‘‘కష్టాలు కాక ఏముంది? అందరి ఆడపిల్లల్లా లేను గదా నేను. నా వల్ల ఎన్నో మాటలు పడ్డావు. మామూలు ఆడపిల్లనై ఉంటే ఈపాటికి నలుగురు మనవ సంతానంతో హాయిగా ఆడుకుంటూ ఉండేదానివి. ఇప్పుడేమో పిల్లల్ని కంటానా లేదా అని దిగులు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. నేనొక మామూలు ఆడపిల్లనయితే…’’ సుబ్బమ్మ శారద నోరు మూసేసింది.
‘‘నువ్వొక మామూలు ఆడపిల్లవయితే ఏముందే` నువ్వూ, నేనూ అనామకంగా ఎక్కడో పడి
ఉండేవాళ్ళం. మీ నాన్న నిన్ను డాక్టర్ చదివిస్తానని అన్న రోజునుంచీ నేను నీ గురించి కలలు కనటం మొదలుపెట్టాను. నా కలలన్నీ నిజం చేశావు. నీ కళ్ళల్లో జ్ఞానం వెలుగుతుంటుందమ్మా. మామూలు ఆడపిల్లల్లా అమాయకంగా మడి కట్టుకుని, వండి వారిస్తే, అదే నీ బతుకైతే నేను ఈపాటికే హరీ అనేదాన్ని. నిన్ను చూస్తుంటే నువ్వు ఠీవిగా నడుస్తుంటే, మగవాళ్ళతో సమానంగా, ఒక్కోసారి వాళ్ళకంటే ఎక్కువగా వ్యవహారాలు నడుపుతుంటే డాక్టరుగా గౌరవం, డబ్బు సంపాదించి నీ స్వతంత్రం నువ్వు నిలబెట్టుకుంటుంటే… పిచ్చితల్లీ… నాకంటే అదృష్టవంతురాలెవరమ్మా? ఎవరు కన్నారమ్మా నా బంగారు తల్లివంటి దాన్ని. మీ నాన్నా, నేను నిన్ను గురించి ఏమనుకున్నామో అలాగే జరిగింది. మీ నాన్న ఉంటే ఎంతు బాగుండేదనే దిగులు తప్ప ఇంకే లోటు లేదు. నా జీవితంలో గర్వపడేది నిన్ను చూసే’’.
‘‘నాకంటే నువ్వే గొప్పదానివమ్మా. నేనిలా ఉన్నానంటే నీ వల్లే గదా’’ తల్లిని కావలించుకుని ముద్దులు కురిపించింది శారద.
‘‘సరేలే గాని, ఆరోగ్యం జాగ్రత్త.’’
‘‘అమ్మా… నేను డాక్టర్ని. ప్రసూతి, శిశుపోషణ అన్న పుస్తకం రాస్తున్నాను. బాగా తింటాను. వ్యాయామం చేస్తాను. ఆనందంగా ఉంటాను. చాలా?’’
ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. తండ్రి గురించి కబుర్లు అడిగి అడిగి చెప్పించుకుంది శారద. తీరిక వేళల్లో వాళ్ళకు అది ఇష్టమైన కాలక్షేపం.
‘‘అమ్మా… నీకు చెబుదామనుకుంటూ మర్చిపోయాను. హరి బాబాయికి మన బెజవాడలో షష్టిపూర్తి ఉత్సవం చేస్తున్నారంట. మనం తప్పకుండా వెళ్ళాలి. హరి బాబాయిని చూసి ఎన్ని రోజులయిందో.’’
‘‘మనింటికి పిలువమ్మా. నాలుగు రోజులుండి వెళతాడు. మీ నాన్న, ఆయనా ఒకే ప్రాణం అన్నట్లుండేవారు. హరి మామూలు వాడు కాదే… హరిలాంటి మనుషులుండరే అని రోజుకోసారి అయినా అంటుండేవారు’’.
‘‘గ్రంథాలయ ఉద్యమం వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. నేనూ కొంత డబ్బు సాయం చేశాను. ముందు వాళ్ళపని పూర్తయ్యాక మనింటికి పిలుస్తాను’’.
‘‘ఇంతకూ ఎప్పుడూ షష్టిపూర్తి సభ.’’
‘‘ఇంకో పదిహేనురోజులుందిలే. మనిద్దరం వెళదాం.’’
శారద హాస్పిటల్‌కి వెళ్ళాలంటూ లేచింది.
‘‘ఫలహారం తిని వెళ్ళు. మళ్ళీ ఎప్పుడొస్తావో’’ అంటూ సుబ్బమ్మ లేచింది.
ఇద్దరి మనసులూ తేలికపడ్డాయి. సుబ్బమ్మ నీరసం, రక్తపోటు ఎటు పోయాయో గానీ ఎక్కడలేని ఉత్సాహంతో తిరుగుతోంది.
