తూత్తుకుడి ఉప్పుమడుల రాణి – అపర్ణ కార్తికేయన్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

(అనువాదం: ఆపర్ణ తోట)
ప్రతి ఏడాది ఆరునెలల పాటు తమిళనాడు తూత్తుకుడి జిల్లాలో ఉప్పుమడుల కార్మికులు మండుటెండలో, అసౌకర్యంగా ఉండే పని ప్రదేశంలో, అతి తక్కువ వేతనాలతో మనమంతా వంటగదిలో ముఖ్యమైన దినుసుగా వాడే ఉప్పుని పండిస్తారు.

తమిళనాడులోని ఏడు పంటలపై రాసిన కథనాలలో ‘లెట్‌ దెమ్‌ ఈట్‌ రైస్‌ (వాళ్ళు వరి అన్నం తిననీ)’ అనే సిరీస్‌లోని మొదటి కథ ఇది. ఈ వరుసలో ూARI ఇప్పటినుండి రెండు సంవత్సరాలలో 21 మల్టీమీడియా నివేదికలను ప్రచురిస్తుంది. ఇవి రైతుల జీవితాలను, వారి పంటల ప్రపంచం ద్వారా పరిశీలిస్తాయి. అపర్ణ కార్తికేయన్‌ రాస్తున్న ఈ సిరీస్‌కు బెంగుళూరులోని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నుండి గ్రాంట్‌ లభిస్తుంది.
బంగారు వర్ణంలో సూర్యుడు ఎప్పటిలానే అందంగా ఉదయిస్తుండగా, రాణి తన పనికి వెళ్ళిపోయింది. అతి బరువైన ఒక పెద్ద చెక్కబద్దను పట్టుకుని, ఆమె అందరికీ తెలిసిన, వంటగదిలో అతి ముఖ్యమైన ఆహార పదార్థం ‘ఉప్పు’ను కుప్పగా చేస్తుంది.
ఆమె పనిచేసే చతురస్రపు గడిలో అడుగును గీరుతూ, ఒకసారి కరకరలాడే, ఒకసారి మెత్తగా, తడిగా ఉన్న ఉప్పు గళ్ళను, అక్కడే ఒకచోట కుప్పగా పేరుస్తుంది. చిన్న మడే అయినా ఆమె ప్రతిసారీ ఉప్పు గళ్ళను లాగుతున్నకొద్దీ, ఆ ఉప్పు గళ్ళ కుప్ప పెద్దదవుతూ ఆమె పని ఇంకా కష్టమవుతూ
ఉంటుంది. ఎందుకంటే ఆమె లాగిన ప్రతిసారీ ఆ ఉప్పుకు మరో 10 కిలోల ఉప్పుని జతచేస్తుంది. ఇది ఆమె శరీర బరువులో నాలుగో భాగం.
అలా ఆమె ఆగకుండా 120 అడుగులకు 40 అడుగులుండే స్థలంలో పైన పేలవమైన ఆకాశం, కింద నీళ్ళపై ప్రతిబింబిస్తుండగా, ఆమె తన నీడతో పాటే కదులుతూ పనిచేసింది. ఈ ఉప్పటి ప్రపంచం గత 52 ఏళ్ళుగా ఆమె పని ప్రదేశమైంది. ఇదే ప్రదేశం గతంలో ఆమె తండ్రిది, ప్రస్తుతం ఆమె కొడుకుది కూడా అయింది. ఇక్కడే ఎస్‌.రాణి ఆమె కథను నాకు చెప్పింది. ఆ కథతో పాటే దక్షిణ తమిళనాడులో తూత్తుకుడి జిల్లాలో ఉన్న 25,000 ఎకరాల ఉప్పు మడుల గురించి కూడా తెలిసింది.
ప్రతి ఏడూ మార్చి నుండి అక్టోబర్‌ వరకు ఈ కోస్తా జిల్లా ఉప్పు తయారీకి సరిగ్గా సరిపడే వాతావరణం ఉంటుంది. ఇక్కడ వేడిగా, పొడిగా, తేమ లేకుండా ఉండడం వలన ఖచ్చితంగా ఆరు నెలలు నిరంతరాయంగా ఉప్పు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. తమిళనాడులోనే అత్యంత అధికంగా
ఉప్పును ఉత్పత్తి చేసే జిల్లా ఇది. దేశం మొత్తంలో 11 శాతం ఉప్పు తమిళనాడులోనే ఉత్పత్తి అవుతుంది. దీనికన్నా ఎక్కువగా గుజరాత్‌ నుండి 16 మిలియన్‌ టన్నుల ఉప్పు, మన దేశంలో ఉత్పత్తి అయ్యే సగటు ఉప్పు పంటలో 76 శాతం అంటే 22 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి అవుతుంది. ఈ దేశంలో ఉత్పత్తి అయ్యే ఉప్పు సంఖ్యతో పోల్చి చూస్తే 1947లో ఉత్పత్తి అయిన 1.9 ఎం.టీ. చాలా ఎక్కువ.
