(గత సంచిక తరువాయి…)
రాజ్ కపూర్ రెండవ సినిమా ‘బర్సాత్’ తలపెట్టినపుడు సంగీత దర్శకుడిగా రామ్ గంగూలీని ఎంచుకున్నాడు. కానీ రాజ్ కపూర్ సినిమా కోసం ఎంచుకున్న బాణీని రామ్ గంగూలీ మరో నిర్మాతకు ఇచ్చాడన్న వార్త రాజ్ కపూర్‌కు తెలిసింది. రాజ్ కపూర్ వ్యక్తిగతంగా చాలా
అసూయాపరుడు. తనది అన్నది వేరేవారికివ్వడు. తన సినిమా కోసం తయారయిన బాణీని వేరే నిర్మాతకు ఇవ్వటం రాజ్‌కపూర్ సహించలేడు. అంతెందుకు, 1965 ప్రాంతానికి శంకర్`జై కిషన్ నంబర్ వన్ సంగీత దర్శకులు. వారు సృజించిన బాణీలను రాజ్ కపూర్ తన దగ్గర టేప్‌లో దాచుకుని అవసరం వచ్చినప్పుడు వాడేవాడు. అలా రాజ్ కపూర్ కోసం సృజించిన ఒక బాణీని శంకర్`జైకిషన్ ఆమ్రపాలి సినిమాలో వాడాలని నిర్ణయించారు. అది తెలిసి రాజ్ కపూర్ నిర్మాత ఎఫ్‌సీ మెహ్రాకు ఫోన్ చేసి బెదిరించాడు. దాంతో చివరి క్షణంలో రిహార్సల్స్ అయిన పాటను వదిలి వేరే బాణీతో మరో పాటను సృజించారు శంకర్`జైకిషన్. అలా సృజించిన పాట ‘జావొరీ జోగి తుం జావొరీ’ తర్వాత సినిమాలో వాడలేదు. రాజ్ కపూర్ కొట్లాడి రక్షించుకున్న బాణీని ‘మేరా నామ్ జోకర్’ సినిమాలో ‘కాటే నా కటే రైనా’ అన్న పాటగా రికార్డు చేయించుకున్నాడు. కానీ, ఆ పాటను సినిమాలో వాడలేదు. రాజ్ కపూర్ అసూయను నిరూపించే ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. దాంతో రాజ్ కపూర్, రామ్ గంగూలీని ‘బర్సాత్’ సంగీత దర్శకుడిగా తొలగించాడు. ఆ బాధ్యత శంకర్‌కి అప్పగించాడు. ఎందుకంటే రామ్ గంగూలీ వేరే వారికి ఇచ్చిన ఆ బాణీని కట్టింది శంకర్. అంతకు ముందు ఆ బాణీని రాజ్ కపూర్‌కు వినిపించింది శంకర్. అప్పటికే రామ్ గంగూలీ నిర్ణయమవటంతో అతనికిచ్చి ఆ బాణీని వాడమన్నాడు. అందుకని రామ్ గంగూలీని తొలగించగానే ఆ బాధ్యతను శంకర్‌కి అప్పగించాడు. నిజానికి ఆ బాధ్యతను శంకర్`జైకిషన్ కు అప్పగించే కన్నా ముందు నౌషాద్‌ను, రోషన్‌ను అడిగాడు. వారికి కుదరలేదు. పృథ్వీరాజ్ కపూర్ సలహాననుసరించి శంకర్‌ను ఎంచుకున్నాడు రాజ్ కపూర్. అయితే తనతో పాటు జైకిషన్ని కూడా జోడీగా ఉండనిస్తే, సంగీత దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తానని శంకర్ చెప్పడంతో దానికి రాజ్ కపూర్ ఒప్పుకున్నాడు. అలా ఏర్పడిరది హిందీ సినీ ప్రపంచాన్ని సంపూర్ణంగా రూపాంతరం చెందించిన సంగీత విప్లవకారులు, హిందీ సినీ సంగీత సామ్రాట్టులైన శంకర్`జైకిషన్ జోడీ!
‘బర్సాత్’ సినిమా అవకాశం లభించగానే, సినిమాలో పాటలు పాడేందుకు అప్పుడప్పుడే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న లతా మంగేష్కర్ పేరును సూచించాడు శంకర్. శంకర్ గతంలో హుస్న్‌లాల్`భగత్రామ్ల వద్ద వాయిద్యకారుడిగా పనిచేశాడు. వారు పాటలకు బాణీ కట్టే పద్ధతిని శంకర్ ఆకళింపు చేసుకున్నాడు. లతా మంగేష్కర్ కోసం వారు సృజించిన బాణీలను విశ్లేషించాడు. లత స్వరంలోని ప్రత్యేకతను గుర్తించాడు. ఆమె ఎలాంటి పాటనైనా పాడగలదనీ, రాగాలు తీయటంలోనూ, ఉచ్ఛ స్వరంలో పాడటంలోనూ ఎలాంటి ఇబ్బంది లేదనీ శంకర్ తెలుసుకున్నాడు. శంకర్ సూచనను రాజ్ కపూర్ ఆమోదించాడు. ఆ తరువాత జరిగింది లతా మాటల్లో… ‘‘ఓ రోజు ప్రొద్దున్నే రాజ్ కపూర్ నుంచి పిలుపు వచ్చింది. స్టూడియోకు తీసుకెళ్ళటానికి కారులో ఓ యువకుడు వచ్చాడు. చిన్నపిల్లవాడిలా ఉన్నా అందంగా ఉన్నాడు ఆ యువకుడు. రాజ్ కపూర్ దగ్గర పనిచేసేవాళ్ళు కూడా రాజ్ కపూర్లాగే అందంగా ఉంటారని అనుకున్నాను. అతడు బహు సిగ్గరి. దారిలో ఏమీ మాట్లాడలేదు. స్టూడియో చేరిన తర్వాత తెలిసింది. అతడు ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న జోడి శంకర్`జైకిషన్లలో జైకిషన్ అని’. అలా రికార్డయింది, సినీ సంగీతాన్ని మలుపు తిప్పిన ‘జియా బేకరార్ హై’ పాట.
