‘తొలి అడుగులు’ ఒక వినూత్న ప్రయోగం -ఆర్‌. శశికళ

మీరు ఎన్నో వాట్సప్‌ గ్రూపులలో సభ్యులుగా ఉండి ఉంటారు. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, తెలియజేస్తూ ఉండొచ్చు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్లను వర్తమాన రాజకీయ, సాంస్కృతిక అంశాలపై మీ అభిప్రాయాలను వ్యక్తం చేసే వేదికలుగా వాడుతూ ఉంటారు కదూ. కానీ ఎప్పుడైనా ఓ వాట్సప్‌ గ్రూప్‌ 11 మంది మహిళలతో కొత్తగా కలం

పట్టించి, కవిత్వం రాయించి, ‘తొలి అడుగులు’ అనే పేరిట ఆ కవిత్వాన్ని ప్రచురించి రెండుసార్లు ఆవిష్కరణ సభను జరిపిందనే విషయం మీకు తెలుసా? జులై 29వ తేదీన ఆచార్య మహాసముద్రం దేవకి గారింట్లో పాతిక మంది మహిళా రచయిత్రులతో జరిగిన సమావేశంలో రెండవసారి ‘తొలి అడుగులు’ పుస్తకం ఆవిష్కరించబడిరది. అదే సమయంలో ఆచార్య మహాసముద్రం దేవకి గారి ‘ఇర్లచెంగి కథలు’ కూడా ఆవిష్కరించబడ్డాయి.
జూన్‌ 30వ తేదీ, 2020 కరోనా కల్లోల కాలంలో కొద్ది మంది మహిళా రచయిత్రులతో వాట్సప్‌ గ్రూప్‌ ప్రారంభమై నేటికి 44 మందితో కొనసాగుతోంది. ఇందులో ఇద్దరు తప్ప అందరూ మహిళలే. అందరూ భిన్న సామాజిక రంగాలలో పనిచేస్తున్నారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు, ఆకుల మల్లేశ్వర రావు గార్లు సమూహంలో సభ్యులు అవడమే కాకుండా ఈ సమూహ నిర్వహణకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఇవ్వబడిన చిత్రంపై కవితలు, ‘వినదగునెవ్వరు చెప్పిన’ అంటూ ప్రతి ఉదయం మంచి మాటలు వినిపించడం, జాతీయ, అంతర్జాతీయ విషయాలు`చట్టాలు, కోర్టు తీర్పులు, విద్య, వైజ్ఞానిక విశేషాలు, ఆలోచనాత్మక లఘు చిత్రాలపై చర్చలు… ఇలా ఒక్కో రోజు, ఒక్కో అంశంపై గ్రూప్‌లో చర్చలు నడుస్తూ ఉంటాయి.
ప్రసిద్ధ రచయిత్రి, సామాజిక కార్యకర్త జి.నిర్మలా రాణి గారు, బిజిలి, డా.స్వర్ణలత, డా.పి.శ్రీదేవి, రోజా రమణి, సుజాత, ఆర్‌. నిర్మల గార్లు అడ్మిన్‌లుగా ఉన్నారు. మూడు సంవత్సరాల పాటు నిరంతరాయంగా, ఆసక్తికరంగా, ఆరోగ్యంగా అధ్యయనం, చర్చలు, సృజనాత్మక రచనలు చేసేలా ప్రేరణ కలిగించడానికి నిర్మల రాణి గారు విశేష కృషి చేశారు.
ఇందులో ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఒక సామాజిక విషయం ప్రతిబింబించే ఓ చిత్రాన్ని ఒక వారం ముందుగా పోస్ట్‌ చేస్తారు. సభ్యులు ఆ చిత్రంపై తమ స్పందనలను ఓ కవితగా లేక కథగా రాయాలి. వాటిపై స్పందనలు, సూచనలు ఉంటాయి. ఇలాంటి ప్రయత్నంలో బాగా చేయి తిరిగిన వారు, కొత్తగా కలం పట్టిన వాళ్ళు ఆసక్తిగా పాల్గొంటున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ‘‘తొలి అడుగులు’’ కవితల పుస్తకం వచ్చింది.
ఆకుల మల్లేశ్వరరావు గారి ‘దృశ్యం విత్తై మొలకెత్తితే’ పుస్తకం వచ్చింది. ఆగస్టు 2021లో ఆ పుస్తకం ఆవిష్కరణ అంతర్జాలం ద్వారా ఈ సమూహంలో జరిగింది. తరువాత ‘తొలి అడుగులు’ పుస్తకం వచ్చింది. ఇప్పుడు నేను చెబుతున్నది ఈ పుస్తకం గురించే.
