హ్యాపీ ఫెమినిస్ట్స్‌ -చిమమండా అడిచే

– అనువాదం : ఎ. సునీత
ముందు మాట: 2012లో ఆఫ్రికాపై టెడ్‌ ఎక్స్‌ యూస్టేన్‌ నిర్వహించే వార్షిక సమావేశంలో నేను చేసిన ప్రసంగాన్ని కొద్దిగా మారిస్తే వచ్చిందీ పుస్తకం. వివిధ రంగాల నుంచి వక్తలు ఆఫ్రికన్లని, ఆఫ్రికా మిత్రులని ఉద్దేశించి, వారికి స్ఫూర్తినిస్తూ, అలాగే సవాలు చేస్తూ క్లుప్తంగా ప్రసంగాలు చేసే సమావేశం ఇది.

కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఇంకొక టెడ్‌ సమావేశంలో ఆఫ్రికా గురించి ప్రబలిన మూస ధోరణులు అందరి ఆలోచనలని ఎలా సంకుచితం చేస్తున్నాయోనన్న విషయం గురించి ‘ఒక కథనం తెచ్చే ప్రమాదం’ అన్న ప్రసంగం చేశాను. ‘స్త్రీ వాది’, ‘స్త్రీ వాదం’ అన్న ఆలోచన కూడా ఇటువంటి మూస ధోరణుల వల్లే కుదించుకుపోయిందని నాకనిపించింది. టెడ్‌ ఎక్స్‌ యూస్టేన్‌ నిర్వాహకులయిన నా సోదరుడు చక్స్‌, అతని ఆప్త మిత్రుడు ఐక్‌ నేను మాట్లాడాల్సిందేనని పట్టుబట్టినప్పుడు నేను కాదనలేకపోయాను. స్త్రీవాదం నన్ను బలంగా ప్రభావితం చేసింది కాబట్టే దాని గురించే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అందరికీ అంత నచ్చే విషయం కాదని నాకనిపించింది. కానీ కనీసం దాని గురించి సంభాషణ మొదలవుతుందేమోనని నా ఆశ. ఆ సాయంత్రం స్టేజీ మీద నిలబడినప్పుడు నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుభూతి కలిగింది. నేను మాట్లాడబోయే విషయం పట్ల ప్రతిఘటన
ఉన్నప్పటికీ, వాళ్ళందరూ నన్ను శ్రద్ధగా, దయతో వినటానికి సిద్ధపడిన శ్రోతలని అనిపించింది. నా ప్రసంగం చివర అందరూ నిల్చుని కొట్టిన చప్పట్లు నా ఆశని చిగురింప చేశాయి.
మనందరం స్త్రీవాదులమవ్వాలి: ఒకోలోమా నాకు అత్యంత ఇష్టమయిన బాల్య మిత్రులలో ఒకడు. మా సందులోనే ఉండేవాడు. నన్ను పెద్దన్నయ్యలా చూసుకునేవాడు. నాకెవరయినా అబ్బాయి నచ్చితే ఒకోలోమాకి చెప్పి, అతని అభిప్రాయం అడిగేదాన్ని. ఒకోలోమా తెలివిగలవాడు. అందర్నీ నవ్వించేవాడు. కౌ బాయ్‌ బూట్లు వేసుకునేవాడు. 2005 డిసెంబర్‌లో దక్షిణ నైజీరియాలో జరిగిన ఒక విమాన ప్రమాదంలో తను చనిపోయాడు. అతని మరణం నన్నెంత బాధపెట్టిందో నేనిప్పటికీ మాటల్లో వివరించలేను. అతడితో చాలా వాదించేదాన్ని. మళ్ళీ కలిసి నవ్వుకునేవాళ్ళం. మనసు విప్పి మాట్లాడుకోగలిగేదాన్ని. నన్ను స్త్రీవాది అని పిలిచిన మొదటి వ్యక్తి కూడా అతనే.
నాకప్పుడు పధ్నాలుగేళ్ళు. వాళ్ళ ఇంట్లో కూర్చుని పుస్తకాల నుండి నేర్చుకున్న సగం సగం పరిజ్ఞానంతో పెద్దగా వాదించుకుంటున్నాం. దేని గురించో ఇప్పుడు గుర్తు కూడా లేదు. నేనలా ఆపకుండా వాదిస్తూ ఉంటే, ఒకోలోమా నన్ను చూసి ‘నువ్వొక ఫెమినిస్టువి’ అన్నాడు.
అదేమీ మెప్పుకోలుగా అనలేదు. ‘నువ్వు తీవ్రవాదాన్ని సమర్ధిస్తున్నావు’ అనే స్వరంలో అన్నాడు.
నాకప్పటికి ఈ ‘ఫెమినిస్టు’ అనే పదానికి అర్థం తెలియదు. కానీ నాకు తెలియదనే విషయం ఒకోలోమాకి తెలియటం నాకిష్టంలేదు. అందుకని, అతనన్న మాటలను పట్టించుకోకుండా, నా వాదన కొనసాగించాను. ఇంటికెళ్ళగానే నిఘంటువులో ఈ పదానికి అర్థం వెతకాలని అనుకున్నాను.