సెప్టెంబర్‌ మధ్యలో, ూARI మొదటిసారి తూత్తుకుడిలో రాజా పండి నగర్‌లో ఉన్న ఉప్పు మడుల వద్దకు వెళ్ళింది. ఆ సాయంత్రం రాణి, ఆమెతో పనిచేసేవారు మమ్మల్ని కలిసి వేపచెట్టు కింద గుండ్రంగా వేసిన కుర్చీలలో కూర్చుని మాతో కబుర్లు చెప్పారు. వారి ఇళ్ళు కొన్ని ఇటుకలతో, ఆస్బెస్టాస్‌ రేకులతో, కొన్ని గుడిసెలు ఉన్నాయి. మా వెనుక ఉన్న కొన్ని పై కప్పులు పడిపోతున్నాయి. ఈ ఉప్పు మడులు లేదా ఎక్కడైతే ఉప్పుని తయారు చేస్తారో అవి రోడ్డు పక్కనే ఉన్నాయి. వారు పనిచేసే ప్రదేశం తరాల నుంచి అక్కడే ఉంది. మా సంభాషణ సాగుతున్నకొద్దీ వెలుగు తగ్గిపోతోంది. ఈ సంభాషణ నెమ్మదిగా సోడియం క్లోరైడ్‌ (ఉప్పుకు ఉన్న రసాయన పేరు)ను తయారుచేయడానికి జరిగే క్లిష్టమైన ప్రక్రియ గురించి మాకు వేగవంతమైన జ్ఞానం అందేంత అద్భుతంగా సాగింది.
సూర్యోదయమవుతున్నప్పుడు తూత్తుకుడిలో ఉప్పు కార్మికులు వాళ్ళ పని ప్రదేశానికి వెళ్ళడానికి నడుస్తున్నారు. వారు ఆ రోజు చేయవలసిన కఠినమైన పని గంటలను ప్రారంభిస్తున్నారు.
తూత్తుకుడిలోని ఈ ‘పంట’ సముద్రపు నీటికంటే ఉప్పు ఎక్కువగా ఉండే ‘నేల క్రింది’ ఉప్పునీరు నుండి పండిస్తారు. దీన్ని బోరు బావుల ద్వారా పైకి తోడుతుంటారు. రాణి, ఆమె స్నేహితులు పనిచేసే 85 ఎకరాల ఉప్పు మడులలో, ఏడు బోరు బావుల నుండి, అక్కడి మడుల్లోకి నాలుగు అంగుళాల వరకు నీటిని నింపుతారు. (ప్రతి ఎకరం దాదాపు తొమ్మిది ప్లాట్‌లుగా విభజించబడి ఉంది. ఇందులో దాదాపు నాలుగు లక్షల లీటర్ల నీళ్ళుంటాయి. అంటే 10,000 లీటర్ల నీటి ట్యాంకర్లలో పట్టేన్ని నీళ్ళు).
కొద్దిమంది మాత్రమే బి అంథోని సామి లాగా ఉప్పలం (ఉప్పు మడుల) నిర్మాణాల గురించి అర్థం చేసుకుని వివరించగలరు. ఈయన తన 56 ఏళ్ళలో ఎక్కువకాలం ఉప్పు కార్మికుడిగానే పనిచేశారు. అతని పని వివిధ ఉప్పు మడుల్లో నీటి లెవల్‌ని నిర్వహించడమే. సామి ఉప్పు మడులను రెండు రకాలుగా విడదీస్తారు. ఆణ్‌ పాతిలు (మగ పాదులు) అంటే నీళ్ళని త్వరగా ఎండగట్టేవి లేదా లోతు లేని ఉప్పు మడులు… వాటికి అవి త్వరగా ఎండిపోయేవిగా చెబుతారు. రెండవ రకం పెణ్‌ పాతిలు (ఆడ పాదులు) ఉప్పుని పుట్టించేవి, అంటే గళ్ళు తయారీ చేసేవిగా చెబుతారు.