ముఖ చిత్రాన్ని ఈ సమూహ సభ్యురాలు శీలా పల్లవి గారు డిజైన్‌ చేశారు. ఇందులో మొత్తం 48 కవితలున్నాయి. 20 విభిన్న చిత్రాలకు వైవిధ్యభరితమైన కవిత్వ వ్యక్తీకరణను చూస్తాము. ఏడుగురు ముందు మాటలు, ఆప్త వాక్యాలు వ్రాసి కవులను ప్రోత్సహించారు. నిర్మలా రాణి గారు ఈ పుస్తక పూర్వాపరాలను, ప్రయోజనాన్ని వ్రాస్తే, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు కవిత్వంపై ముందు మాట రాశారు. కవి, కథా రచయిత జి.వెంకటకృష్ణ గారు కవితలను పరామర్శించి అభినందనలతో కొత్త కలాలను ప్రోత్సహించారు. శీలా సుభద్రాదేవి గారు, ఘంటసాల నిర్మల గారు, ఆచార్య మహాసముద్రం దేవకి గారు ఆప్త వాక్యాలతో, తమ కవితలతో అలరించారు. ఇందులోని అన్ని కవితలు కాకుండా కొత్తగా కవిత్వం రాసిన 11 మంది కవితలను పరిచయం చేయడానికే పరిమితమవుతున్నాను. ‘తొలి అడుగులు’ ఓ కొత్త ప్రయోగం. అనంతపురం సాహిత్య చరిత్రలో నిలిచిపోతుంది. ఇది సమిష్టి కృషితో పుట్టిన సృజన. అందమైన మనసులలో మొలకెత్తిన ఆందోళన భావ వ్యక్తీకరణ. విభిన్న సామాజిక భావనలపై ఫోటోలకు స్పందించి రాసిన కవిత్వం.
ఆశలన్నీ నేలకూలిన ఈ విచిత్ర సామాజిక సందర్భంలో ప్రజాస్వామిక దృక్పథం, మతోన్మాదంపై నిరసన.
స్వేచ్ఛ, సమానత్వం ఆకాంక్షగా తమ అనుభూతులతో, నూతన విశ్వాసాలతో ఈ కవిత్వాన్ని వెలిగించారు. ఆవేశం, ఆలోచన, సంయమనంతో ఒకే వృక్షంలోని వివిధ శాఖలుగా విస్తరించిన సమిష్టి గానం ఈ కవిత్వం. కాలమే కాదు, సృజనాత్మక కళ కూడా వృక్షం లాంటిదే. సమాజంలో ఉండడమంటే మొత్తం ఆమోదించడం కాదు, చెడును నిరసించడం కూడా కవిత్వం. అది చైతన్యంలో అంతర్భాగం. ఆ లక్ష్యం ఈ ‘తొలి అడుగులు’లో కనబడుతుంది. ఫోటోలు దృశ్యాలుగా, కవిత్వంగా రూపుదిద్దుకున్నాయి. అలా బయటకు రావడానికి అధ్యయనం ఆలోచనలను, ఆలోచనలు జ్ఞానాన్ని, జ్ఞానం సృజనాత్మకతలో ప్రతిఫలించడానికి సుదీర్ఘ కాలం పట్టింది. చక్కని ప్రణాళికతో, ఆరోగ్యకరమైన సంయమనంతో ఇది సాధ్యమైంది.
11 మంది కొత్తగా కలం పట్టి రాసిన కవిత్వం పాఠకులకు ‘తొలి అడుగులు’గా చేరువ అవుతుంది. ఇది వాట్సప్‌ను సద్వినియోగం చేసిన ప్రయోగం. ఇందులో కవయిత్రులు, కవులు దేశ కాల పరిస్థితులపై తమ సామాజిక చైతన్యంతో ప్రజా పక్షాన నిలబడటం కనబడుతుంది.
ఉదా:` బాగా కవిత్వం రాయగలిగిన దీవెన
నెర్రెలు చీలి
నోరు తెరుచుకొన్న
సీమ నేలతల్లి…
……
పచ్చటి చెట్ల
పట్టుచీర కట్టుకున్నట్లు
కలగంటోంది…
సీమ అస్తిత్వ వాదనను, ఈ ప్రాంతం నీటి గలగలలతో, పచ్చదనంతో మెరిసే పొలాలను, ప్రజల ఆశలను ఈ కవిత్వంలో చెప్పారు.
