భావాలూ బాధలూ పంచుకొన్న డా.సవితా ‘అంబేద్కర్‌’ -డా॥ బి.విజయభారతి

సవితా అంబేద్కర్‌ డాక్టర్‌ అంబేద్కర్‌కు చివరి దశలో తోడునీడగా నిలిచిన సహచరి. వారి వివాహం 1948 ఏప్రిల్‌ 15న జరిగింది. అంబేద్కర్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 14. సవితను చేసుకున్నది ఏప్రిల్‌ 15న. అప్పటికి అంబేద్కర్‌కు 55 సంవత్సరాలు నిండాయి. ఆ వివాహం ఆయన జీవితానికి మరో మలుపు.

అంబేద్కర్‌కు సవిత రెండవ భార్య. అంబేద్కర్‌ మొదటి భార్య రమాబాయి. ఆయన మెట్రిక్‌ పాసయిన కొద్ది రోజులకే (1907 సంవత్సరం) రమాబాయితో పెళ్ళయింది. అప్పటికి ఆమెకు తొమ్మిది సంవత్సరాల వయసు. చిన్న వయసులోనే సంసార బాధ్యతలు స్వీకరించింది. వివాహానంతరం భర్త చదువు, ఆ తర్వాత ఉద్యమ కార్యకలాపాలు, సంతాన బాధ్యతలు, మానసిక ఒత్తిడి… ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీశాయనే చెప్పాలి. ఆమె 1935 మే 27న మరణించింది. ఆ తర్వాత చాలాకాలం వరకూ అంబేద్కర్‌ రెండవ వివాహం గురించి ఆలోచించలేదు. తర్వాత 13 సంవత్సరాలకు ఆయన డా.శారదా కబీర్‌ను తన జీవితంలోకి ఆహ్వానించారు. వివాహానంతరం ఆమె పేరును ‘సవిత’గా మార్చారు.
1948, అంటే 70 సంవత్సరాల కిందటి మాట. వారిది కులాంతర వివాహం. ఈ రోజుల్లోనూ కులాంతరం అంటే సందేహిస్తున్నారు. మరి, ఆ రోజులలో ఒక డాక్టర్‌, సారస్వత బ్రాహ్మణ వంశానికి చెందిన అందమైన మహిళ అంబేద్కర్‌కు తోడుగా నిలవడానికి ముందుకు వచ్చిందీ అంటే ఆమె పరిణిత మనస్సును, వ్యక్తిత్వాన్ని అభినందించాలి. ఆమె అంబేద్కర్‌ మూర్తిమత్వానికి ఆకర్షితురాలవటం సహజమే. అయితే ఎంతటి వారినైనా కులం దూరంగా ఉంచుతుంది. మాల నాయకులు, మాదిగ కలెక్టర్లు ఆలయాలకు వెళ్తే పూర్ణ కుంభాలతో ఆహ్వానించి ఆ వెనుక శుద్ధి కార్యక్రమం నిర్వహించుకునే సాంప్రదాయం భారతదేశంలో ఉంది. అలాంటి సాంప్రదాయాలకు అతీతులైన వారూ ఉన్నారు.శారదా కబీర్‌ కుటుంబం ఆ కోవకు చెందినదే.
