ఇంట్లో ప్రేమ్‌చంద్‌-9

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌ అనువాదం : ఆర్‌.శాంతసుందరి


(గత సంచిక తరువాయి)
ఆ సంఘటన జరిగిన నెలా పదిహేను రోజులకి బన్నూ పుట్టాడు. ఆయన పిన్ని నన్ను చూడటానికి వచ్చింది, కానీ ఇరవై రోజులకే వెనక్కి వెళ్లిపోయింది.
కాన్పూరు
ఒకరోజు ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చి, రైల్లో తన కోటెవరో ఎత్తుకుపోయారనీ, కోటుతో పాటు అందులో ఉన్న డబ్బు కూడా పోయిందనీ అన్నాడు. నా పెళ్లాం పిల్లలతో నేను మా అత్తవారి ఊరికి వెళ్తున్నాను, నాకు కాస్త డబ్బు కావాలి. లేకపోతే నేను అక్కడికి చేరుకోలేను, అన్నాడు. రెండ్రోజులు ఆయన మా ఇంట్లోనే ఉన్నాడు. ”అతనికి పదిహేను రూపాయలు కావాలిట, ఇచ్చి పంపు,” అన్నారాయన.
”నా దగ్గర డబ్బెక్కడిది? ఫీజుకోసం తీసి ఉంచినదే ఉంది,” అన్నాను.
”ఎలాగోలాగ ఇచ్చి పంపేద్దూ, నాకు చాలా ఇబ్బందిగా ఉంది!” అన్నారు.
”మళ్లీ సమయానికి మనకి డబ్బు అందకపోతేనో?” అన్నాను.
”ముందతనికి ఇచ్చెయ్యి. మన సంగతి తరవాత ఆలోచిద్దాం.”
నేనతనికి పదిహేను రూపాయ లిచ్చాను. అవి తీసుకుని అతను వెళ్లిపోయాడు.
ఐదారు రోజులయాక అదే మనిషి మళ్లీ తన పెళ్లాం పిల్లలతో వచ్చాడు. మూడు రోజులు మా ఇంట్లోనే ఉన్నారందరూ. మా ఆయన్ని ఇరవై రూపాయలడిగాడతను. మా ఆయన నాదగ్గరకొచ్చి, భయపడుతూ, ”మళ్లీ ఇరవై రూపాయలు అడుగుతున్నాడు. ఏం చేద్దాం?” అన్నారు.
”నన్ను మీరు చాలా ఇబ్బంది పెడు తున్నారు. అంత డబ్బెక్కడుంది? నా దగ్గర లేవు!” అన్నాను.
”డబ్బుల్లేకపోతే ఇంత మందికి అన్నం పెట్టటం ఎలా? లేక పొమ్మని చెపుదామా?”
”పొమ్మని మీరే చెప్పాల్సింది.”
”డబ్బివ్వకపోతే కదిలేట్టు లేరు. నలుగురికి వంట  చేసి  పెట్టటమంటే మాటలా? ఇంటికి వెళ్లగానే డబ్బు పంపించేస్తానంటున్నాడుగా!” అన్నారు.
నేను మళ్లీ పదిహేను రూపాయ లిచ్చాను. అతను నాలుగైదు రోజుల్లో వెనక్కి ఇచ్చేస్తానన్నాడు. అతనిస్తానన్న తేదీ గడిచి పోయాక, ”డబ్బు పంపాడా?” అన్నాను.
”లేదు, కానీ ఫీజు డబ్బు కట్టేశాలే!” అన్నారు.
పది పదిహేను రోజులయాక, ”కనీ సం అతనికి ఒక ఉత్తరమైనా రాసి పడె య్యండి!” అన్నాను.
”నువ్వు చెప్పకముందే రెండు ఉత్తరాలు రాసి పోస్టు చేశాను,” అన్నారు.
”అయితే ఇకనించీ ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వనని ఒట్టు పెట్టుకోండి!”
”నువ్వు చెప్పినట్టే వింటాను. కానీ ఎవరైనా అడిగితే ఇచ్చి తీరాల్సిందేగా?”
”మీకేమీ సమస్య ఉండదు. పెట్టెలో రూపాయి పెట్టి అది పది రూపాయలై పోతుందని అనుకుంటారు, మీరు.”
