‘‘ఇంతకంటే పాపం ఏముంటుం దమ్మా…’’ నోటిమీద వేలు వేసి అన్నది లోనికి వస్తోన్న యాదమ్మ.
ఏమైందన్నట్లు చూస్తున్న నాకేసి చూసి ‘‘మా బస్తీలో ఉన్నడులే అమ్మా… ఓ పశువు. ఆ మాట అంటే పశువులను తప్పు పట్టినట్టయితదేమో… అంతకంటే హీనం బతుకు… తూ… ఆని బతుకు చెడ… నిట్టనిలు నరికెయ్యాల. కండ్లకు ఆడిది తప్ప కన్నబిడ్డ కానరాక పాయె.
దాని బతుకు బుగ్గి జేసిండు. ఆని మొదలా రిపోను’’ నోటికొచ్చిన తిట్లు మొదలెట్టింది.
‘‘అసలు ఏమైంది యాదమ్మా.’’
‘‘ఏమున్నదమ్మ… ఆడపిల్లకు ఇల్లే కాపాడుతది అనుకుంటం కానీ ఏడిదమ్మా…?’’
సొంత ఇంట్లనే, సొంత తండ్రి కాడనే లేకపోతే ఇంకా ఎక్కడ ఉంటది?
తాగుబోతు సచ్చినోడు. ఆరు నెలల సంది చెరబడుతున్నాడట. పాపం బిడ్డ, ఎంత నరకం పడిరదో… యాతన పడిరదో… బడిలె కళ్ళు తిరిగి పడి పోయిందట. డాక్టరుని పిలిపిచ్చి చూపిచ్చిరంట. ఆ డాక్టరుసాబు ఈ పోరికి కడుపు అని చెప్పిండు. అప్పుడు నోరిప్పి నిజం చెప్పింది బిడ్డ. ఎవరికన్నా ఈ విషయం చెబితే చంపుతానని బెదిరిచ్చిన తండ్రికి బయపడి ఎవరికీ చెప్పలేదట.
తల్లి ఉంటేనన్న ఏమన్న మనసులో బాధ చెప్పుకుంటుండెనో ఏమో… ఆ తల్లి సచ్చి మూడేండ్లయె… తాగొచ్చి మొగడు తన్నిన తన్నులకే అది సచ్చిందట. తండ్రి, బిడ్డ ఉండేది. మేస్త్రీ పనికివోతడు, తప్పతాగి పంటడు అనుకుంటిమి గాని ఇట్ల బిడ్డతోనే… ఛీ ఛీ… పోలీసులు పట్కపోయిన్రు. ఇప్పుడు పట్కపోయిన్రు… పగుల తాగుంరి అని బస్తీలల్ల అమ్ముతరు. అటెన్క తప్పు చేసిన్రని ఠాణల నూకుతరు. ఇది తీరేనా ఈ సర్కారోళ్ళకు?’’ అంటూ విసురుగా లోపలికి పోయి చీపురు చాట అందుకుంది యాదమ్మ.
నిజమే ఆమె మాటల్లో వాస్తవమున్నది. ఆమె ఆవేశంలో అర్థమున్నది. ఒంటిని, ఇంటిని, కుటుంబ బంధాలను, సామాజిక బంధాలను, విలువలను పొట్టన పెట్టుకుంటున్న మద్యం వద్దని ముప్ఫై ఏళ్ళ క్రితమే మహిళలు యుద్ధం ప్రకటించారు. ఉద్యమం చేసి నిషేధం సాధించుకున్నారు. కానీ ఏమి లాభం?
మద్యంతోనో, మద్యం అమ్మకాలతోనో నడిచే ప్రభుత్వాలకు మహిళల ఆవేదన అర్థం చేసుకోలేని కరకు గుండెలాయె. పోరాడి తెచ్చుకున్న మద్య నిషేధ బిల్లుకు తూట్లు పొడిచారు. గల్లీ గల్లీకి దుకాణం తెరిచి పోలీసుల్ని పెట్టి మరీ అమ్మడం మొదలుపెట్టి సామాన్యుడి జేబు గుల్లచేసి గల్లాపెట్టె నింపుకుంటున్న వైనం మనసు ను మెలిపెడుతున్నది.
మద్యంతో మండిపోయే జీవితాలు, కుటుంబాల గురించి చిన్న పిల్లలకు
ఉన్న బుద్ధి జ్ఞానం ఏలికలకు లేకపోయే.. ఆ మధ్య ఒక ఊళ్ళో పిల్లలు తమ కుటుంబ రాబడి ఎంత? దేనికి ఖర్చు చేస్తున్నారు? అని చేసిన సర్వే గుర్తొచ్చింది.
తమ తల్లిదండ్రుల సంపాదనలో అధిక మొత్తం మద్యం కోసం, పొగాకు కోసం, అవి తెచ్చే రోగాల కోసం, గొడవల కోసం ఖర్చు చేయడాన్ని జీర్ణించుకోలేక పోయారు. వెంటనే తమ ఊళ్ళో ఏ రకమైన మద్యం అమ్మడానికి వీల్లేదని తీర్మానించారు. మద్యం దుకాణం ముందే తాము ఎట్లా అన్యాయం అయిపోతు న్నామో తెలుపుతూ వీథి నాటికలు వేశారు. ఎవరికి వారు తమ ఇంట్లో పెద్దలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు సంక్షేమం పేరుతో చిల్లర విదిలిస్తూ మరోవైపు చేతిలో ఉన్నదంతా ఊడ్చేసి ఖజానా నింపుకుంటున్న వారిని ఏమనాలి?
అది సంక్షేమం అంటే ఏమిటి?
అన్ని రకాల మద్యం దుకాణాలకు డోర్లు బార్లా తీసి జనాన్ని మత్తులో ముంచడమా?
ఏడాదికేడాది భారీగా మద్యం అమ్మకాలు చేయడమా?
పెరిగిన సేల్స్‌తో సెలబ్రేషన్ చేసుకోవడమా?
ప్రజల విచక్షణ, ప్రశ్నించే స్వభావాన్ని, చైతన్యాన్ని మద్యంతో మట్టు పెట్టడమా?
వికసించాల్సిన కుటుంబాన్ని, కుటుంబ బంధాల్ని, సామాజిక బంధాల్ని, విలువల్ని, మానవ వనరుల్ని బొంద పెట్టడమా?
మనని మనం, మన ఆడపిల్లల్ని మనం, కూలుతున్న మన కుటుంబ బంధాల్ని మనం, మన సామాజిక బంధాల్ని, విలువల్ని మనం కాపాడుకోవడం కోసం మళ్ళీ మద్య నిషేధం కోరుతూ పోరాటం చేయక తప్పదేమో…
ఆదాయం కోసం రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తూ జాతికి తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వా లపై ఉద్యమించక తప్పదేమో…
కనురెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వ ఆధ్వర్యంలోనే, జరుగుతున్న విధ్వం సంపై యుద్ధానికి ప్రజలతో పాటు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు కలసికట్టుగా సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చిందేమో…!