(మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన దుర్ఘటనకు నిరసనగా)
`
ఆడదాన్ని వివస్త్రను చేసి
అవమానించామని
సంబరపడతారు వాళ్ళు.
తమాషా చూడటానికి
ఏముందిరా అక్కడ??
నీకు పాలిచ్చి పెంచిన
పాలిండ్లు తప్ప.
నిన్ను కనడానికి
రక్తమోడిన
జన్మస్థానం తప్ప.
ఆమెను నిందించటానికి నానారకాల
బూతుమాటల ఛందస్సులను
రచిస్తారు వాళ్ళు.
కానీ…!
పలికిన మొదటి మాట
అమ్మ అన్నది గుర్తెరుగరు.
నేడు
తలదించుకోవాల్సింది
ఆడతనం కాదు.
అమ్మతనాన్ని
నడివీథిలో ఊరేగించిన
ఈ దేశం కన్నకొడుకులు.
సిగ్గుతో చచ్చిపోవాల్సింది
వాళ్ళే కదా…!
ఇప్పుడు
ఏ ముఖం పెట్టుకుని
అంటారు ఇక…!
భారత్ మాతా కీ జై అని.