”నువ్వు కూడా ఎప్పుడడిగినా తీసి ఇస్తూ ఉంటావుగా. నీ దగ్గర లేకపోతే ఇవ్వటం ఎలా వీలవుతోంది? మునుపటిలా కాదుకదా? ఫీజు కట్టకపోతే డబ్బుల్లేవని నాకర్థం అవుతుంది కదా!”
”నా సమస్యని కూడా కొంచెం అర్థం చేసుకోండి.”
”అరె, ఏం చెయ్యమంటావు? ఆ వచ్చిన వాళ్లకి నీ ఒంట్లో బాగా లేదనీ, వండి వార్చలేననీ చెప్పచ్చుకదా? అసలు వాళ్ల దగ్గర డబ్బు ఉంటుంది, అయినా అప్పు చెల్లించరు!”
నేను జవాబు చెప్పలేదు. కానీ అప్పట్నించీ అప్పులివ్వటం మానేశాను.
కానీ మళ్లీ ఇలాంటిదే ఇంకో సంఘటన జరిగింది. ఒకసారి ఈయనకి గ్వాలియర్‌ నించి ఒక ఉత్తరం వచ్చింది. నేనప్పుడు లక్నోలో ఉన్నాను. ఆ ఉత్తరం రాసిన వ్యక్తి, మీరు నాకు వంద రూపాయ లిస్తే, నాకు నెలకి వంద రూపాయల జీతం తో ఉద్యోగం దొరుకుతుంది, నేను జామీను కట్టాలి, అని రాశాడు.
మా ఆయన నాకా ఉత్తరం చదివి వినిపించారు. ”వంద రూపాయలు కావాలనీ, వంద రూపాయలు నెలకి సంపాదించగల ఉద్యోగం తనకి దొరకుతుందనీ రాశాడు,” అన్నారు.
”అయితే ఉద్యోగం చేసుకోమనండి. డబ్బెందుకు అడుగుతున్నాడు?” అన్నాను.
”జామీను కట్టాలంటున్నాడు కదా!”
అతని మీద నాకు కూడా జాలి వేసింది. ఇస్తే తప్పేముందిలే, పాపం ఉద్యో గం దొరుకుతుంది, అనుకున్నాను.
”రెండు నెలల్లో యాభై యాభై చొప్పున తీర్చేస్తానంటున్నాడు,” అన్నారు.
”ఆ డబ్బులు వెనక్కొస్తాయని ఆశ వదులుకోండి. అతనికి ఇచ్చెయ్యండి. అతనికి సాయం చేసినట్టుంటుంది. అతని జీవితం బాగుపడచ్చు,” అన్నాను.
”సరే, నీ ఇష్టం.” అన్నారు.
మర్నాడు బ్యాంక్‌నించి వంద రూపా యలు తెప్పించాను. వాటిని అతనికి పంపేశాను. మా ఆయన ఉత్తరంలో, ఈ డబ్బు నేను కాదు, శివరాణి పంపిస్తోందని రాశారు.
నాలుగోరోజుకి అతని దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. ”నాకిప్పుడు ఆ ఉద్యోగం దొరుకుతుందని చెప్పటానికి చాలా సంతోషిస్తున్నాను,” అని రాశాడు.
ఆ తరవాత నెల రోజులపాటు అతని దగ్గర్నించి ఉత్తరాలు తరచు వస్తూ ఉండేవి. ఆ తరవాత అతనే స్వయంగా వచ్చాడు. మా ఇంట్లోనే దిగాడు.
”సెలవు పెట్టి మీ ఇద్దర్నీ కలుసు కోవటానికే వచ్చాను. మా అమ్మ పోయి చాలా కాలమయింది. మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. నేనంటే ఆయనకి అసలు ఇష్టం లేదు. ఇక ఈ ఇల్లే నాదనుకుంటాను,” అన్నాడతను.
రెండ్రోజులు చూసి నేను మా ఆయనతో, ”ఇతన్ని ఏదైనా హోటల్లో ఉంచే ఏర్పాటు చెయ్యండి,” అన్నాను.
”నాకూ అదే అనిపిస్తోంది,” అన్నారా యన.
అతను పన్నెండు రోజులు అలా హోటల్లో ఉన్నాడు. ఆ సమయంలో మా ఆయన ‘హంస్‌’ పత్రిక తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. రెండు వారాలుండి, ఆ వచ్చినతను వెళ్లిపోయాడు.