ఇలా కలిశారు హిందీ సినీ గీతాల దిశను మార్చే రాజ్ కపూర్, శంకర్`జైకిషన్, లతా మంగేష్కర్లు. ఆ రోజునుంచి శంకర్`జైకిషన్ల సంగీతపు ప్రయాణంలో లత సహ ప్రయాణికురాలైంది. ‘బర్సాత్’లోని ఒక్కో పాటనూ శంకర్`జైకిషన్లు ఒక్కో అద్భుతమైన గీతంలా తీర్చిదిద్దితే, ఆ అద్భుతమైన గీతాలకు తన స్వరంతో ప్రాణం పోసింది లత. ‘హవామే ఉడ్తా జాయే’, ‘బిఛ్డే హువే పర్దేశీ’, ‘అబ్ మేరా కౌన్ సహారా’, ‘బర్సాత్ మే హమ్ సే మిలే’, ‘ఛోడ్ గయా బాలమ్’, ‘పత్లి కమర్ హై’, ‘మేరీ ఆంఖోంమే బస్గయే కోయీరే’, ‘మురేa కిసీసే ప్యార్ హోగయా’ వంటి సూపర్ హిట్ పాటలతో ‘బర్సాత్’ సినిమా సినీ ప్రపంచాన్ని సంగీత కుంభవృష్టితో తడిపి వేసింది. అదే సమయానికి పాటల వ్యాపార విలువను ప్రస్ఫుటం చేసింది ‘బర్సాత్’. సినిమాతో సంబంధం లేకుండా పాటల అమ్మకాలతోనే రాజ్ కపూర్‌కు విపరీతమైన లాభాలు వచ్చాయి. రాజ్ కపూర్, శంకర్`జైకిషన్లతో లతకు సన్నిహితమైన, స్వచ్ఛమైన స్నేహం ఏర్పడిరది. శంకర్ ఆమెకన్నా ఏడేళ్ళు పెద్ద. జైకిషన్ నాలుగేళ్ళు చిన్న. రాజ్ కపూర్ అయిదేళ్ళు పెద్ద. అంటే, అందరూ దాదాపుగా సమ వయస్కులే. శంకర్`జైకిషన్లకు సంగీత దర్శకులుగా ‘బర్సాత్’ తొలి చిత్రం. రాజ్ కపూర్‌కు దర్శక నిర్మాతగా రెండవ చిత్రం. లతా మంగేష్కర్ అప్పుడప్పుడే సినీ రంగంలో నిలద్రొక్కుకుంటోంది. దాంతో సమ వయస్కులంతా కలిసి దాదాపుగా ఒకేసారి తమ భవిష్యత్తును నిర్దేశించే సినిమా కోసం నిజాయితీగా, శాయశక్తులూ ఒడ్డి పనిచేశారన్నమాట. వారి నడుమ ఎంతో సాన్నిహిత్యం ఏర్పడిరది.
‘బర్సాత్’లో తొలిపాట ‘జియా బేకరార్ హై’ రికార్డింగ్ పూర్తయిన తర్వాత ‘తమ భవిష్యత్తు ఏమవుతుందో? ఎలా ఉంటుందో?’ అని ఆలోచిస్తూ స్టూడియో మెట్ల మీద ఆలోచిస్తూ చాలాసేపు కూర్చున్నాం’ అని పలు ఇంటర్వ్యూలలో చెప్పింది లత. ‘బర్సాత్’ సినిమా తర్వాత శంకర్`జైకిషన్, రాజ్ కపూర్ల సినిమాల్లో లత తప్పనిసరి అయింది. శంకర్`జైకిషన్లు లతను దృష్టిలో ఉంచుకుని, అత్యద్భుతమైన బాణీలు, అతి క్లిష్టమైనవి, అత్యంత ఉచ్ఛ స్వరంలో పాడేవి సృజించారు. లతతో కలిసి శంకర్`జైకిషన్లు హిందీ సినీ సంగీత జగత్తులో స్వర్ణయుగంపై తెర తీశారు. ‘బర్సాత్’ పాటలు ఎంత హిట్ అయ్యాయంటే, రికార్డుపై తన పేరు ఉండాలని లత పట్టుబట్టి సాధించుకుంది. ‘రాయల్టీ’ కూడా రాజ్ కపూర్ దగ్గర సాధించుకుంది లత. అంటే ‘బర్సాత్’ వరకూ అగ్రశ్రేణి గాయనిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న లత, ‘బర్సాత్’తో అగ్రశ్రేణి గాయనిగా గుర్తింపు పొందింది. లతా మంగేష్కర్ ‘మహారాణి’గా ఎదగటానికి కారణమయింది ‘బర్సాత్’.
అదే సంవత్సరం విడుదలయిన ‘అందాజ్’ లతను ‘మహారాణి’గా స్థిరపరచింది. ఒకే సంవత్సరం ‘ఆయేగా ఆనేవాలా (మహల్)’, ‘బర్సాత్’, ‘అందాజ్’ పాటలు సూపర్ డూపర్ హిట్లు కావటంతో, అంతవరకూ లతకన్నా ముందున్న గీతారాయ్తో లత సమానం కావటమే కాదు, ఆమెకన్నా ఒక అడుగు ముందుకు వెళ్ళింది. గీతారాయ్ కూడా 1949లో అధిక సంఖ్యలో పాటలు పాడినా లతా మంగేష్కర్ పాడిన పాటలు అయినంత హిట్ గీతారాయ్ పాటలు పాడిన సినిమాలు కాలేదు. దీనికి తోడు లత పాడిన పాటల సినిమాలు క్లాసిక్లుగా నిలిచిన సినిమాలు. పాటలు ఎంత బాగున్నా, సినిమా నడవకపోతే పాటలు అంతగా జ్ఞాపకాల్లో నిలవవు.
