెచ్చి తనమడిలో వేస్తుంది. ఎక్కడో తిని పనిచేసే ఇళ్లల్లో నుండీ కూరతొక్కంతా తెచ్చి గోళెంలో మట్టేసి అందులో వేస్తుంది. ఏటినుండీ నీళ్లు మోసి తెచ్చి పోస్తుంది. తల్లి బిడ్డని సాకినట్టుగా కూరాకుల మడిని సాకుతుంది. అక్కడ ఉన్న ప్రతిమొక్కతో స్నేహమే. కలుపుతీసినపుడు కూడా ఎంతో బాధపడుతుంది. పనికిరాదని తీసిపారేస్తున్నా ననుకొంటుంది. కలుపు గడ్డి తీసి పట్టుకొని నాబతుకులాంటిదే దీనిదీ అనుకొంటుంది. మొగుడు పోయి ఏడాదయింది. ఏ పెళ్లికీ, పేరంటానికైనా అమ్మ, నాన్న ముస్తాబయి వెళ్లిపోవడమేగాని కనకని రమ్మనమన్నదీ లేదు. కనక వెళ్లిందీ లేదు. ఎక్కడకయినా వెళ్దామన్నా మడికి నీళ్లు ఎవరు పెడ్తారని వెళ్లలేదు. నాయనమ్మ పేరు పెట్టుకొన్నది కనుక పేరింటికత్తె అని – తన పసుపు కుంకాల భూమి 20 సెంట్లు కనక పేర రిజిష్టర్‌ చేయించింది. దానివలన నాన్న.. నాన్నమ్మ చచ్చే దాకా ఆమెతో మాట్లాడలేదు. గడ్డిపరకలు ఏరుతూ ఆలోచనలో పడింది కనక. సత్యవతి మాటలకి ఈలోకంలోకి వచ్చింది. ”సత్తీ, గడ్డి అల్ల ఖాళీ జాగాలో పాతుదాం. మొలిస్తే ఏ పశువైనా తింటుంది గదా!”
”నువ్వు సాలా మంచిదానివే. నేను పాతేస్తాలే. నాకు గంజివార్చే వేళయిందే… నేను అలా వెళ్లిపోతాను..” అంది.
అలాగే అంటూ ఆనపకాయ కోసి చేతిలో పెట్టింది. నవ్వుతూ తీసుకొంది సత్తెమ్మ.
జ జ జ
పండగ వచ్చిందంటే సందడే సందడి. చెల్లికి తొలి పండగ. చెల్లి, మరిది వస్తారని ఇల్లంతా దులిపి, కడిగి శుభ్రం చేసింది. అటకమీదున్న రెండు ఇత్తడి బిందెలు, స్టీలు సామాన్లు తళతళా మెరిసేటట్టూ తోమి బోర్లించింది కనక. వాళ్లు వస్తారని ప్రతి నెలకన్నా 500 రూ|| ఎక్కువ ఇచ్చింది తల్లికి. తల్లి చాలా సంతోషించింది.
చెల్లి భర్త, ఆడబిడ్డతో వచ్చింది. ఆపకుండా కబుర్లు చెబుతోంది. తను నేర్చుకొన్న వంటలు గురించీ చెబుతోంది. అంతా కలగా పులగంగా మాట్లాడుతున్నారు. ఏటికి వెళ్లి స్నానాలు చేసారు. కూరాకులమడి చాలా సరదాగా చూపించింది కనక. సాయంత్రం వేళకి ఆ సరదా అంతా ఆవిరి అయిపోయింది.
చెల్లి ఏడుస్తోంది. పెళ్లికి ఇస్తామన్న టి.వి. ఇమ్మనమని అడిగారు. ఆడబిడ్డ గట్టిగానే అడుగుతోంది. ‘అది కాదు అల్లుడూ…’ అని చెప్పబోయిన తండ్రిమాటకి ”ఆడాళ్ల గొడవది. నన్ను లాక్కండి”. అన్నాడు చెల్లి మొగుడు. అంతేగాకుండా ‘టి.వి. కొన్నాకే పంపండి’ అన్నాడు.
