స్పర్శ… స్పర్శ… స్పర్శ…
స్పర్శ అంటే ఏమిటి? ఎలా ఉంటుంది?
ఎందుకీ స్పర్శ…?
ఒక దోర నవ్వు ఒక కన్నీటి చుక్కను కౌగిలించుకోవడమేనా స్పర్శంటే…!
గోగుపూల అంచుల్లోంచి జారుతున్న వెన్నెల జలపాతాన్ని
హృదయ పాత్రలోకి నింపడమేనా స్పర్శంటే…!
అర్థంలేని జీవితాన్ని పెనవేసుకున్న పరమార్థమేనా స్పర్శంటే…?
చీకటి క్షణాలన్నీ పురివిప్పిన పున్నమి ఘడియలై నర్తించడమే… స్పర్శంటే…!
కమ్మని కావ్యాన్ని చదివి అందులోని అర్థాన్ని అంతరార్థాన్ని
ఆస్వాదించడమేనా… స్పర్శంటే…
లాలన ఆప్యాయత అందించే ఆనంద చంద్రోదయాన్ని
అందుకోవడమే అంటారా… స్పర్శంటే…?
నాలో అడుగడుగునా అణువణువునా అదృశ్యంగా
దాక్కున్న నిన్ను తాకడం ఎలా? నీలాకాశాన్నుండి నీలాన్ని వడబోయగలనా?
అసంపూర్ణ జీవికి అద్భుత బ్రహ్మాండ భాండం అందుతుందా…?
ఎలా స్పర్శించగలను?
నాలోని ‘నేను’ నా ఎదుట ప్రత్యక్షమై గలగలా నవ్వింది.
నీలోని ‘నిన్ను’ ఎలా దూరం చేసుకోగలవు?
దూరం కాకుండా ఎలా దగ్గరై స్పృశించగలవు? మళ్ళీ మళ్ళీ పకపకా నవ్వింది
నాలోని ‘నన్ను’… ఎలా? నీవే ‘నేనైన’ ‘నన్ను’… ఎలా?
ఇంతకూ నేను ఓడిపోయానా? గెలిచానా…?!