… … …
కొన్ని సంవత్సరాలు ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ చేద్దాం: 2003లో నేను ‘పర్పుల్‌ హైబిస్కస్‌’ అనే నవల రాశాను. దానిలో కథానాయకుడు పెళ్ళాన్ని కొడతాడు. నవలలో ఆయన కథకి అంత మంచి ముగింపు ఉండదు. ఆ నవల ప్రచారంలో భాగంగా నైజీరియాలో తిరుగుతున్నప్పుడు ఒక పాత్రికేయుడు, మంచివాడే, నాకొక సలహా ఇద్దామనుకుని చెప్పాడు. (నైజీరియన్లు అక్కర్లేని సలహాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారని మీలో చాలామందికి తెలిసే ఉంటుంది)
ప్రజలు నా నవలని ఫెమినిస్టు అంటున్నారని చెబుతూ, దాని గురించి తన విచారాన్ని తల అడ్డంగా ఊపి వ్యక్తం చేస్తూ ఆయన నాకిచ్చిన సలహా ఏమిటంటే, ‘‘ఎప్పుడూ ఫెమినిస్టుగా మారకు, మొగుడు దొరకలేదనే బాధతో ఉండే స్త్రీలే ఫెమినిస్టులవుతారు’’ అని.
అప్పటినుండి నన్ను నేను హ్యాపీ ఫెమినిస్టు అని పిలుచుకోవటం మొదలుపెట్టాను.
ఒక యూనివర్శిటీ అధ్యాపకురాలు, నైజీరియన్‌ మహిళ, ఫెమినిజం మన సంస్కృతికి చెందింది కాదని, అసలు ఆఫ్రికాకే దానితో సంబంధం లేదని, నేను పాశ్చాత్య పుస్తకాల వల్ల ప్రభావితమై నన్ను నేను ఫెమినిస్టుగా పిలుచుకుంటున్నానని నాకు నచ్చచెప్పారు. (ఇది విని నాకు చాలా నవ్వొచ్చింది. పదహారేళ్ళ వరకు నేను చదివిన పుస్తకాలన్నీ స్త్రీ వాదానికి విరుద్ధమైనవే. ప్రచురితమైన ప్రతి మిల్స్‌ అండ్‌ బూన్స్‌ రొమాన్స్‌ నవలా పదహారేళ్ళకు నేను చదివేసే ఉంటాను. ప్రామాణిక స్త్రీ వాద రచనలు అనే వాటిని చదవాలంటే నాకు మహా బోర్‌. వాటిని పూర్తి చేయడానికి కష్టపడతాను.)
సరే, ఫెమినిజం ఆఫ్రికాకి చెందదని తెలిసిపోయింది కాబట్టి, అప్పటినుండి ‘హ్యాపీ ఆఫ్రికన్‌ ఫెమినిస్టు’ అని నన్ను నేను పిలుచుకోవటం మొదలుపెట్టాను. ఈ లోపల ఒక మంచి మిత్రుడు ఫెమినిస్టుగా ఉండడమంటే మగవారిని ద్వేషిస్తున్నానని చెప్పాడు. సరే అని అప్పటినుండి ‘మగవారిని ద్వేషించని హ్యాపీ ఆఫ్రికన్‌ ఫెమినిస్టు’గా నన్ను నేను పిలుచుకోవటం మొదలుపెట్టాను. ఇదే క్రమంలో ‘మగవారిని ద్వేషించని హ్యాపీ ఆఫ్రికన్‌ ఫెమినిస్టు, పురుషుల కోసం కాక తన కోసం తాను లిప్‌ గ్లాస్‌, హై హీల్స్‌ వేసుకోవటానికి ఇష్టపడే స్త్రీ వాది’ అని కూడా పిలుచుకున్నాను.
ఇందులో చాలామేరకు వ్యంగ్యం ఉందని మీకు అర్ధమయ్యే ఉంటుంది. కానీ ఫెమినిస్టు అనే పదం అనవసర బరువుతో, ప్రతికూల అర్ధాలతో వస్తుందని చెప్పటం నా ఉద్దేశం. ఒకసారి నిన్ను నువ్వు ఫెమినిస్టునని చెప్పుకున్నావంటే, ‘నువ్వు పురుష ద్వేషివి, నీకు బ్రా అంటే ఇష్టం ఉండదు, నువ్వు ఆఫ్రికన్‌ సంస్కృతిని ద్వేషిస్తావు, ఎప్పుడూ స్త్రీలకే పై చెయ్యి ఉండాలని అంటావు. నువ్వు మేకప్‌ వేసుకోవు, షేవ్‌ చేసుకోవు. ఎప్పుడూ కోపంగా ఉంటావు. నీకు అసలు హాస్య చతురత లేదు’… ఇలా అనేక రకాల ఊహలు మనుషుల మెదళ్ళలోకి వచ్చేస్తాయి.
… … …
ఇప్పుడు నా చిన్నప్పటి కథ ఒకటి చెప్తాను.