చెల్లి ఏడుపు చూసి విసిగిపోయి ”ఎధవ మొగుడు వదిలేయ్‌” అంది ఆవేశంగా.
ఆ మాటకి తల్లికి కోపమొచ్చింది. ”నీకు ఎలాగూ లేడు. దాన్ని వదిలేయ మంటావా? కొవ్వెక్కిపోయిందా? వెధవ సలహాలివ్వకపోతే పొదుపు సేసిన డబ్బు ఇచ్చి టీవీ కొని కాపురం నిలపొచ్చుగా. పేమలేదు. ఒంటెద్దు బతుకు…
ఆ మాటలకి గిరగిరా కన్నీళ్లు తిరిగాయి. రాలుతున్న కన్నీరు తుడుచు కుంటూ పరిగెత్తి కూరాకుల మడిలోకి పోయింది. మొక్కలన్నిటికీ తన గోడు చెప్పుకొంది. ఒక అరగంట ఏడ్చిఏడ్చి – మరో అరగంట మౌనంగా ఆలోచించింది. కూరాకులమడి ఓదార్చింది. ఈ మడి మీద మళ్లీ సంపాదించ లేకపోతానా, అని ధైర్యం తెచ్చుకొని, చెల్లికాపురం నిలబెట్టడానికి నిర్ణయించుకొంది. తను దాచుకొన్న డబ్బు ఇస్తే – అమ్మ, నాన్న, బాప్ప… అందరి ముఖాలలో ఆనందం, తన పట్ల ప్రేమ మిగుల్తాయనుకొంది. ఆ నిర్ణయానికి మనసు తేలిక పడింది. ఈ మడిలోకి వస్తేనే నాకు హాయి. నిజమైన తల్లి ఈ మడే నాకు అనుకొని చేత్తో ఆప్యాయంగా నేలనితాకి మట్టిపిడికిటితో తీసి నేలమీదకి ధారగాపోసి చిరునవ్వుతో ఇంటికి బయల్దేరింది.
కనకకి కంటి మీద కునుకులేదు. నా కూరాకులమడే గవర్నమెంటోళ్లకి కావలసివచ్చిందా! ఇది నిజమేనా? నాన్న ఏవన్నా అబద్ధమాడుతున్నాడా? సొంత తండ్రిని నమ్మలేని స్థితి. ఊరంతా ఒకటే సందడి. నిజమేనని తెలిసినా మడి వదలాలంటే బెంగ. తన నిజమైన నేస్తం. కట్టానికి, సుఖానికి అక్కున చేర్చుకొని సేదదీర్చే మడి. తనని పోషిస్తున్న మడి. దుఃఖం… రోజూ తండ్రి తిట్లే. ”నలుగురితో నారాయణా, కులంతో గోవిందా” అనాల అని గావుకేకలు. ప్రశాంతత పోయింది కనకకి. మొండిగా ఇవ్వననుకొంది. ఒకరోజు మునిమాపువేళ ఇంటికి పదిమంది వచ్చారు. వాళ్ల చేతుల్లో కాగితాలు.
”కనకా! మంచినీళ్లు పట్రా.” అన్నాడు తండ్రి. నీళ్లు పట్టుకొనివచ్చిన ”ఏలిముద్ర ఎయ్యాలి…” అన్నాడు. విన్పించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది.
చెయ్యిపట్టుకొని బరబరా ఈడ్చుకొచ్చి వేలిముద్ర వేయించాడు. చెయ్యి ఎఱ్ఱగా కందిపోయింది. అవమానంతో ముఖం ఎఱ్ఱగా కందిపోయింది. కళ్లమ్మట నీళ్లు ప్రవాహంలా వస్తున్నాయి. దుఃఖం… ఆ దుఃఖానికి ఒక్కక్షణం అందరి మనసులూ జాలితో నిండిపోయాయి.