మేలో మళ్లీ మేం మా ఊరొచ్చాం. జూన్‌లో కమల పెళ్లి. ఆ పెళ్లికి అతను మళ్లీ వచ్చి మా ఇంట్లో పదిహేను రోజులు ఉండిపోయాడు. వెళ్లేప్పుడు మళ్లీ ఒక యాభై రూపాయలు ఇమ్మని అడిగాడు, ఆ డబ్బు అతనికి ఇచ్చిన విషయం నాకు తెలీదు, అతను వెళ్లిపోయాడు. ఆ తరవాత జూలైలో మా ఆయన లక్నో వెళ్లారు. నేనప్పుడు ఆయన వెంట వెళ్లలేదు. ఆయన, ధున్నూ వెళ్లారు.
ఆ తరవాత మా ఇంటికి వచ్చిన అతను పాట్నాలో తన పెళ్లి అని ఆయనకి చెప్పాడు, పెళ్లికి పిలిచాడు. ఈయన అతని కాబోయే పెళ్లాం కోసం,  నాలుగు బంగారు గాజులూ, గొలుసూ, కమ్మలూ, రెండు మూడు పట్టు చీరల కొని తీసుకెళ్లి ఇచ్చారు. ఇది కాక ఖర్చుకి అతనికి వందరూపాయ లిచ్చి, పెళ్లికి పాట్నాకి కూడా వెళ్లారు.
అతను పెళ్లి చేసుకుని, పెళ్లాంతో లక్నోకి వచ్చాడు. మూడు రోజుల తరవాత పోలీసులు అతన్ని వెతుక్కుంటూ వచ్చారు. అతను పరారీ అయిన నేరస్థుడు!
అప్పుడు మా ఆయన అతనితో, ”ఇంక నువ్విక్కడ ఉండటానికి వీల్లేదు,” అన్నారు. అతను పెళ్లాంతో ఎటో వెళ్లి పోయాడు.
ఆగస్టులో నేను లక్నోకి వెళ్లేదాకా నాకీ వివరాలేవీ తెలీలేదు. అతను తన దగ్గర్నించి బట్టలూ, డబ్బూ తీసుకెళ్లాడని మా ఆయనే చెప్పారు.
ఒకరోజు కంసాలి ఇంటికొచ్చి గొడవ చెయ్యసాగాడు. నేను అక్కడే ఉన్నాను.
”డబ్బివ్వండి,” అన్నాడు కంసాలి. ఆ కంసాలి చేతే నేను మా అమ్మాయికి కూడా నగలు చేయించాను.
”నీకివ్వవలసిందంతా ఇచ్చేశామే?” అన్నాను.
”ఆ డబ్బు గురించి కాదమ్మా! బాబు గారు ఒక బెంగాలీ అసామికి వేరే నగలు చేయించి ఇచ్చారు.”
”మరి ఆ బెంగాలీ బాబు ఇస్తే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాం,” అన్నాను.
”అవును, అతని దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. డబ్బు చేతికి అందగానే ఇచ్చేస్తానని రాశాడు,” అన్నారాయన.
కంసాలి వెళ్లిపోయాడు. ఆ తరవాత ఆయన్ని నిలదీశాను. అతని కోసం మీరు డబ్బెందుకిచ్చారు, అని అడిగాను.
”నువ్వు అతని ఉద్యోగం కోసం వంద రూపాయలివ్వలేదూ, అలాగే నేను పెళ్లికోసం ఇచ్చాను. నువ్వు కూడా ఇక్కడే ఉండి ఉంటే అతని పెళ్లాం నీకు చాలా సేవ చేసి ఉండేది!” అన్నారాయన.
నేను జవాబు చెప్పలేదు. కొన్నాళ్లకి బట్టల దుకాణం మనిషి వచ్చాడు. ఆరోజు కూడా నేను అక్కడే ఉన్నాను.
”ఎందుకొచ్చావు?” అని అడిగాను.
”బాబుగారు, ఒక బెంగాలీ బాబుకి బట్టలు కొనిచ్చారు,” అన్నాడు.
”అంటే నీకు కూడా ఇంకా డబ్బులివ్వ లేదా?”