హరి సర్వోత్తమరావు గారి షష్టిపూర్తి ఉత్సవం చాలా బాగా జరిగింది. పాతూరి నాగభూషణం చొరవ, శారదాంబ వంటి కొందరి సహాయంతో ఒక ఆంధ్రుడిని, తెలుగు జాతి గర్వించదగిన ఒక యోధుడిని ఆలోచనాపరుడిని జాతి సన్మానించుకోగలిగింది, గౌరవించుకోగలిగింది.
సన్మానం అయిన తర్వాత శారద ఆయనను తమ ఇంటికి తీసుకొచ్చి సంబరంగా నలుగురినీ పిలిచి విందు చేసింది. హరిగారికి శారదంటే పుత్రికా వాత్సల్యం. తన స్నేహితుడి కూతురు ఇంత ఎదిగి అటు రాజకీయాలలో ఇటు వైద్య వృత్తిలో రాణిస్తున్నదంటే ఆయన పొంగిపోయాడు. వినటం వేరు. కళ్ళారా చూడటం వేరు.
‘‘మీ నాన్న ఉంటే ఎంత గర్వపడేవాడో’’
‘‘మీరు సంతోషంగా ఉన్నారుగా బాబాయ్. నాన్న ఉన్నట్టే ఉంది నాకు. మళ్ళీ మీ దగ్గర వెల్లూరు జైలు కబుర్లు చెప్పించుకోవాలని ఉంది. చిన్నప్పుడు అవి చెప్పేవరకూ మిమ్మల్ని పీడిరచేదాన్ని కదా…’’
‘‘నేనూ ఇష్టంగానే చెప్పేవాడిని. ఇప్పుడలా అడిగేవాళ్ళు లేక అన్నీ మర్చిపోయాను.’’
‘‘అన్నీ రాయండి బాబాయ్. పుస్తకాల కోసం గ్రంథాలయ ఉద్యమం నడుపుతున్నారు. మీ అనుభవాలు పుస్తకంగా రాయరా?’’
‘‘నేనంత గొప్పవాడినా? నా జీవితం గురించి ఏముంది రాయటానికి’’ నిరాడంబరంగా, నిజాయితీగా నవ్వాడాయన.
‘‘మీ జైలు జీవితం గురించి రాయండి. తర్వాతి తరాలకు తెలియొద్దా? అది వింటుంటే నాకు దుఃఖం వచ్చేది. వీర రసం
ఉప్పొంగేది. బ్రిటిష్‌వాళ్ళ మీద కోపంతో రగిలిపోయేదాన్ని. అదంతా మా పిల్లలకు తెలియొద్దా?’’
‘‘పిల్లలంటున్నావు…’’ అర్ధవంతంగా చూశాడాయన.
‘‘మీరూ, ద్వారకా ఇక్కడికొచ్చి ఉండిపొండి బాబాయ్’’ అన్న మాటలకు నవ్వి ఊరుకున్నారు. అప్పటిదాకా వీళ్ళ మాటలను మౌనంగా వింటున్న సుబ్బమ్మ
‘‘మీరు చినతాతగారు కాబోతున్నారు’’ అని నవ్వింది. హరిగారు శారద తలమీద చేయి వేసి నిమిరి లోలోపలే ఆశీర్వదించారు.
‘‘సంతోషం తల్లీ. బెజవాడ వచ్చినందుకు శుభవార్త విన్నాను. రామారావు ఒకటే గుర్తొస్తున్నాడు. శారదమ్మకు పుట్టే బిడ్డను నెత్తిన పెట్టుకు మోసేవాడు. నాకు ఆప్తమిత్రుడు, నా ప్రాణమైన నా భార్యా ఇద్దర్నీ కోల్పోయిన దురదృష్టవంతుడిని’’ అందరూ కన్నీరు పెట్టుకున్నారు.
కనీసం నాలుగు రోజులుండి వెళ్ళమన్నా ఆయన వెంటనే ప్రయాణం అయ్యారు.
కూతురు ద్వారకకు బట్టలు, పళ్ళు, పిండి వంటలూ అన్నీ సిద్ధం చేయించి ఉంచింది సుబ్బమ్మ.
‘‘మద్రాసు వస్తే మా ఇంటికి వచ్చి మీ చెల్లిని చూడమ్మా’’ అంటూ ఆయన తల్లీ కూతుళ్ళ దగ్గర శలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
పద్మ చక్కని ఆడపిల్లను కన్నది. లావణ్య అని పేరు పెట్టాడు సత్యం.
… … …
తొమ్మిదో నెలలో కూడా శారద తన పనులు ఏ మాత్రం తగ్గించుకోలేదు. తల్లి విశ్రాంతి తీసుకోమంటే ‘‘తిని కూచుంటే కాన్పు కష్టమవుతుంది. హాయిగా పనులన్నీ చేసుకోండని నేనందరికీ చెబుతాను. నేను తిని కూచుంటే నా మాటలెవరు నమ్ముతారమ్మా. నేను వ్యాయామం చేస్తున్నా, పనులు చేస్తున్నా…ఎంత తేలిగ్గా పురుడు పోసుకుంటానో చూడు’’ అని తల్లి మాటలను కొట్టేసేది. ‘‘ఏమో తల్లీ. నీ పుటక గుర్తొస్తే నాకిప్పటికీ ముచ్చెమటలు పడతాయి. ఆ కుగ్లర్ ఆసుపత్రిలో నేనూ, డాక్టర్లు ఎంత కష్టపడ్డామో చెప్పలేను’’.