మహబూబ్ ఖాన్ సినిమా ‘అందాజ్’ సినిమాను ఈనాటికీ క్లాసిక్‌గా పరిగణిస్తారు. రాజ్ కపూర్, నర్గీస్, దిలీప్ కుమార్‌లు నటించిన ‘అందాజ్’ సూపర్ హిట్ కావటంలో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. నౌషాద్ సంగీత దర్శకుడు. 1949 వరకూ నౌషాద్ నాలుగు సినిమాల్లో 19 పాటలను లతతో పాడిరచాడు. 1948 వరకూ లతతో ఒక్క పాట కూడా పాడిరచని నౌషాద్ 1949లో అందాజ్, చాందినీ రాత్, దులారీ, ఆయియే అనే నాలుగు సినిమాలలో 22 పాటలు పాడిరచాడు. ‘చాందినీ రాత్’ సినిమాలో ఒకే ఒక పాడిరచిన నౌషాద్ ‘ఆయియే’లో ఏడు పాటలు, ‘అందాజ్’లో ఆరు పాటలు, ‘దులారీ’లో ఎనిమిది పాటలు పాడిరచాడు. అంటే ఒక్కో సినిమాతో నౌషాద్కు లత ప్రతిభ పట్ల నమ్మకం పెరగటమే కాదు, లత నౌషాద్ సంగీతంలో ప్రధాన గాయనిగా ఎదిగిందన్న మాట. ఎంతగా అంటే, అప్పటివరకూ నౌషాద్ సంగీతంలో నాయికలకు పాటలు పాడుతున్న శంషాద్ బేగమ్, ‘దులారీ’లో రెండే పాటలు, ‘న బోల్ పీపీ మోర్ అంగ్ నా’, ‘చాంద్నీ ఆయీ బన్ కే ప్యార్’ పాడిరది. ఈ రెండూ హిట్ పాటలుగా నిలిచాయి. కానీ ‘దులారీ’ నాయిక మధుబాల స్వరంగా లతను స్థిరపరిచాడు నౌషాద్. ఇది ఒకే సినిమాలో మధుబాలపై శంషాద్ బేగమ్, లతల స్వరాలు తెరపై చూస్తే స్పష్టమవుతుంది. అంతేకాదు, ఈ సినిమాలో ‘ఏ దిల్ తురేa కసమ్ హై’ పాటను నూర్జహాన్ పంథాలో పాడి మెప్పించింది లత. ఒక్క సంవత్సరంలో నౌషాద్కు లత ఎంత ప్రధాన గాయనిగా ఎదిగిందంటే ‘అందాజ్’లో శంషాద్ బేగమ్ పాట ఒక్కటే, అదీ లతతో యుగళ గీతం. నిజానికి ఆ పాట పాడడానికి నౌషాద్ నుంచి పిలుపు రావటంతో నాయికకు పాడుతున్నాననుకొని వచ్చిందట శంషాద్ బేగమ్. లతతో కలిసి పాడటం శంషాద్ బేగమ్‌కు కొత్త కాదు.
1949లోనే లత, శంషాద్లు ‘పతంగ్’ సినిమా కోసం ‘ప్యార్ కా జహాన్ కీ నిరాలీ సర్కార్ హై’ అనే పాటను కలిసి పాడారు. సంగీత దర్శకుడు సి.రామచంద్ర. ఈ పాట రికార్డయిన సమయానికి శంషాద్ బేగమ్ నంబర్ వన్ గాయని. అందుకే శంషాద్ బేగమ్ స్వరాన్ని నాయిక నిగర్ సుల్తాన్ కోసం, లత స్వరం సహాయ నటి కోసం వాడారు. కానీ ‘అందాజ్’ సినిమాలో ‘డర్ నా మొహబ్బత్ కర్ లే’ పాట రికార్డింగ్ సమయానికి వచ్చేసరికి నౌషాద్ లత స్వరాన్ని నర్గీస్ కోసం, శంషాద్ స్వరాన్ని సహాయ నటి కోసం వాడాడు. ఒక కోణం నుంచి చూస్తే శంషాద్ బేగమ్‌కు చాలా అన్యాయం చేశాడనవచ్చు.
నౌషాద్ సంగీత దర్శకత్వంలో లత, శంషాద్ బేగమ్‌లు కలిసి ఎప్పుడు యుగళ గీతం పాడినా, శంషాద్ బేగమ్‌కు అన్యాయం జరిగింది. ముఖ్యంగా ‘దీదార్’ సినిమాలో ‘బచ్పన్ కే దిన్ భులానదేనా’ పాటలో లత స్వరాన్ని బాల నటి కోసం, శంషాద్ స్వరాన్ని బాలుడి స్వరం కోసం వాడడంతో శంషాద్ బేగమ్ స్వరం ‘మగ గొంతు’ అనీ, లత ‘ఆడ గొంతు’ అనీ ప్రతీకాత్మకంగా చెప్పినట్లయింది. ఇది శంషాద్ బేగమ్ కెరీర్‌ను దెబ్బ తీసింది. నౌషాద్ సంగీత దర్శకత్వంలో 1952లో ‘ఆన్’లో పాట ‘ఖేలో రంగ్ హమారే సంగ్’, ‘బైజు బావరా’లో ‘దూర్ కొయి గాయే’ పాటలకు లత స్వరాన్ని నాయికకు వాడాడు నౌషాద్. పైగా లతతో యుగళ గీతాల్లో ‘తీగ’లాంటి లత స్వరం ముందు శంషాద్ స్వరం మొరటుగా వినిపించేది. దాంతో లతతో యుగళ గీతం పాడినప్పుడల్లా శంషాద్ నష్టపోయింది.
