ఐదుకాళ్ళ మనిషి – రొంపిచర్ల భార్గవి

మా చిన్నప్పుడు మా ఊరినిండా చెరువులే!
రాళ్ళభండి వారి చెరువూ, గంగానమ్మ గుడి చెరువూ, నడి చెరువూ, కోటిరెడ్డి చెరువూ, వీరభద్రయ్య చెరువూ, చాకలి చెరువూ, చెక్కోడి చెరువూ, మంగలి గుంట, ఒడ్డోడి గుంట ఇన్నోటి చెరువులుండేవి. మంచినీళ్ళకయినా, బట్టలుతుక్కోవడానికయినా, పశువులని

కడగడానికయినా, ఇతరత్రా ఏ పనికయినా చెరువు నీళ్ళే. ఎన్ని చెరువులున్నా తాగడానికి మాత్రం నడిచెరువు నీళ్ళే ఆధారం. అందుకనే ఆ చెరువు కట్ట చుట్టూ కాపలా ఉండేది. ఈ రేవులో బట్టలు ఉతకరాదు, పశువులను కడగరాదు అనే బోర్డులు కూడా ఉండేవి. పొద్దున్నే మొదలయి పగలు పది గంటల వరకూ చెరువు రేవు దగ్గర సందడిగా, ఉత్సవంలా ఉండేది… నీళ్ళ బిందెలతో వచ్చే ఆడవాళ్ళతో, కావిళ్ళతో వచ్చేమొగవాళ్ళతోనూ. ఆడవాళ్ళు కొంతమంది బిందెలను భుజం మీద మోస్తే, ఇంకొంతమంది నడుం మీద పెట్టుకుని ఒక చెయ్యి బిందెను చుట్టి ఇంకో చెయ్యిని జాడిస్తూ వయ్యారంగా నడిచేవారు. మగవాళ్ళయితే కావడి ఒక భుజంమీద కానీ, రెండు భుజాల మీద కానీ మోస్తూ ఒక ఊపుతో నడిచేవాళ్ళు. వాళ్ళ బిందెల నుండి తుళ్ళిపడిన నీళ్ళ జాలు కూడా రోడ్డుమీద ఒక తిన్నని గీత గీసినట్టు పడటం మా బోటి పిల్లకాయలకెంతో ఆశ్చర్యం గొలిపేది.
ఆ తర్వాత కాలంలోనే, పంచాయితీ పంపులు రావడం, పంపుల దగ్గర తగాదాలూ… ఆ పైన డబ్బులు కట్టీ, పలుకుబడి
ఉపయోగించీ ఇంట్లో ట్యాప్‌ కనెక్షన్‌ తెచ్చుకుని గొప్ప భాగ్యవంతులుగా భావించుకోవడమూనూ. కాలక్రమేణా అన్ని చెరువులూ పూడ్చివేశారు. కలువలూ, తామరల స్థానంలో ఇళ్ళు పూచాయి. మిగతా చెరువులన్నీ చేపల చెరువులయ్యాయి. గంగానమ్మ చెరువు మాత్రం ఊరంతటికీ నీటి దాహం తీరుస్తూ పంపుల చెరువయ్యింది. ఆ రోజుల్లో ఎవరింటికెళ్ళినా ముందు కాళ్ళకి నీళ్ళిచ్చి, దాహానికి కూడా నీళ్ళో, మజ్జిగో ఇచ్చేవారు. రాబోయే కాలంలో నీళ్ళు సీసాలలోనూ, ప్యాకెట్లలోనూ అమ్ముతారనీ, అదే పెద్ద వ్యాపారమవుతుందనీ, నీళ్ళకు కూడా టాక్స్‌ కట్టాల్సి వస్తుందనీ ఊహ కూడా లేదు. ఎవరైనా చెప్పినా నమ్మకుండా నవ్వులాటకు దిగేవాళ్ళమేమో.ఒక్క నీళ్ళ టాక్సేనా ఎన్నెన్ని టాక్సులు కడుతున్నాం, చెత్త తీసుకుపోయేవాళ్ళకు నెలనెలా టాక్స్‌ కాక పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకి సంవత్సరానికొకసారి రెన్యువల్‌ ఛార్టొకటీ, ఇంటి పన్నూ, వృత్తి పన్నూ… ఇంకా ఎన్నో… ఇంకా భవిష్యత్తులో ఇంకెన్ని పన్నులొస్తాయో! ‘‘ఐదుకాళ్ళ మనిషి’’ పుస్తకంలో ‘గురుత్వాకర్షణ సుంకం’ కథ చదివాక నాలో రేగిన ఆలోచనలివి. ఈ కథలో ఒకాయనకి గురుత్వాకర్షణ సుంకం కట్టమని నోటీసుల మీద నోటీసులు వస్తూ ఉంటాయి. ఆయనకి ఈ సుంకం మరీ అన్యాయంగా తోస్తుంది. ఆదినుండీ ఉన్న ఈ శక్తికి బిల్లు ఎందుకు కట్టాలనీ, కట్టకపోతే ఏం చేస్తారని ఆ శాఖ వారిని నిలదీస్తాడు. దానికివాళ్ళు చెప్పే సమాధానాలు వింతగానూ, భయం గొలిపేవిగానూ ఉంటాయి.