”ఊరుకో కనకా! చిన్న షావుకార్ని నేను. గుర్తున్నానా?” అన్నాడు ఓదార్పుగా. ఆ మాటకి కళ్లెత్తి అటుచూసి ఏవీ కనబడక చీరకొంగుతో కళ్లొత్తుకొంది.
”ఊరుకోవాల. నేనొకటి చెప్పనా? నాకు రెండొకరాలుందా! లొయ్లల సంద్రంలో కలిపేసారు. అయిదేళ్లబట్టీ అరిచాను. కోర్టుల చుట్టూ తిరిగాను… ఏటయినాది? డబ్బు అయిపోయిందంతే. నీకు మడిసెక్కకి డబ్బులు ఇస్తారు. టేకుమొక్కలు వేసావుట గదా! ఎక్కువ డబ్బు రాపిద్దాంలే…” అన్నాడు షావుకారు.
”టీకా!” అన్నాడు తండ్రి.
ఏనాడూ మడి చూడని నాన్న దౌర్జన్యంగా మడి నిప్పించేసాడు. రెక్కలు ముక్కలు చేసుకొన్న తన బ్రతుకు గురించి ఆలోచించలేదు. మొగుడు లేడు. ఎలా బ్రతుకుతా? 700 రూ|| ఇస్తే గానీ అమ్మే బువ్వ ఎయ్యదు… ఎలా?…
ఆ ఏడుపుకి మనసు నీరయిన షావుకారు టౌన్‌కొచ్చీ నీకేమిటి తక్కువ. చురుకైనదానివి. మంచిదానివి…” అని వొప్పించాడు,
జ జ జ
మడిసెక్కకి డబ్బులిస్తారని అయ్య రమ్మంటే పల్లెకి బయల్దేరింది. బస్సు ఎక్కించడానికి వచ్చిన నేస్తం – ”డబ్బులిస్తారన్నా హుషారుగా ఉండవేటి?” అంది.
”మా అయ్య నాకేం అంకనివ్వడు…” అంది దీనంగా.
”అదేటే! ఆ గుమస్తా కాడకి నువ్వే పోయి… కాస్త నీ బాధ సెప్పు. నువ్వే పుచ్చుకో. చెక్‌ ఇస్తారు. నీ పేరే ఉంటుందిట” అని చెప్తుండగానే బస్‌ వచ్చింది.
కనకకి పల్లెగాలికి హుసారొచ్చింది. పచ్చని పైరు తనతో ఊసులాడుతున్నట్టు ఊగుతుంటే మనసు గెంతులేసింది. పైరు మధ్య ఉండే ఆనందం… కంకర, సిమెంటు లతో ఎలా వస్తుంది. చేసే పని మీద ఇష్టం ఉంటే మనసుకి కష్టం ఉండదు. కూరాకుల మడిలో ఎంతసేపు పనిచేసినా హాయిగానే ఉండేదనుకొంది కనక.
అయ్య, అమ్మ, సత్తెమ్మ, తమ్ముడు… అంతా ఆప్యాయంగా పలకరించారు. వచ్చిన డబ్బులు ఏం చెయ్యాలా అని అయ్య, అమ్మ… ఆలోచన. ఏవీ విన్పించుకోలేదు కనక. నేస్తం మాటలే బుఱ్ఱలో తిరుగుతున్నాయి. మడిని అయ్య 5000 రూ|| తాకట్టు పెట్టాడని తెలిసి ఉసూరుమంది. అయినా డబ్బులొస్తే విడిపించుకోవచ్చని ఆశతో సత్యవతిని కలసి కొత్తగా వచ్చిన రెవిన్యూ ఆఫీసర్‌ గురించి అడిగింది. పదిరోజులనుండీ మోటారుబైక్‌ మీద వచ్చిపోతున్నాడు. నిన్ననే ఇల్లు చూడ మన్నాడని చెప్పింది. కనక మహానంద పడింది.