శంషాద్ బేగమ్ ఒక్కర్తే కాదు, లత ప్రతిభ ఎలాంటిదంటే, లతతో యుగళ గీతం పాడిన ఏ గాయని కూడా లాభపడలేదు. ఆ పాటల్లో లత స్వరం ముందు ఇతర స్వరాలు వెలతెలబోవటం, తేలిపోవటం జరిగేది. 1949లో ‘బడీ బెహన్’లో ‘చుప్ చుప్ ఖడే హో జరూర్ కోయీ బాత్ హై’లో లతతో పాటు ‘ప్రేమలత’ అన్న గాయని పాట పాడిరదని తక్కువ మందికి తెలుసు. అలాగే ‘గోరీ గోరీ (సమాధి, 1950)’లో లతతో పాటు అమీర్ బాయి కర్ణాటకి పాడిరదని చెప్తే కానీ గుర్తుకు రాదు. అయితే లతకు ధీటుగా పాడి యుగళ గీతాల్లో కూడా లతతో సమానంగా, అప్పుడప్పుడూ ఓ మోస్తరు ఎక్కువగా పేరు సంపాదించింది గీతారాయ్ ఒక్కతే. అందుకే ఇతర గాయనిలతో కన్నా గీతారాయ్తో పాడేటప్పుడు తాను మరింత ఎక్కువ శ్రమ పడతానని, జాగ్రత్తలు తీసుకుంటానని లత చెప్పింది. ‘అంతవరకూ బెంగాలీ యాసతో తప్ప హిందీ మాట్లాడలేని గీతా, మైకు ముందుకు రాగానే, హిందీ తప్ప మరో భాష రానిదానిలా, హిందీ మాతృభాష అయినదానిలా అద్భుతంగా పదాలు పలుకుతుంది. అదేం మాయాజాలమో నాకు ఇప్పటికీ అర్థం కాదు’ అంది లతా మంగేష్కర్ తాను గీతారాయ్తో పాడిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ. అందుకే లతతో కలిసి యుగళ గీతం పాడిన గాయని కెరీర్ దాదాపుగా సమాప్తమయినంత పని అవుతుంది. గీతారాయ్ మాత్రం లతతో దీటుగా నిలబడిరది. ఆశా భోంస్లే, లతతో కలిసి యుగళ గీతాలు పాడినా, ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల కెరీర్ పరంగా నష్టం కలగలేదు కానీ, లత ముందు ఆశా స్వరం తేలిపోతుంది. నాయికకు తప్పనిసరిగా లత స్వరమే వాడటం వల్ల ఇద్దరిలో నంబర్ వన్ గాయని ఎవరో స్పష్టంగా తెలుస్తుంటుంది.
1949లో ‘అందాజ్’లోని పాటలతో లత, శంషాద్ బేగమ్ కెరీర్ పతనానికి నాందీ ప్రస్తావన చేసింది. నర్గీస్ కోసం లత పాడిన ‘ఉఠాయే జా ఉన్కీ సితమ్’ పాటను హిందీ సినీ సంగీత ప్రపంచంలో అద్భుతమైన గజల్గా పరిగణిస్తారు. నూర్జహాన్ను అనుకరిస్తూ పాడిన ఈ పాట గురించి ఈనాటికీ చర్చలు జరుగుతున్నాయి. 1949లోనే ‘ఆయియే’లో ‘దునియా బదల్గయీ’, ‘బజార్’లో ‘సాజన్ కీ గలియాన్ ఛోడ్ చలీ’, ‘బడీ బెహన్’లో ‘చలే జానా నహీ నైన్ మిలాకే’, ‘జో దిల్ మే ఖుషి బన్ కే ఆయా’, ‘లాడ్లి’లో ‘తుమ్హారే బులానేకో జీ చాహతా హై’, ‘లాహోర్’లో ‘బహారే ఫిర్ భీ ఆయేంగీ’ వంటివి సూపర్ హిట్ పాటలుగా నిలిచాయి. ఒకే సంవత్సరం ఇలా వెంట వెంటనే హిట్ పాటలు రావటం, అదీ క్లాసిక్లుగా నిలిచే సినిమాల్లో పాటలు పాడటం లతకు లాభించింది. ఒక సంవత్సరంలో గీతారాయ్తో పాటుగా అగ్రశ్రేణి గాయనిగా గుర్తింపు సాధించింది. 1947 అంతానికి, ఇంకో రెండు మూడేళ్ళలో కనుమరుగైపోతుందని అనిపించిన గాయని, రెండేళ్ళ తర్వాత చూస్తే, అగ్రశ్రేణి గాయనిగా గుర్తింపు పొందటమే కాదు, అంతవరకూ అగ్రస్థాయిలో ఉన్న ఒక గాయని, శంషాద్ బేగమ్ని దాటిపోవటం, మరో గాయని, గీతారాయ్తో సమానంగా నిలవటం అనూహ్యమైన సత్యం. ఈ అనూహ్యమూ, అసంభవమూ అయిన అంశాన్ని సంభవం చేసింది లత తన స్వరంతో, పట్టుదలతో, నిజాయితీతో.