‘‘నిన్ను నాన్న, నాన్నమ్మ బాగా గారం పెట్టి ఉంటారు. ఇటు పుల్ల తీసి అటు పెట్టి ఉండవు. ఆ బద్ధకం నీ కడుపులో ఉన్న నాకూ అంటుకుని బైటికి రావటానికి బద్ధకించి సోమరిగా ఉండుంటాను. నా బిడ్డ చూడు ఎంత చురుగ్గా నీ చేతుల్లోకి వస్తుందో.’’
శారద చెప్పినట్లే ఒక శుక్రవారం ఉదయాన్నే శారద తనొక్కతే హాస్పిటల్‌కు వెళ్ళింది. గంట లోపలే నర్సు వచ్చింది డాక్టరమ్మ గారు ఆడపిల్లను కన్నారనే కబురుతో. సుబ్బమ్మకు కాళ్ళూ, చేతులూ ఆడలేదు. మేనగోడలు పద్మ ఆమెను పట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్ళి బిడ్డను చేతిలో పెడితే ఆమె కళ్ళనిండా నీళ్ళు.
‘‘నిన్నెత్తుకున్నట్టే ఉందే శారదా’’ అని ఏడ్చేసింది.
తండ్రి కోసం అమ్మ ప్రాణం కొట్టుకుంటోందని గ్రహించింది శారద. శారదకూ దుఃఖం వచ్చింది.
ఇద్దరూ నవ్వూ, ఏడుపూ కలగలిసిన అనుభూతిలో ఉక్కిరి బిక్కిరయ్యారు.
మూర్తి వచ్చేసరికి సుబ్బమ్మ, మిగిలినవాళ్ళు బైటికి నడిచారు.
‘‘మొత్తానికి నీలాంటి అమ్మాయినే ఇచ్చావు’’ అని నుదుటి మీద ముద్దు పెట్టాడు మూర్తి.
‘‘నేనివ్వటమేంటి? నువ్వే ఇచ్చావు. మగవాళ్ళ వీర్యకణాలవల్లే పుట్టే బిడ్డ ఆడా మగా అనేది ఆధారపడుతుంది. సో…థాంక్స్. మా అమ్మ కోరిక తీర్చావు. నాకెవరైనా ఒకటే.’’
‘‘అబ్బా… నువ్వు ఏ మిస్టరీని అలా అందంగా ఉండనివ్వవుగదా.’’
‘‘మిస్టరీ అంటేనే అది ఎప్పుడో ఒకప్పుడు విడిపోతుందని అర్థం. మిస్టరీలను విడగొట్టి తెలుసుకోవటమే మానవుల పని. అదే అందం. అదే ఆనందం.’’
‘‘అలసటగా లేదూ?’’
‘‘కొంచెం… కాసేపు నిద్రపోతా…’’
మూర్తి కూడా బైటికి వెళ్ళాక కళ్ళు మూసుకుని పడుకుంది శారద.
శారద మూడోరోజే ఇంటికొచ్చింది. ఐదవరోజుకి కబురొచ్చింది కాశీలో నరసమ్మ గారు కీర్తిశేషులయ్యారని.
సుబ్బమ్మ కన్నీరు మున్నీరయింది.
శారద పదేళ్ళ పిల్లగా ఉన్నప్పుడు అందర్నీ వదిలి కాశీ వెళ్ళినామె మళ్ళీ రాలేదు. కొడుకు చనిపోయాడనే వార్తకూ చలించలేదు. అప్పటినుంచీ ఉత్తరాలూ తగ్గాయి. కాశీలో వాళ్ళే అయినవాళ్ళయ్యారు. అన్ని కర్మలూ చేయించారు. మనవరాలిని చూస్తూ ‘‘మీ నాయనమ్మ పేరు పెట్టుకుందామే’’ అంది.
శారదకు నాయనమ్మ చిన్నతనపు జ్ఞాపకం. ఆమె పంతం గురించి తప్ప మిగిలినవి అంతగా గుర్తులేవు. తన విషయంలో పేచీ పడి అందరికీ దూరమైందనేది రాను రానూ శారదకు ముల్లులా గుచ్చుకునేది. ఆ విషయం మర్చిపోటానికి ప్రయత్నించేది. ఆమె పేరు పెట్టాలనే ఉత్సాహం శారదకు లేదు.
‘‘చూద్దాం లేమ్మా’’ అంది ముభావంగా.
పాప పేరు గురించి మూర్తీ, శారదా చాలా రోజుల నుంచే మాట్లాడుకుంటున్నారు. నిర్ణయించుకున్నారు. మగపిల్లవాడయితే ‘రామారావు’ తప్ప మరో పేరు అని ఎవరూ అనుకోలేదు. ఆడపిల్ల అయితే… మూర్తి ఏవేవో అందమైన పేర్లు చెబుతుంటే శారద ఒకరోజు అంది.