బ్రైన్‌ని పైకి లాగగానే ముందుగా ఎవాపరేటర్లని నింపుతామని ఆయన చెప్పారు. ఇక ఆ తర్వాత అంతా సాంకేతికంగా మాట్లాడతారు. ద్రవాల నిర్దిష్ట గురుత్వాకర్షణను కొలిచే పరికరమైన బామ్‌ హైడ్రోమీటర్‌ ద్వారా ఆ ఉప్పు నీటిలో లవణీయతను డిగ్రీలలో కొలుస్తారు. స్వేదనజలం యొక్క ‘బామ్‌ డిగ్రీ’ సున్నా. అదే సముద్రపు నీటిలోనైతే ఇది 2 నుండి 3 బామ్‌ డిగ్రీల వరకు ఉంటుంది. అలాగే బోర్‌వెల్‌ నీటిలో 5 నుండి 10 డిగ్రీల వద్ద ఏర్పడుతుంది. ‘‘నీరు ఆవిరైపోతుంది. దాంతో లవణీయత పెరుగుతుంది. ఆ తర్వాత అది క్రిస్టలైజర్లకు పంపబడుతుంది’’ అని సామి చెప్పారు.
ఆ తర్వాత రెండు వారాల పాటు, ఆడవారు ఒక చాలా పెద్ద బరువైన ఇనుప చువ్వలుండే పార వంటి పరికరంతో నీళ్ళను దువ్వినట్లుగా రోజూ కలియబెడతారు. ఒకరోజు దీంతో నిలువునా లాగితే, మరోరోజు అడ్డంగా లాగుతారు. ఉప్పు గళ్ళు కిందనే
ఉండిపోకుండా అలా చేస్తారు. పదిహేను రోజుల తర్వాత మగ, ఆడవారు కలిసి ఒక పెద్ద చెక్క తెడ్డు వాడి ఉప్పుని తీస్తారు. దీన్ని తర్వాత వారం అంటే రెండు మడుల మధ్య ఉన్న వరప్పు గట్టు మీద వేస్తారు.
ఇప్పుడు కష్టతరమైన పని మొదలవుతుంది. ఆడవారు, మగవారు వరప్పు నుండీ ఉప్పుని తలమీద పెట్టుకుని దూరంగా ఒకచోట కుప్పలా పోస్తారు. ప్రతి వ్యక్తికి కొన్ని వరప్పు గట్లు ఇస్తారు. దాని నుంచి వారు ప్రతిరోజూ 5`7 టన్నుల ఉప్పును తలమీద పెట్టుకుని మోస్తారు. అంటే మొత్తం 150 సార్లు వాళ్ళు నెత్తిమీద 35 కేజీల బరువు పెట్టుకుని 150 నుండి 250 అడుగులు నడుస్తారు. ఇన్నిసార్లు తిరిగారు కాబట్టి ఆ చిన్న ఉప్పు కుప్ప నెమ్మదిగా దిబ్బంత పెరిగిపోతుంది. ఆ సూర్యకాంతిలో ఈ తెల్లని ఉప్పు గళ్ళు వజ్రాలలాగా మెరిసిపోతుంటాయి. ఇది వేడిగా ఉన్న ఈ గోధుమ రంగు నేలలోని సంపద.
… … …
ఒక ప్రేమికుడి కోపం ఆహారానికి ఉప్పు వంటిది. ఎక్కువైతే రుచించదు.
అది చెంతిల్‌ నాథన్‌ చేసిన తిరుక్కురల్‌ (పవిత్ర జంటలు) నుండి ద్విపద యొక్క అనువాదం (మరియు క్లుప్త వివరణ). 4వ శతాబ్దం దీజజు నుండి 5వ శతాబ్దం జజు మధ్య కాలంలో జీవించినట్లు వివిధ చరిత్రకారులు విశ్వసించే తమిళ కవి సన్యాసి తిరువళ్ళువార్‌ రాసిన తిరుక్కురల్‌లోని 1,330 ద్విపదలలో ఇది ఒకటి.
సరళంగా చెప్పాలంటే, ఉప్పును ప్రతీకగా తమిళ సాహిత్యంలో వాడడం రెండువేల ఏళ్ళ క్రితమే మొదలైంది. అంటే దానికంటే ముందుగానే తమిళనాడు కోస్తా ప్రాంతంలో ఉప్పు తయారీ మొదలైంది.
చెంతిల్‌ నాథన్‌, 2000 ఏళ్ళ ప్రాచీనమైన సంగం యుగానికి చెందిన ఒక కవితను కూడా అనువదించారు. ఈ కవితలో కూడా ఉప్పును మాధ్యమంగా ఉపయోగించారు. ఈ పదాన్ని ప్రేమికుల గురించి వ్రాస్తున్నప్పుడు వాడారు.
సొర చేపలను వేటాడుతుండగా
గాయపడిన మా నాన్న తేరుకుని
మళ్ళీ నీలిసముద్రంలోకి
వెళ్ళిపోయాడు.
