ఈర్ష్య చూపులను ఆభరణంగా ధరిస్తే
కనురెప్పలపై నిద్ర ఎలా వాలుతుంది
కుళ్ళు కత్తులు కడుపులో దువ్వుతుంటే
అజీర్తి తప్ప ఆరోగ్యమెలా వెల్లివిరుస్తుంది
అసూయ నర్తకితో ఆడిపాడుతుంటే
బుర్రలో బురద తప్ప మరేం పారుతుంది మిత్రమా…!
నీతి నిజాయితీలను దండెం మీద ఆరేసి
స్వార్ధపు తోలు కప్పుకుని వెచ్చగా ఉండాలంటే
అగ్ని రవ్వలు రగలకుండా ఉంటాయా
నిన్ను, నీ ఆలోచనలను దహించకుండా ఉంటాయా
మనస్సాక్షి తీగను ఒక్కసారి లాగి చూడు
నేస్తమా ముసురుకున్న చీకట్లు తొలగిపోతాయి
జీవితపు సజీవ చిత్రానికి కొత్త రంగులద్దుతాయి…
మనసు తోటలో ఆనందపు మిణుగురులు ఎగురుతాయి
మరణపు అంచున కూడా మందహాసమై విచ్చుకుని
అస్తమించని సమీరాలై నిత్యం పూస్తుంటాయి.
తెల్లటి సీతాకోక చిలుకలు తనువంతా వాలుతాయి
వేలాడే గబ్బిలాలు మెదడు నుంచి దూరంగా ఎగిరిపోతాయి
బ్రతుకు ఓడ ఎల్లలు దాటి రేవును చేరుకుంటుంది
కంటి వాకిట్లో నిద్ర పిట్ట ప్రశాంతంగా వాలుతుంది.