ఏంసుక్ఖా అని ఈశాన్య నైజీరియాలోని యూనివర్శిటీ పట్టణంలో నేను ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నప్పుడు మా టీచర్‌, క్లాస్‌ టెస్టులో ఎవరైతే ఫస్ట్‌ వస్తారో వారిని క్లాస్‌ మానిటర్‌ చేస్తానని సంవత్సరం మొదట్లో ప్రకటించింది. క్లాస్‌ మానిటర్‌ అంటే పెద్ద విషయం. క్లాసులో గొడవ చేసేవాళ్ళందరి పేర్లు బోర్డు మీద ఎక్కించే అధికారం మామూలుది కాదు. అంతేకాదు, మా టీచర్‌ క్లాసులో తిరుగుతున్నప్పుడు పట్టుకోవటానికి మానిటర్‌కి ఒక బెత్తం కూడా ఇచ్చేది. బెత్తం వాడే అధికారం ఆవిడదే లెండి. కానీ తొమ్మిదేళ్ళప్పుడు దాన్ని పట్టుకొని తిరగొచ్చు అంటేనే మహా ఉత్సాహంగా ఉంటుంది కదూ. నేను వెంటనే క్లాస్‌ మానిటర్‌ అవ్వాలని ఒట్టేసుకుని, ఫస్ట్‌ ర్యాంకు కూడా తెచ్చేసుకున్నాను.
అప్పుడు చెప్పింది మా టీచర్‌, క్లాస్‌ మానిటర్‌ అవ్వాలంటే తప్పకుండా అబ్బాయి అయి ఉండాలని. నాకు ఆశ్చర్యమేసింది. అంతకుముందు ఆవిడ ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదు. బహుశా ఆవిడకి ఆ విషయం పట్ల స్పష్టత
ఉండే ఉంటుంది, అందుకనే చెప్పాలని కూడా అనుకోలేదు. క్లాసులో రెండో ర్యాంకు ఒక అబ్బాయికి వచ్చింది. ఆ అబ్బాయే క్లాస్‌ మానిటర్‌ అని ప్రకటించింది.
కానీ ఆ అబ్బాయి చాలా సున్నిత మనస్కుడు. ఎవరితో గట్టిగా మాట్లాడలేడు. వాడికి బెత్తం పట్టుకుని క్లాసులో తిరగాలనే ఉత్సాహం ఎప్పడూ లేదు. నాకు మాత్రం బాగా బలంగా ఉండేది.
కానీ నేను అమ్మాయిని, వాడు అబ్బాయి. వాడే క్లాస్‌ మానిటర్‌ అయ్యాడు.
నేనెప్పుడూ ఆ సంఘటనని మర్చిపోలేదు.
ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేస్తే అదే నార్మల్‌ అనుకుంటాం. ఒకే విషయాన్ని పదే పదే చూస్తే దాన్ని నార్మల్‌ అనుకుంటాం. అబ్బాయిలని మాత్రమే ఎప్పుడూ క్లాస్‌ మానిటర్‌ చేస్తే, మనకి తెలియకుండానే, క్లాస్‌ మానిటర్‌గా అబ్బాయిలే ఉండాలని అనుకుంటాం. పెద్ద కంపెనీలకి ఎప్పుడూ మగవాళ్ళు మాత్రమే అధిపతులుగా ఉంటే, కంపెనీలకి మగవాళ్ళు అధిపతులుగా ఉండటమే సహజంగా అనిపిస్తుంది.
… … …
నాకు ఏదయినా విషయం స్పష్టంగా అర్థమైతే, నాలాగే అందరికీ కూడా అర్థమవుతుందని అనుకుంటూ ఉంటాను. కానీ అలా జరగదు. నా మంచి దోస్తు లూయి. అద్భుతమైన తెలివితేటలు కలవాడు, అభ్యుదయ భావాలు కలవాడు. మేము చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మాటల్లో లూయి నాతో, ‘‘ఆడవాళ్ళని భిన్నంగా చూస్తారని, వారికి అన్నీ కష్టతరం చేస్తారని నువ్వు అంటుంటావు. అది గతంలో మాట. ఇప్పుడలా లేదు. ఇప్పుడు ఆడవాళ్ళకి అంతా మంచిగానే ఉంది’’ అంటుంటాడు. నాకు స్పష్టంగా కనిపించేది, లూయికి ఎందుకు కనిపించదో నాకు అర్థమే కాలేదు.
నైజీరియాకు వెళ్ళటం నాకు చాలా ఇష్టం. వెళ్ళినపుడు ఎక్కువ సమయం అక్కడి పెద్ద నగరమయిన లాగోస్‌లో గడుపుతాను. సాయంత్రాలు వేడి తగ్గినప్పుడు, అప్పుడప్పుడు మా కుటుంబ సభ్యులతోనో, స్నేహితులతోనో రెస్టారెంట్లకు, కేఫ్‌లకు వెళతాను. అలా ఒకరోజు లూయి, నేను ఫ్రెండ్స్‌లో బయటికి వెళ్లాం.