ఊరంతా కలసి రెవిన్యూ ఆఫీసర్‌ నిరంజన్‌ డాబా ఇల్లు అదెకిప్పించారు. అతను దిగిన రోజే కాసుక్కూచుని కనక – సత్యవతి అతనితో మాట్లాడారు. కనక ముందుగా తను గిన్నెలు తోవుతానని పని ఇప్పించమని అడిగింది. అతను వొప్పుకొన్న తర్వాత తన మడిసెక్క గురించి చెప్పింది. తప్పకుండా చూస్తానని చెప్పాడు. సత్యవతి ఆగకుండా ”దాని అయ్య సారాకి పోస్తాడు. మొగుడు సచ్చిందని ఇదంటే సిన్నసూపు… అందుకని డబ్బు ఎవరికీ తెలియకుండా దీనిసేతిలో పెట్టాల. బాబ్బాబూ… మంచోడిలా ఉన్నావు” అంది.
”అన్నిసార్లు చెప్పక్కర్లేదు. అలాగే చేస్తా.” అన్న నిరంజన్‌ మాటలకి ఉబ్బితబ్బిబ్బయింది కనక.
నిరంజన్‌ నాజూగ్గా ఉన్నాడు. ఉంగరాల జుత్తు. సన్నని మీసాలు. తెల్లటి మనిషి. కళ్లు ఎఱ్ఱగా లేవు… అనుకొని తేరిపార చూసి తృప్తిపడి, తన రోజులు బాగున్నాయి అనుకొంది.
వారంరోజులు నిరంజన్‌కి కేరేజీలు రెండు పూటలా వచ్చాయి. ఎనిమిదోనాడు ఎవరూ పంపలేదు. నిరంజన్‌కి ఆకలి. ఊర్లో బడ్డీ టీకొట్టు తప్ప ఏవీ లేవు. భోజనం దొరకదు. నిరంజన్‌ పనంతా మానేసి మధ్యాహ్నం వచ్చి కనకని అడిగాడ.
వారంబట్టీ కనక రోజూ గదులు తుడవడం, బట్టలుతకడం చేస్తున్నా… ఏనాడూ మాట్లాడలేదు. నన్ను రోజూ చూస్తున్నారు గదా నా పని గుర్తుంటుందను కొంది కనక. అడగాలన్నా విసుక్కొంటాడేమో నని భయం. అలావున్న కనక్కి నిరంజన్‌ మాట్లాడి భోజనం తయారుచెయ్యమనడం శుభసూచకంగా అన్పించింది. ఆ తర్వాత నిరంజన్‌ ఇచ్చిన డబ్బులతో పాత్రలు కొని మట్టిపొయ్యి తనే వేసి పుల్లలు తెచ్చి వంట చేసింది. అప్పుడప్పుడు 100 రూ|| నోటు చేతిలో పెట్టి ఏం లెక్కలు అడిగేవాడు కాదు. దానికి మురిసిపోయి ఎంతో మంచోడు అనుకొంది. పొదుపుగా ఖర్చుపెట్టేది. ఆమె వలన అతను హాయిగానే ఉన్నాడు. గిన్నెలు తోవడానికి, బట్టలుతకడానికి ఇచ్చిన జీతమే. వంట చేసినందుకు వేరే ఇవ్వడం లేదు. కానీ గౌరవంగా చూస్తున్నాడు. సత్యవతి అడగమన్నా కనకకి మొహమాటం. మడిసెక్కకి 60,000 రూ|| ఇస్తాడు గదా! అతని సేతిలో మన పని ఉంది గదా’ అని అడగలేదు.