ఆరంభం నుంచీ లత కొన్ని నియమ నిబంధనలతో పనిచేసింది. ఎవరికోసం వాటిని మార్చుకోలేదు. తనని ఎవరు చులకన చేసినా మౌనంగా సహించలేదు. ఎంతటి గొప్ప పేరున్న కళాకారుడైనా లెక్కచేయలేదు. దాంతో సినీ పరిశ్రమ అంతా లత గురించి ఒక ఇమేజీ ఏర్పడిపోయింది. ఆమె దగ్గరకు పాటలు పాడిరచుకోవాలని వచ్చేవారు ఆమె గురించి తెలుసుకునే వచ్చేవారు. ఆమె ప్రవర్తనకు సిద్ధమయ్యే వచ్చేవారు. కెరీర్ ఆరంభంలోనే లత ద్వంద్వార్థాల పాటలు, బూతు మాటలుండే పాటలు, రెచ్చగొట్టే నీచమైన పాటలు పాడనని స్పష్టం చేసింది. పాట పాడే అవకాశాన్ని వదులుకొనేదే కానీ, రాజీపడి అలాంటి పాటలు పాడలేదు. ఇది కూడా పరిశ్రమలో లత పట్ల గౌరవభావం కలిగించింది. ఖేమ్‌చంద్ ప్రకాశ్, గులామ్ హైదర్, నౌషాద్లు ఆమె ఈ నిర్ణయాన్ని మెచ్చారు, ఆమెను ఆదరించారు. సినీ రంగంలో వ్యాపార విజయాన్ని మించిన దైవం మరొకటి లేదు. ప్రతి శుక్రవారం కళాకారుల అదృష్టానికి పరీక్ష లాంటిది అంటారు. ప్రతి శుక్రవారం కొత్త హీరో పుట్టుకొస్తాడనీ, పాత హీరో జీరో అవుతాడనీ అంటారు. అలాంటి విజయాన్ని ఆరాధించే ప్రపంచంలో వ్యక్తి విజయాన్ని సాధించే వరకే అతడిని అందరూ చులకన చేస్తారు. విజయం సాధించిన తర్వాత అతనికి పాదాక్రాంతమవుతారు.
‘జహాఁ తక్ మేరా సవాల్ హై, మైనే హమేషా అపనీ షర్తోం పర్ ఇస్ ఇండస్ట్రీ మే కామ్ కియా హై! మురేa షురూ సే హీ జో సంస్కార్ మిలే థే, ఉస్ మే ఏక్ బాత్ పహలే సే హీ తై హో చుకీ థీ, కి మై జో కరూంగీ, ఉస్ కా స్వరూప్ ఔర్ సీమాయే క్యా హోగీ’. ఓ ఇంటర్వ్యూలో లత అన్న మాటలివి. అంటే ఇండస్త్రీలో లత తనకు నచ్చిన నియమ నిబంధనల ప్రకారమే పనిచేసింది. తన ప్రతి చర్య స్వరూపం, పరిధులు తెలుసుకుని మరీ పని చేసింది. అందుకే ఆరంభంలోనే తన వ్యక్తిత్వాన్ని స్పష్టం చేసింది. తనకంటూ ఓ ఇమేజిని సృష్టించుకుంది. ఆరంభంలోనే తాను అశ్లీలమైన శబ్దాల పాటలు పాడనని నిర్ణయించుకోవటం వల్లనే అత్యద్భుతమైన భావాలున్న పాటలు పాడగలిగిందని లత నమ్మకం. రాజీపడని వాళ్ళు వాళ్ళకు కావాల్సింది సాధిస్తారు. అదే లత విషయంలో జరిగింది. ఆమె అశ్లీల పాటలు పాడననేసరికి అత్యుద్భుతమైన పాటలు ఆమె ఖాతాలోకి వచ్చి చేరాయి. అందుకే నౌషాద్ ‘లత పాడితే క్లబ్బు పాట కూడా భజనలా పవిత్రంగా తోస్తుంది’ అని అన్నాడు. 1950 వచ్చేసరికి లతతో పోటీకి గీతారాయ్ ఒక్కతే మిగిలింది. 1950 గురించి చర్చించేకన్నా ముందు ఏయే సంగీత దర్శకుల వద్ద లత ఏమేం నేర్చుకుందో గమనిస్తే, ఆమె నేర్చిన విజ్ఞానం ఆధారంగా యువ సంగీత దర్శకులు చేసిన ప్రయోగాలు గుర్తించవచ్చు.
‘నదియా ఫిర్ భీ మై ప్యాసీ, భేద్ యె గహెరా, బాత్ జరాసీ’
లతా మంగేష్కర్‌కు శైలేంద్ర గేయాలంటే చాలా ఇష్టం. అలతి అలతి పదాలతో అత్యంత లోతైన భావాలను పొదుగుతాడు. అతి సంక్లిష్టమైన తత్వాన్ని అత్యంత సరళంగా తన గేయాలలో ప్రదర్శిస్తాడు. ‘మధుమతి’ సినిమాలో శైలేంద్ర రచించగా, లతా మంగేష్కర్ అభిమానించే సంగీత దర్శకుడు, సలిల్ చౌదరి సృజించిన అత్యద్భుతమైన గీతం ‘ఆజారే… మైతో కబ్ సే ఖడీ ఇస్ పార్’ పాటలో చరణంలోని పంక్తులివి. అత్యంత భావాత్మకమైనవి. అందరి దాహం తీర్చే నది దాహం తీర్చేదెవరు? అందుకే నేను నదిని అయి కూడా దాహంతో అల్లాడుతున్నాను. ఈ రహస్యం చాలా లోతైనది. నిజానికి కారణం చాలా చిన్నది. ఈ రెండు పాదాల భావం గురించి ఎంతో రాయవచ్చు. అందరి దాహం తీర్చే నది ఎందుకు దాహంతో ఉంది?
