ఆంక్షలు, కట్టుబాట్లు, సంకెళ్ళు వంటి అణచివేతల నుండి ఒక నిరసన, ఆగ్రహం, ధిక్కారం క్రమంగా పోరాట తత్వం తలెత్తుతుంది. అందులో నుండి ముందో, వెనకో అస్తిత్వ ఉద్యమం ప్రారంభమవుతుంది. ఆ కఠినమైన పరిస్థితుల్లో నుండి బలమైన, విలువైన సాహిత్యం పురుడు పోసుకుంటుంది.
పోరుగడ్డ ఖిల్లా, వరంగల్ జిల్లా నుండి ఎదిగి వచ్చిన భండారు విజయ అన్ని రకాల అస్థిత్వ చైతన్యాల పట్ల, పోరాటాల పట్ల, లోతైన అవగాహన కలిగి ఉండి, అణగారిన వర్గాల, పీడితుల పక్షాన నిలబడి బలమైన కవిత్వం, కథలు రాయడం అభినందనీయం.
ఒకవైపు హక్కుల పోరాటంలో చురుకైన పాత్రను నిర్వహిస్తూనే, మరోవైపు అన్నిరకాల అనుభవాలను సాహిత్యంలో నమోదు చేస్తూ, తన కార్యాచరణకు రచనను ఒక వాహికగా ఎంచుకున్నదేమో ‘విజయ’ అని ఈ కథలు చదువుతుంటే అనిపిస్తుంది.
గతంలో ‘‘గణిక’‘ వంటి మంచి కథా సంపుటాన్ని ‘‘స్వయంసిద్ధ’’ వంటి విలువైన కథా సంకలనాన్ని, ఇప్పటికీ మన గుండెల్లో ‘‘తడియారని దుఃఖం’’ వంటి కవిత్వాన్ని పండిరచిన భండారు విజయ ఇప్పుడు తన రెండో కథా సంపుటం ‘‘విభజిత’’తో మన ముందుకు వచ్చింది. జీవితం గురించి గానీ, సామాజిక సందర్భాల గురించి గానీ, అనేక రకాల అసమానతల తాలూకు చిక్కుముళ్ళ గురించి కానీ, చప్పున సమాధానాలు కనిపించకపోయినప్పటికీ, వాటి తాలూకు లోతైన తాత్వికత ఏదో అంతర్లీనంగా ప్రవహిస్తున్నట్లు ఈ కథల్లో మనకు కనిపిస్తుంది.
ఆమెది ఒక సమిష్టి దుఃఖం – ఆమెది ఒక సామూహిక స్వరం
అందరి దుఃఖాలు అందరి ఆవేదనలు తనవిగా భావించి స్పందించే తీరు, చుట్టూ ఉన్న సామాజిక సందర్భాల పట్ల లోతైన అవగాహనతో వాటిని సామాన్యీకరిస్తూ, సాహితీకరిస్తూ మన ముందు ఆవిష్కరించే వైనం మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనం ఒక మాట అనుకుంటూ ఉంటాం. వాళ్ళు జీవించిన కాలంలోనే మనము జీవించాం అని, వాళ్ళు నడిచిన నేల మీదనే మనం కూడా నడుస్తున్నాం అని, వాళ్ళు మనకి పరిచయంగా ఉన్నందుకు గర్విస్తున్నామని, అలా మనం జీవించిన కాలంలోనే, ఒక పెద్ద మహమ్మారి దేశాల మీదుగా విమానయానం చేసి వచ్చి, మనందరినీ అతలాకుతలం చేసి వెళ్ళడం బాధాకరం, దుఃఖ భాజనం. దాని మూలంగా ఏర్పడిన అనేక విధాలైన కష్టనష్టాలను పక్కనపెడితే, అప్పుడప్పుడే ఆడుతూ, పాడుతూ పాఠశాలలకు వెళ్ళి చదువులు నేర్చుకోవలసిన, జీవితాన్ని చూడవలసిన, నాలుగైదేళ్ళ బుడతల్ని కూడా ఈ మహమ్మారి ఎట్లా ట్రాప్ చేసింది, ఎట్లా లాప్‌టాప్‌ల్లో పంజరాల్లో పక్షుల్లా బంధించి వాళ్ళకి ఆ కాస్త బాల్యం కూడా లేకుండా చేసిందో మనందరికీ తెలుసు. ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం ఫీజులు లాగడం కోసం పన్నిన పెద్ద పన్నాగం ‘ఆన్‌లైన్ క్లాసులు’. చిదిమితే పాలుగారే పిల్లలు… అసలు వాళ్ళ బుర్రలు ఎంత పని? వాటిల్లో ఎన్నెన్ని కూరాలి? వాళ్ళకు అసలు ఏం తెలుసని ఈ క్లాసులు? పదాలే సరిగ్గా పలకలేని బుడ్డి పిల్లలు వాళ్ళ మానసిక పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా, బలవంతంగా వారిపై ప్రభుత్వ పాలకులు మోపుతున్న ఒత్తిడి, బలవంతంగా రుద్దుతున్న ఈ పాఠాలు, టీచర్, మాస్టర్, పంతులమ్మ అన్న పదాలకి అర్థం తెలియకుండా వాళ్ళు పాఠం ఎలా అర్థం చేసుకుంటారు? ఈ మొత్తం ఒత్తిడికి వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? అంటూ పాలకులని, ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాన్ని నిగ్గదీసిన ఈ రచయిత్రి, కలంతో కాకుండా హృదయంతో రాసిందేమో ఈ కథ అనిపిస్తుంది.