లాగోన్‌లో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఏ రెస్టారెంట్‌, షాపింగ్‌ మాల్‌ బయటైనా కనిపించి మీ కారుని పార్క్‌ చేయడానికి ‘సహాయం’ చేసే బలమయిన యువకులు. 20 లక్షల జనాభా కలిగి, లండన్‌ కంటే ఎక్కువ
ఉత్సాహంతో, న్యూయార్క్‌ కంటే ఎక్కువ వ్యాపార స్ఫూర్తి కలిగిన నగరం లాగోస్‌. జీవనోపాధి కోసం అక్కడ వెతకని మార్గం లేదు. అన్ని పెద్ద నగరాల్లాగే అక్కడ కూడా పార్కింగ్‌కి చోటు దొరకటం కష్టం. ఈ యువకులు అలాంటి చోటు వెతికే పని దొరకబట్టుకుని, ఒకవేళ పార్కింగ్‌ స్థలం ఉన్నా సరే, మీ కారుని ఆ చోటులోకి పార్కింగ్‌ చేయటానికి చేతులు పెద్దగా ఊపుకుంటూ సహాయం చేసేస్తారు. మీరు తిరిగివచ్చేదాకా తాము కారుని జాగ్రత్తగా చూసేసుకుంటామని అభయ హస్తం కూడా ఇస్తారు. ఆ రోజు మా కారు పార్కింగ్‌ చెయ్యటానికి సహాయపడిన యువకుడి హావభావాలు నాకు చాలా నచ్చేశాయి. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అతడికి టిప్‌ ఇద్దామని, నా బ్యాగ్‌ తెరిచి, పర్స్‌లోంచి డబ్బులు తీసి అతనికి ఇచ్చాను. అతను సంతోషపడి, కృతజ్ఞతగా నా దగ్గర్నుండే డబ్బులు తీసుకుని, లూయి వంక చూసి, ‘థాంక్యూ సార్‌’ అని చెప్పాడు.
లూయి నావంక ఆశ్చర్యంగా చూసి, ‘అతను నాకెందుకు థాంక్స్‌ చెప్తున్నాడు? నేనతనికి డబ్బులు ఇవ్వలేదు కదా?’’ అన్నాడు. అంతలోనే అతనికి జ్ఞానోదయమైంది. ఆ పార్కింగ్‌ స్థలం యువకుడు, నా పర్సులోంచి నేను డబ్బులు తీసిచ్చినా, ఆ డబ్బులు నా పక్కనున్న లూయి సంపాదించినవే అయ్యుంటాయి అనుకున్నాడని.
… … …
స్త్రీలు, పురుషులు భిన్నమయిన వారు. ఇద్దరికీ భిన్నమయిన హార్మోన్లు ఉంటాయి, లైంగిక అవయవాలు
ఉంటాయి. భిన్నమయిన జీవ సంబంధ పనులు చెయ్యగలిగే సామర్ధ్యం ఉంటుంది. స్త్రీలు పిల్లల్ని కనగలరు, పురుషులు కనలేరు. మగవాళ్ళకి ఆడవాళ్ళకంటే టెస్టోస్టెరోన్‌ ఎక్కువ ఉంటుంది. అందువల్ల స్త్రీలకన్నా శరీర ధృఢత్వం ఎక్కువ ఉంటుంది. పురుషుల కంటే ప్రపంచంలో స్త్రీలు కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రపంచ జనాభాలో 52 శాతం స్త్రీలున్నప్పటికీ అధికారం, ప్రతిష్ట రెండూ పురుషుల చేతిలోనే ఎక్కువగా ఉన్నాయి. నోబెల్‌ ప్రైజ్‌ విజేత కీర్తిశేషులయిన కెన్యాకి చెందిన వన్గారి మాతాయి చెప్పినట్లు, ‘‘సమాజంలో పైకి వెళ్ళేకొద్దీ ఆడవాళ్ళు తక్కువగా కనబడతారు.’’
ఈ మధ్యే జరిగిన అమెరికన్‌ ఎన్నికల్లో మనం లిల్లి లేడిబేట్ర్‌ చట్టం గురించి బాగా విన్నాం. అది అమెరికాలో ప్రబలిన ఒక వాస్తవం గురించి. ఒకే అర్హతలున్న స్త్రీ, పురుషుడు ఒకే ఉద్యోగంలో ఉంటే, ఆ పురుషుడికి ఎక్కువ వేతనం ఉంటుంది, అతను పురుషుడు అన్న ఒకే ఒక కారణం వల్ల.
అంటే, పురుషులు ప్రపంచాన్ని ఏలుతున్నారని అర్థం. ఒక వెయ్యి సంవత్సరాల క్రితం దీనికో అర్థముండేది. అప్పట్లో శారీరక బలం ప్రపంచంలో బ్రతకటానికి చాలా అవసరం ఉండేది. పురుషులకి ఎక్కువ శారీరక బలం ఉండడం వల్ల వారే నాయకత్వ స్థానాల్లో ఉండేవాళ్ళు. (దీనికి మినహాయింపులు ఉండేవనుకోండి). ఈ రోజు మనం జీవించే ప్రపంచం చాలా భిన్నమైంది. ఇప్పుడు నాయకత్వ స్థానాల్లో ఉండేవాళ్ళు, శారీరక బలం కలవాళ్ళు కాదు, బుద్ధి బలం, జ్ఞాన బలం, సృజనాత్మకత, ఆవిష్కరణ సామర్ధ్యాలు కలవాళ్ళే నాయకత్వ స్థానాల్లో ఉంటున్నారు. హార్మోన్లకీ, వీటికీ ఏ సంబంధం లేదు. స్త్రీకయినా, పురుషుడికయినా ఈ సామర్ధ్యాలు ఉండే అవకాశం సమానంగా ఉంది. జాతిగా మనం పరిణామం చెందాం. కానీ, జెండర్‌ గురించి మన ఆలోచనలు మాత్రం పరిణామం చెందలేదు.
