స్త్రీల కవితలు రెండు – దృక్పథాలు రెండు

పాత శ్రీలక్ష్మి

అసమ సమాజంలో స్త్రీ అడుగడుగునా ఏదో రూపంలో అవమానాలను ఎదుర్కొంటూనే ఉంటుంది. భౌతిక, మానసిక హింసలకు గురవుతూనే ఉంది. స్త్రీలు గురయ్యే భౌతికహింసలు పైకి కనిపిస్తాయి. కాని, మానసికహింసలు పైకి కనిపించవు. అప్రకటిత సామాజిక నిషేధాలు స్త్రీలను ఆ హింసల గురించి పైకి చెప్పుకోనీయకుండా చేస్తాయి. అంత రంగాలను విప్పి అనుభవాలను నిస్సంకోచంగా చెప్పుకొనటానికి అవసరమైన స్త్రీవాద సిద్ధాంత అవగాహన ఉద్యమ చైతన్యం స్త్రీలకు అంతర్జాతీయ మహిళా దశాబ్దంలో అందివచ్చాయి. ఆ నేపథ్యంలో ఆంధ్రదేశం లో స్త్రీలు తమను లోలోపల నుండి బాధిస్తున్న, వేధిస్తున్న సమస్యలను వస్తువుగా చేసుకొని కవిత్వం రాయడం ప్రారంభించారు. ఆ ప్రారంభ కవులలో జయప్రభ ఒకరు.
స్త్రీని ఒక లైంగిక వస్తువుగా చూసే సమాజంలో వయసు వస్తున్న కొద్దీ ఆడపిల్ల శరీరాన్ని వస్త్రాలతో మరింతగా దాచుకోవలసి రావటం మగవాళ్ళ దృష్టి ఆ వస్త్ర పరివేషాన్ని దాటి స్త్రీ శరీరాన్ని తాకటము ఎక్కువవుతూ ఉంటుంది. ఈ సాంస్కృతిక వాతావరణంలో ”పైట” తనకెలాంటి అనుభవాన్నిస్తుందో పైట పట్ల తన దృక్పథమేమిటో చెప్పటానికి జయప్రభ ”పైటని తగలెయ్యాలి” అనే కవిత వ్రాసింది.
 స్త్రీ అయినా, పురుషుడయినా పరువు కాపాడుకోవడం కొరకు, శరీర రక్షణ కొరకు దుస్తులు ధరిస్తారు. సౌందర్యం వారివారి వ్యక్తిగతమైన హక్కు కూడా. కేవలం సంస్కారహీనమైన దృష్టితో స్త్రీలను చూసి మానసికంగా వారిని వేధిస్తున్నారు కొందరు పురుషులు. ఈ మానసకి వేదనను జయప్రభ ”పైటని తగలెయ్యాలి” అనే కవిత ద్వారా బయటకు తీసుకొచ్చింది.
జయప్రభ సామాజిక నేపథ్యం ఉన్నతవర్గానికి చెందినది కావచ్చు. కాని ఒక స్త్రీగా అసహ్యమైన పురుష దృక్కుల ద్వారా మానసిక హింసకు గురైన సంఘటన ఆమె ప్రత్యక్ష, పరోక్ష అనుభవం కూడా కావచ్చు. ఈ చేదు అనుభవాన్ని ఆమె తన కవిత ద్వారా వ్యక్తం చేసింది.
స్త్రీవాద కవయిత్రి అయిన జయప్రభ వ్రాసిన ”పైటని తగలెయ్యాలి” అనే కవిత 1988లో మే 31న ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించబడింది. అదే పైటను వస్తువుగా తీసుకొని సరిగ్గా ఇరవైయేళ్ళకు 2008లో తెలంగాణ దళితస్త్రీవాద కవయిత్రి అయిన జూపాక సుభద్ర ”కొంగు నా బొచ్చె మీద కావలుండే వొంగ పేగ్గాదు” అనే కవిత వ్రాసింది.