లతా మంగేష్కర్ జీవితం చూస్తే ఈ రెండు పంక్తులు గుర్తుకు వస్తాయి. లతా పాటల వల్ల ఎంతోమందికి సాంత్వన లభిస్తుంది. స్ఫూర్తి లభిస్తుంది. సంతోషం కలుగుతుంది. జీవితం పట్ల అవగాహన కలుగుతుంది. మార్గదర్శనం లభిస్తుంది. కానీ లతా మంగేష్కర్ మాటలు, ఆమె ప్రవర్తనలను గమనిస్తే, లతా మంగేష్కర్‌కు తాను పాడుతున్న నేపథ్య గీతాల పట్ల ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా తనకు శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టమని అనటం, శాస్త్రీయ సంగీత గాయకురాలిని అయి ఉంటే బాగుండేదని అనటం లత మనస్సులో సినీ నేపథ్యగాయని అవటం వల్ల అసంతృప్తి ఉందని స్పష్టం చేస్తోంది. ‘‘నేను శాస్త్రీయ సంగీత గాయనిని అయి ఉంటే ఇంత పేరు వచ్చేది కాదు. వీథి వీథినా నా పాటలు మార్మోగేవి కావు. నాకు ఇంత డబ్బు, గుర్తింపు, సన్మానాలు ఇవేవీ వచ్చేవి కావు. కానీ నాకు ఆత్మ సంతృప్తి కలిగేది. సమాజంలో అత్యంత గౌరవం లభించేది’’ అని యతీంద్ర మిశ్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది లతా మంగేష్కర్. కానీ జీవితం కోసం, కుటుంబాన్ని నడపడం కోసం నేపథ్యగానం తప్ప మరో మార్గం లేకపోవడంతో లత గాయనిగా ఎదిగింది. ‘‘జీవితంలో ఏ పని చేయాలన్నది మా నాన్న మాకు చిన్నప్పుడే నేర్పించారు’’ అంది లత ఓ ఇంటర్వ్యూలో. అంతేకాదు ‘‘నాన్నకు సంగీతం తప్ప మరేమీ పట్టి ఉండేది కాదు. ఇంట్లో ఉంటే ఆయన నిరంతరం సాధన చేస్తుండేవారు. ఎప్పుడూ సంగీతం గురించి ఆలోచించేవారు. స్నేహితులు వస్తే కూడా సంగీతం గురించి చర్చించేవారు. నూటికి నూరు పాళ్ళు సమర్పణ అన్నది ఆయనను చూసి నేర్చుకున్నాను’’ అంటుంది లత. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నుంచి నేర్చుకున్న ఈ సంపూర్ణ సమర్పణ భావం లతను అగ్రశ్రేణి గాయనిగా నిలపడంలో కీలకమైన పాత్రను పోషించింది. ఎందుకంటే, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా మైకు ముందు నిలబడితే సర్వం మెదడు లోలోతు పొరల్లోకి దిగజారేవి. ఈ విషయాన్ని స్పష్టం చేసేందుకు లత ఓ సంఘటన చెప్పింది.
ఓ రోజు లత రికార్డింగ్‌కు వెళ్ళటానికి సిద్ధమవుతోంది. ఆ సమయంలో ఇన్‌కమ్‌టాక్స్ వాళ్ళు ఆమె ఇంట్లోకి వచ్చారు. టాక్స్ కట్టనందుకు ఇంట్లోని విలువైన వస్తువులతో పాటు కార్లు కూడా తీసుకువెళ్తామన్నారు. లతకు రికార్డింగ్‌కు వెళ్ళాల్సిన సమయమవుతోంది. అప్పుడు ఆమె వారితో ‘‘ఒక కారు ఇవ్వండి. దానిలో రికార్డింగ్ స్టూడియోకి వెళ్తాను. తర్వాత కారు మీరు తీసేసుకోండి’’ అంది. వారు ఒప్పుకోవటంతో సమయానికి స్టూడియోకి చేరుకుంది. కారును పంపించేసింది. ఒక్కసారి ఆమె మైకు ముందు నుంచోగానే సర్వం మర్చిపోయింది. పాట తప్ప మరొకటి గుర్తు లేదు. రికార్డింగ్ పూర్తయిన తర్వాత లత టాక్స్ ఇబ్బంది తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నిజాయితీ, ఈ నిబద్ధత, ఈ అంకిత భావం లత తండ్రి దీనానాథ్ మంగేష్కర్ నుంచి నేర్చుకుంది. 1941 నుంచి 1947 వరకూ రోజూ ఉదయం సంగీత సాధన చేసేది. తండ్రి నేర్పినది, గురువులు నేర్పినది తప్పనిసరిగా సాధన చేసేది. 1947 తర్వాత రికార్డింగ్‌ల బిజీలో ఆమెకు శాస్త్రీయ సంగీత సాధనకు సమయం ఉండేది కాదు. ఇది ఆమెను జీవితాంతం బాధించింది. సినిమాలలో శాస్త్రీయ సంగీత ఆధారిత పాటలను అధికంగా సృజించే సంగీత దర్శకులను అత్యంత గౌరవించింది. ఆయా పాటలను ఎంతో ప్రీతితో పాడిరది. కానీ సంగీత సాధన చేయని లోటు ఆమెను వదలలేదు.
‘‘మీరు శాస్త్రీయ సంగీతంలో సాధన చేయటం లేదని, స్టేజిమీద శాస్త్రీయ సంగీత కచేరీలు ఇవ్వలేదన్న లోపం
ఉన్నా, సినిమాలలో శాస్త్రీయ సంగీత ఆధారిత పాటలు పాడారు. శాస్త్రీయ సంగీత విద్వాంసులు సైతం మీ గానాన్ని ప్రశంసించారు. ఇది సరిపోదా?’ అన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం లత హృదయ లోతుల్లోని శాస్త్రీయ సంగీత దాహార్తిని తెలుపుతుంది. ‘మై నదియా ఫిర్ భీ ప్యాసీ’ అర్థం స్పష్టం చేస్తుంది.