నెలరోజులకి కనక లేనిదే బ్రతకడం కట్టం అయింది నిరంజన్‌కి. కోడిపెట్టని ఎవడి దగ్గరో తెచ్చినది ఇచ్చి కోడికూర చెయ్యమన్నాడు. అప్పటికే వంట చేసినది. గుడ్లకోడిని చంపడానికి ఇవ్వలేకపోయింది. కోడిని పెంచడం మొదలెట్టింది. కోడిగుడ్లు ఎనిమిది పెట్టింది. పొదిగిన రోజు పిల్లల్ని చూసి మురిసిపోయింది. మెత్తగా, బుల్లిగా రకరకాల రంగులతో ముచ్చటగొల్పు తున్నాయి. ఆ ఎనిమిది పిల్లల్ని పెంచడం మొదలెట్టింది. తర్వాత వారంలో కోడిని మాత్రం రక్షించలేకపోయింది. కోడికూర చేయడం కనకకి బాగా వచ్చు. చాలా శ్రద్ధగా చేసింది. ఆ రోజు నిరంజన్‌ తొమ్మిదిదాకా పొలంలోనే ఉన్నాడు. పొలంలో నలుగురు పెద్ద మనుషులతో విస్కీ తాగాడు. పున్నమి వెన్నెల్లో నిశ్శబ్దంగా ఉన్న పల్లెలో పిల్లగాలులతో ఊసులాడుతున్న వరిశంకులతో నిండిన చేలో ఉన్న మంచెమీద ఆనందంగా, ఆహ్లాదంగా విస్కీ పుచ్చుకోవాలని ఎప్పటినుండో కోరిక. నిరంజన్‌కి ఆ కోరిక తీరింది. కాస్త అభిరుచి, అనుభూతులు ఉన్న అతనికి విస్కీమత్తులో మహానందంగా హుషారుగా మనసు గాల్లో తేలుతోంది.
ఆ హుషారుతో ఇంటికి వచ్చి తాళం కోసం కనక ఇంటికి వెళ్లాడు. తాగినట్టు తెలియకుండా గుమ్మంలో ఉన్న తులసాకు తెంపి నోట్లో వేసుకొన్నాడు. కనకని రమ్మన్నాడు. ‘రాత్రివేళ వస్తే మా అయ్య ఊరుకోడని భయపడింది.’ ”బావిలో నీళ్లు తోడతాను. పొద్దున్న గోళెం బద్దలయింది గదా! నాలుగు చేదలు ఇచ్చిపో” అన్నాడు. ఆ మాటకి కరిగి అమ్మవైపు చూసింది. ‘పోన్లే, వెళ్లు…’ అనడంతో అతని వెనకే వెళ్లింది. నీళ్లు ఇచ్చి, అన్నం వడ్డించింది. కోడికూరతో తృప్తిగా భోజనం చేసాక మత్తుగా అన్పించింది. కనకని వంటని చాలాసేపు పొగిడాడు. కనకకి తన మడి డబ్బులు అడగాలని ఉంది. ”కనకా! నిన్ను వదిలి వుండలేను. ప్లీజ్‌…” అన్నాడు. దగ్గరగా వచ్చాడు. హడలిపోయింది. దగ్గరగా వచ్చేసరికి తులసాకు, వాసనని మించి కూరమసాలా వాసనని మించి ముక్కుకు చేరింది వాసన. చిన్నప్పటినుండీ తెలిసిన వాసన. ”వద్దు బాబూ… నేనలాంటిదాన్ని కాను… అని గబగబా వెళ్లబోయింది.” ”ప్లీజ్‌, కనకా, నేను సెడ్డోడ్ని కాను. నీమీద మనసుపడ్డా. ఈ వూర్లో దిక్కులేని నన్ను ఎంత బాగా చూసావు…” బ్రతిమలాడు తున్నాడు. మీద పడలేదు. బలవంతం సేయలేదు. మగాడ్ని అని అహంకరించ లేదు… ప్లీజ్‌, ప్లీజ్‌… అంటూనే కనకని లొంగదీసాడు.