ఉప్పుతో బియ్యాన్ని కొనడానికి
మా అమ్మ ఉప్పు మడులలోకి
వెళ్ళింది.
ఇప్పుడు దూరాన్ని మతించని
నడకవలన కలిగే అలసటను
భరించగలిగే
ఒక మిత్రుడు ఉంటే బావుండు,
ఆ చల్లని దూరతీరాలలోని
మనిషికి
నన్ను చూడాలనుకుంటే, ఇదే
సమయమని
నా మాటగా చెప్పాలి.
జానపదాలు, సామెతలు కూడా ఉప్పుతో ముడిపడినవి ఉన్నాయి. అందులో ఒకటి రాణి నాకు చెప్పింది. ప్రసిద్ధి పొందిన తమిళ సామెత ‘ఉప్పిలా పండం కుప్పయిలే’`(ఉప్పు లేని భోజనం, అర్థం లేనిది). ఆమె వర్గం వారు ఉప్పును లక్ష్మిగా భావిస్తారు. లక్ష్మీదేవి హిందూ దేవతల్లో సంపదకు దేవత. ‘ఎవరైనా ఇల్లు మారితే మేము ఉప్పును, పసుపును, నీళ్ళను తీసుకెళ్ళి వారింట్లో పెట్టి వస్తాము. అది శుభం’ అని చెప్పింది రాణి.
సంస్కృతిలో ఉప్పుని విశ్వాసానికి ప్రతీకగా వాడతారు. రచయిత ఎ.శిబ సుబ్రమణియన్‌ ఇలా చెబుతారుః జీతానికి తమిళ పదం సంబలం`ఇక్కడ సంబ అంటే వరి, ఉప్పలం అంటే ఉప్పును పండిరచే చోటు. ఆయన పేరు గాంచిన పుస్తకం ఉప్పితావారై (తమిళుల సంస్కృతిలో ఉప్పును గురించి మొనోగ్రఫ్‌)లో ఆయన తమిళంలో తరచుగా వాడే సామెతను దృష్టికి తెస్తారు. ఉప్పితావరల్‌ ఉల్లవుమ్‌ నేనై… అంటే నీ భోజనంలో ఉప్పు వేసేవాడిని మరచిపోకు, అంటే నీ యజమానిని మరిచిపోకు.
మార్ల్‌ కుర్లాన్స్కీ తన గొప్ప అద్భుతమైన పుస్తకం, ‘సాల్ట్‌: ఎ వరల్డ్‌ హిస్టరీ’లో చెప్పినట్లు ‘‘ఇది మొదటి అంతర్జాతీయ విక్రయం పొందిన ఉత్పత్తులలో ఒకటి. దీని ఉత్పత్తి మొదటిగా వచ్చిన పరిశ్రమలో ఒకటి. ఇదే మొదట గుత్తాధిపత్యం తీసుకున్నదనడానికి ఎటువంటి సందేహం లేదు’’. ఈ ఒక్క దినుసు మన భారతీయ చరిత్రను పూర్తిగా మార్చేసింది. మహాత్మాగాంధీ మార్చి, ఏప్రిల్‌ 1930లో బ్రిటిష్‌ రాజ్యానికి పన్ను కట్టకుండా గుజరాత్‌లోని దండి వరకు మార్చ్‌ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది ఏప్రిల్‌లో ఆయన రాజకీయ సహోద్యోగి సి.రాజగోపాలాచారి తమిళనాడులో ఉప్పు సత్యాగ్రహాన్ని తిరుచునాపల్లి నుండి వేదారణ్యం వరకు నడిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటాలలో దండి మార్చ్‌ ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోయింది.
… … …
‘‘అత్యంత కష్టమైన పనికి అతి తక్కువ వేతనాలు’’ ` ఆంథోనీ సామి, ఉప్పు కార్మికుడు.
రాణి మొదటి జీతం రోజుకు 1.25 రూపాయలు. ఇది 52 ఏళ్ళ క్రిందటి మాట. ఆమెకి ఎనిమిదేళ్ళున్నప్పుడు ఒక పొడుగు లంగా వేసుకుని ఉప్పు బట్టీల మధ్య తిరుగుతూ ఉండేది. ఆంథోనీ సామికి కూడా తన మొదటి జీతం గుర్తుంది 1.75 రూపాయలు. ఏళ్ళ తర్వాత అది 21 రూపాయలకు మారింది. ఈ రోజు, దశాబ్దాల పోరాటం తర్వాత ఆడవారికి రోజు వేతనం 395 రూపాయలు, మగవారికి 405 రూపాయలు అయింది. కానీ ఒక విషయం మాత్రం అలాగే ఉందిÑ ‘‘అత్యంత కష్టమైన పనికి అతి తక్కువ వేతనం’’.