‘శాస్త్రీయ సంగీత విద్వాంసులు నా గానాన్ని ప్రశంసించారన్నది నిజం. వారందరికీ నేను కృతజ్ఞురాలిని. కానీ ఏ రకంగా స్థిరంగా కూర్చుని పద్ధతి ప్రకారం రాగాలు తీస్తూ శాస్త్రీయ సంగీతం పాడాలో అలా నేను పాడలేదు. ఇందుకు నాకు దుఃఖం కలుగుతుంటుంది. నా జీవితం సంగీతం. సంగీతం తప్ప నా జీవితంలో మరేమీ లేదు. నేనేం చేసినా సంగీతం తప్ప మరొకటి చేయలేను. నాకు శాస్త్రీయ సంగీత క్షేత్రంలో ప్రవేశించాలని ఉంది. కానీ నేను సినిమా రంగంలోకి ప్రవేశించాను. నేను సినిమా రంగంలో సంపాదించినంత పేరు ప్రఖ్యాతలు శాస్త్రీయ సంగీత రంగంలో సంపాదించవచ్చు, సంపాదించకపోవచ్చు. కానీ నా జీవితం సినీ రంగంతోనే ముడిపడి ఉంది. నేను ఈ నిజాన్ని స్వీకరించాను. ఇప్పుడు ఇదే నా జీవితం. దీనితోనే సంతృప్తి చెందాలి. ఈ నిజాన్ని గ్రహించిన తర్వాత శాస్త్రీయ సంగీత విద్వాంసురాలిని కాలేదన్న బాధ నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయింది. (యతీంద్ర మిశ్రా యొక్క ‘సుర్`గాథా’ పేజీ 245). తాను నేపథ్య గాయనిగా స్థిరపడటం తప్ప మరో మార్గం లేదని గ్రహించిన తర్వాత నేపథ్య గానంలో మెళకువలు నేర్వటంపై దృష్టి పెట్టింది.
ప్రథమంగా ఆ కాలంలో పేరు సంపాదించిన గాయనిలు నూర్జహాన్, శంషాద్ బేగమ్, జోహ్రాబాయి, అంబాలే వాలి వంటి వారు పాట పాడే విధానాన్ని గమనించింది. తనతో పాటు సినీరంగ ప్రవేశం చేసిన గీతాదత్ గాన సంవిధానాన్ని పరిశీలించింది. నూర్జహాన్ పాటలు గంటల తరబడి వినేది. ఆ పాటలు పాడే విధానాన్ని, పదాల ఉచ్ఛారణను, భావాలను పలికించటాన్ని ఆకళింపు చేసుకుంది. విషాద గీతం ఎలా పాడాలి, రొమాంటిక్ పాటను ఎలా పాడాలి, చిలిపి పాటలలో పదాలను ఎలా పలకాలి వంటివి తెలుసుకుంది. ముఖ్యంగా భావ ప్రకటన నూర్జహాన్ నుంచి నేర్చుకున్నానని పలు ఇంటర్వ్యూలలో చెప్పింది లత. హాస్య గీతం అంటే వెకిలిగా పాడనవసరం లేదని, విషాదగీతం అంటే గాయనీ గాయకులు పాట పాడుతూ వెక్కిళ్ళు పెట్టనవసరం లేదని ఆ విషాదాన్ని స్వరంలో ప్రతిఫలించాలని అర్థం చేసుకుంది. అంటే పాట పాడుతూ గాయని ఎలాంటి వెర్రి వేషాలు వేయనవసరం లేదు, ఏడవనవసరం లేదు. కానీ ఆ భావాన్ని స్వరంలో ఎంతగా పలికించాలంటే వింటున్న శ్రోతకు భాష తెలియకున్నా అది హాస్యగీతమో, విషాద గీతమో, రొమాంటిక్ పాటో కేవలం స్వరం పలుకుతున్న భావాల ద్వారా అర్థమైపోవాలి. అంటే, తానే పాటయిపోవాలి, పాటలో భావమైపోవాలి.
కుందన్ లాల్ సెహగల్ పాట విని, నూర్జహాన్ గాన సంవిధానానికి సంపూర్ణంగా భిన్నమైన పాట పాడే పద్ధతిని నేర్చుకుంది లతా మంగేష్కర్. ముఖ్యంగా సెహగల్ పాట ‘దుఃఖ్ కే అబ్ దిన్ బీతత్ నాహి’ (దేవదాసు) పాటను విని దుఃఖాన్ని ధ్వనింపచేయటం నేర్చుకున్నానంటుంది లతా మంగేష్కర్. నాయకుడు విషాదంలో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. ఆ ఎమెషన్ను, ఆ భావాన్ని సెహగల్ తన గొంతులో ఎలా ప్రతిధ్వనింప చేశాడన్నది ఈనాటికీ తనకు ఆశ్చర్యమేనంటుంది లత. ఎందుకంటే పాట పాడుతూ ఏడవలేడు, ఏడిస్తే పాట పాడలేడు. కాబట్టి పాట పాడుతూ ఏడుస్తున్న భావనను సెహగల్ ఎలా కలిగించగలిగాడోనన్నది అంతుపట్టని విషయం అంటూ అలాంటి ‘పర్ఫెక్షన్’ కోసం ప్రయత్నిస్తున్నట్లు పలు సందర్భాలలో చెప్పింది లత. తన గాన సంవిధానాన్ని తిరుగులేని రీతిలో ప్రభావితం చేసింది ఈ ఇద్దరు కళాకారులేనని లత స్పష్టం చేసింది. ఇతర సమకాలీన గాయనిలపై లత ఆధిక్యం సంపాదించటంలో, ఆమె ఇలా విని నేర్చుకోవటం ప్రధాన పాత్ర వహించిందన్నది ప్రముఖ గాయకుడు మన్నాడే అభిప్రాయం.