డా.శారదకు అంబేద్కర్‌తో పరిచయం యాదృచ్ఛికంగా జరిగినదే. అంబేద్కర్‌ ఆరోగ్యం బాగాలేని స్థితిలో ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్న దశలో శారద ఆయనకు డాక్టర్‌గా పరిచయమయ్యారు, వ్యక్తిగా సన్నిహితమయ్యారు. అంబేద్కర్‌కు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వాన్నీ ఇచ్చారు. ఆయన మానసిక పరిస్థితిని గమనిస్తూ ఆయనను ఉల్లాసంగా ఉంచడానికి ప్రయత్నించేవారు. రాజకీయాలు, సమాజసేవ, గ్రంథ పఠనం, పుస్తకాలు రాయటం అనేవి అంబేద్కర్‌ వ్యాపకాలు. అవి లేకుండా ఆయన ఉండలేరని ఆమెకు తెలుసు. ఆయనను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే ఆమె వివాహ నిర్ణయం తీసుకున్నారు. ఆమె తండ్రి కుటుంబంలో ఆడపిల్లలకు స్వేచ్ఛ ఉంది. ఆమె అక్క చెల్లెళ్ళు వర్ణాంతర వివాహాలు చేసుకున్నారు. తండ్రి వారిని విశాల భావాలతో పెంచారు. బాగా ఆలోచించి తండ్రి అనుమతితోనే ఆమె అంబేద్కర్‌ను వివాహం చేసుకున్నారు. అప్పటినుంచీ ఆయనను నిరంతరం వెన్నంటి ఉంటూ శ్రద్ధగా చూసుకుంటూ వచ్చారు. తనను, తన పుస్తకాలనూ, రాజకీయాలనూ ఓర్పుతో భరించాల్సి ఉంటుందని అంబేద్కర్‌ శారదకు ముందే చెప్పి ఉన్నారు. అంబేద్కర్‌కు సందర్శకుల తాకిడి ఎక్కువ. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఆమె చిరునవ్వుతోనే ఆహ్వానించేవారు.
సవిత, అంబేద్కర్‌ల దాంపత్య జీవితం సమకాలిక రాజకీయ నాయకులకు అబ్బురంగా ఉండేది. కొంత అసూయగా కూడా ఉండేది. ఆ అసూయను వారు దాచుకోలేకపోయేవారు. హిందూ కోడ్‌ బిల్లు చర్చల సందర్భంగా అనవసరంగా హాస్యోక్తులు విసురుతుండేవారు.
1951 ఫిబ్రవరి ఆరవతేదీన శాసనసభలో హిందూ కోడ్‌ బిల్లుపై చర్చ జరుగుతోంది. వివాహాలు రిజిస్టర్‌ చేసుకోవాలనే అంశంపై ‘‘పౌర వివాహాలు (సివిల్‌ మ్యారేజెస్‌)పై మాట్లాడుతూ శ్రీ హుకుం సింగ్‌ ‘‘ఎప్పుడో జరిగిపోయిన నా వివాహాన్ని ఈ వయసులో ఇప్పుడు పౌర వివాహంగా రిజిస్టర్‌ చేయించాలని మంత్రివర్యులు (న్యాయ శాఖామంత్రి అంబేద్కర్‌) భావిస్తున్నారా?’’ అని అడిగారు. వెంటనే పక్కనే ఉన్న త్యాగి ‘‘ఆయన తాను చేసుకున్ననట్టుగానే’’ అని అందుకున్నారు. ఇలాంటి వ్యంగ్యోక్తులు అంబేద్కర్‌ విని ఊరుకునేవారు.