‘‘నేరం ఆయిట్టు’’ (ఆలస్యం అవుతోంది)… రాణి కొడుకు కుమార్‌ తూత్తుకుడి యాసలో పొద్దున్న 6 గంటలకు పిలిచాడు. మేము అప్పటికే ఉప్పు మడులకు చేరిపోయాము. అతను పని మొదలుపెట్టడం ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో అన్నాడు. దూరం నుండి ఆ మడులు చిత్రాల్లాగా ఉన్నాయి. ఆకాశం ఊదా, బంగారు వర్ణాలలో ఉంది. కింద మడులలో నీరు మెరుస్తోంది. చల్లగాలి దయగా నిమురుతోంది. దూరంగా ఫ్యాక్టరీలు తమకేమీ తెలియనట్లున్నాయి. ఒక అందమైన ప్రకృతి దృశ్యం. ఇంకో అరగంటలో, ఇది ఎంత క్రూరంగా మారబోతోందో మీకు అక్కడ పనిచేస్తే తెలుస్తుంది.
ఒక పాడైపోయి ఉన్న పాత షెడ్డు వద్ద ఉప్పు మడుల మధ్యలో ఆడా, మగా అంతా తయారవుతారు. ఆడవారు వారి చీరలపైన చొక్కాలు వేసుకుని, ఒక బట్టతో నెత్తిమీద చుట్టకుదురు తయారు చేసుకుని పెట్టుకుంటారు. ఆ తరువాత వారు పనిచేయవలసిన సామగ్రిని అల్యూమినియం గిన్నెలను, బక్కెట్లు, మంచినీళ్ళ సీసాలు, ఆహారం… ఒక స్టీల్‌ కారేజ్‌లో గంజి అన్నాన్ని పట్టుకుని బయల్దేరతారు. ఎడమవైపు చూపిస్తూ ‘‘ఈ రోజు ఉత్తరం వైపు వెళ్తున్నాం’’ అన్నాడు కుమార్‌. అతని వెనుకే ఒక బృందం కదిలింది. వారంతా ఒక రెండు వరసల్లో ఉన్న మడుల వద్ద ఆగి అక్కడి ఉప్పును కొన్ని గంటలలో ఖాళీ చేస్తారు.
వెంటనే వాళ్ళు పనిలోకి దిగుతారు. ఆడవారు, మగవారు వారు వేసుకున్న బట్టలను పైకి మడుస్తారు. చీరలు, లంగాలు, ధోతీల అంచులు వారి మోకాళ్ళను తాకుతాయి. వాళ్ళు ఉప్పును పారతో ఎత్తి వారితో తెచ్చుకున్న బేసిన్లలో నింపుకుంటారు. ఒక్కసారి ఆ బేసిన్లు నిండగానే ఒకరి బరువు ఇంకొకరి నెత్తిమీద పెట్టుకుని తీగమీద నడిచినంత లాఘవంగా ఆ సన్నని దారిగుండా చెరోవైపు నీరు ఉండగా, 35 కిలోల ఉప్పును వారి తలపై మోస్తూ ఆ తాటిచెక్క వంతెన మీద ఒకటి, రెండు, మూడు… ఆరు అడుగులు.
ఇలా సాగిన ప్రయాణం తర్వాత ఒక విరామం తీసుకున్న క్షణం, తెల్లని వర్షంలా ఉప్పును కురిపిస్తూ వారు వారి బేసిన్లను ఖాళీ చేసి మళ్ళీ ఇంకా తీసుకురావడానికి వెనక్కు మరలుతారు. అలా మళ్ళీ, మళ్ళీ ప్రతి ఒక్కరూ కనీసం 150`160 సార్లు తిరుగుతారు. చివరికి అక్కడ ఒక ఉప్పు దిబ్బ వెలుస్తుంది. 10 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పు, ఒక అంబారం (కుప్ప). ఇది ఒక సముద్రం, సూర్యుడి బహుమతే కాదు… రాణి, ఆమె మనుషుల చెమటోడ్చిన కష్టం కూడా.