వస్తువు ఒకటే అయినా వారి వారి సామాజికార్థిక, సాంస్కృతిక నేపథ్యాలను ప్రయోజనాలను బట్టి కవితా దృక్పథం భిన్నమవుతుంది. వీరిద్దరి కవితలను తులనాత్మకంగా అధ్యయనం చేయటంవలన అది తెలుసుకొనటానికి వీలవుతుంది.
జయప్రభ
”పైట కొంగును చూస్తే
  -నాకెందుకో
పాతివ్రత్యం గుర్తొస్తుంది!
భుజాలనించి కిందికి వేలాడే
గుదిబండలా
అదెప్పుడూ నా స్వేచ్ఛని హరిస్తూనే ఉంటుంది!”
అని తన కవితను ప్రారంభించింది. పైటను లైంగికతపై స్త్రీకి స్వేచ్ఛ లేకుండా చేసే సంకేతంగా భావించింది. పైట స్త్రీని నిటారుగా నిలువనివ్వదని, వంగదీసే శక్తి అని అంటుంది. శరీరంలో వచ్చే యవ్వన సహజమైన ఎదుగుదల స్త్రీకి గర్వకారణం కాక స్త్రీని సిగ్గుపడేట్లు చేయడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించింది.
”నన్ను అబలని చేసిన
పితృస్వామ్యపు అదృశ్యహస్తం పైట!”
అని అంటుంది జయప్రభ. పితృ స్వామ్యం రకరకాల వ్యవస్థల ద్వారానే కాదు వస్త్రధారణ రూపంలో కూడా స్త్రీపై ఎంత నియంత్రణను కొనసాగిస్తుందో గుర్తించడం ఇక్కడ కనిపిస్తుంది.
నా వ్యక్తిత్వాన్ని శవంగా చేసి
దానిపైన కప్పిన తెల్లదుప్పటి పైట!
నేను నడిచే శవాన్ని కాకుండా వుండాలంటే
ముందుగా పైటని తగలెయ్యాలి
పైటని తగలెయ్యాలి
అని పితృస్వామ్యంపై తిరుగుబాటును ప్రకటించింది.
జూపాక సుభద్ర ”కొంగు నా బొచ్చెమీద కావలుండే బొంత పేగ్గాదు” అనే కవితలో కొంగును పితృస్వామ్యపు అదృశ్యహస్తంగా గుర్తించటానికి నిరా కరించింది. శ్రామిక దళిత మహిళ జీవితంలో అదెంత స్నేహహస్తమవుతుందో శ్రామిక దళిత మహిళ ప్రయోజనం నుండి వ్యాఖ్యానించింది.
సుభద్ర కవితలో ఆకలి ముఖ్యం. పైవర్గపు స్త్రీలను అణచివేసేది పితృస్వామ్యం అయితే దళిత స్త్రీని అణచివేసేది ఆకలి అంటుంది సుభద్ర.
”కొంగు నా ఆకలిని ముడేసుకొని
నా కడుపు కర్సుకొని కట్టయోని మైసమ్మోలె
కావలి బంటది.”
అని ప్రారంభమవుతుంది ఈ కవిత. కొంగు స్త్రీలకు ఎన్ని విధాలుగా చేదోడు వాదోడు ఉంటుంది తెలియజేస్తుంది. కూలిపని చేసుకునే సమయాల్లో చెమటపడితే కొంగు ఆ చెమటను తుడుచుకొనటానికి ఉపయోగ పడుతుంది. దళిత శ్రామిక మహిళ రోజు కూలి డబ్బులతో సాయంత్రం ఇంటిముఖం పట్టినప్పుడు, రాత్రి వంట కోసం కొనుకున్న కూరగాయలు, ఆహారధాన్యాలు, చిల్లర సామానులు మూటగట్టుకొనే సాధనమవు తుంది కొంగు. నెత్తిపై పెట్టుకున్న ఆ సరుకుల మూట తలపై చందమామ వలె మెరుస్తుంది అని అంటుంది. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. అంతేకాదు ఆ కొంగు
”సేండ్లల్ల, సెల్కల్ల అల్సి, సొలిసి పుల్ల సీలితే
పక్కబట్టై పుర్సతిస్తది.”
