The diary of a young girl – రమాదేవి చేలూరు

ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన గొప్ప డైరీలు ఇరవై దాకా ఉన్నాయని అంటారు. ఇందులో ఒకటి,”The diary of a young girl”.

పగలంతా కదలక మెదలక నిర్నిశబ్దంగా ఉండాలి. రాత్రి చీకటిలో పనిచేసుకోవాలి. ఇది డైరీలో ఒక వాక్యం… ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో రాసుకున్న డైరీ ఇది.
13 ఏళ్ళ ఒక అమ్మాయి రాసుకున్న డైరీ ఇది. ఇంత చిన్నపిల్ల అంత గొప్పగా ఎలా రాయగలిగింది! ఆ అమ్మాయికి వచ్చిన అంత పెద్ద కష్టమేమిటో కదా అనిపిస్తుంది. ఆమె పేరు ఆన్‌ ఫ్రాంక్‌. తన మాతృభాష డచ్చిలో రాసింది ఈ డైరీని. 1929 జూన్‌ 2న, జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌లో పుట్టింది. ఆ అమ్మాయిని ఆనా, ఆన్‌, ఆనీ అంటూ పిలిచేవారు.
నేపథ్య చరిత్రను పరిశీలిస్తే… జాత్యహంకారి హిట్లర్‌, ఆయన అనుచర గణం, రెండవ ప్రపంచ యుద్ధాన్ని 1939లో ఏకపక్షంగా ప్రకటించి, జర్మనీ చుట్టూ ఉన్న దేశాల్ని ఆక్రమిస్తూ, యూదుల్ని (జీవషం) కర్కశంగా కాలరాస్తున్న దుష్టకాలమది. యూదుల జాతి మంచి జాతి కాదని, వాళ్ళు స్వార్థపరులనీ, అభివృద్ధికి ఆటంకులని, జన్యురీత్యా అల్పులని, ఆర్యులే గొప్ప జాతి వాళ్ళని తప్పుడు నినాదాలతో, సిద్ధాంతాలతో యూదుల్ని, వాళ్ళ ఊర్లలో, వాళ్ళ ఇళ్ళల్లో, వాళ్ళ దేశాల్లో ఉండనీయక, వాళ్ళ పనుల్ని వాళ్ళు చేసుకోనీక, కాన్సంట్రేషన్‌ క్యాంపులకి తరలించేవారు నాజీలు.
నాజీ సైన్యం జర్మనీ చుట్టూ ఉన్న ఆరు దేశాల్ని ఆక్రమించి ఆయా దేశాల్లో ఉన్న యూదుల్ని ఏరి ఏరి, కాన్సంట్రేషన్‌ క్యాంపులకి తరలించి ప్రణాళిక ప్రకారం వాళ్ళకు గ్యాస్‌ ఇచ్చి కొందర్ని, తిండి పెట్టక కొందర్ని చంపాడు. ఇదీ బయట ప్రపంచానికి తెలీదు. యూదుల్ని తీసుకుపోయి, ఏదో ఉపాధి కల్పన చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. జర్మనీలో యూదుల పట్ల రేసిజం విలయతాండవం చేస్తూ నాజీల ఆగడాలు మితిమీరి పోయాయి.
ఆన్‌ ఫ్రాంక్‌కి అమ్మా, నాన్న, అక్క ఉండేవాళ్ళు. తండ్రి వ్యాపారవేత్త. జామ్ల ఊరకాయల వ్యాపారంలో దిట్ట. వాళ్ళది సంపన్న కుటుంబం.
జర్మనీలో నాజీలు, యూదుల పట్ల చేసే దౌష్ట్యాలు వికృతంగా, మరింత క్రూరంగా మారిన దుస్థితి చూసి ఆన్‌ ఫ్రాంక్‌ వాళ్ళ నాన్న తన కుటుంబాన్ని జర్మనీ నుంచి నెదర్లాండ్స్‌కి తరలించాడు. అప్పుడు ఆన్‌కి నాలుగేళ్ళ వయసు.
