అసమ సమాజంలో ఆదివాసీల ఆర్థిక దుస్థితి,
వెన్నెల్లు రాని అమావశ్యలు
కూడూగుడ్డకు నిరుపేదలైనా,
ప్రేమకు కడలంత పెన్నిధులు వాళ్ళు
అందమైన అందలమే వారి సంస్కృతి,
వారి ముంగిలి ముచ్చటైన ముద్దబంతి తోట
ఆదివాసీ తల్లుల మనసులు తళుకులీనే తారకలు,
పిల్లలు చల్లని నిండు జాబిల్లి సోయగాలు
పేదరికపు చెలియలి కట్టను దాటలేని సాగరాలు వాళ్ళు,
అందని పుల్ల ద్రాక్ష వాళ్ళకందని నవ నాగరిక సౌకర్యాలు
పచ్చటి కొండా కోనల్ని దాటి వచ్చే దొరలదండు,
ప్రకృతి బిడ్డల శ్రమను దోచుకొని గాలమేసి
రెక్కల్ని ఎన్నో ముక్కల్ని చేసుకున్నా,
ఐదు వేళ్ళూ నోటికందవనేది చేదు నిజము
బాల సూర్యులు జ్ఞాన కిరణాల్ని ధరించి,
వారి గూడేల్ని తేజో కాంతి మయం చేయాలి.
ప్రకృతి వసంత శోభల్ని కాల్చే అగ్నికి, ఎదురగ్గి పెట్టాలి.
అందమైన వనాల కోసం చైతన్య జలకళతో జీవం పోయాలి.