‘‘మూర్తీ మనిద్దరం కలిసి చదివి, కలిసి నవ్వి, కలిసి ఏడ్చి సాహిత్యానుభూతిని పొందిన పుస్తకం నీకు గుర్తుందా?’’
‘‘ఎందుకు లేదు? టాల్‌స్టాయ్ ‘‘యుద్ధము`శాంతి’’
‘‘మరి మన పాపకు ఆ పేరు పెడితే బాగుండదూ?’’
‘‘ఏమని? శాంతి అనా?’’
‘‘కాదు. ఆ పుస్తకంలో మనిద్దరం ఇష్టపడి ప్రేమించి తపించిన పాత్ర పేరు మన పాపకు పెట్టుకుందామోయ్’’
‘‘నటాషా నా?’’
‘‘ఊ! నటాషా. ఎంత బాగుంది కదా’’
‘‘బాగుంది. కానీ మన పేరు కాదుగా’’
‘‘ఇంకా మన పేరేమిటోయ్. ప్రపంచమంతా ఒక్కటే కావాలని కాదూ మన కల. మన కలల ప్రతిరూపం కదూ మనకు పుట్టబోయే బిడ్డ.’’
మూర్తి ఇక మాట్లాడటానికేముంది? ఆడపిల్ల పుడితే నటాషా అని పేరు పెట్టాలనుకున్నారు.
తల్లి మనవరాలితో ఆడుకుంటూ ఆనందంగా ఉన్న సమయం చూసి శారద నటాషా పేరు, ఎందుకా పేరు పెట్టాలనుకుందీ వివరంగా చెప్పింది.
‘‘సరేలే, కాలం మారింది. అవతారం ఎత్తింది. నరసమ్మ నటాషా అవ్వదా? నటాషా.. బాగుంది. నా చిట్టితల్లికి కొత్త పేరు. నటాషా. నరసమ్మా… నరసమ్మా! నటాషాగా పుట్టావా?’’ అంటూ నవ్వుతూ ముద్దులాడిరది.
పదకొండోరోజు నుంచీ శారద మళ్ళీ తన పనుల్లో పడిరది. నటాషా అమ్మమ్మ ఒళ్ళో, గుండెల మీదా హాయిగా ఆడుకుంటుంది. రాత్రిళ్ళు అమ్మ గుండెలకు హత్తుకుని నిద్రపోతోంది. లావణ్య, నటాషాలతో సుబ్బమ్మ మరిక ఏ పని చేయటానికీ సమయం లేదు. అంతా పద్మే నిర్వహిస్తోంది. చూడటానికి సుకుమారంగా ఉండే పద్మ మానసికంగా ధృడమైనది. గంభీరంగా కనిపించే సూర్యం మనసు మెత్తనిది.
… … …
ఆంధ్ర ప్రాంత నాయకుల సమావేశం గంభీరంగా జరుగుతోంది.
‘‘యుద్ధం గురించి మాట్లాడుతున్నాం. ప్రజా యుద్ధమని బలపరుస్తున్నాం. కానీ యుద్ధం అంటే నాశనం. నిర్మాణం కాదు. ఏదో ఒక నిర్మాణం చెయ్యకుండా ప్రజా నాశనాన్ని పట్టుకు కూచోటం సరికాదు. రైతులు నీళ్ళు లేక పంటలు పండక చచ్చిపోతున్నారు. కాలవలన్నీ పూడిక పట్టిపోయాయి. వాళ్ళకు ఒట్టి ఉపన్యాసాలు తప్ప ఏమీ ఇవ్వలేమా?’’ శారద ఆవేదనగా అన్నది.
‘‘ఏం చెయ్యగలం? బందరు కాలవ పూడిపోయి రైతులకు నీళ్ళందటం లేదు. ప్రభుత్వాన్ని అడిగాం. అడిగితే కూలీలు దొరకటం లేదు, ఐనా ఇప్పుడది ముఖ్యం కాదు అన్నారు. యుద్ధం రోజుల్లో ఆహారానికి కరువుండకూడదంటారు. పంటల గురించి పట్టించుకోరు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏమీ చెయ్యకూడదు కాబట్టి ఆందోళన కూడా చెయ్యం. ఇక నిర్మాణ కార్యక్రమం ఏం చేస్తాం’’ వెంకట్రావు నిస్పృహగా మాట్లాడాడు. కాసేపు అందరూ మౌనంగా ఉన్నారు. పది నిమిషాలు అలాగే గడిచాయి. రామకృష్ణయ్య మెల్లిగా అయినా ధృడంగా అన్నాడు.
‘‘నిర్మాణమే చేద్దాం. బందరు కాలవ పూడిక మనమే తీస్తే’’ అందరి కనుబొమలూ పైకి లేచాయి శారదది తప్ప.
‘‘అద్భుతం. నిజంగా అద్భుతం. మనం ఆ పని చేద్దాం’’ అంది విప్పారిన ముఖంతో.
‘‘మనమా? ఎలా?’’