ఆమె తండ్రి జాతీయ, అంతర్జాతీయ వార్తలు వింటూ విశ్లేషణ చేసుకునేవారు. నాజీ సైన్యం నెదర్లాండ్స్‌ని ఆక్రమిస్తారు. అక్కడి యూదులు అయోమయంలో పడిపోతారు.
నాజీలు నెదర్లాండ్స్‌ను ఆక్రమిస్తే యూదుల్ని ఏరి, కుటుంబ సభ్యుల్ని విడదీసి, వేర్వేరు కాన్సంట్రేషన్‌ క్యాంపులని తరలించి చంపేస్తారని తెలుసుకుని కుటుంబాన్ని నాజీల కంటపడకుండా సురక్షిత స్థలంలో, రహస్య స్థావరంలో దాచాలని నిర్ణయించుకుంటాడు.
ఆన్‌ వాళ్ళకు, స్నేహితులకు వ్యాపార నిమిత్తం ఒక వేర్‌హౌస్‌ ఉండేది. ఆ ఇంటి క్రింది భాగంలో బిజినెస్‌ చేసుకుంటారు. పైన మూడు గదులుంటాయి. పుస్తకాల రాక్‌ తలుపు. చూడడానికి పుస్తకాల రాక్‌, దాన్ని నెడితే పైకి మెట్లు ఉంటాయి. అక్కడ రహస్యంగా దాక్కునే ఏర్పాటు చేశాడు. కింద వేర్‌హౌస్‌లో పనిచేసే వర్కర్లకు అనుమానం రాకుండా పగలంతా నిశ్శబ్దంగా ఉండాలి.
1942 జూన్‌ 14న డైరీ రాయటం మొదలు పెట్టిందామ్మాయి. పుట్టిన రోజు కానుకగా వచ్చిందీ డైరీ.
ఆనా ఫ్రాంక్‌ వాళ్ళు, కుటుంబ స్నేహితులు, ఆయన భార్య, కొడుకు పీటర్‌ కూడా వీళ్ళతో కలిసి ఉండేవాళ్ళు. ఆ సీక్రెట్‌ అనెక్స్‌లో చిన్న బ్యాగ్‌లో బట్టలు సర్దుకొని, ఇల్లు, సామాను వదిలేసి అక్కడికి వచ్చి ఉంటారందరూ.
పీటర్‌ పదహారేళ్ళ కుర్రాడు. చిన్ని పిల్లి కూనను చంకను పెట్టుకొని వచ్చుంటాడు. మొదట్లో ముభావంగా, బద్ధకంగా ఉండేవాడు. రాన్రానూ ఆనాకి స్నేహితుడవుతాడుడ. ఆనా ఫ్రాంక్‌ రహస్య జీవితానికి బట్టలతో పాటు పెన్సిల్‌, డైరీని కూడా వెంట తెచ్చుకొని ఉంటుంది.
వాళ్ళున్న రహస్య స్థావరాన్ని సీక్రెట్‌ అనెక్స్‌ అనేవాళ్ళు. ఆమె రోజూ వాళ్ళ పనుల్ని, ఇబ్బందుల్ని, సమస్యల్ని, కోపాల్ని, భావావేశాల్ని, గొడవల్ని, ఆందోళనల్ని, విసుగుని, ఏడుపుల్ని, భయాల్ని అన్నింటినీ ఎంతో ఓపిగ్గా డైరీలో రాసుకుంది.
వాళ్ళు పగలంతా కలుగులో ఎలుకల్లా నిశ్శబ్దంగా నక్కి ఉండాలి. రాత్రి వేర్‌హౌస్‌లోని వర్కర్లు ఇళ్ళకు వెళ్ళిపోయాక అప్పటినుంచి స్నానాలు, బట్టలు ఉతికి ఆరబెట్టుకోవడం, వంట, చిన్నగా మాట్లాడుకోవటం అన్నీ రాత్రిపూటేనని, రాత్రిపూట లైట్‌ వేసుకోకూడదని, అన్నీ కష్టమేనని డైరీలో రాసుకుందామె.
సమాజ జీవనం కోసం, మంచి ఆహారం కోసం, తాజా గాలి కోసం, వినోదం కోసం అందరూ ఎంతో మొహం వాచిపోయి, యాంత్రిక జీవితంతో విరక్తి చెంది, వాళ్ళల్లో వాళ్ళే అసహనంగా కీచులాడుకోవటాన్ని ఆ అమ్మాయి హృద్యంగా డైరీలో చిత్రించుకుంది.