ఆ మడులకు మరోవైపు 53 ఏళ్ళ రాణి, ఆంథోనీ సామి పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఆమె ఆ ఇనుప చువ్వలను ఉప్పు నీటిని కలియబెట్టడానికి వాడుతుంది. అతను తెడ్డుతో అంతా ఒకచోటకు చేరుస్తున్నాడు. అక్కడ నీరు నెమ్మదిగా, సలసలమని చప్పుడు చేస్తుంటే ఆ ఉప్పు గట్టిపడుతుంది. ఇక రోజు వేడెక్కుతుంది, నీడలు నల్లబడతాయి, కానీ ఎవరూ వారి పనిని ఆపరు. వారు ఒళ్ళు విరుచుకోవడానికి, కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా ఆగలేరు. ఆంథోనీ నుండి తెడ్డుని అందుకుని నేను గట్టు మీదకు
ఉప్పును ఎత్తి వేయడానికి ప్రయత్నించాను. అది చాలా కష్టతరమైన పని. ఐదుసార్లు అలా చేయగానే నా భుజాలు మంటపుట్టాయి. వెన్నునొప్పి పెట్టింది. చెమట నా కనురెప్పల మీదకు జారింది.
ఆంథోనీ ఏమీ మాట్లాడకుండా నా వద్దనున్న తెడ్డును తీసుకుని అక్కడున్న ఉప్పుని తోయడం మొదలుపెట్టాడు. నేను రాణి పనిచేస్తున్న మడిలోకి వెళ్ళాను. ఆమె చివరి మడిలో పనిచేస్తోంది. ఆమె కండరాలు బిగుసుకుంటున్నాయి. లాగుతోంది, మళ్ళీ… మళ్ళీ. ఆ మొత్తం తెల్లని పదార్థం అంతా ఒకవైపునకు తోసుకువచ్వేరకు, ఆ మడిలో ఉన్న నీళ్ళన్నీ తెలుపు కోల్పోయి గోధుమ రంగులోకి వచ్చేవరకు, మళ్ళీ మడిలో కొత్త నీరు నింపుకోవడానికి, ఇంకో ఉప్పు పంటను తయారు చేయడానికి ఆమె కష్టపడుతూనే ఉంది.
అడ్డదిడ్డంగా ఉన్న కుప్పను తన తెడ్డుతో సరిచేశాక, రాణి తనతో నన్ను కూర్చోమని పిలిచింది. అలా కూర్చున్న మేము ఆ పెద్ద తెల్లటి ఉప్పు దిబ్బ పక్కన, దూరంగా వెళ్ళిపోతున్న గూడ్స్‌ రైలుని చూస్తున్నాం. ‘‘ఒకప్పుడు గూడ్స్‌ రైలు ఇక్కడ ఉప్పును తీసుకెళ్ళడానికి వచ్చేది’’ అంది రాణి పాత దారిని గాలిలో గీస్తూ. ‘‘వారు కొన్ని క్యారేజీలు ట్రాక్‌పైన వదిలేసేవారు. తరువాత ఇంజన్‌ వచ్చి వాటిని తీసుకుని వెళ్ళిపోయేది’’. ఆమె ఆ షెడ్డు వద్దకు ఎడ్ల బండ్లు, గుర్రపుబగ్గీలు వచ్చే రోజుల గురించి చెప్పింది. ఇప్పుడు సూర్యుడు, ఉప్పు, పని తప్ప ఇంకేమీ లేదు. అలా చెప్పి ఆమె తన రొంటిలో దోపుకున్న గుడ్డ సంచిని బయటకు తీసింది. అందులో ఒక చిన్న రెండు రూపాయల అమృతాంజనం డబ్బా, ఒక విక్స్‌ ఇన్‌హేలర్‌ ఉన్నాయి. ‘‘వీటి వలన (ఇంకా ఆమె షుగర్‌ మాత్రల వలన) నా పని సాగుతోంది’’ అని ఆమె చిన్నగా నవ్వింది.
… … …
‘‘ఒకరోజు వర్షం పడితే మాకు వారం పాటు పని దొరకదు’’ ` తూత్తుకుడిలోని ఉప్పు మడుల కార్మికులు
ఏళ్ళు గడిచిన కొద్దీ పనివేళలు కూడా మారిపోయాయి. ఇదివరకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మధ్యలో ఒక గంట భోజన విరామంతో సాగే పనివేళలు, ఇప్పుడు రెండు బృందాలుగా, ఒక బృందం ఉదయం 2 గంటల నుండి పొద్దున్న 8 గంటల వరకు పని చేస్తుంటే, మరో బృందం పొద్దున్న 5 గంటల నుండి 11 గంటల వరకు పనిచేస్తున్నారు. ఈ షిఫ్టులలో అన్నిటికన్నా కష్టమైన పని జరుగుతుంది. ఇటువంటి సమయాలలో, వారు ఇంకా కొన్ని పనులు చేయవలసి
ఉంటుంది. కొంతమంది పనివాళ్ళు అటువంటి అదనపు పనులను చేయడానికి షిఫ్ట్‌ సమయం అయిపోయినా, ఉండిపోతారు. ‘‘పది గంటల తరువాత అక్కడ నించోవాలంటే చాలా వేడిగా మారిపోతుంది’’ అన్నారు ఆంథోనీ సామి. ఉన్నట్టుండి ఉష్ణోగ్రత, వాతావరణం ఎలా మారిపోతాయనేది ఆయన స్వయంగా చూసి అనుభవించినవాడు. న్యూయార్క్‌ టైమ్స్‌లో గ్లోబల్‌ వార్మింగ్‌పై సాగే ఒక ఇంటరాక్టివ్‌ పోర్టల్‌ డేటాలో ఈయన వ్యక్తిగత గమనికలను ఉంచారు.