‘‘కూలి పనులు చేద్దామా?’’
‘‘మనమంటే ఎవరం. ఇక్కడ కూచున్న పదిహేను మందా?’’
‘‘డాక్టరు గారూ మీరు పార పట్టుకుంటారా?’’
ప్రశ్నలు, నవ్వులు, వ్యంగ్య బాణాలూ శరపరంపరగా కురిసిన తర్వాత శారద అంది.
‘‘అందరం కలిసి చేద్దాం. మనం పదిహేనుమందిమి కాదు. రైతు సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం అందరం కలిస్తే ఎంతసేపు… చెయ్యగలం. ఎంత పొడవుంటుంది పూడిక.’’
‘‘బెజవాడ ఆనకట్ట నుంచి యనమలకుదురు దాకా నన్నా తియ్యాలనుకుంటాను. కనీసం నాలుగైదు మైళ్ళుంటుంది’’ సుబ్బారావు గారికి బందరు కాలువ పుట్టు పూర్వోత్తరాలన్నీ బాగా తెలుసు.
‘‘ప్రజా సంఘాలన్నీ కలిసి పనిచేస్తే మరీ అసాధ్యం కాదనుకుంటా’’
‘‘రైతులకు మేలు జరుగుతుందంటే అందరూ వస్తారు’’
‘‘ప్రభుత్వం చెయ్యాల్సిన పని మనమెందుకు చెయ్యాలి?’’
‘‘ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? చెయ్యనిస్తుందా?’’
‘‘యుద్ధం రోజుల్లో ఉత్పత్తిని పెంచే ఏ పనినీ ప్రభుత్వం అడ్డుకోదు. ప్రభుత్వం చెయ్యని పని మనం ప్రజల కోసం చేస్తున్నాం గనుక ప్రజలలో మనమీద సానుభూతి కలుగుతుంది. ప్రజాయుద్థం అంటున్నామని మనమీద కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత తగ్గుతుంది.’’
‘‘ఒట్టి కబుర్లు కాదు కమ్యూనిస్టులు గట్టిగా పనిచేసి చూపిస్తారనే నమ్మకం కలుగుతుంది.’’
అందరిలో ఏదో తెలియని ఉత్సాహం కమ్ముకుంటోంది. నిర్ణయాలు వేగంగా జరిగిపోతున్నాయి. ప్రజా సంఘాల బాధ్యులకు ఉత్తర్వులు చేరుతున్నాయి. అందరిలో ఒక సంచలనం.
‘‘బందరు కాలువ పూడిక తీస్తారంట’’ మండుటెండలే మోసుకెళ్తున్నాయి ఆ వార్తను.
యువకులు, యువతులు మాత్రమే రావటం లేదు. పార్టీ ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చి చేరుతున్నారు. కాలవలో వారి స్వేదజలం ప్రవహించి పంటలు పండేలా ఉన్నాయి.
శారద, రామకృష్ణయ్య, మెల్లీ వంటి పెద్ద నాయకులు కూడా తట్టలతో మట్టి మొయ్యటం చూసిన సామాన్యుల ఉత్సాహానికి అంతు లేదు. జన సంద్రం ముందు కాలువ వినయంగా వంగింది. లొంగింది. కుంగింది. ప్రతిరోజూ పనిచేసే వారికి మధ్యాహ్నం కడుపునిండా భోజనం తప్ప డబ్బేమీ ఇచ్చే పరిస్థితి లేదు.
భోజనానిని కరువు లేదు. పాటలు, నవ్వులు, దుఃఖాలు, దెబ్బలు, గాయాలూ అన్నీ మట్టిలోనే…
మహిళా సంఘంలోని ఆడవాళ్ళకు అది అలవాటు లేని పని. అయినా డాక్టరు గారు చేస్తుంటే మనం చెయ్యలేమా? ఐనా ఈ పని ఎవరిది? మనది. కోటేశ్వరమ్మ, రాజమ్మ పాటలు ఎత్తుకున్నారంటే కృష్ణానదే తుళ్ళిపడేది. అందరి గొంతులూ కలిస్తే ఆకాశం కిందికి దిగాలని చూసేది. ఈ పని చేసే
వాళ్ళు చేస్తుంటే చూసేవాళ్ళు ప్రవాహంలా వచ్చి పోతుండేవాళ్ళు. ఇంతపని స్వచ్ఛందంగా జరగటం వాళ్ళు ఇంతకు ముందెన్నడూ చూడలేదు. శ్రమదానం ఇంత పెద్ద ఎత్తున జరగటమూ చూడలేదు. సమూహంగా, సమిష్టిగా పనిచెయ్యటంలో ఎంత ఆనందముంటుందో వాళ్ళకు తెలియదు. ఇప్పుడు జరుగుతున్నది ఏదో స్వప్నంగా ఉంది వాళ్ళకు. కానీ అది యదార్థం.