… … …
కొన్నాళ్ళ క్రితం నైజీరియాలోని అతి పెద్ద హోటల్‌ లాబీలోకి నేను నడిచి వెళ్తుంటే, అక్కడున్న సెక్యూరిటీ గార్డు నన్ను ఆపేసి చాలా చిరాకు పెట్టే ప్రశ్నలు వేశాడు. మీరు ఏ రూమ్‌లో ఎవరిని కలవటానికి వచ్చారు? ఆయన మీకు తెలుసా? మీరు హోటల్‌ రూమ్‌లో ఉంటున్నట్లయితే, సాక్ష్యం చూపించండి. కీ కార్డు ఉందా? ఆయన ఈ ప్రశ్నలు అడగటానికి కారణమేంటంటే, ఒంటరిగా నైజీరియన్‌ హోటల్‌లోకి వచ్చే స్త్రీ తప్పకుండా సెక్స్‌ వర్కర్‌ అయి ఉంటుందని అందరికీ ఉండే బలమయిన నమ్మకం. లేకుంటే, ఒక నైజీరియన్‌ మహిళ తనంతట తాను ఒక హోటల్లో బసచేసే అవకాశమే లేదని వాళ్ళ భావన. అదే ఒక ఒంటరి నైజీరియన్‌ పురుషుడు హోటల్లోకి వస్తే ఈ ప్రశ్నలు రావు. ఆయన తప్పకుండా ఏదో ఒక వ్యాపార పనిమీదే వస్తాడని అందరి నమ్మకం. (మరి హోటళ్ళు సెక్స్‌ వర్కర్ల కోసం పురుషులు చేసే డిమాండు పట్ల ఎందుకు దృష్టి పెట్టవో అర్థం కాదు. డిమాండు ఉంటేనే సప్లై ఉంటుంది. లేకుంటే వాళ్ళు రానే రారు కదా!)
లాగోస్‌లో పేరొందిన క్లబ్బులు, బార్లలోకి నేను వెళ్ళలేను. ఒంటరి ఆడవాళ్ళని అవి లోపలికి అడుగు పెట్టనీయవు. మగవాళ్ళతో కలిసి వెళ్తేనే స్త్రీలు లోపలికి వెళ్ళగలరు. నా మగ స్నేహితులు చాలామంది అక్కడికి ఒంటరిగా వెళ్ళి, ముక్కు మొహం తెలియని ఆడవాళ్ళ చేతులు పట్టుకొని లోపలికి తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ ఆడవాళ్ళకి లోపలికి వెళ్ళటానికి వీళ్ళ సహాయం అడగక తప్పని పరిస్థితి.
నేను నైజీరియాలో రెస్టారెంట్‌లోకి ఒక పురుషునితో వెళ్ళిన ప్రతిసారీ, అక్కడి వెయిటర్లు అతనికి మాత్రమే విష్‌ చేస్తారు, వాళ్ళకి నేను కనిపించను. సమాజం వాళ్ళకి పురుషులే ప్రధానం, స్త్రీలు కాదు అని నేర్పింది కాబట్టి వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారని, వారికి ఏ చెడు ఉద్దేశాలు లేవని నాకు తెలుసు. అయితే ఒక విషయాన్ని మేధోపరంగా అర్థం చేసుకోవటం వేరు, అనుభవించటం వేరు. వాళ్ళు నన్నలా పట్టించుకోని ప్రతిసారీ, నేను అదృశ్యమయ్యాననే భావన నాకు కలుగుతుంది. మనసు బాధ పడుతుంది. నేను కూడా మనిషినేనని, నా వంక చూసి, నన్ను విష్‌ చెయ్యండని వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది. ఇవి చిన్న విషయాలే, కానీ ఒక్కోసారి చిన్న విషయాలే చాలా బాధపెడతాయి.
కొన్నాళ్ళ క్రితం నేను లాగోస్‌లో ఒక అమ్మాయిగా బ్రతకడం గురించి ఒక వ్యాసం రాశాను. నాకు తెలిసినాయన ‘చాలా కోపంగా రాశావు, అంత కోపంగా రాయటం అవసరం లేదు’ అన్నాడు. కానీ నేను ఏ మాత్రం పశ్చాత్తాప పడలేదు. నాకు చాలా కోపంగా ఉంది. ఇప్పటి ప్రపంచంలో జెండర్‌ భేదాలలోని అన్యాయం నాకు కోపం తెప్పిస్తుంది. నాకే కాదు, అవి అందరికీ కోపం తెప్పించాలి. న్యాయమయిన కోపం ప్రపంచంలో మంచి మార్పుని తీసుకురావరటానికి చాలా తోడ్పడిరది. నాకు ప్రపంచంలో ఈ మార్పు వస్తుందని ఆశ ఉంది. మనుషులకి తమని తాము బాగుపరచుకునే సామర్ధ్యం ఉందని నేను బలంగా నమ్ముతాను.