ఒక రెండు వారాల పాటు, ప్రతి ఉదయం, ఇక్కడ పనిచేసే ఆడవారు ఒక బరువైన ఇనుప చువ్వలున్న పార వంటి బరువైన పరికరంతో నీళ్ళను కలియబెడతారు. పదిహేను రోజుల తరువాత, ఆడవారు, మగవారు కలిసి ఉప్పును ఒక పెద్ద చెక్క తెడ్డుతో జమ చేస్తారు. ఆంథోనీ 1965లో పుట్టారు. అప్పట్లో తూత్తుకుడి (టుటుకోరిన్‌ అని పిలిచేవారు)లో ఏడాదిలో 136 రోజులుఉష్టోగ్రత 32 డిగ్రీలు దాటేది. ఈ రోజు సమాచారం ప్రకారం, ఏడాదిలో 258 రోజులు ఇదే ఉష్ణోగ్రత ఉంటోంది. అతని జీవిత కాలంలో ఏడాదిలో వేడి రోజులు 90 శాతం పెరిగాయి. దాంతో కలిపే అకాల వర్షాలు కూడా పెరిగాయి.
‘‘ఒకరోజు వర్షం పడితే, మాకు ఒక వారం వరకు పని దొరకదు’’ పనివాళ్ళంతా ముక్తకంఠంతో అన్నారు. వర్షం వచ్చి ఉప్పు, అవక్షేపం, మడులు… అన్నీ కొట్టుకుపోతాయి. కొన్ని రోజుల పాటు పనిలేక, డబ్బుల్లేక అల్లాడవలసి వస్తుంది. చాలావరకు ఈ నిలకడ లేని వాతావరణానికి, స్థానికంగా జరిగిన మార్పులే కారణం. నీడనిచ్చే చెట్లను కొట్టివేశారు. ఇప్పుడంతా ఖాళీగా పైన నీలమైన ఆకాశం మాత్రమే కనిపిస్తుంది. ఇవి ఫోటోలలో బాగా అనిపిస్తాయిÑ కానీ నీడలేని ఆకాశం కింద అంత వేడిలో పనిచేయాలంటే దుర్భరంగా ఉంటుంది. ఉప్పు మడులు కూడా ఇబ్బందిగా మారాయి. ఎందుకంటే, ‘‘ఇదివరకు యజమానులు తాగునీరు అందుబాటులో ఉంచేవారు. ఇప్పుడు మా నీళ్ళను మేము మా ఇంటినుంచే సీసాలలో ఇక్కడికి మోసుకురావాలి’’ అన్నది రaాన్సీ. మరి టాయిలెట్ల సంగతేంటని నేనడిగితే ఆ ఆగవాళ్ళు ఎగతాళిగా నవ్వారు. ‘‘మేము ఆ మడుల వెనుక ఉన్న పొలాలలోకి వెళ్తాము’’ అన్నారు. ఎందుకంటే, అక్కడ మరుగుదొడ్డి ఉన్నా కానీ, వాడుకోవడానికి నీళ్ళు లేవు.
ఇవేకాక ఉప్పు మడులలో పనిచేసే ఆడవాళ్ళకి ఇంట్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలతో. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తాను వాళ్ళను కూడా తనతో పనికి తెచ్చి ఇక్కడ షెడ్డులో ఒక తూలి, అంటే ఒక గుడ్డ ఉయ్యాల కట్టి పనికి వెళ్ళేదాన్నని చెప్పింది రాణి. కానీ ఇప్పుడు తన మనవలను ఇంటివద్దనే వదిలేసి రావలసి వస్తోందని, మడులలో పిల్లలకు స్థానం లేదని చెబుతారని చెప్పింది. బాధగానే ఉంది కానీ, దీని అర్థం పిల్లలను బంధువుల ఇళ్ళల్లోనో, పక్కింటి వారికో అప్పచెప్పడం, లేదా వదిలేసి రావడం కాదు కదా. చిన్నపిల్లలకు మూడేళ్ళు వచ్చాకే బల్వాడికి తీసుకెళ్ళగలమని, అయినా గానీ అక్కడ పని వేళలు 9 గంటలకు మొదలవుతాయని, తమకు ఆ సమయాలలో కుదరదని చెప్పింది.