వాళ్ళ అమ్మకి విసుగొచ్చి కూతుర్లను తిట్టేదని, కూతుర్లకు విసుగొచ్చి అమ్మానాన్నలని తిట్టేవాళ్ళని, అందరూ కలిసి యుద్ధాన్ని, హిట్లర్‌ని తిట్టేవాళ్ళని రాసుకుంది.
ఆన్‌ ఫ్రాంక్‌ వాళ్ళ అక్క మార్గరెట్‌. ఆమె మంచి ఉద్యోగం తెచ్చుకుని, తర్వాత పెళ్ళి చేసుకోవాలని కలలు కనేది. కలలు కల్లలైనందుకు ఎప్పుడూ విసుగ్గా ఉండేదని, ఏడ్చేదని, స్నేహితులు లేక, పని లేక, చదువు లేక పిచ్చిదానిలా కుంగిపోయేదని, తండ్రి ఆమెను బాగా ఓదార్చేవాడని ఆన్‌ ఫ్రాంక్‌ బాధతో రాసుకుంది.
యుద్ధం ఎప్పుడెప్పుడు ముగుస్తుందోనని అందరూ ఎదురు చూసేవాళ్ళు. రోజూ సాయంత్రం చిన్న శబ్దంతో రేడియోలో వార్తలు వినేవాళ్ళు. ఇక మంచి కాలం వస్తుంది, తిరిగి అందరూ ఇళ్ళకు చేరుకుంటామనే ఆశ అందరికీ ఉండేది. వీళ్ళు ఉంటున్న గదులపైకి మెట్లుండేవి, ఆ పైన అటక ఉండేది. అక్కడే చిన్ని వెంటిలేటర్‌ ఉండి, దాని నుంచి చూస్తే సిటీ కొంత కనిపించేది. పగలంతా నిశ్శబ్దంగా వెంటిలేటర్‌ గుండా చూస్తూ ఉండేవాళ్ళు అన్‌ ఫ్రాంక్‌, పీటర్‌, మార్గరెట్‌. కొంతకాలానికి మార్గరెట్‌ వీళ్ళతో కలిసేది కాదు. అటక మీదకు వచ్చేది కాదు. ఆన్‌, పీటర్‌… ఇద్దరే అటక మీదికెక్కి వెంటిలేటర్‌ నుంచి చూసేవాళ్ళు.
ఆకాశపు కాన్వాసుపై మబ్బు తునకల ప్రయాణాలు, పక్షులు అలవోకగా ఎగిరిపోతున్న వైనం, అప్పుడప్పుడూ వర్షపు వయ్యారం, శీతాకాలంలో తెల్లగా, మెత్తగా, నిశ్శబ్దంగా, హాయిగా జాలువారే మంచు విన్యాసం కనిపించేది. అదే వెంటిలేటర్‌ గుండా నేలపైకి తొంగి చూస్తే ఒక రేగు చెట్టు కనిపించేది. ఆ చెట్టు ఋతువుల్ని అనుసరించి మార్పునకు గురై, చిగుర్లు, మొగ్గలు, కాయలు కాసే తీరు చూసేవారు. అదే ఆ పిల్లలకి వినోదం. అదే ఆనందం. అదే జీవితం. రెండేళ్ళు అలా నిశ్శబ్దంగా కాలక్షేపం చెయ్యటం ఎంత కష్టమైన శిక్ష కదా! ఆ వీథిలోనే ఉన్న చర్చి నుంచి గంటలు వినిపించేవి.