కథ పూర్తయ్యేటప్పటికి ఈ ఆలోచనలన్నీ పురుగుల్లా మన మెదడును తొలిచేస్తూ ఉన్న చోట మనని నిలవనివ్వవు.
‘‘ఆన్‌లైన్ పాఠాలు’’ అన్న ఈ కథే ఇతివృత్తం. ఈ కోణం మరెవరూ స్పృశించినట్టుగా అనిపించడం లేదు. ఆయా అంశాల పట్ల సైద్ధాంతిక అవగాహన కలిగి ఉండి, పాఠకులను చైతన్యపు దారుల వెంట నడిపిస్తాయి ఈ కథలు.
మన దగ్గరే పుట్టి, మనతో పాటు పెరిగి ఇక్కడే మనతోనే జీవిస్తూ… మైనారిటీల పేరుతో అణచివేతకు గురవుతున్న ముస్లిం పట్ల విజయకు తీవ్రమైన ఆవేదన ఉంది. అన్ని మతాల్లో లాగే, ఇస్లాం మతంలోనూ పితృస్వామ్యం అధికారం చెలాయిస్తూ ఉంటుంది. అందునా బానిసకు బానిసైన ముస్లిం స్త్రీల జీవితాల గురించిన అవగాహనతో, సహానుభూతితో, చక్కటి భాషలో, మంచి కథలు తెలుగు కథా సాహిత్యానికి చేర్పు చేసింది విజయ. ఇందులో ఒకే కుటుంబానికి సంబంధించిన రెండు కోణాల్లో రెండు కథలు ఉండడం విశేషం.
తాగుబోతు భర్తతో, బాధలు పడి అతడి మరణం తర్వాత ఒంటరిగా పిల్లల్ని పెంచుతూ వచ్చిన ముంతాజ్ పెద్ద కూతురు ఫాతిమా, చిన్న కూతురు హసీనా ఒక కొడుకుని ప్రయోజకులను చేస్తుంది. ముస్లిం స్త్రీల జీవితాలను ఈ కథల్లో ఒక్కొక్క కోణం నుంచి విప్పి చెప్పుకుంటూ వస్తుంది విజయ. ‘‘పరదాలు’’ ‘‘హిజాబ్’’…
అన్నిచోట్ల ఉన్నట్లే అక్కడ కూడా ఆడవాళ్ళు కేవలం పిల్లల్ని కనే యంత్రాలుగానే చూడబడతారు. ముసుగులు వేసుకుని ఒక్క మాట కూడా బదులు చెప్పకుండా ఉంటేనే వారి జీవితాలు నిలుస్తాయి.
ఈ కథలు చదువుతున్నప్పుడు ‘షాజహాన’ తన తొలి కథల్లో ముస్లిం స్త్రీల జీవితాలలోని చీకటి కోణాలను విప్పి చెప్పిన వైనం గుర్తుకొస్తుంది. ‘వతన్’ కథలు ముస్లిం జన జీవితాలలో మనకు తెలియని మహారణ్యపు చిక్కుదారులెన్నో మనకి అవగతమైన జ్ఞాపకం మళ్ళీ నన్ను కుదిపేసింది. అయితే ‘‘హిజాబ్’’ కథలో ఫాతిమా, హసీనా ఇద్దరూ కూడా ఈ అణచివేతల పట్ల ఒక అవగాహన కలిగిన వారే కావడం విశేషం. దేశవ్యాప్తంగా హిందుత్వ వాదులు మతం పేరుతో మైనారిటీలపై చేస్తున్న దాడులు, అరాచకాల పట్ల తెలివిడితో ప్రజలంతా తమ అస్తిత్వాలను కాపాడుకుంటున్న నేపథ్యంలో తాము కూడా తమ అస్తిత్వం కోసం హక్కుల కోసం పోరాడాలన్న ఒక ఆలోచనని కలిగి ఉండి, ధిక్కార స్వరంతో, ఆత్మగౌరవంతో ఉండడం మనకు కనిపిస్తుంది.