డా.స్వర్ణలత, రోహిణి బొమ్మన, నిర్మల ఆర్‌., బిజిలి, షహనాజ్‌ బేగం, ఎమ్మనూరు రమాదేవి, టి.వి.ఉషారాణి గార్లు ఈ గ్రూప్‌ ప్రేరణతో మొదటిసారిగా కవిత్వం రాశారు. కవులందరూ మహా పండితులు కానవసరం లేదు. కానీ, దేని గురించి రాస్తున్నారో స్పష్టత మాత్రం
ఉండాలి. నిరంతరాయంగా మారుతున్న సామాజిక వాస్తవికతలను, ప్రజల ఆరాట పోరాటాలను, ఆకాంక్షలను తమ సృజనాత్మక కళతో, చైతన్యంతో చెప్పగలగాలి. జీవితంలో పుట్టే వాస్తవికతను తమ కవితా నైపుణ్యంతో ఆవిష్కరించగలగాలి. ఆ పని ఈ కవిత్వం చేసింది. ప్రాచీన కవులు ‘‘వాక్యం రసాత్మకం కావ్యం’’ అన్నారు. నవరసాలలో ఏదో ఒక రకం భావోద్వేగాలను కవిత్వం ప్రతిఫలిస్తూ ఉంటుంది. వాల్మీకి రామాయణ కావ్యం కంటే ముందే రాసిన శ్లోకం ‘‘మానిషాద ప్రతిష్ఠాం…’’ మొదలు నేటి ఆధునిక కవిత్వం వరకూ ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు, చరిత్ర, సామాజిక రాజనీతి శాస్త్రాలు, తాత్విక, ఆర్థిక, నైతిక శాస్త్రాల అధ్యయనం నుండి, అస్థిత్వ సంవేదనల నుండి సాహిత్యం విస్తృతమవుతుంది.
‘తొలి అడుగులు’ కవిత్వంలో ఆవేదన, అనుభవాలను పునరనుసంధానం చేసే భాషా సౌందర్యం, ప్రతీకలతో తమదైన ప్రత్యేక శైలితో, ప్రగతిశీల దృక్పథంతో రాసిన విధానం కనబడుతుంది.
ఇందులో కవిత్వం మొదట పెన్సిల్‌ స్కెచ్‌లా ప్రారంభమై అద్భుతమైన రంగుల చిత్రంలా రూపాంతరం చెందడం చూస్తాము. మానవీయ దృష్టి కోణం ఈ కవిత్వానికి కంఠస్వరం.
ఉదా:` ‘‘నిర్మాణం కోసం నిల్పిన అతి పెద్ద పైపు గొట్టంలో జీవనం సాగించే తల్లి బిడ్డను పాఠశాలకు పంపే దృశ్యం’’.
‘అమ్మా నీకు వందనం’ కవితలో…
‘‘నీవున్న స్థితిని మరచి
నీవున్న గతిని విడచి…

బిడ్డను బడికి పంపుతున్నావు
అమ్మా నీకు వందనం’’ అంటూ జ్యోత్స్న రాశారు.
‘దేశం క్లిష్ట పరిస్థితులలో ఉంది’ అనే కవితలో స్వర్ణలత గారు కరోనా నేపథ్యమే కాదు, ఇప్పటికీ మారని వ్యవస్థ వైఫల్యాలను ఎండకట్టారు.
‘‘న్యాయ వ్యవస్థకు
విలువ లేదు
ప్రజాస్వామ్యానికి
స్థానం లేదు
రాజ్యాంగానికి
దిక్కు లేదు
చట్ట సభల్లో
సఖ్యత లేదు’’
‘రోజుకో పేలుడు`రోజుకో బాదుడు’, ఏళ్ళు గడచినా ఏ సమస్యలు పరిష్కారం కాలేదు, అవినీతి, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, కుంభకోణాలు, అన్నదాతల ఆత్మహత్యలు… ఇలా మొత్తం సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాలను
తన కవిత ద్వారా ప్రశ్నించారు స్వర్ణలత గారు.
ఉషోదయం, మొలకెత్తుతున్న దృశ్యం, మహిళలపై దాడులు, ప్రకృతి పర్యావరణం, పనులు చేస్తున్న బాల కార్మికులు, వృద్ధ దంపతుల చివరి మజిలీ లాంటి ఫోటోలపై కవితలున్నాయి.