చూడు మా చేతులు మగవాడి చేతుల్లా లేవూ? ` మహిళా ఉప్పు మడి కార్మికులు
ఆ ఆడవారు వారి శరీరాల గురించి మాట్లాడేసరికి వారిలో లేని చురుకు వచ్చేసింది. ఈ పనికి వారు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. రాణి తన కళ్ళ గురించి చెప్పడంతో మొదలైంది. అలా మెరుస్తున్న తెల్లని ఉప్పుని చూడడం వలన వాళ్ళ కళ్ళ నుండి నీళ్ళు కారతాయి. బాగా కాంతివంతంగా ఉన్నప్పుడు కళ్ళు చికిలించి చూడవలసి వస్తుంది. ‘‘వారు మాకు నల్ల కళ్ళద్దాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు చాలా తక్కువ డబ్బులు ఇచ్చి వాటితో కొనుక్కోమంటారు. మాకు ఏడాదికొకసారి కాలిజోళ్ళు, కళ్ళ
జోళ్ళు కొనుక్కోవడానికి 300 రూపాయలు ఇస్తారు’’. ఇందులో ఒక్కరు కూడా ఆ తెల్లని దృశ్యాన్ని, దాని ప్రతిబింబాన్ని కానీ చూసేటప్పుడు కళ్ళకు రక్షణగా గాగుల్స్‌ వేసుకోరు.
కొంతమంది ఆడవారు నల్లటి సాక్స్‌ పాదాల అడుగు భాగంలో రబ్బరు తొడుగుని వేయించి కుట్టించుకుంటారు. కానీ ఈ మడులలో పనిచేసే వారిలో ఒక్కరు కూడా గాగుల్స్‌ వేసుకోలేదు. ‘‘మంచి కళ్ళజోడు అంటే 1,000 రూపాయిల ఖర్చు ఉంటుంది. చవకరకంవి వేసుకున్నా ఉపయోగం ఉండదు, ఇంకా ఇబ్బంది పెరుగుతుంది’’ అని చెప్పారు. నలభై ఏళ్ళు వచ్చేసరికి వారి కళ్ళు ఎలా దెబ్బతిన్నాయో చెప్పారు. రాణితోపాటు ఇంకా చాలామంది ఆడవారు మాట్లాడసాగారు. వారికి పని నుండి అసలు విరామం అనేది దొరకదని చెప్పారు. తాగడానికి సరిపడా మంచి నీళ్ళు ఉండవు. విపరీతమైన ఎండ, వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉప్పు నీరు వారి చర్మాన్ని పాడు చేస్తుంది. ‘‘చూడు నా చేతులను. ముట్టుకో, మగవారి చేతుల్లా లేవూ?’’ అందరూ తమ అరచేతులు, వేళ్ళు, పాదాలను నాకు చూపించారు. వారి గోర్లు నల్లబడిపోయాయి, వంగిపోయాయి, చేతులకు కాయలు కాచాయి, కాళ్ళకు చాలా మచ్చలున్నాయి. మానకుండా ఉన్న చిన్న చిన్న గాయాలు, వారు నీళ్ళలోకి దిగినప్పుడల్లా సలుపుతుంటాయి.
మన భోజనాన్ని రుచికరం చేసే పదార్ధం వారి శరీరాలను తినేస్తోంది.
ఈ జాబితా ఇంకా లోతుకు వెళ్తుంది. గర్భసంచి తీసేయడం, కిడ్నీల్లో రాళ్ళు, హెర్నియా. రాణి కొడుకుకు 29 ఏళ్ళు, గట్టిగా ఉన్నాడు. కానీ అతను మోసే బరువుకు అతనికి హెర్నియా వచ్చింది. అతను ఆపరేషన్‌ చేయించుకుని మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. మరైతే ఇప్పుడేమి చేస్తున్నావని అడిగితే నేనింకా బరువులు మోస్తున్నాను అన్నాడు. అతనికి మరో మార్గం లేదు. ఈ ఊరిలో ఇంకా చేయడానికి వేరే పనులు కూడా ఏమీ కనిపించడం లేదు.
(ఈ వ్యాసం (https://ruralindiaonline.org/en/articles/the-rani-of-thoothukudis-salt-pans/) పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా ruralindiaonline.org) నవంబర్‌ 15, 2021 లో మొదట ప్రచురితమైనది.)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.