రెండు నెలల పాటు అందరూ పనిచేస్తే కాలవ జల ప్రవాహ యోగ్యమైంది. వానలు కురిస్తే చాలు, కృష్ణమ్మ కాస్త నాలుగు బారలు సాగితే చాలు కాలవ నిండుగా ప్రవహిస్తుంది. అవతల పంట పొలాలకు ఈ వార్త చేరి అదునుకు పదునెక్కి నిరీక్షిస్తున్నాయి.
‘‘కమ్యూనిస్టులంటే ఇదా’’ అనుకున్నారు కొందరు.
‘‘కమ్యూనిస్టులంటే ఇదిరా’’ అనుకున్నారు మరికొందరు.
ఈ రెండు నెలల కాలం ఆ పనిచేసిన వారి జీవితాల్లో మర్చిపోలేనిదయింది. దేశంలో కాలవలన్నీ బాగుచేద్దాం. కొత్త కాలవలు తవ్వుదాం. నీటి కొరత లేకుండా చేద్దాం అనిపించింది అందరికీ.
అందరి కోసం పనిచెయ్యటంలోని ఆనందం, గర్వం, త్యాగ భావనలతో మనసులు నిండి కష్టమన్నదే తెలియలేదు.
‘‘నువ్వు కూడా రావోయ్’’ అని అన్నపూర్ణకు కబురంపింది శారద.
‘‘రాలేను. యుద్ధ కాలంలో ప్రభుత్వానికి సహకరించటం నాకు సమ్మతం కాదు. మీరు చేస్తున్న పని మంచిదే. కానీ చేస్తున్న సమయం, సందర్భం మాత్రం మంచివి కావు. నేనెంత మాత్రం ఈ పనిలో కలిసి రాను’’ అని సమాధానం పంపింది అన్నపూర్ణ. శారద నవ్వుకుంది. రైతులకు సహాయం చెయ్యటానికి, పంట పండిరచేందుకు సమయానికి నీరివ్వటం కంటే మంచి సమయం ఏముంటుంది? కానీ రాజకీయాలు ఒకే సమయాన్ని ఎట్లా మార్చేస్తాయో గదా అనుకుంది. అన్నపూర్ణ దేశం కోసమే కాలువ తవ్వే పని నుంచి దూరంగా ఉంది. తనూ దేశం కోసమే కాలువ తవ్వే పనిలో మునిగిపోయింది. ఇద్దరం సమాంతర రేఖల్లా ప్రయాణిస్తున్నాం. గమ్యం ఒకటే… దేశ స్వాతంత్య్రం. అక్కడ కలుస్తాం. సమాంతర రేఖలన్నీ కలిసే చోటు దేశ స్వాతంత్య్రం. అన్నపూర్ణకు కాలువ తవ్వే దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లు రాసిన ఉత్తరాల్లో ఈ వాక్యాలూ రాసింది శారద.
కృష్ణాజిల్లాలో మొదలైన ఈ పూడిక తీసే పని గోదావరి జిల్లాకూ పాకింది. అక్కడి కార్యకర్తలు బ్యాంకు కాలవ పూడిక తీశారు.
కృష్ణాజిల్లా కాటూరులో మహిళా సంఘం మహాసభ తలపెట్టినప్పటి నుంచీ శారదకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా దొరకకుండా ఉంది. కాటూరు కమ్యూనిస్టు గ్రామంగా అప్పటికే ప్రసిద్ధి పొందింది. అక్కడ మహిళా సంఘం సభలు జరిపితే ఎక్కడా ఏ ఆటంకమూ రాదు. ఆ ఊరి ప్రజలే కాదు యిరుగు పొరుగు గ్రామాల ప్రజలు కూడా సహకరిస్తారు.
శారద, మెల్లీ, సూర్యావతి రాష్ట్ర నాయకులతో కలిసి కార్యక్రమమంతా నిర్ణయిస్తున్నారు. కావలసినవి చెబితే ఏర్పాట్లు చేసే యువ కార్యకర్తలకు లోటు లేదు.
ఆ రోజు శారదకు తమ్ముడి వరసయ్యే లక్ష్మీపతి నుంచి ఫోన్ వచ్చింది.
‘‘మీ సభలకు సరోజినీ నాయుడి గారిని ఆహ్వానించకూడదూ?’’ అంటూ
‘‘ఎందుకు కూడదోయ్. ఆహ్వానించాలనే ఉంది గానీ ఎలా చెప్పు. ఆవిడ నాకంటే పెద్దావిడ. నువ్వు ఫోన్ చేసినట్లు ఆవిడకు ఫోన్ చేసి మా సభలకు కాటూరు రండి అని చెప్పలేను గదా! ఆవిడ ఎప్పుడు ఎక్కడుంటారో కూడా తెలియదు, వెళ్ళి పిలుద్దామంటే. పోనీ మా తరఫున నువ్వు ఆహ్వానించరాదుటోయ్, ఖర్చులన్నీ ఇస్తాం’’.