కనకకి సిగ్గుగా అన్పించింది. తప్పు చేసానన్పించింది. తండ్రి ముఖం చూలేననుకొంది. ఎవరికీ చెప్పలేదు. చెప్తే సిగ్గుచేటు… కానీ కడుపు వస్తుందేమోనని భయం. ఏ జబ్బన్నా ఆడికివుందేమో… ది అంటించేడేమోనని భయం. కళ్లమ్మట నీళ్లు… ధారాపాతంగా వస్తున్నాయి. మత్తులో ఉన్న నిరంజన్‌కి ఏవీ తెలీదు. కనక పదినిముషాల్లో తేరుకుని కూరాకులమడి డబ్బులిస్తే టౌన్‌కి పోతాననుకొంది.
జ జ జ
తెల్లారి కనక రోజూలాగే వెళ్లింది. నిరంజన్‌ ఇంటిదగ్గర చాలామంది చేరారు. అందరితో చేతులు కలుపుతూ కులాసాగా కబుర్లు చెబ్తున్నాడు. కనకని చూసీచూడగానే ఈ మూడునెలలూ రోగం, రొట్టు లేకుండా ఉన్నానంటే కనక దయే అన్నాడు. ఆ మాటకి దూదిపింజలా ఎగిరింది మనసు. ముఖమాటంగా నవ్వింది. ఆ నవ్వులోని అందం, అమాయకత్వం, మంచితనం, అభిమానం… చూసి అనుభూతించగలిగేంత తీరుబడీ మనసూలేని నిరంజన్‌ పట్టించుకోలేదు.
”బాబూ, బస్సు ఎన్ని గంటలకి?” అడిగారెవరో.
”ఇపుడే అరగంటలో వెళ్తున్నా…”
కనకకి అర్థం కాలేదు. కానీ ఏదో అనుమానంతో ఏంటని అడిగింది.
”బాబుగారికి ట్రాన్స్‌ఫర్‌ అయి పోయింది. కొత్తోళ్లు వస్తారట…”
మిన్నువిరిగి మీద పడడం ఏవిటో అర్థమయింది. నిలువునా వణికిపోయింది.
”అదేవిటి బాబూ… నాకు సెప్ప లేదు…” కాస్త నిష్ఠూరం.
”నీకు చెప్పలేదు. మరచిపోయాను.” అని తేలిగ్గా ‘గిన్నెలు అన్నీ నువ్వు తీసుకో’ అన్నాడు. ఒక మూకుడు, రెండు గిన్నెలు, ఒక గరిట, గ్లాసు… కంచం కూడా కొనలేదు. అరిటాకులో అన్నం పెట్టింది. ఎంత పొదుపుగా చేసాను? సెభాష్‌ అన్పించుకోవాలని… ఎంత తాపత్రయం పడ్డాను… అనుకొంది.
”బాబూ, నా మడి… డబ్బులు…”
”వచ్చినతనికి చెప్తాలే. ఆడు నాలాంటివాడుకాడు. కాస్త డబ్బు మనిషి. ఒక 3000 రూ|| నీవి కావనుకో. వస్తాయి…” అన్నాడు.
”మీరేటి సెయ్యరా?”
”ఇంకేం చెయ్యగలను…”
”బాబూ,” అని వంటగదిలోకి పిలిచి ”డబ్బులేవైనా ఇప్పించండి. వంటకేటీ ఇవ్వలేదు మీరు… వంటచేసా. వొళ్లప్పచెప్పా… ఏటీ ఇవ్వరా…” వొళ్లమ్ముకొన్నాననే బాధని నొక్కిపెట్టి దీనంగా అడిగింది. 100 రూ|| చేతిలో పెడ్తూ – కువకువలాడుతున్న కోడిపిల్లల్ని చూపిస్తూ ”కనకా! కోడిపిల్లల్ని నువ్వే తీసుకో” అన్నాడు ధారాళంగా. ‘బాబూ!’ అంటున్నా విన్పించుకోకుండా వెళ్ళిపోయాడు.