”ఇస్తే ఎందుకమ్మా మళ్లీ వస్తాను?”
అతనిక్కూడా కంసాలికి చెప్పిన జవాబే చెప్పారాయన. అతను వెళ్లగానే నేనింక కోపాన్ని తమాయించుకోలేకపోయాను.
”నేను అప్పు గురించి ఎప్పుడూ భయ పడుతూ బతుకుతాను, మీరేమో నా నెత్తిమీదికి ప్రతిసారీ అప్పుల భారాన్ని తెస్తూ ఉంటారు! పిల్ల పెళ్లి ఇప్పుడే కదా చేశాం, దానికే అప్పు చెయ్యాల్సి వచ్చింది, ఇప్పుడు ఇదొక అదనపు భారం! బాధ్యత మీరైనా పూర్తిగా తీసుకోండి, లేదా నా సలహాలనైనా పాటించండి. ఇలాంటి అవకతవక పనులు చేస్తే నాకేమాత్రం బావుండదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. నాకైతే అతను డబ్బు పంపిస్తాడన్న నమ్మకం లేదు!” అన్నాను.
ఆ డబ్బు గురించి నాకు తెలీకుండా ఉత్తరాలమీద ఉత్తరాలు రాసి, వాయిదాల రూపంలో కొద్దికొద్దిగా అతను పంపించిన దాన్ని చెల్లిస్తూ, అప్పు తీర్చటానికి ఆయనకి దాదాపు సంవత్సరన్నర పట్టింది.
ఈ విషయాలన్నీ ఆయన పోయాక జైనేంద్ర కుమార్‌ (ప్రసిద్ధ హిందీ రచయిత) చెపితే నాకు తెలిశాయి. ఆయన జైనేంద్ర కుమార్‌కి మాత్రం చెప్పారు. నాకు చెప్పద్దని చెప్పారట, ”ఇంట్లో వాళ్లకి చెప్పద్దు, మొహం వాచేట్టు చీవాట్లు తినాల్సొస్తుంది,” అన్నారట. (ఈ సంఘటనని ఆయన ‘ఢపోర్‌ సంఖ్‌’ అనే కథలో రాశారు.)
మరోసారి ఇంకో మహాశయుడు వచ్చాడు. బ్యాంకునించి రెండు వందల రూపాయలు తీసిస్తే వాటిని తీసుకుని వెళ్లిపోయాడు. ఆ సమయంలో నేను జైల్లో ఉన్నాను. ఒకరోజు జైల్లోంచి బైటికి వచ్చినప్పుడు ఆయన్ని డబ్బు లెక్కలు చెప్పమని అడిగాను. లెక్కలో రెండు వందలు తగ్గాయి.
”రెండు వందలు తగ్గాయేమిటి? ఏమయాయి?” అన్నాను
”ఖర్చయిపోయాయి,” అన్నారు.
”అబద్ధాలు చెప్పకండి! ఏం చేశారో చెప్పండి!”
ఇక చేసేదేమీ లేక, ”ఎవరో ఒకాయన వచ్చి అడిగి పట్టుకెళ్లాడు చాలా అర్జెంటుగా అవసరమేదో వచ్చిందన్నాడు!” అన్నారు.
”అంటే ఊళ్లో వాళ్లందరి అవసరాలూ తీరుస్తానని మీరేమైనా మాటిచ్చారా?”
”ఏం చెయ్యను? కావాలని ఇలాటి చిక్కుల్లో ఇరుక్కోనుగా! అలా అవసరమని అడిగితే కాదనలేను!”
”మునుపే నయం, పైసాపైసాకీ జాగ్రత్తగా లెక్క చూసేవారు. ఎవరి నుదుటి రాత ఎవరు మార్చగలరు! మళ్లీ అలా డబ్బుకి మొహం వాచిపోయి బతకాలని ఉన్నట్టుంది. మీకు. డబ్బు ఖర్చు పెట్టినంత సులభంగా కూడబెట్ట గలిగితే, అప్పుడు తెలుస్తుంది మీకు. ఇరవై నాలుగ్గంటలూ పొదుపు చెయ్యటం గురించి జాగ్రత్త పడితేనే డబ్బు దాచుకోగలుగుతాం.”