‘‘కాదక్కా… నువ్వే ఆహ్వానించు. ఆవిడ రేపు రాత్రి విజయవాడలో అరగంట ఆగుతారు రైలు స్టేషన్‌లో. విశాఖ నుంచి సికింద్రాబాదు వెళ్తున్నారు. నువ్వు వెళ్ళి కలిసి ఆహ్వానించు. నువ్వంటే ఆవిడకు చాలా ఇష్టం. వాళ్ళ తమ్ముడు హరీన్ చెప్పాడట నీ గురించి. చాలా గౌరవంగా మాట్లాడిరది నీ గురించి. నువ్వే వెళ్ళి అడిగితే కాదనరు’’.
‘‘మంచి మాట చెప్పావోయ్. ఈసారి మనింటికి వచ్చినపుడు నీకేం కావాలో అడుగు ఇస్తాను. రేపు రాత్రి ఆవిడను కలుసుకుంటానోయ్’’.
శారద ఫోన్ పెట్టి పార్టీ ఆఫీసుకు వెళ్ళింది. అక్కడి నుంచి బెజవాడలో మహిళా సంఘంలో సభ్యులందరికీ కబురు వెళ్ళింది మర్నాడు రాత్రి రైలు స్టేషన్‌కి రావాలని. కొందరు ఊళ్ళో లేని వాళ్ళు తప్ప దాదాపు ముఖ్యులందరూ పాతికమంది దాకా వచ్చారు. అందరిలో ఉత్సాహం ఉరకలేస్తోంది.
ఉప్పు సత్యాగ్రహంలో స్త్రీలు కాస్త వెనక్కు తగ్గండి అని గాంధీ అంటే వెంటనే ఆ మాటను ధిక్కరించి వెళ్ళి మొదటి దళం సత్యాగ్రహుల్లో ముందు నిలబడిన సరోజినీ దేవి అంటే ఇష్టం లేనిదెవరికీ. గాంధీతో సహా ఎవరితోనైనా పరిహాసమాడగల చొరవ, సమయస్ఫూర్తీ, తన ఉపన్యాసాలతో జనాలను తట్టి లేపగల శక్తి, సున్నితమైన కవి హృదయం, త్యాగబుద్థీ… సరోజినీ నాయుడు గురించి వినని వారెవరూ లేరు ఆ మహిళా సంఘంలో.
‘‘ఆమె రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ, తన మేనత్త శారదాంబల వలే ఈ దేశంలో ఎన్నదగిన స్త్రీ. నాన్న ఆమెను చూశాడా? విన్నాడా? తెలియదు. తమ మధ్య ఆమె గురించి మాటలు జరగలేదా? తను మర్చిపోయిందా? ఇప్పుడు నాన్న ఉంటే నన్ను చూసి సంతోషించేవాడా? డాక్టరుగా, కమ్యూనిస్టుగా నాన్న కల, తన కల కూడా నిజం చేసుకున్న తనను చూసి సంతోషించేవాడు. తండ్రి గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి. తండ్రితో పాటు రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మా గుర్తొచ్చింది. ఆవిడే తన భవిష్యత్తుకు అక్షరాభ్యాసం చేసింది. వీరేశలింగం తాతయ్య మాట తీసుకున్నాడు డాక్టర్ కావాలని.’’ ఇవాళ అందరూ ఎందుకు గుర్తొస్తున్నారు. తన పక్కన ఇంతమంది ఆడవాళ్ళున్నారు. కాటూరులో వేలమంది వస్తారు. ఒక్కతే ప్రయాణం ప్రారంభించింది. సమూహంలో కలిసింది.
కోటేశ్వరమ్మ, సత్యవతి, రాజమ్మ వంటి వాళ్ళంతా సరోజినీ నాయుడిని కలుస్తామనే సంతోషంతో తలమునకలవుతున్నారు.
రైలు వచ్చింది.
కంపార్టుమెంటులోకి అందరూ ఎక్కారు.
శారద వెళ్ళి సరోజినీ దేవికి నమస్కారం చేసి తనను తాను పరిచయం చేసుకుంది నవ్వుతూ.
సరోజినీదేవి ఆనందంగా శారదను ఆలింగనం చేసుకుంది.
‘‘హరీన్ చెప్పాడు నీ గురించి. నీలాంటి వాళ్ళే కావాలి దేశానికి. వీళ్ళంతా మహిళా సంఘం సభ్యులా’’ అందరినీ ఆప్యాయంగా పలకరించింది. సమయం ఎక్కువ లేదు. వచ్చిన పని చెప్పింది శారద.
‘‘తప్పకుండా వస్తాను. మంచి అవకాశం. ఒదులుకుంటానా? నేనొక వారం రోజులు హైదరాబాద్‌లో ఉంటాను. రెండు రోజులాగి ఫోన్ చెయ్యి. ఏం లేదు. మర్చిపోతానేమోనని’’.
ఇద్దరూ దేశంలో మహిళా ఉద్యమం చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకుంటుండగానే సమయం లేదని గార్డు వచ్చి అందరినీ దిగమన్నాడు. శారద ఆమెకు నమస్కరించింది.
అందరూ కోలాహలంగా మాట్లాడుకుంటూ స్టేషన్ బయటకు వచ్చారు. శారద అందరూ జాగ్రత్తగా ఇళ్ళకు వెళ్ళేలా జట్లుగా వారిని పంపి తను కూడా ఇంటికి చేరింది.