మళ్ళీ కోపం దగ్గరికి వద్దాం. నాకు తెలిసినాయన మాటల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమా అనే స్వరం ధ్వనించింది. ఆయన చేసిన కామెంట్‌ నేను రాసిన వ్యాసం గురించే కాదు, నా క్యారెక్టర్‌ గురించి కూడా. కోపం ఆడవాళ్ళకి మంచిది కాదు, వాళ్ళు కోపం వ్యక్తం చేయడం ఎవరికీ నచ్చదు అని ఆయన చెప్పదలచుకున్నాడు. నాకు ఒక అమెరికన్‌ స్నేహితురాలుంది. ఆమె ఒక పురుషుడు ఖాళీ చేసిన మేనేజీరియల్‌ స్థానంలోకి ఈ మధ్యే వెళ్ళింది. ఆయనకి చాలా గట్టివాడని, ఎవరితోనైనా కఠినంగా ఉండగలడని, ముఖ్యంగా టైమ్‌ విషయంలో చాలా కఠినంగా ఉంటాడని పేరుంది. ఈమె తాను కూడా కఠినంగానే ఉండాలని, అయితే ఉద్యోగులకి కుటుంబాలు ఉంటాయన్న విషయం గుర్తించి, కొంచెం దయతోనే ఉండాలని అనుకుంది. కొన్ని వారాలలోపే ఒక ఉద్యోగి రిజిస్టర్‌లో కావాలని తప్పు టైమింగ్‌ వేస్తే అతన్ని, తన ముందున్న మేనేజర్‌ క్రమశిక్షణలో పెట్టినట్లే తాను కూడా పెట్టింది. సదరు ఉద్యోగి వెంటనే పై స్థాయి మేనేజ్‌మెంట్‌కి ఆమె గురించి ఫిర్యాదు చేశాడు. ఈమె చాలా దూకుడుగా వ్యవహరిస్తుందని, ఈమెతో పనిచేయడం కష్టమని చెప్పాడు. మిగిలిన ఉద్యోగులు కూడా ఆయనకి వంత పాడారు. ఈవిడ ‘దయ గల స్త్రీగా’ వ్యవహరిస్తుందని ఆశించామని, కానీ చెయ్యలేదని అన్నారు. అంతకు ముందున్న పురుష మేనేజర్‌ వ్యవహార శైలినే ఆమె పాటించిందని, ఆయన్ని అందుకోసమే అందరూ పొగిడారని ఆ సమయంలో ఎవరికీ గుర్తు రాలేదు.
నాకు ఇంకొక స్నేహితురాలు ఉంది. ఆమె కూడా అమెరికన్‌. వాణిజ్య ప్రకటన రంగంలో పెద్ద స్థాయిలో ఉంది. ఆమె టీంలో ఇద్దరే స్త్రీలు. ఒకరోజు మీటింగ్‌ జరుగుతున్నప్పుడు ఆమె బాస్‌ తను చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా, అదే విషయం టీంలోని ఒక పురుషుడు చెప్పినప్పుడు విని ప్రశంసించాడని చెప్పి బాధపడిరది. ఆ విషయం గురించి మాట్లాడి బాస్‌ని ఎదిరిద్దామనుకున్నా అని కూడా చెప్పింది. కానీ చెయ్యలేదు. మీటింగ్‌ అయిపోయిన తర్వాత, బాత్రూంలోకి వెళ్ళి తనివితీరా ఏడ్చి, ఆ తర్వాత నాకు ఫోన్‌ చేసి, అంతా వెళ్ళగక్కుకుంది. అలా మాట్లాడితే ‘ఈమె దూకుడుగా వ్యవహరిస్తుంది’ అని అంటారని భయపడిరది. తన కోపాన్ని అలాగే దావానలంలా లోపల దాచుకుంది.
తననికానీ, తనలాంటి అనేకమంది అమెరికన్‌ స్నేహితురాళ్ళని చూసినప్పుడు నాకు కొట్టొచ్చినట్టు కనిపించేది ఏంటంటే, వాళ్ళు ఇతరులు తమని ఇష్టపడాలని ఎంత కోరుకుంటారోనని. ఇతరులు వారిని ఇష్టపడేలా చూసుకోవడం చాలా ముఖ్యమని వాళ్ళ సంస్కృతి వాళ్ళకి నేర్పింది. ఈ ఇష్టపడేటట్లు చూసుకోవటంలో కోపం వ్యక్తం చేయడం, దూకుడుగా ఉండటం, ఇతరులతో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడటం భాగం కావు.
మనం ఆడపిల్లలకి మగపిల్లలు వారి గురించి ఏమాలోచిస్తున్నారో పట్టించుకోవాలని నేర్పటంలో చాలా సమయం వెచ్చిస్తాం. అయితే అటువైపు పెద్దగా ఏమీ చెప్పం. మగపిల్లలకి ఆడపిల్లలు ఇష్టపడేలా ప్రవర్తించాలని నేర్పం. ఆడపిల్లలకు కోపం చూపించొద్దని, దూకుడుగా ఉండొద్దని, కఠినంగా వ్యవహరించొద్దని చెప్తూనే, మరోపక్క ఇవన్నీ చేసినందుకు మగపిల్లలని ప్రశంసిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆడవాళ్ళకి మగవారిని ఆకర్షించటానికి, సంతోషపరచటానికి చెయ్యాల్సినవి, చెయ్యకూడనివి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చెప్పడానికి అనేక వేల మ్యాగజైన్లు, పుస్తకాలు, వ్యాసాలు ఉన్నాయి. కానీ స్త్రీలని సంతోషపెట్టటానికి పురుషులు ఏమి చెయ్యాలో చెప్పే మార్గదర్శకాల సంఖ్య చాలా తక్కువ.