జ జ జ
మర్నాడు దాకా లేవలేకపోయింది. దుఃఖం, ఆక్రోశం… ఎనిమిది గంటలవుతోంది.
”ఏటే, పనికి పోవా?”
”ఊహూ” అంది.
”ఏటయిందీ? తలనొస్తుందా?
”ఊ….” అంది.
”సరేగానీ, కాసేపు పడుకొని లేచాక కాస్త గంజివార్చి పప్పుచారెట్టేయ్‌. నేను లచ్చమ్మ గారింటికి వెళ్లి కొబ్బరిమట్టలు అడిగి రెండు సీపుర్లు కట్టుకు వస్తా” అంది. కనక సమాధానం వినలేదు. ఆ ఇంట్లో ఎవరికీ ఎవరితోనూ ఎక్కువసేపు గడపడానికి, వోదార్చడానికి, సేవలు చేయడానికి, ప్రేమ చూపడానికి సమయం, వోపికా రెండూ ఉండవు.

పదిగంటలదాకా ఆలోచించింది. అమ్మ సెప్పినట్టు చెయ్యకపోతే… అమ్మేటంటుందో… అని ఒక్కక్షణం ఎప్పటిలా భయపడిపోయింది. కానీ బంధాలేవీ లేవన్పించింది. ఏదో తెగింపు వచ్చింది. నేను ఎవరి మాటా వినను. వెళ్లిపోతాను. మొగుడు చనిపోయినపుడు ఏడ్చిన ఏడుపుకి నా కర్మ అని సరిపెట్టుకొన్నా కానీ ఇప్పుడు అలా సరిపెట్టుకోలేకపోతోంది మనసు. ఏదో ఉక్రోషం. అస్పష్టంగా తెలుస్తోంది. కసిగా ఎదగాలన్పిస్తోంది.
తన జీవితంలో మిగిలిందేంటి…
”మొగుడూ పోయాడు.
పొదుపుసేసిన డబ్బూ పోయింది.
మడి సెక్కా పోయింది.
మానం పోయింది. చివరికి మనిషి మీద నమ్మకమే పోయింది. ఇంక ఇక్కడ ఉండననుకొంది స్థిరంగా. మొదటిసారి ఊరొదలడానికి ఎంత బాధపడిందో, ఇప్పుడు ఊల్లో ఉండడానికి అంత బాధగా ఉంది. ఎవరి కబురుకీ అందనంత దూరం పోవాలనుకొంది. ఉన్న నాలుగు చీరలు సర్దుకొని బయల్దేరింది. కువకువలాడుతున్న కోడిపిల్లలు కాళ్లల్లో పడ్డాయి. నాలుగు పిల్లలే. అటూ ఇటూ వెదికింది. మిగిలినవాటిని, గెద్ద తన్నుకుపోయింది. అయ్యో! అనుకొని నాలుగిటినీ బుట్టలో పెట్టుకొని పైన గుడ్డ కప్పింది. ఆ బుట్ట ఒక చేత్తో పట్టుకొని పచ్చని బతుకు కోసం, దగాలేని బతుకు కోసం పట్టుదలగా బయల్దేరింది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

2 Responses to కూరాకులమడి

  1. kusumakumari says:

    సీతారత్నంగారి కథ”కూరాకు మడి”వాస్తవ దర్పణం.
    “దగా పడని బతుకు కోసం సాగే కనకం అన్వేషణ యొక్క ఆరంభాన్ని
    బాగా చిత్రించారు.

  2. anamika says:

    ఎక్కడయినా అదె కధ.. 🙁

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.