”రాణీ, డబ్బు నీ పేరే జమ చేసుకో. అప్పుడిక ఏ తంటా ఉండదు!”
”అంటే నాకు డబ్బు పిచ్చి ఉందని అంటున్నారా?”
”లేదు, ఆడవాళ్లు చిల్లర డబ్బులు అక్కడా ఇక్కడా దాస్తూ ఉంటారే, అది చాలా మంచి అలవాటని అంటున్నాను.”
”నేను అలా దాచిపెట్టేది మీ అందరి కోసమేగా? మీరు డబ్బు గురించి ఆలోచించ కుండా ఉండేందుకేగా? మునుపు ఎప్పుడూ డబ్బుకి ఇబ్బింది పడాల్సి వస్తుందేమోనని ఆందోళన పడేవారు, నాకు తెలీదా? మీ ఒత్తిడిని తగ్గించాలనే నా ప్రయత్నం. అలాంటి నా దగ్గరే మీరు దొంగతనం చేస్తారా?”
”లేదు, దొంగతనం చెయ్యాలని కాదు….”
”మీ దగ్గరున్న డబ్బు మీరు ఖర్చు చెయ్యండి. దొంగతనం చేస్తే మీ అంతరాత్మే బాధ పడుతుంది!”
”దొంగతనం చేసేది నీ దగ్గరే కదా? అంత పెద్ద శిక్ష పడదులే!”
”సరే, ఇవాళ్టినించీ నేను చిల్లిగవ్వ కూడా దాచబోవటం లేదు.”
”లేదు, లేదు, ఎవ్వరికీ ఇంకెప్పుడూ డబ్బివ్వనని నేనే ఒట్టేస్తున్నాను ఇకమీదట డబ్బు వ్యవహారాలన్నీ నీ చేతిమీదుగానే జరుగుతాయి. ఈ బాదరబందీకి నేను దూరంగానే ఉంటాను.”
సేవా భావం
ఒకసారి ఏం జరిగిందంటే, నేను పసివాడు బన్నూని ఒళ్లో పెట్టుకుని వంట చేస్తున్నాను. బన్నూ అదేపనిగా ఏడుస్తు న్నాడు. మా అమ్మాయి వాణ్ణి ఎత్తుకుంది, ఇద్దరూ పడ్డారు. పిల్లవాడి తలకి దెబ్బ తగిలింది. మూడు రోజులు తల మంచానికి ఆనించి పడుకోలేకపోయాడు. అందువల్ల ఒక నాలుగురోజులు ఆయనే వంట చెయ్యాల్సివచ్చింది. పగటిపూట తన పని చేసుకునే వారు. తెల్లారగట్ట నాలుగున్నరకి లేచి రాసుకునే వారు, ధున్నూకి చదువు చెప్పేవారు. ఆ తరవాత స్నానం చేసి, ఏదైనా తిని స్కూలుకెళ్లేవారు. వచ్చేప్పుడు కూరలూ, వెచ్చాలూ తెచ్చేవారు. కొంతసేపు పిల్లలతో ఆడుకునేవారు.
కాంగ్రెస్‌ మీటింగులు రోజూ జరిగేవి. వాటికి హాజరయేవారు. మీటింగు అయి ఇంటికి వచ్చేసరికి ఒక్కోరోజు రాత్రి పది దాటిపోయేది. అలా ఆలస్యంగా వచ్చిన రోజున రాత్రి రాసుకోలేకపోతే, మర్నాడు అర్ధరాత్రి మూడు గంటలకే లేచి రాసుకునేవారు. కానీ నా నిద్ర చెడకూడదని, ఏ మాత్రం చప్పుడు చెయ్యకుండా పక్కమీదినించి లేచేవారు. నేనెప్పుడూ ఆయన హాయిగా విశ్రాంతి తీసుకునేందుకు లేదని పోట్లాడేదాన్ని. కానీ ఆయన వినిపించుకునే రకమైతే కదా! ఆ ఏడాదే మార్గశిర మాసంలో ఆయనకి సుస్తీ చేసింది. తొమ్మిది రోజులు విడవకుండా జ్వరం. కానీ నేనెప్పుడడిగినా, బానే ఉన్నాను, అనేవారు. మా ఇంట్లో ఆ తొమ్మిదిరోజులూ పొయ్యి రాజెయ్యలేదు. పిల్లలిద్దరికీ బజారునించి పాలూ, పూరీలూ తెప్పించి ఇచ్చేదాన్ని.