అని అంటుంది. పంట చేనులలో పని చేసి, చేసి అలసిపోయిన స్త్రీ కాసేపు నడుమువాల్చ టానికి నేలను పరచుకొనేది ఆ కొంగునే ఆ రకంగా కొంగు ఆమెకు విశ్రాంతినిచ్చేది కూడా అవుతుంది.
స్త్రీ దుఃఖం అనాదిది. తన కోసమో, పిల్లల కోసమో, మొగుడి కోసమో, కుటుంబ అవసరాల కోసమో, ప్రేమ కోసమో, సానుభూతి కోసమో సమూహంలో ఒంటరిదై విలపించే స్త్రీ కంటితుడుపు సాధనం పైట కొంగే. తల్లివలె స్త్రీని దగ్గరకు తీసుకొని హత్తుకుంటుంది కొంగు. భర్తకు, భార్యపై అనురాగం కలిగినా, ఆగ్రహం వచ్చినా భార్యకంటె ముందు ఆమె వేసుకున్న కొంగు భర్తకు దొరుకుతుంది. ఆ కొంగు చేతిలో ఉన్న వెన్నముద్దవలె తేలికగా దొరుకుతుంది. ఇంట్లోనే కాకుండా బయట కూడా స్త్రీ కంటే ముందే ఆమె వేసుకున్న కొంగు దొరుకుతుంది. బయట స్త్రీ బలాత్కారానికి వేదనలకు గురైనప్పుడు బలయ్యేదీ కొంగే.
స్త్రీ చలికాలంలో చలిపెట్టకుండా చెవులనుండి కొంగును తీసుకొని కప్పుకుంటుంది. వేసవికాలంలో సూర్యుని వేడిని తట్టుకొనటానికి వడగాడ్పులనుండి, వానచినుకులనుండి రక్షణ పొందడానికి స్త్రీకి ఆమెలో భాగంగా వుండే కొంగు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడైనా అక్కరకు వస్తుంది. చెట్టునీడవలె అలసటను తీర్చటం, చలికాలంలో వెచ్చని చలిమంటవలె భుజాల్ని కప్పటం కొంగు వల్ల ప్రయోజనాలు.
”కోసుదూరాన్నుంచి దూపదీర్చే
కుండ సెరువులకు సుట్టకుదురైతది
పోయి మీద గిన్నెలకు మసిబొంత పేగై
సెయి గాల్పుకుంటది!”
స్త్రీ కుండతో నీళ్ళు తెచ్చుకునేప్పుడు తలపై కొంగును చుట్ట చుట్టుకొని దానిపై మంచినీళ్ళ కుండను పెట్టుకొని కొన్ని కిలోమీటర్లు అవలీలగా నడుస్తుంది. ఆ సమయంలో ఆమె తలపై ప్రత్యక్షంగా భారం పడకుండా తన మెత్తని స్పర్శతో స్త్రీ తలను కాపాడుతుంది కొంగు.
స్త్రీ పొయ్యిపై వంటచేసేప్పుడు మసిగుడ్డవలె కొంగు సహాయపడుతుంది. స్త్రీ చేతులు కాలకుండా రక్షణ కవచంలా ఉంటుంది కొంగు. పిల్లలు ఏడుస్తున్నప్పుడు వారి కళ్ళు తుడవడానికైనా ముక్కు తుడవడానికైనా పనికివచ్చేది కొంగు.
రోజంతా పనిచేయడం వలన స్త్రీలకు ఒంటిపై దుమ్ము పడుతుంది. ఆ దుమ్మును కొంగు ద్వారా దులుపుకోవడం జరుగుతుంది. ఈనినావు తన లేగదూడెను పుట్టినప్పుడు ఎలా శుభ్రం చేస్తుందో అలా స్త్రీల శరీరాన్ని శుభ్రం చేస్తుంది కొంగు అంటుంది సుభద్ర.
”నెలబట్టమోసిన మోదుగు    పూరంగాకు
తడ్కసాటోలె అడ్డువస్తది.”
స్త్రీకి ఋతుస్రావమైనప్పుడు చీరకు మరకలేర్పడితే కొంగే ఆ మరను కన్పించకుండా చాటు అవుతుంది.