‘తొలి అడుగులు’ కవిత్వం సమాజం పట్ల ఆర్తి, బాధ్యత, భావోద్వేగాల రూపం. భావ చైతన్యం. సమ సమాజ ఆకాంక్షను, చైతన్యాన్ని, సామాజిక స్పృహను కలిగించడం లక్ష్యంగా కొనసాగింపు. ఇది కవయిత్రుల సామూహిక నిరసన కవనం. వేకువ బాట కవితలో కోటి ఉషస్సుల కోసం, సత్యమార్గం కోసం, సమానత్వం కోసం కవితలల్లిన ఘంటశాల నిర్మల, చేలూరి రమాదేవి గార్ల కవితలతో బాటు ఇంకా అనేక మంచి కవితలు ఉన్నాయి.
‘‘మనుధర్మ కుట్రలు తెలుసుకున్నాం
స్వేచ్ఛ సమన్యాయం
కోసం నినదిస్తా
మా పయనం
మున్ముందుకే’’
అని కొత్తగా కలం పట్టిన సుజాత ‘పయనం మున్ముందుకే’ కవితలో రాశారు.
వలసలపై ఆచార్య మహాసముద్రం దేవకి గారు, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు రాసిన కవితలో అనంతకోటి ప్రశ్నలున్నాయి. కవిత్వమంతా విషాదంతో, సానుభూతితో, వేదనతో నిండిపోయింది.
మహిళలపై, మైనారిటీలపై, దళితులపై అణచివేత, వ్యక్తం చేసే కవితలు రాశారు కొత్తగా కలం పట్టిన కవయిత్రులు…
‘కీలు బొమ్మలు’ కవితలో రోహిణి బొమ్మన గారు
‘‘కాశ్మీరు ఉసురు తీసినా
ఢల్లీిలో మారణహోమం
జరిగినా

మమ్మల్ని కీలు
బొమ్మలు చేసి
ఆడిరచే ఓ మత
మదమా
మతం మదం కాదని మనిషిలోని
మానవత్వమని
తెలిపి నీ ఉనికిని నిలుపుకో…’’ అంటూ సూటిగా, వాడిగా చెప్పారు.
బాలకార్మికుల గురించి షహనాజ్‌ బేగం గారు
‘‘గంప మోసిన నీ చిట్టి
చేతులు
మోయాలి పుస్తకాల
సంచులు’’
కన్నీరు నింపవద్దు, కలలను మనసున నింపుకోమని, రేపటి భవితకై ఫలించమని, చదువు బాటలో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఉదయిస్తున్న సూర్యుని ఫోటోపై స్పందనగా
‘‘నేనూ నీలాంటి దాననే
నువ్వు చీకట్లను చీల్చుకుంటూ పైపైకి ఎగబాకితే
నేను నిరాశ నిస్పృహలను ఛేదించుకుని ఎదుగుతున్నాను’’ అనే ఆశాభావంతో శీలా పల్లవి రాశారు.
బాల కార్మికుని ఫోటో చూసి ‘‘ఆవేదనతో నిన్ను చూసి ఎంతో కలత చెందాను, మీకు బంగారు భవిత కావాలి’’ అని కోరారు ఎమ్మనూరు రమాదేవి గారు.
అన్ని వ్యవస్థలలో మహిళలపై ఎడతెగని దాడులు, హింస కొనసాగుతోంది. తన ‘నిత్య సమరం’ కవితలో ప్రసిద్ధ కవయిత్రి ఘంటశాల నిర్మల గారు
‘‘ఎప్పటికప్పుడు
పడిపోతాననిపిస్తుంది
నిలదొక్కుకోగలనని
అనిపిస్తుంది’’ అంటారు.
దృశ్యం రంగుల ప్రపంచమై, ప్రకృతి చిత్రమై, తన్మయత్వంతో వివిధ కళారూపాల్లోకి, రంగుల్లోకి తర్జుమా చేస్తే, అక్షరాల్లో పొదిగితే, ఉపయోగించే ప్రతీకల ద్వారా గాఢమైన అనుబంధం పాఠకులకు కవిత్వం, పాట ద్వారా ఏర్పడుతుంది.
ప్రకృతి ప్రళయం, పాలకుల నిర్లక్ష్యం, ఉన్మాదం… ఇలా ఏ అంశమైనా చక్కని భావావేశంతో కవిత్వం చేశారు. మానవుల పట్ల, సమాజం పట్ల సానుభూతి, సహానుభూతితో రాసిన కవిత్వం కొత్తగా రాసిన వారి ‘‘గుర్తుకొస్తున్నాయి’’ అనే కవితలో ఎన్నో మధుర జ్ఞాపకాలు చెప్పారు.
