సామాజిక ఉద్యమకారిణి, వర్ధమాన రాజకీయ నాయకురాలు కల్పన దయాల (1977`2021) ఈ నెల 19న లివర్ క్యాన్సర్ కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆమె రెండు దశాబ్దాలుగా అణగారిన వర్గాల ప్రయోజనం కోసం అనేక సంస్థలతో కలిసి పనిచేశారు. ఆమెకు
కపార్ట్, భూమిక, పిలుపు, స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ వంటి వాటితో అనుబంధం ఉంది. చాలాకాలం యాక్షన్ ఎయిడ్ సంస్థల్లో ప్రోగ్రాం అఫీసర్‌గా సేవలు అందించారు. ఆ క్రమంలోనే, దళితుల భూమి హక్కులు, ఆదివాసీల సమస్యలు, చేనేత, చేతివృత్తులు, మహిళా సమస్యలు, లింగవివక్ష, బహుజన వర్గాల జీవనోపాదుల గురించి కృషి చేశారు. ఉపాధి హామీ పథకంపై, తోళ్ళ పరిశ్రమలో పనిచేసేవారి సమస్యలు, మత్స్యకారుల సమస్యలపై కూడా ఆమె కృషి ప్రశంసనీయం. ఫిషరీస్ నేషనల్ కో`ఆర్డినేటర్‌గా పనిచేసిన కల్పన సామాజిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనంతరం
ఉస్మానియాలోనే పిహెచ్‌డి కూడా రిజిస్టర్ చేసుకున్నారు. కానీ దాన్ని పూర్తిచేయకుండానే జీవితం చాలించారు.
కల్పన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. వివిధ సామాజిక సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంపై ఎక్కువ దృష్టి పెట్టేవారు. దానికోసం 2001లో తెలంగాణ చైతన్య వేదిక అనే సంస్థను స్థాపించారు. చేనేత సమస్యలపై వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి వంటి ప్రముఖులకు సైతం ఆమె అవగాహన కల్పించారు. హైదరాబాద్ సందర్శించే కొంతమంది సామాజిక కార్యకర్తలను పోచంపల్లి తీసుకువెళ్ళి చేనేత విశిష్టత గురించి వివరించేవారు. తన కార్యక్రమాలలో భాగంగా నెల్లూరు, ప్రకాశం, నల్లగొండ, వరంగల్ వంటి చోట్ల ఎక్కువగా పనిచేశారు. కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సామాజిక అంశాలపై జరిగిన సభలు, సదస్సులు, క్షేత్ర పర్యటనల్లో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో అణగారిన వర్గాల భూమి హక్కులపై జరిగిన అంతర్జాతీయ సదస్సుకు ఆమె హాజరయ్యారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని సాధించడంలోనూ కల్పన పాత్ర మరువలేనిది. కొండా లక్ష్మణ్ బాపూజీ, గుంటుక నర్సయ్య పంతులు వంటి చేనేత ప్రముఖుల జీవిత చరిత్రలు రాసి ప్రచారం చేశారు. సామాజిక అంశాలపై వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడంతో పాటు టెలివిజన్ చర్చలలో తన వాదనను గట్టిగా వినిపించేవారు. స్త్రీ సమస్యలపై వచ్చిన సినిమాలన్నా, కథా సాహిత్యమన్నా ఆమె ఎంతో మక్కువ చూపేవారు. కొన్ని కథలు, కవితలు కూడా రాశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎందరో మహిళా కార్యకర్తలను ఆదర్శంగా భావించిన కల్పన… సదాలక్ష్మి, కమలాదేవి ఛటోపాధ్యాయ వంటి వారి జీవిత చరిత్రలను ఇష్టంగా చదివేవారు. రాజకీయాలలో స్వతంత్య్ర గొంతుకకు సదాలక్ష్మిని, ఏ ఆధారం లేనివారికి జీవనోపాధులు కల్పించడంలో కమలాదేవిని ఆదర్శంగా భావించేవారు.
2013 నుంచి కల్పన పూర్తిస్థాయిలో ప్రత్యక్ష రాజకీయాలలో పాలుపంచుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేశారు. రిజర్వ్‌డ్ నియోజకవర్గాలలో నాయకత్వ అభివృద్ధి కోసం నియమించిన కమిటీకి ఆమె రాష్ట్ర సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆ తర్వాత పిసిసి కార్యదర్శి పదవిలో కొనసాగారు. దుబ్బాక, జిహెచ్‌ఎంసి ఉప ఎన్నికలలో పార్టీ తనకు అప్పగించిన ఎన్నికల ప్రచార బాధ్యతను విజయవంతంగా నిర్వహించారు. ఆ మధ్య అసోంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి పాల్గొన్నారు.
బహుజన కుటుంబాల నుంచి కల్పన లాంటివాళ్ళు సామాజిక బాధ్యత కోసం ముందుకు రావడమే అరుదు. రాజ్యాధికారం దిశగా ఆలోచించేవారు మరీ అరుదు. గతంలో వనం రaాన్సీ రాజకీయంగా ఎదుగుతున్న తరుణంలోనే అకాల మరణం చెందారు. ఆ కోవలోనే కల్పన కూడా వెళ్ళిపోయారు. కొందరు ఎనభై ఏళ్ళలో కూడా సాధించలేనిది ఆమె 44 ఏళ్ళకే చాలావరకు సాధించారు. బహుజన వర్గాల కోసం ఆమె చేసిన కృషి సదా స్మరణీయం.