మహిళా పత్రిక అంటే వంటలు, ముగ్గులు, అలంకరణలు వీటితో పాటు కాసిన్ని కవితలు, కథలు అనే ఉద్దేశాలతో వనిత, మహిళ, మహిళా జ్యోతి వంటి పత్రికలు తెచ్చినా చదువుకున్న, ఉద్యోగినులు అయిన ఆధునిక మహిళలు ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి ఆశిస్తున్నారు, వాళ్ళ
అంతరం ఏమిటి అనేది తెరిచి చూపించిన స్త్రీల గుండె చప్పుడుగా వచ్చిన భూమిక తొలి సంచిక నుండి నేను చదువుతున్నాను. ఈ పత్రికలో రాస్తున్నాను.
భూమిక పత్రిక నిర్వహణలో ప్రత్యేకంగా నాకు నచ్చిన విషయం మనకి ముందు నడిచి వెళ్ళిపోయిన రచయిత్రులైన మల్లాది సుబ్బమ్మ, అబ్బూరి ఛాయాదేవి, మాలతీ చందూర్‌లను గౌరవిస్తూ ముఖచిత్రంతో బాటు రచనలు వేసి వెలువరించిన ప్రత్యేక సంచికలు. ఇదేవిధంగా ఈ పద్ధతి కొనసాగించాలని అభిలషిస్తున్నాను.
ప్రతి సంచికలో 1910 తర్వాత రాసిన రచయిత్రుల ఒక రచనను పునఃప్రచురణ చేస్తే ఈనాటి తరం వారికి అప్పట్లో అనేకానేక రాజకీయ, కౌటుంబిక, సామాజిక అడ్డంకుల మధ్య వారు ఏ విధంగా రచనలు చేశారనేది అవగాహన అవుతుంది. అవి ఈనాటి వాదాలను ప్రతిబింబించక పోవచ్చు, కానీ ఆనాటి సమాజం తీరుతెన్నులు తెలియజేస్తాయి కదా.
ఈ విషయంలో నాకు చేతనైన సహకారం అందించగలనని కూడా తెలియజేస్తున్నాను.
భూమిక మూడు దశాబ్దాల పాటు ఏ ఒక్క నెలా ఆగకుండా చేస్తున్న ఈ ప్రయాణంలో అవిరామ కృషిలో భాగస్వాములైన కొండవీటి సత్యవతితో పాటు నిర్వాహకులందరికీ హృదయపూర్వక అభినందనలు.
` శీలా సుభద్రాదేవి