1948లో అంబేద్కర్‌ నివాసంలోనే కొద్దిమంది మిత్రుల సమక్షంలో శారదా కబీర్‌కు, అంబేద్కర్‌కు వివాహం జరిగింది. ఈ వివాహం సివిల్‌ మ్యారేజెస్‌ చట్టం ప్రకారం రిజిస్టర్‌ చేశారు. సవిత ఆదర్శ గృహిణిగానూ, ఇంటి డాక్టర్‌గానూ బాధ్యతలు స్వీకరించారు. అంబేద్కర్‌ నగరం విడిచి బయటకు ఎక్కడికి వెళ్ళినా ఆమె ఆయన వెంట వెళ్ళేవారు. 1950 మేలో కొలంబోలో జరిగిన బౌద్ధ మహా సభలకు, దేశంలోని పలు ప్రదేశాలలోని సమావేశాలకూ ఆమె హాజరయ్యారు. ఔరంగాబాద్‌లో పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ కళాశాల భవనాల పర్యవేక్షణ పనులు కూడా చూసుకున్నారు. 1952 జనవరి ఎన్నికల్లో అంబేద్కర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిపై 14 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. చెల్లని ఓట్లు 50 వేలు. ఆ సమయంలో అంబేద్కర్‌ నిరాశకు లోనయ్యారు. సవిత ఆయనకు ధైర్యం చెప్పారు. ఆయన రాజకీయ సహచరులను సంప్రదించి ఆయన కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌కి ఎన్నికయ్యే ప్రయత్నాలు చేశారు. ‘‘రాజకీయాలే అంబేద్కర్‌ ఊపిరి. మానసికంగా, శారీరకంగా ఆయనకు బలాన్నిచ్చేవి అవే. ఈ సమయంలో పార్టీ ఆయనకు సహాయం చేయాలి. దేశానికి ఏవేవో చేయాలని ఆయన ఎన్నో ఆలోచించి పెట్టుకున్నారు. అలాంటి మేధావిని పార్లమెంటుకు పంపాల్సిన అవసరం ఉంది’’ అంటూ ఆమె కమలా కాంత్‌ చిత్రేకి ఉత్తరం రాశారు. బొంబాయికి ప్రత్యేకించిన 17 స్థానాల్లో ఒక స్థానానికి నామినేషన్‌ వేసి అంబేద్కర్‌ ఎంపికయ్యారు.
వివాహానికి ముందు అంబేద్కర్‌ తన సమయం ఎక్కువగా అనుచరులతో గడిపేవారు. తన ఆలోచనలు వారికే చెబుతుండేవారు. తర్వాత ఆ ధోరణిలో మార్పు వచ్చింది. అది ఆయన అనుయాయులకు రుచించలేదు. అంబేద్కర్‌ సున్నిత మనస్కుడు. ఏదైనా క్రమపద్ధతిలో లేకపోతే చిరాకు పడిపోయేవారు. అనారోగ్యం వల్ల మొండితనం కూడా వచ్చింది. ఆహారం విషయంలో జాగ్రత్తలు చెప్పినా చిరాకు పడేవారు. సవిత అన్నింటినీ అర్థం చేసుకుని వ్యవహరించేది. మిత్రులు సవితను పొగుడుతూ ఉంటే, ‘‘చెప్పు ఎక్కడ కరుస్తుందో తొడుక్కున్న వాడికే తెలుస్తుంది’’ అని ఛలోక్తులు విసిరేవారు అంబేద్కర్‌.
గొప్ప సామాజిక కార్యకర్త అయిన సంత్‌ గాడ్గే బాబాతో (1876`1956) సవితకు, అంబేద్కర్‌కూ సాన్నిహిత్యం ఉండేది. వారి సేవా కార్యక్రమాల్లో సవిత పాల్గొనేవారు. 1956లో అంబేద్కర్‌ బౌద్ధ ధర్మం స్వీకరించినపుడు సవిత కూడా ధర్మ దీక్ష తీసుకున్నారు. అంబేద్కర్‌ కార్యకలాపాలన్నింటిలోనూ చేయూతగా నిలిచారు. ఆయన మరణానంతరం ఆయన భావజాలాన్నే అనుసరించి పనిచేశారు.
సవిత స ్వస్థలం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా, రాజ్‌పూర్‌ తాలూకాలోని డోర్లా గ్రామం. పూణేలో విద్యాభ్యాసం చేశారు. 1937లో ముంబై గ్రాంట్‌ మెడికల్‌ కళాశాల నుంచి డాక్టర్‌ పట్టా పొందారు. సవితకు ఒక సోదరుడు (బాలూ కబీర్‌), నలుగురు అక్కచెల్లెళ్ళు. ఒకామె చిన్నవయసులోనే మరణించిందట. అందరూ బాగా చదువుకున్నారు. వర్ణాంతర వివాహాలు చేసుకున్నారు.