ప్రతి ఇంటిలోనూ నివసించే వారి సంఖ్యను బట్టి, వారు పెరిగిన బరువును బట్టి ఈ సుంకం పెరుగుతూ ఉంటుందట. ఈ సుంకాన్ని 8 నెలల పాటు చెల్లించని ఒకతనికి ఎలాంటి శిక్ష విధించారు అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఒకసారి చూడండి.
‘‘అతణ్ణి స్పేస్‌ షిప్‌లో తీసుకెళ్ళి భూగురుత్వాకర్షణకి బయట దింపేశాము. ఒకసారి అతను భూప్రదక్షిణం చేశాడు. ఈలోపు మనసు మార్చుకుని కట్టేస్తానని ఒప్పుకున్నాడు. మళ్ళీ భూమ్మీదకు తీసుకొచ్చేశాము’’
‘‘నిజంగానా?!’’
‘‘దెబ్బకి మొత్తం బాకీ, వడ్డీతో సహా చెల్లించేశాడు. అయితే ఒక చిక్కు…’’
‘‘ఏంటది?’’
‘‘స్పేస్‌ షిప్‌లో తీసుకెళ్ళిన ఖర్చు, స్పేస్‌ సూట్‌ ఖరీదు, ఇతర ఖర్చులన్నింటికీ ఇప్పుడు నెలనెలా ఇన్‌స్టాల్‌మెంట్‌లో కడుతున్నాడు.2196 నెలలు కట్టాలి.’’
‘‘2196 నెలలా?’’
‘‘అవును మొత్తం కట్టడానికి 183 ఏళ్ళు పడుతుంది’’
‘‘అన్నేళ్ళు బతగ్గలడా?’’
‘‘అవన్నీ మాకు తెలీదు. అతని పిల్లలు కడతామని హామీ ఇచ్చారు’’.
‘‘మేడమ్‌, నేను ఇప్పుడే మీ బాకీ మొత్తం నయాపైసాతో సహా చెల్లించేస్తాను’’
అలా ఆయన రాజీ పడిపోయి, ఈ శాఖ బిల్లులు కట్టేస్తుండగానే భూ ప్రయాణ శాఖ అని ఒక కొత్త శాఖ నుండి బిల్లులు వస్తాయి, అవేంటంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగే దూరాన్ని లెక్కవేసి దానికయ్యే ఖర్చు సుంకంగా కట్టమంటారు! అయ్యా అదీ సంగతి. ఈ కథలో ఉన్న వ్యంగ్యానికీ, హాస్యానికీ వెనక అంతులేని ఒక విషాదముంది.
ఈ పుస్తకంలో పదిహేను కథలున్నాయి, పదిహేనుకు పదిహేనూ ఆణిముత్యాలు.
శ్రీలంక శరణార్థుల కథలున్నాయి, పాకిస్తాన్‌ నేపథ్యంలో కథలున్నాయి, కెనడా వలసపోయిన వారి కథలున్నాయి. అయితే, అక్కడ వారు పడే వెతల మధ్యలో ఒక రకమైన జీవన లాలస, జీవిత సూత్రము, మానవ మనస్తత్వమూ
ఉంటాయని తెలియచెబుతున్న ఈ కథలలో అంతర్లీనంగా ఒక ఆశావహ దృక్పథం ఉండడం నాకు చాలా నచ్చింది.
మంచి కథల పట్ల అభిరుచీ, ఆసక్తీ కలిగిన ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది.
ఇంత మంచి కథలను రాసిన ఎ.ముత్తులింగం గారినీ, వాటిని తమిళం నుండి వాటి ఫ్లేవర్‌ పోకుండా తెలుగులోకి అనువదించి మనకు అందించిన అవినేని భాస్కర్‌ గారినీ తప్పకుండా అభినందించవలసిందే.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.