ఇదే చైతన్యంతో ‘‘పరదాలు’’ కథలో వీళ్ళిద్దరూ తమ జీవితాలను తాము సరిదిద్దుకోవడం, ఏర్పరచుకోవడం కూడా మనకి తృప్తిని కలిగిస్తుంది. కథన శైలి అంతా మంచి శ్లిష్టవ్యావహారికంలో, సాధారణ శిల్పంలో, ఎటువంటి మార్మికత లేకుండా నడుపుతూ, ఎక్కడికక్కడ తెలంగాణ యాసని, ఉర్దూ యాసని సందర్భోచితంగా వాడుకోవడం ప్రశంసనీయం.
ఒక్కో కథ చదువుతున్నప్పుడు ఒక వస్తువు తనంతట తానుగా శిల్పాన్ని ఎంచుకుంటుంది అన్న విజ్ఞుల అభిప్రాయం సరిగ్గా సరిపోయినట్లుగా తోస్తుంది. ఈ కథలన్నీ కూడా పనిగట్టుకుని శిల్పం కోసం, శైలి కోసం ప్రయత్నించినట్లుగా ఉండవు. అత్యంత సహజంగా వస్తువు తనంతట తానుగా శైలి శిల్పాలని సంతరించుకున్నట్లుగా తోస్తుంది. ఒంటరి స్త్రీల జీవితాలలోకి, స్నేహం పేరుతో మెల్లిమెల్లిగా చొచ్చుకు వచ్చి వాళ్ళ జీవితాలను ఆక్రమించాలని చూసే చొరబాటుదారులు పోలీసు శాఖలో కూడా ఉండవచ్చునని ముసుగులు తీసి బట్టబయలు చేస్తుంది రచయిత్రి ‘‘చొరబాటుదారులు’’ కథలో. స్త్రీల చుట్టూ వల విసిరి వారిని ఆక్రమించడానికి, దోచుకోవడానికి, పిదప డబ్బు చేసుకోవడానికి పరాయి మగాళ్ళే కాదు, కుటుంబాలలోని మొగుళ్ళు కూడా కావచ్చునని అర్థం చేయించే కథలు కూడా ఇందులో ఉన్నాయి. పదేళ్ళు కాపురం చేసి పిల్లల్ని కన్న తర్వాత కూడా భార్యని చిత్తు కాగితాల్లా వదిలిపెట్టి, మరో పెళ్ళి చేసుకుని, కొత్త జీవితాల్లోకి ప్రవేశించే మగవాళ్ళు కూడా ఇందులో మనకి తారసపడతారు. విడాకులు తీసుకోవడానికి ముందు, వెనక కూడా స్త్రీలు పడేటువంటి ఘర్షణ, వేదన, మరీ మధ్యతరగతి కుటుంబాల్లో అయితే అది ఎంత కష్టతరమైన విషయమో, ఆమెను ఎన్ని సమస్యలు చుట్టుముడతాయో కూడా సూక్ష్మస్థాయిలోకి వెళ్ళి మనకు ‘‘ఇడుపు కాగితాలు’’ కథ ద్వారా తెలియజేస్తుంది.