పదోరోజు స్కూలు టీచరొకాయన వచ్చి ఆయన్ని, ”ఒంట్లో ఎలా ఉంది?” అని అడిగారు.
”జ్వరం తగ్గటం లేదు, దీనికేదో గడువున్నట్టుంది!” అన్నారు.
కొంతసేపయాక ఇద్దరూ వెళ్లి ఒక వైద్యుణ్ణి పిలుచుకొచ్చారు. ఆయన ఏం మందిచ్చాడోగాని, జ్వరం వెంటనే తగ్గింది కానీ విరోచనాలు పట్టుకున్నాయి, రక్తవిరో చనాలు. నేను ఆయన్ని పట్టుకుని పాయి భానాకి తీసుకెళ్లేదాన్ని. ఒకరోజు అలాగే తీసుకెళ్లి కూర్చోపెట్టి వచ్చాను. అక్కడినించి లేచి రాబోయి, స్పృహతప్పి పడిపోయారు. నేను తలుపు దగ్గరే ఉన్నాను. గాభరాపడి తలుపు తెరిచాను, చూస్తే నేలమీద పడి ఉన్నారు! లేపి ఎలాగోలాగ మంచందాకా తీసుకొచ్చి పడుకోబెట్టాను. కొంత సేపటికి ఆయనకి స్పృహ వచ్చింది.
”ఏంమందిచ్చాడో ఏమిటో!” అన్నారు. ఆ తరవాత చాలా నీరసించి పోయారు. మూడు రోజుల పాటు అలా రక్తవిరోచనాలు అవుతూనే ఉన్నాయి. ఆ తరవాత స్కూల్లో నీళ్లు మోసే కుర్రాడు వస్తే, అతని చేత మాస్టర్‌కి కబురుపెట్టి వైద్యుణ్ణి వెంట పెట్టుకుని రమ్మని చెప్పారు. వైద్యుడొచ్చి వేరే మందిచ్చాడు. దాంతో విరోచనాలు ఆగి పోయాయి. నెలరోజులు నీరసం వల్ల మెట్లు కూడా దిగలేకుండా అయిపోయారు.
కానీ రాయాలన్న కోరిక మాత్రం ఆయనకి ఇరవైనాలుగ్గంటలూ ఉండేది. రాత్రి నేను నిద్రపోయాక నెమ్మదిగా లేచి, నోటు పుస్తకం, కలం, సిరాబుడ్డీ తెచ్చుకునే వారు. చలికాలం, మంచంమీదే రజాయి కప్పుకుని రాసేవారు. అప్పట్లో ఆయన ‘ప్రేమాశ్రమ్‌’ అనే నవల రాస్తూ ఉండేవారు. నాకు మెలకువ వచ్చి చూస్తే కనక, కోప్పడే దాన్ని – ”ఏం, ఇంకా ఉన్న జబ్బే నయం కాలేదు, కొత్త జబ్బు తెచ్చుకోవాలని ఉందా మీకు?” అనేదాన్ని.
”లేదు, నేను రాయటం లేదు, ఇంతకు ముందు రాసినదే ఊరికే చూసుకుంటున్నా నంతే!” అనేవారు.
”లోకమంతా మిమ్మల్ని మోసం చేస్తే మీరు నన్ను మోసం చేద్దామని చూస్తు న్నారా?”
”నిన్నెవరు మోసం చేస్తారు?”
”గోరఖ్‌పూర్‌లో కూడా ఇలా రాయ టం మానకపోతేనే జబ్బు ముదిరి పోయింది. మళ్లీ అలాగే ఆరోగ్యం పాడుచేసుకోవాలని ఉన్నట్టుంది!”
”ఎక్కడ? నువ్వు కలాన్నే విరిచి పారేశావాయె, ఇంక ఎలా రాశాను, ఎప్పుడు రాశాను?”
”ఎంత చెప్పినా వినకపోయే సరికే గదా కలం విరగ్గొట్టాను! రోజంతా మీతో బాటు నేను కూడా ఏ పనీ లేకుండా కూర్చునే దాన్ని.”
”సరే, నేనే పనీ చెయ్యనులే.”
– ఇంకా ఉంది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.