ఆమ్రపాలి
వైశాలి నగరంలో ప్రమదావనంలో పనిచేసే తోటమాలికి ఒక మామిడిచెట్టు క్రింద ఓ చిన్నారి శిశువు దొరికింది. ఆ శిశువుకు అతడు అంబపాలి/ఆమ్రపాలి అని పేరు పెట్టి పెంచుకోసాగాడు. ఆమె అపురూపమైన సౌందర్యరాశిగా రూపుదిద్దుకొంది. ఆమెను పెండ్లాడాలని అనేకమంది యువరాజులు పోటీపడి వాదులాడుకొనేవారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా
మారినపుడు` అంబపాలిని వేశ్యగా మారి అందరికీ ప్రేమను పంచుతూ జీవించమని పెద్దలు తీర్పు చెప్పారట. ఆ మేరకు ఆమ్రపాలి వేశ్యగా జీవనం సాగించి అపారమైన ధనాన్ని కూడబెట్టి నగరంలో ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తిగా జీవించసాగింది. బింబిసార చక్రవర్తి ద్వారా అంబపాలి కుమారుడ్ని పొందింది. ఒకనాడు అంబపాలి గౌతమ బుద్ధుని బోధనలు స్వయంగా విని, బౌద్ధ భిక్షుణిగా మారి సంఘారామ జీవనం ప్రారంభించింది. తన సంపదలను సంఘపరం చేసింది. గొప్ప ఆరామాన్ని నిర్మించింది. తథాగతుడు నిర్వాణానికి నాలుగు నెలల ముందు అంబపాలి నిర్మించిన ఆశ్రమంలో కొన్నాళ్ళు బస చేశాడు.
అంబపాలి వేశ్య. అంతఃపుర వాసినిగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించింది. అన్నీ పరిత్యజించి బుద్ధుని బోధనల ప్రభావంతో ఆమె వ్రాసిన ఒక గాథలో అందం శాశ్వతం కాదు అనే జీవిత సత్యం ప్రకటిస్తుంది. ఇది ధర్మమార్గంలోకి ప్రజలను ఆకర్షించడానికి వ్రాసినదిగా భావించాలి.
ఒకప్పుడు నా కురులు
గండుతుమ్మెదల రంగులో నల్లగా, ఒత్తుగా ఉండేవి
నేడు
జనపనార వలె వడిలిపోయి ఉన్నాయి
ఒకప్పుడు నా కొప్పునిండా పూలుండేవి
తలంతా సుగంధ పేటికలా పరిమళాలు చిందేది
నేడు
కుందేలు ఉన్నివలె దుర్గంధమోడుతోంది
ఒకప్పుడు నా కనుబొమలు
నెలవంకల వలే కాంతులీనుతూ ఉండేవి
నేడు
అవి వాలి, ముడుతలు పడి ఉన్నాయి
ఒకప్పుడు నా కనులు
వజ్రాలవలే తళుక్కుమంటూ మెరిసేవి
నేడు
అవి ఎవరినీ వెనక్కి తిరిగి చూసేలా చేయటం లేదు
ఒకప్పుడు నా గొంతు
తోటలో సంచరించే కోయిల వలే ఉండేది
నేడు
బీటలు తీసి, పెళుసుబారి
నా వయసును స్పష్టంగా పలికిస్తూ ఉంది
ఒకప్పుడు నా వక్షోజాలు
అందంగా, ఉన్నతంగా గుండ్రంగా ఉండేవి
నేడు
అవి ఖాళీ తోలు సంచుల్లా వేలాడుతున్నాయి
ఒకప్పుడు నా పాదాలు
మెత్తని దూదికూరినట్లు మృదువుగా ఉండేవి
నేడు
అవి పగుళ్ళు తీసి పుచ్చిపోయాయి
చూశావుగా నా దేహం ఎలా శిథిలమైందో
నేడు ఇది
బాధలు వసించే చోటు
పెచ్చులు రాలిపోతున్న
ఒక జీర్ణ గృహం
సత్యాన్ని పలికేవాని బోధనలు ఇవి (252`270)
ఏ మతంలోనైనా ఉన్మతలకు దారితీసే ఐహిక సుఖాల పట్ల విముఖతను పెంచేలా బోధనలు ఉంటాయి. బుద్ధిజం మినహాయింపు కాదు. ఏమి జన్మంబు ఏమి జీవనంబుÑ మానవా ఏమున్నది ఈ దేహంÑ తోలుతిత్తి ఇది తుటులు తొమ్మిది…లాంటి వైరాగ్య గీతలలోని భావధారకు 2600 ఏండ్ల క్రితం అంబాపాలి రచించిన ఈ గీతమే మూలం అనటానికి సందేహించనక్కరలేదు.