నేను లాగోస్‌లో రచయితల కోసం వర్క్‌షాప్‌ నిర్వహించాను. దానిలో పాల్గొనటానికి వచ్చిన ఒక యువతిని ఆమె స్నేహితుడు హెచ్చరించాడు, ‘‘ఆవిడ ‘ఫెమినిస్టు మాటలు’ వినొద్దు, అవన్నీ నా మనసులోకి ఇంకి నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయి’’ అని. పెళ్ళి విచ్ఛిన్నమవటం, లేకుంటే పెళ్ళి కాకపోవటం అన్నదొక ఉపద్రవంగా మన సమాజం పరిగణిస్తోంది. అంతేకాక, దీన్ని స్త్రీలకి మాత్రమే వ్యతిరేకంగా వాడుతుంటుంది. ఎందుకో పురుషులకి ఇదొక పెద్ద ఉపద్రవం కాదు.
ప్రపంచంలో ఎక్కడయినా సరే జెండర్‌ అనేది స్త్రీలు, పురుషుల జీవితాలపై విభిన్న ప్రభావం చూపిస్తోంది. ఈ రోజు నేను మిమ్మల్ని అడగాలనుకుంటోంది ఒక్కటే… కొత్త ప్రపంచం గురించి, న్యాయమయిన ప్రపంచం గురించి. మనం కలలు, ప్రణాళికలు వేద్దామా? ఆ ప్రపంచంలో స్త్రీలు, పురుషులు ఇద్దరూ కూడా ఇప్పటికన్నా సంతోషంగా ఉండబోతున్నారు. మరి మనమెక్కడ మొదలుపెడదాం? ముందుగా మనం మన కూతుళ్ళని భిన్నంగా పెంచటంతో మొదలుపెడదాం. మన కొడుకులని కూడా ఇప్పటికంటే భిన్నంగా పెంచాలి.
… … …
మగపిల్లల పెంపకంలోనే వారికి మనం అన్యాయం చేస్తున్నాం. మగపిల్లల మానవత్వాన్ని కుదిస్తున్నాం, మగతనాన్ని అత్యంత సంకుచితంగా నిర్వచిస్తున్నాం. మగతనాన్ని ఒక చిన్న, దృఢమయిన బోనులాగా తయారుచేసి, దాన్లోకి వారిని తోస్తున్నాం.
మగపిల్లలకి భయం, అశక్తత, దుర్భలత్వం అంటే భయపడాలని నేర్పిస్తున్నాం. తమ నిజ స్వరూపం జాగ్రత్తగా దాచుకోవాలని నేర్పుతున్నాం. అలా చేస్తేనే నైజీరియా భాషలో చెప్పాలంటే, వాళ్ళు దృఢమయిన మగాళ్ళుగా తయారవగలరు మరి!
ఒక హైస్కూల్‌ అబ్బాయి, అమ్మాయి కలిసి బైటకి వెళ్ళారనుకోండి. ఇద్దరి దగ్గరా పెద్ద డబ్బులుండవు. కానీ, తన మగతనాన్ని నిరూపించుకోవటానికి, ఆ అబ్బాయి మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది (అబ్బాయిలు ఇంట్లో డబ్బులు ఎందుకు దొంగిలిస్తారని మళ్ళీ మనమే ఆశ్చర్యపోతాం కూడా).
మగతనం డబ్బులతో ముడిపడలేదని ఆడపిల్లలు, మగపిల్లలకు కూడా నేర్పితే బాగుంటుంది కదా? మగపిల్లలు మాత్రమే ఖర్చు పెట్టాలని చెప్పడం కాకుండా, ఎవరి దగ్గర డబ్బులుంటే వాళ్ళు ఖర్చుపెట్టాలనేలా పెంచితే మంచిది కదూ?
మగవాళ్ళకున్న చారిత్రక అవకాశాల వల్ల వాళ్ళ దగ్గరే డబ్బు ఉండటం సాధారణం. కానీ పిల్లల్ని ఇప్పుడు భిన్నంగా పెంచటం మొదలుపెడితే, బహుశా ఏ యాభై ఏళ్ళకో, వందేళ్ళకో మగపిల్లలకి తమ మగతనాన్ని డబ్బు ద్వారా నిరూపించుకునే భారం తగ్గుతుంది కదా. మన పెంపకమంతా అబ్బాయిలు, అమ్మాయిలకంటే కూడా ఎప్పుడూ దృఢంగా ఉండాలనే లక్ష్యంతో ఉంటుంది. వాళ్ళు కూడా పెద్దయ్యేటప్పటికి తామే దృఢచిత్తులమనే నమ్మకాన్ని పెంచుకుంటారు. కానీ ఇటువంటి నమ్మకం వల్ల వాళ్ళకి జరిగే పెద్ద నష్టం… వారి ఇగో అత్యంత దుర్భలంగా, బలహీనంగా తయారవటం. మగపిల్లలు దృఢంగా ఉండాలనే ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటుందో, వాళ్ళ ఇగో అంత దుర్భలంగా తయారవుతుంది.