భర్తల నిర్లక్ష్యం, నిరాదరణల మూలంగా, ఎంతమంది స్త్రీలు జీవితమంతా నిర్భాగ్యంగా ‘హాఫ్ విడో’లుగా బతికేస్తున్నారో మరో కోణంలోంచి అర్థం చేయిస్తుంది రచయిత్రి ‘‘హాఫ్ విడో’‘ అన్న కథలో. ‘‘జుమ్రీ’’ మరో కొత్త కోణం. ఉత్తర తెలంగాణ గ్రామ సీమల్లో కొన్ని తెగల్లో ఆడపిల్లల్ని అమ్ముకొనడం అనేది ఉందని, మగపిల్లాడు పుట్టేవరకు కూడా ఆ తల్లి ఆడపిల్లల్ని కంటూనే ఉండాలని, మరీ ఎక్కువ మంది పుట్టినప్పుడు ఆ బిడ్డల అమ్మమ్మ నాన్నమ్మలే ఆడపిల్లల్ని అమ్మడానికి ప్రయత్నాలు చేస్తారని తెలిసినప్పుడు దిగ్భ్రాంతికి గురవుతాం మనం. మనసు గగుర్పొడుస్తుంది. అటువంటి మూఢ సాంప్రదాయాల నడుమ నలిగిపోతున్న తల్లుల్ని, అమ్ముడుపోతున్న ఆడపిల్లల్ని మనకి పరిచయం చేస్తూ… ఆ కుటుంబాలలోనే ఈ మూఢత్వాన్ని నిరసించే చదువుకున్న రాందాసు వంటి వారు, ఆ రాందాసు కుటుంబాన్ని అక్కున చేర్చుకున్న విజిత, అనంత్‌ల జంట… ఇదంతా అలా ఉంటే నగరాలలో కూడా వారిమీద ఎంత చులకన భావం ఉంటుందో జుమ్రీని వెంటాడి వేధించే వీథి మగపిల్లలు. ఇవన్నీ ఒక కొత్త ప్రపంచాన్ని మనకు లోతులకు వెళ్ళి అర్థం చేయిస్తాయి. బాగా దగ్గరి అనుబంధం ఉంటేనే తప్ప జుమ్రీ వంటి కథలు రాయడం అసాధ్యం. ఇలా విభిన్నమైన అంశాలను కదేతివృత్తాలుగా గ్రహించి జీవితపు లోతులను పరామర్శించిన కథలు ఇవి. జీవితాలను తమవైపు నుంచే కాక, అవతలి వైపు వారి దృష్టి కోణం నుంచి కూడా అర్థం చేసుకోమని బోధించే కథలు ఇవి. ఎక్కువ భాగం కథలు, ఎక్కువ పాత్రలు లేకుండానే సమగ్ర జీవితాన్ని ఆవిష్కరించినవిగా కనిపిస్తాయి. మరికొన్ని కథలు స్వేచ్ఛగా ప్రయాణించడం కూడా మనకి కనబడుతుంది. మొత్తంగా చూసినపుడు ఈ కథలన్నీ కూడా మనువాదానికి, పితృస్వామ్యానికి, అగ్ర కుల, ప్రాంత ఆధిపత్యానికి, బ్రాహ్మణీయ కట్టుబాట్లకి వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడిన తూణీరాలే అనిపిస్తుంది. స్త్రీల సమస్యల పరిష్కార దిశగా, ‘ఫీల్డ్ వర్క్’ చేసే క్రమంలో తనకు దగ్గరగా వచ్చిన స్త్రీల ఆవేదనలు, కష్టాలు, కన్నీళ్ళు వాటికి కౌన్సిలింగ్ మాత్రమే కాక ఆ జీవన చిత్రాలని సాహిత్య చరిత్రలో నమోదు చేయడం భండారు విజయ సాధించిన విజయంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఒక్కో సామాజిక అంశాన్ని, లేదా స్త్రీల జీవనాంశాలని ప్రస్తావించి, రచయిత్రులందరినీ ఒక చోటికి చేర్చి చర్చించి, ఒక్కో రచయిత్రితో ఒక్కో కోణాన్ని కథగా రాయించి ప్రచురించడం ఒక కొత్త కార్యాచరణ, విజయకు సంబంధించిన మరో కోణం.
ఆ క్రమంలో హస్మిత ప్రచురణల ద్వారా ‘‘స్వయంసిద్ధ’’ అన్న కథా సంకలనంలో నలభై మంది రచయిత్రులతో కథలు రాయించి, ప్రచురించి, ఆవిష్కరణలు జరిపి విజ్ఞుల నుండి ప్రశంసలందుకోవడం ఆమె సాధించిన మరో విజయం. ‘‘గణిక’’ వంటి కథా సంపుటితో తెలుగు కథా సాహిత్యంలోకి వేగంగా దూసుకొచ్చిన భండారు విజయ రెండో కథా సంపుటి ‘‘విభజిత’’లో 17 కథలు ఉన్నాయి. అన్ని కథలూ వివిధ కోణాల్లో చర్చించదగినవే. మానవ సంబంధాల పరిమళాలు వెదజల్లే భండారు విజయ ‘కథల బంగారు లోకం’లోకి పాఠకులను సాదరంగా ఆహ్వానిస్తూ, విజయను అభినందిస్తున్నాను.