ఇలా కొత్తగా కలం పట్టినా ఫోటోలపై తమదైన, వైవిధ్యభరితమైన శైలితో కవిత్వం రాశారు. ప్రసిద్ధ రచయిత్రుల కవిత్వం గురించి నేనిక్కడ ఎక్కువగా ఉదహరించలేదు.
మానవీయ కోణంతో వృద్ధ దంపతుల ఫోటోపై ‘సె’ ‘లవ్‌’ ‘నేస్తం’ అనే కవితలో బిజిలి గారు…
‘‘సుఖ దుఃఖాలో నిను
వీడనని
నీలో సగం నేనని
అన్నానని
గుర్తుంది నేస్తం
గుర్తుంది’’.
జంటలో ఎవరో ఒకరు మృత్యువుతో పోరాడుతున్నప్పుడు, ఒంటరితనంతో, వేదనతో, మనసు పొరల్లో దాగిన ప్రేమను వ్యక్తం చేస్తూ పాఠకుల మనసును ఆర్తితో నింపేశారు బిజిలి గారు.
‘విశ్వనరుడ నేను’ అని ఘోషించిన కవి గుఱ్ఱం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయన స్మృతిలో కవితలు రాశారు. వెంకటలక్ష్మి గారు కవిత్వమనే కత్తితో కుల వివక్షపై పోరాటం సల్పిన కవి కోకిల గుఱ్ఱం జాషువా గారు అని తన కవితలో రాశారు. కుల మతాలకతీతంగా అలాంటి మహానుభావులను తలచుకోవడం సమాజం బాధ్యత.
ఇలా కొత్తగా కలం పట్టి తమదైన అవగాహనతో సమాజం పట్ల ఆర్తితో రాయటం ప్రారంభించారు. ఇందులో లబ్దప్రతిష్టులైన కవయిత్రుల కవితలు అనేకం ఉన్నాయి. వాళ్ళంతా సీరియస్‌గానే రాశారు. మానవతావాదం ఎజెండాగా ప్రకృతి పట్ల, అభ్యుదయ భావాల ప్రభావంతో కవిత్వం రాశారు. రాచపాళెం గారు చివరిలో ‘తన వివేకం’ కవితలో
‘‘నిజం నిప్పుల మీద
నడవ లేనప్పుడు
అబద్ధాల కర్ర కాళ్ళే గతి’’ అంటూ చెప్పారు.
నిబద్ధతతో పనిచేస్తే ఎంత ప్రతిభావంతమైన పనులు చేయవచ్చో ఈ ‘తొలి అడుగులు’ కవిత్వం నిరూపించింది.
కవిత్వం రాయాలనే తపన ఉంటే సరిపోదు. నిరంతర అధ్యయనం, ప్రకృతి, సమాజం పరిశీలన, విభిన్న సాహిత్య ప్రక్రియలతో అనుబంధం అవసరం. అందమైన మనసు, సృజనాత్మక నెలవు కూడా కావాలి. ఇందులో ఉన్న సభ్యులంతా నిరంతరం అధ్యయనం చేస్తూ ఉద్యోగాల్లో, వివిధ సామాజిక రంగాలలో, పిల్లలతో… ఇలా ఎన్నో పనులున్నా ఈ విషయంలో దృష్టి పెట్టి సహకరించడం గొప్ప విషయం. అందుకే ఈ కవిత్వంలో సౌందర్యారాధనతో పాటు, అస్తిత్వ సంవేదన ఉంది. శీలా సుభద్రా దేవి గారి కవితతో ముగిస్తాను.
‘‘ఈనాడు ప్రేమ అంగడిలో వస్తువు
మన పిల్లలకు
ఈ చలి మంటలు
ప్రేమ కాదు
జీవితాన్ని ప్రేమించటం ఎలానో నేర్పాల్సింది
ఇక మీదట కవులే కదా’’
బతుకు ఎంత ఉక్కిరిబిక్కిరి అయిపోయిందో, మానవ సంబంధాలు అంగడి సరుకై, డబ్బు జీవితాలను ఎలా శాసిస్తోందో చెప్పారు శీలా సుభద్రా దేవి గారు.
కనుక ఈ సరికొత్త వాట్సప్‌ ప్రయోగం ‘తొలి అడుగులు’ కవిత్వం మీరంతా ఆదరించాలని కోరుకుంటూ కవయిత్రులందరికీ అభినందనలతో…

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.