బడికి వెళ్ళాలని, చాక్లెట్లు, ఐస్‌క్రీం తినాలని, సైకిల్‌ నడపాలని, పింగ్‌ పాంగ్‌ ఆట ఆడాలని, స్నేహితుల్ని చూడాలని వీటన్నింటి కోసం మొహం వాచిపోయిందని ఆ అమ్మాయి వాపోయింది. అక్కడికొచ్చిన కొత్తలో గోడమీద తమ ఎత్తుల్ని పెన్సిల్‌తో మార్కు చేసుకుని ఉండేది ఆన్‌. తర్వాత అప్పుడప్పుడూ ఎత్తును కొలిచి, పెరిగిన ఎత్తు చూసుకొని ఆనందించేది. కానీ, అప్పుడెప్పుడో తమ వెంట తెచ్చుకున్న బట్టలు పొట్టిగా, పాతగా, చిరుగులు పడ్డాయని బాధపడుతూ రాసుకుంది. అంతేకాక, నెలసరిలో వాడే బట్టల కొరత ఉందని అక్క, అమ్మ ఈ దుర్భర పరిస్థితుల్ని ఎప్పుడూ ఊహించలేదని, ఏడ్చేవాళ్ళని ఆన్‌ రాసుకుంది.
ఒకసారి ఎండు బఠానీల సంచికి కట్టిన తాడు ఊడి గింజలన్నీ పెద్ద శబ్దం చేస్తూ గలగలపై అటక మీదినుంచి కిందికి దొర్లాయి. అప్పుడందరూ భయంతో వణికిపోయారు ఇక తమ రహస్య జీవితం బట్టబయలవుతుందని. కాకపోతే అప్పటికే వేర్‌హౌస్‌లో పనివాళ్ళు ఇళ్ళకు వెళ్ళిపోయుంటారు. బతుకు జీవుడా అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి భయాల్ని రోజూ ఏదో ఒకదాన్ని ఎదుర్కోవాలి. రోజూ ఆ బఠాణీల్ని, ఆలూల్ని తినలేక చస్తున్నామని రాసుకుంది. పగలు గానీ, రాత్రి కానీ దగ్గు, తుమ్ములొస్తే భయపడేవాళ్ళు. అంతేకాక అడుగులో అడుగులేస్తూ పిల్లిలాగా నడవటం కష్టంగా ఉండేది.
వీళ్ళ కుటుంబ స్నేహితుల్లో ఒకామె మైప్‌ గైస్‌ వీళ్ళకోసం బేకరి ఆహారం, వంట దినుసుల్ని, ఎండు బఠాణీల్ని ఎంతో రహస్యంగా రాత్రి సమయంలో సీక్రెట్‌ అనెక్స్‌ వచ్చి ఇచ్చేది. యుద్ధ సమయంలో ఆహారం కొరత వల్ల వీరికి రహస్యంగా అందించడం రాన్రాను కష్టంగా ఉండేది. ఆన్‌ కోసం కథల పుస్తకాల్ని, వాళ్ళ అక్క కోసం షార్ట్‌ హ్యాండ్‌ నేర్చుకునే పుస్తకాల్ని తెచ్చి ఇచ్చేదామె. ఆనా పుస్తకాల పురుగు. తెచ్చినవి అయిపోగానే మళ్ళీ ఎదురు చూపులు.
యుద్ధం ముగిశాక మైప్‌ గైస్‌ అందించిన సేవలకు గాను, తర్వాత కాలంలో ఆమెకి ప్రభుత్వం తరపున అవార్డు లభించింది.
వేర్‌హౌస్‌లో పనిచేసేవాడు వీళ్ళ ఉనికిని కనిపెట్టి, డబ్బుకాశపడి నాజీ పోలీసులకు ఉప్పందించడం వల్ల 1944 ఆగస్టు 4న సీక్రెట్‌ అనెక్స్‌ మీద నాజీలు రైడ్‌ చేస్తారు. అప్పుడు అందరూ పట్టుబడతారు. ఆ స్థావరం నుండి బయటికొచ్చిన వాళ్ళు ఒక్కసారిగా సూర్యుని వెలుతురు చూడలేకపోతారు. తాజా గాలి కొంత హాయి కలిగించింది. ఆ రోజు ఆ అమ్మాయి డైరీని అక్కడే వదిలేసి పోలీసులతో వెళ్ళిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం వాళ్ళ నాన్న ఒక్కడే జీవించి ఉంటాడు. ఆయన సీక్రెట్‌ అనెక్స్‌కి వచ్చి, ఆ డైరీని గుండెలకత్తుకుని ఎంతో విలపించాడు. తర్వాత కాలంలో డైరీని పబ్లిష్‌ చేయిస్తాడు. అది డచ్చి నుంచి ఆంగ్లం, తదితర ఎన్నో భాషల్లోకి అనువాదమైంది.