అందరూ నిద్రపోతున్నారు. నటాషా నిద్రలో నవ్వుతోంది. పాపను మెల్లిగా ముద్దు పెట్టుకుంది.
ఇప్పుడిక నిద్ర రాదు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం గురించి తను రాస్తున్న పుస్తకం తీసింది.
ఈ పుస్తకం రాస్తున్నానని తెలిస్తే నాన్న ఎంత సంతోషించేవాడో. తగిన సమయం దొరకటం లేదు. త్వరగా పూర్తి చేయాలి. ప్రజల్లో ఎన్ని మూఢనమ్మకాలు. వాళ్ళ శరీరాల గురించి వాళ్ళకేమాత్రం తెలియదు. శరీరం మీదా, మనసు మీదా అధికారం సంపాదించినపుడే మనకో వ్యక్తిత్వం వస్తుంది. అది స్త్రీలు సాధించాలనే ఈ పుస్తకం రాస్తోంది తను.
పది నిమిషాల్లో రాతలో మునిగిపోయింది. రెండు గంటలపాటు రాసి తృప్తిగా కలం మూసి వచ్చి పాప పక్కన పడుకుని నిద్రపోయింది. శారదనూ, మహిళా సంఘ సభ్యులనూ నిరాశలో ముంచే వార్త మూడో రోజుకే చేరింది.
ఆ రోజు శారద ఉదయాన్నే సరోజినీ నాయుడికి ఫోన్ చేసింది. ఫోన్ ఎవరు ఎత్తారో కూడా చెప్పకుండా శారద పేరు వినగానే ‘‘సరోజినీదేవి గారి రెండో అబ్బాయి నిన్న మరణించాడు. ఆవిడ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు’’ అని చెప్పి ఫోన్ పెట్టేశారు.
శారద మనసు ఆ తల్లి కోసం కొట్టుకుంది. వెళ్ళి చూడాలనిపించింది గానీ కాటూరు సభ వారంలోకి వచ్చింది. పనులు, పనులు, పనులు. మెల్లీతో ఈ విషయం చెప్పి, మహిళా సంఘం ఆఫీసుకు కబురు చేసి ఆస్పత్రికి వెళ్ళింది.
కాటూరు మహిళా రాజ్యమా అన్నట్లుంది. ఎక్కడెక్కడినుంచో వచ్చారు స్త్రీలు. ఎన్ని ఆశలో. ఎంత సంబరమో. ఎంత ఆకలో జ్ఞానం కోసం. నాయకులు చెప్పే మాటలు విన్నారు ఒళ్ళంతా చెవులు చేసుకుని. శారద ఉపన్యాసాన్ని తాగేశారు. పాటలు పాడారు. బుర్ర కథలు చెప్పారు. నాటకాలు వేశారు. దేశ స్వ్రాతంత్య్రం కోసం, రైతు విముక్తి, మహిళల హక్కులు సాధిస్తామని ప్రతిజ్ఞలు చేశారు.
శారద స్త్రీలను ప్రత్యేకంగా సమావేశపరచి ఆరోగ్యం, శరీరం గురించి మాట్లాడిరది.
‘‘మగవాళ్ళందరూ రాజకీయాలు మాట్లాడుతుంటే మనం ఈ విషయాల గురించి మాట్లాడటమేమిటని అనుకుంటున్నారా?
గురజాడ ఏమన్నాడు ‘తిండి కలిగితే కండ కలదోయ్, కండ గల వాడేను మనిషోయ్’ అన్నాడా? ఆయన మగవాళ్ళ గురించి చెప్పినట్లున్నా మనిషి అన్నాడు గదా… అంటే మనుషులకు తిండి, బలమైన శరీరం కావాలి. మనకు బలమైన శరీరాలు లేకపోవటమంటే రాజకీయాలు సరిగా నడవటం లేదని అర్థం. మనకు సరైన తిండి లేదంటే, ఉన్నా తెలియని అజ్ఞానంలో మనం తినటం లేదంటే ఆడవాళ్ళు బలహీనంగా ఉండాలని ఎవరో రాజకీయ కుట్ర చేస్తున్నారన్నమాట. మనం ఆరోగ్యంగా లేమంటే ఎవరో కావాలని మనల్ని అనారోగ్యంలో ఉంచే రాజకీయాలు నడుపుతున్నారన్నమాట. మన ఆరోగ్యం, శరీరం గురించి మాట్లాడటమంటే చిన్న విషయం కాదు. స్వతంత్రం పొందటమంత పెద్ద విషయం’’ ఒక్కొక్క విషయాన్నీ నవ్వుతూ నవ్విస్తూ చెప్పే శారద మాటలంటే ఆడవాళ్ళందరికీ ఎంత ఇష్టమో. చాలా శ్రద్దగా విన్నారు. మహాసభలయ్యేసరికి మరో కార్యక్రమం ఎదురు చూస్తూనే ఉంటుంది శారదను తనలోకి లాక్కోటానికి.