ఇంకో పక్క ఆడపిల్లలకి ఇంతకంటే పెద్ద అన్యాయం చేస్తున్నాం. ఎందుకంటే ఈ మగవాళ్ళ దుర్భలమైన ఇగోలని జాగ్రత్తగా కాపాడుకోవటం కోసమే వాళ్ళని పెంచి, పెద్ద చేస్తున్నాం. ఆడపిల్లలకి తమని తాము కుదించుకుని, చిన్నగా చేసుకోవటం నేర్పిస్తున్నాం.
ఆడపిల్లలకి ఏమి చెప్తామంటే, ‘‘ఆశయాలు ఉండటం మంచిదే కానీ, మరీ ఎక్కువ ఉంచుకోవద్దు. జీవితంలో విజయాలు సాధించు కానీ, మరీ విజయాలు సాధిస్తే మగవాళ్ళు బెదిరిపోతారు. నువ్వే కుటుంబాన్ని పోషిస్తున్నా సరే, నువ్వు కాదన్నట్లు ప్రవర్తించు. ముఖ్యంగా పబ్లిక్‌లో, లేదంటే, నువ్వే వారిని నపుంసకులుగా తయారు చేస్తున్నట్లు అర్థం.’’
అసలు మనం ఈ మొత్తం ఏర్పాటుని, అది చేసే ప్రతిపాదనలని ధిక్కరిస్తే ఏమవుతుంది? అయినా భార్య సాధించే విజయాలు భర్తకి నష్టమెలా కలుగచేస్తాయి? అసలు ఈ నపుంసకత్వం… ఇంగ్లీష్‌ భాషలోనే నాకు అత్యంత అయిష్టమయిన పదమిది… అనే పదాన్నే తీసి పక్కన పడేస్తే ఎలా ఉంటుంది?
ఒక నైజీరియన్‌ పరిచయస్తుడు నన్ను ‘‘మిమ్మల్ని చూసి మగవాళ్ళు భయపడతారేమోనని మీకు ఆందోళన లేదా?’’ అని అడిగాడు.
నాకు అటువంటి ఆందోళన లేదు. ఆందోళన చెందాలని కూడా నాకెప్పుడూ తట్టలేదు. ఎందుకంటే, అలా భయపడే పురుషుల పట్ల నాకే ఆసక్తి ఉండదు కాబట్టి.
అయినా, ఆయన అడిగింది నాకు ఎక్కడో తగిలింది. నేను స్త్రీని కాబట్టి తప్పకుండా పెళ్ళి కోసమే జీవిస్తానని, నా జీవిత ఆశయాలని పెళ్ళినే కేంద్రంగా చేసుకుని ఎంచుకుంటానని, కోవాలని ఈ ప్రశ్నలో అంతర్లీనంగా ఉంది. వివాహం మంచిదే. ఆనందానికి, ప్రేమకి, పరస్పర సహకారానికి దారితీస్తుంది. మరయితే, అమ్మాయిలకి మాత్రమే ఇదెందుకు చెప్తాము. పెళ్ళి గురించి ఆలోచించాలని అబ్బాయిలకి కూడా ఎందుకు చెప్పం?
నాకు తెలిసిన ఒక నైజీరియన్‌ మహిళ తనను పెళ్ళి చేసుకునే పురుషుడు తన ఆస్తిని చూసి బెదిరిపోకూడదని తనకున్న స్వంత ఇల్లు కాస్తా అమ్మేసింది. ఇంకో పెళ్ళికాని నైజీరియన్‌ మహిళ కాన్ఫరెన్సులకి వెళ్ళినపుడు తన సహోద్యోగులు తనకి గౌరవం ఇవ్వాలని వేలికి పెళ్ళి అయినట్లు ఒక ఉంగరం పెట్టుకుంటుంది.
బాధాకరమైన విషయం ఏమిటంటే, చేతి ఉంగరం వల్ల ఆవిడకి గౌరవం లభిస్తుంది. అది లేకపోవటం సహోద్యోగులు కూడా ఆమెను పట్టించుకోకుండా ఉండేటట్లు చేస్తుంది. పైగా ఇదంతా జరిగేది ఒక ఆధునిక పని స్థలంలో.
కుటుంబం, సహోద్యోగులు, స్నేహితులు పెళ్ళి చేసుకోవాలని తీవ్రంగా వత్తిడి పెట్టడంతో భయంకరమైన మగవాళ్ళని ఎంచుకున్న యువతులు నాకు తెలుసు.
‘‘ఆడవాళ్ళు ఇదంతా వద్దని చెప్పొచ్చు కదా’’ అని మీరనొచ్చు. కానీ వాస్తవ జీవితం చాలా సంక్లిష్టమైనది. మనందరం సంఘ జీవులం. సాంఘికీకరణ ద్వారా సంఘ విలువలను వంట పట్టించుకుంటాం.
మన భాష కూడా దీనికి ఒక ఉదాహరణ. పెళ్ళికి సంబంధించిన భాషంతా యజమాని`సేవకుల భాషలాగే
ఉంటుంది. అది ఒక సమాన భాగస్వాములకు వాడే భాషలాగా ఉండదు.
స్త్రీలు భర్తని గౌరవించాలి, కానీ అదే పదాన్ని పురుషులు భార్యకి చూపించే భావనకి వాడడం అరుదు. స్త్రీ పురుషులిద్దరూ కూడా ‘‘కుటుంబంలో శాంతి కోసం ఇలా చేశాం’’ అని చెప్తుంటారు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.