ఆ డైరీని తెరిచి రహస్య స్థావరంలోకి అడుగిడిన పాఠకులందరూ, వేదనాభరిత హృదయ భారాన్ని మోయలేక నిట్టూర్పులతో వెనుతిరిగి వస్తారే కానీ, ఆ డైరీ మాత్రం మనల్ని వెంటాడి మనతోనే వస్తుంది, మనతోనే ఉంటుంది.
నాదొక చిన్న మాట.
ఏ రచనైనా పాఠకులు ఆసక్తిగా, ఉత్కంఠతో చదువుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, ఆవేశపడుతూ, వ్యవస్థని దుయ్యబడుతూ, కోపాగ్నితో రగిలిపోతూ, దుష్ట రాజకీయ నాయకుల మొహాన ఉమ్మేస్తూ పుస్తకాన్ని ముగిస్తారో, ఆ పుస్తకం గొప్ప పుస్తకమని నా అభిప్రాయం. అంతేకాక, ఆ పుస్తకం చదివాక, ఏళ్ళ తరబడి రోజూ అందులోని విషయం గుర్తొచ్చి పాఠకుల్ని వెంటాడి వేదనకు గురిచెయ్యాలి.
ఈ డైరీ కూడా అలాంటిదే. నేను ఇరవై ఏళ్ళ క్రితం చదివా, మళ్ళీ ఎప్పుడూ చదవలేదు. మళ్ళీ చదవకుండా మీకు పరిచయం చేస్తున్నానిప్పుడు.
అరెస్ట్‌ తర్వాత వాళ్ళ జీవితాన్ని, క్యాంపులలో ఆనాతో పాటు ఉన్న స్కూలు స్నేహితులు చెప్పిన నిజాలు ఎన్నో పుస్తకాలుగా వెలువడ్డాయి.
ఇక ఆ కాన్సంట్రేషన్‌ క్యాంపు జీవితం గురించి, విషపు వాస్తవాల్ని తెలిపే ఆ పుస్తకాల గురించి ఎందుకులెండి! భరించేందుకు, మనం తట్టుకునేందుకు వెయ్యి గుండెలు కావాలి గానీ.
ఒకసారి, 2003లో మేము అమెరికాకు, ఆమ్‌స్టర్‌డాం మీదుగా వెళ్తూ అక్కడ కాసేపు ఆగాము. నేను చాలాసేపు ఆ సిటీలో ఆకాశం వంక చూస్తుండిపోయాను. మా పిల్లలడిగారు, ఎందుకలా ఆకాశం వంక చూస్తున్నావని. అప్పుడు వివరాలు చెప్పా. ఆనా, పీటర్‌ వెంటిలేటర్‌ నుంచీ చూస్తే కనిపించే ఆకాశపు ముక్కను నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ఆన్‌ ఫ్రాంక్‌కి అంకితం ఇచ్చిందని. ఓప్‌ా… అవునా అన్నారు వాళ్ళు. నెదర్లాండ్స్‌ తులిప్స్‌ పూలకు ప్రసిద్ధి. పూలలాంటి చిన్నారులెందరో నాజీలు రగిలించిన అగ్నికి ఆహుతైపోయిన దుర్భర చరిత్రకు కూడా ప్రసిద్ధే.
కుల, మత, జాతి వివక్ష వల్ల ఎంతో రక్తపాతం, మానవ హననం జరుగుతుందని చరిత్ర మనల్ని హెచ్చరిస్తోంది. మన దేశం కుల, మత, జాతి వైషమ్యాలకు పెట్టింది పేరు. వివక్ష నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. కాబట్టి స్నేహ సౌభ్రాతృత్వాల్ని అలవరచుకొని అందరూ సహజీవనం చెయ్యాలి. చిన్నారి రాసుకున్న డైరీ మనకు అదే చెబుతోంది.

Share
This entry was posted in పుస్తక పరిచయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.