“When Latha emerged as a force to reckon with, the other popular voices of the time like Zohrabai Ambalewali, and Shamshad Begum began to appear unolished. They lacked Latha’s sophistication. Latha has a very rare talent. I would not say she has been taught music. woh sun sun ke bani hai. She learnt from Noorjehan. She even learnt by listening to Geeta Dutt. But Latha polished all the weaknesses in Geetha’s voice.”
అయితే ఎంతగా విని నేర్చుకున్నా, నిజంగా రికార్డింగ్ స్టూడియోలో మైకు ముందు నిల్చుని, ఆర్కెస్ట్రాతో కలిసి పాడటం భిన్నమైన ప్రక్రియ. ఇక్కడ లతా మంగేష్కర్లోని లోపాలను సవరించి, మార్గదర్శనం చేసిన వాడు గులామ్ హైదర్. ‘‘గులామ్ హైదర్ నాకు గాడ్ ఫాదర్ లాంటివాడు’’ అంటుంది లత సందర్భం దొరికినప్పుడల్లా. శాస్త్రీయ సంగీత గానానికి, సినిమా పాటలు పాడడానికి నడుమ గల తేడాను లతకు వివరించిన వాడు గులామ్ హైదర్. మైకు ముందు నిల్చుని పాడేటప్పుడు తిన్నగా మైకులోకి పాడకుండా కాస్త పక్కనుంచి పాడాలని, మైకుకు మరీ దగ్గరగా కాకుండా, మరీ దూరం కాకుండా స్వరం సరిగ్గా వినిపించేంత దూరంలో నిల్చుని పాడాలని నేర్పించింది గులామ్ హైదర్. ‘ప, స, భ’ వంటి అక్షరాలను జాగ్రత్తగా పలకాలనీ, మరీ దగ్గరనుంచి పలకకూడదని ‘మైక్ కల్చర్’ను లతకు నేర్పించినవాడు గులామ్ హైదర్.
గులామ్ హైదర్ ఎప్పుడూ లతను పాట పాడేటప్పుడు మూడు విషయాలపై దృష్టి పెట్టమనేవాడు. ముందుగా పదాలు స్పష్టంగా ఉచ్ఛరించాలి. ఏదైనా పదం ఉచ్ఛారణ విషయంలో సందేహముంటే, గేయ రచయితలను అడిగి సరైన ఉచ్ఛారణ తెలుసుకోవాలి. హిందీ సినిమా పాటలలో హిందీ, ఉర్దూ పదాలు కలిసి ఉంటాయి. కాబట్టి హిందీ పదాలను, ఉర్దూ పదాలను వేర్వేరుగా, స్పష్టంగా ఉచ్ఛరించాలి. పాటలో ‘బీట్’ వచ్చినపుడు వచ్చే పదాలను మైకుకు ఒక పక్కగా కోమలంగా పాడాలి. ఇందువల్ల ఆ పదం మరింత కోమలంగా వినిపిస్తుంది. పాట మాధుర్యం పెరుగుతుంది. ఇలా పాట మాధుర్యాన్ని ఇనుపడిరపచేయటం గాయకుడి పని. పాట పాడే సమయంలో గాయకుడు ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. ఆర్కెస్ట్రాతో రిహార్సల్స్ చేసే సమయంలో బీట్నూ, వాయిద్యాల నడకను గమనించి, పాటలో ఎక్కడ ఏ పదాలను ఒత్తి పలకాలి, ఏ పదాలను తేలికగా పలకాలి, ఎక్కడ పదాన్ని విరవాలి వంటివి గులామ్ హైదర్ తనకు నేర్పించాడని లత పలుమార్లు చెప్పింది. గులామ్ హైదర్ నేర్పించిన మరో మహత్తరమైన విషయం, శాస్త్రీయ సంగీతం పాడటానికి, సినిమాల్లో శాస్త్రీయ సంగీత ఆధారిత పాటలు పాడటానికీ ఉన్న ప్రధానమైన తేడా. లత శాస్త్రీయ సంగీత సాధన చేస్తుండేది. ఆమె ప్రమేయం లేకుండా దీర్ఘంగా రాగాలు తీయటం, శృతి చూసుకునేందుకు సమయం పట్టటం సంభవించేది. అప్పుడు గులామ్ హైదర్ ఆమెకు ఈ రెండు గాన ప్రక్రియలలో తేడాను వివరించాడు.
శాస్త్రీయ సంగీత గాయకుడికి సమయం ప్రతిబంధకం కాదు. అతడికి శృతి చూసుకునేందుకు సమయం ఉంటుంది. రాగాలు తీయవచ్చు. స్వర ప్రస్తారాలు వేయవచ్చు. అతని గానం వినేందుకు వచ్చిన శ్రోతలు కూడా అందుకు సిద్ధమై వస్తారు. వారూ సంగీతంతో పరిచయం ఉన్నవారో, అభిరుచి కలవారో అయి ఉంటారు. పైగా, శాస్త్రీయ సంగీత కళాకారుడు ఎవరినో మెప్పించటం కోసం పాడడు. తన ఆత్మానందం కోసం పాడతాడు. అది శ్రోతల హృదయాలను స్పందింపచేస్తుంది. కానీ సినిమా పాట ఇందుకు పూర్తిగా భిన్నమైనది.
(ఇంకా ఉంది)