అంబేద్కర్‌ ఆశయాలను అర్థం చేసుకుని ఆయనతో సహకరించినప్పటికీ అంబేద్కర్‌ అనుయాయులు కొందరు సవితను అనుమానంతోనే చూశారు. ఆయన మరణించినప్పుడు ఆమెపై ఆరోపణలు చేశారు. సమగ్ర విచారణ కూడా జరిగింది. ఆయనది సహజ మరణమేనని నిర్ధారణ అయింది. సవిత ఈ విషయంలో బాధపడినప్పటికీ అంబేద్కర్‌ ఆశయాల కొనసాగింపునకు సిద్ధపడ్డారు. దళిత పాంథర్స్‌తోనూ, అలాంటి ఇతర సేవా సంస్థలతోనూ కలిసి పనిచేశారు.
1982 ప్రాంతాల్లో నేను, తారకం గారు భోపాల్‌లో ఒక సమావేశానికి వెళ్ళిన సందర్భంలో ఆమెను కలుసుకునే అవకాశం కలిగింది. రామదాస్‌ అత్వాలే, తదితరులు ఆమెకు మమ్మల్ని పరిచయం చేశారు. బాబా సాహెబ్‌ జీవిత చరిత్ర తెలుగులో రాసిన రచయిత్రిగా నన్ను పరిచయం చేశారు. అంబేద్కర్‌ గారి గురించి, వారి అలవాట్ల గురించి తెలుసుకునే కుతూహలంతో నేను ఏదో అడుగుతుండగా ఆమె నా మెడలోని నల్లపూసల దండ చూసి, ‘‘ఇలాంటివి బాబా సాహెబ్‌కు ఇష్టముండవు’’ అన్నారు. నేను దండ పైకి తీసి చూపించాను. ఆ దండకు మంగళ సూత్రం వంటివేమీ లేవు. కేవలం అలంకారంగా వేసుకున్నానని చెప్పాను. ఆవిడ సంతోషించారు. మేము నిజంగా అంబేద్కర్‌ భావాలను గౌరవిస్తున్నామని ఆమెకు నమ్మకం కుదిరింది.
వివిధ ప్రదేశాలను సందర్శించి బుద్ధుని ధర్మాన్ని ప్రచారం చేయడం, సామాజిక కార్యకలాపాలలో పాల్గొనటం ఆమె అభిరుచులు. ఒకసారి లక్నోలో మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత అయోధ్య రామునిది కాదు, స్థానిక వైదికేతర ధర్మానికి సంబంధించిన క్షేత్రం. పూర్వం అది సాకేత నగరం. బృహదశ్వుని రాజ్యం. బృహదశ్వుడు ఆర్యేతర ధర్మాన్ని అనుసరించాడు. తర్వాత అది మిత్రశ్రుంగుని వశమైంది. ఇక్కడి శిధిలాలు క్రీ.పూ.ఏడవ శతాబ్దం నాటివి. అప్పటికి బ్రాహ్మణ మతం ఏర్పడలేదు’’ అని ఆమె చెప్పారు.
అంబేద్కర్‌కు వచ్చిన ‘భారతరత్న’ అవార్డును 1990 ఏప్రిల్‌ 14న సవితా అంబేద్కర్‌ స్వీకరించారు. ఆమె తన చివరి దశలో కొంత అనారోగ్యంతో బాధపడ్డారు. 2003 మే 29న ముంబాయిలో తన 94 ఏట కాలధర్మం పొందారు. ఆమె జన్మించినది 27.1.1909న. డా.బాబా సాహెబ్‌ భావాలనూ, బాధలనూ పంచుకున్న భాగస్వామి ఆమె. డా.అంబేద్కర్‌కి తోడుగా, ఆయన కార్యకలాపాలకు దన్నుగా నిలిచిన సవిత చిరస్మరణీయురాలు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.