స్త్రీలు పంటచేనుల్లో పనిచేసేప్పుడు కొంగు తీసుకొని నడుముచుట్టూ గట్టిగా కట్టుకొని నడుమువంచి పాటలు పాడుతూ నాట్లు నాటడం, కోతలు కోయడం, కలుపు తీయడం మొదలైన పనులు చేస్తారు. పనిలో నడుము గట్టితనానికి ఆ రకంగా కొంగు ఒక ఉపకరణమవుతుంది.
ఈ విధముగా దళిత శ్రామిక వర్గ స్త్రీలకు సుఖంలో, దుఃఖంలో పనులలో పాటలలో చేదోడువాదోడుగా ఉంటుంది కొంగు. ఇంతగా తోడ్పడే కొంగుకు ఎదపై ఉండే సమయమే లేదని అంటుంది సుభద్ర.
”బొచ్చెమీన కావలుండే బొంతపేగు గాదు
గుండెలమీద చేరే గుదిబండకాదు
బజారుకీడ్సి ఎట్ల బద్నాం జేద్దు
అగ్గిపెట్టి నేనెక్కడ ఆగమైదా.” అని అంటుంది.
ఇన్నివిధాలుగా సహాయపడే కొంగును దళిత శ్రామిక స్త్రీ లైంగికత మీద అదుపుగానో, శరీరాన్ని నియంత్రించే పితృస్వామ్యపు అదృశ్యహస్తంగానో భావించలేదు. ఒక వస్తువు అనేక పనులకు ఆసరా అవుతున్నప్పుడు దానిని నిరాకరించడం సాధ్యం కాదు. ఆ కొంగు లేకపోతే తన నిత్యజీవిత వ్యాపారంలో, వ్యవహారంలో ఎన్నో వస్తువులను తాను ప్రత్యేకంగా అదనంగా ఏర్పరచుకోవాలి. అది దళిత శ్రామిక స్త్రీకి అదనపు బరువే. అందువల్ల సుభద్ర కొంగును గుదిబండగా భావించలేనని నిర్ద్వంద్వంగా చెప్తుంది.
ముగింపు : స్త్రీవాద దృష్టికోణంతో చూస్తే జయప్రభ వ్రాసిన ”పైటని తగలెయ్యాలి” అనే కవిత సమంజసంగా ఉంది. ఇక్కడ పితృస్వామ్య విధానంపై తిరుగుబాటు ప్రధానం.
అదే కవితకు మరో దృష్టికోణం జూపాక సుభద్ర రచించిన ”కొంగు నా బొచ్చెమీద కావలుండే బొంత పేగ్గాదు” అనే కవిత. ఇక్కడ కొంగు స్త్రీకి జీవితాంతం తోడుండే ఆపన్నహస్తం.
ఒకరు ”పైటని తగలెయ్యాలి” అని అంటే, మరొకరు ”పైటను బద్నాం చేయలేను” అనటానికి కాలమాన పరిస్థితులే కారణం. రెండు కవితలలో వస్తువు ఒకటే. కాని ప్రయోజనాల గుర్తింపే అదనం. రెండు పైటల సామాజిక వర్గాలలోని వ్యత్యయమే దీనికి మూలం.
దళిక శ్రామిక వర్గ స్త్రీల ప్రయోజనాల దృష్ట్యా జూపాక సుభద్ర పైటను చూడవలసిన కొత్త దృష్టికోణాన్ని చూపింది. సమయం సందర్భం మారినప్పుడు ఒకే వస్తువు, మరొక కోణం నుండి ఫోకస్‌లోకి రావడం సహజం. వస్తువుకున్న భిన్న పార్శ్వాల గుర్తింపునుండే సాహిత్య విస్తృతి, సౌందర్యం సాధ్యమవు తుంది.
( కాకతీయ విశ్వవిద్యాలయం మహిళా అధ్యయన కేంద్రం, మనలో మనం రచయిత్రుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో 2009 మార్చి 21, 22 తేదీలలో కాకతీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ”దళిత తెలంగాణ స్త్రీల సాహిత్యం – అధ్యయనం” అన్న సదస్సులో సమర్పించిన పత్రం.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.