జీవితంలో ఒకసారైనా కలవకుండానే వారి గురించి ఇలా రాయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐదేళ్ళ క్రితం రైటర్స్ మీట్ ద్వారా నాకు పరిపూర్ణ గారి కుమారుడు దాసరి అమరేంద్ర పరిచయం. అపర్ణ తోట కూడా. తర్వాతెప్పుడో అమరేంద్ర గారు పరిపూర్ణ గారు రాసిన ‘‘వెలుగుదారుల్లో’’ పుస్తకం పంపించారు. అలా ఆమె జీవితం నాకు పరిచయమైంది. నంబూరి పరిపూర్ణ గారి జీవితం నిండైనది,
సాహసోపేతమైనది. ఇప్పటికీ స్వంతంగా నిర్ణయాలు తీసుకోవాలంటే పలుమార్లు ఆలోచించాల్సి వస్తున్న స్త్రీలకు ఆమె జీవితం చాలా నేర్పిస్తుంది. ఆమె పరచిన దారులు ఒక స్పష్టతను ఇస్తాయి.
అపర్ణ తోట సోషల్ మీడియా ద్వారా పరిపూర్ణ గారి గాత్రాన్ని పరిచయం చేశారు. అంత నిండు వయసులో కూడా ఆమె జ్ఞాపకశక్తి, ఆమె పాడిన పాటలు నన్ను అబ్బురపరిచేవి. పరిపూర్ణ గారు ప్రతిరోజూ పుస్తకాలు చదువుకోవడం, రాసుకోవడం చూసి నాకున్న బద్ధకాన్ని తిట్టుకునేదాన్ని. నా మొదటి కథాసంపుటి వచ్చాక అమరేంద్ర గారు పుస్తకం కొనుక్కున్నారు. తర్వాత జరిగింది నేనెప్పటికీ ఊహించలేని విషయం.
పరిపూర్ణ గారు నా పుస్తకం చదివారు. అమరేంద్ర గారు మా ఇద్దరి మధ్యా వారధిగా మారారు.
నంబూరి పరిపూర్ఱ గారు నా పుస్తకం చదవడం నా గొప్పయితే, పుస్తకం చదివి దానిపై తన అభిప్రాయాన్ని ఆమె చేతివ్రాతతో నాకు పంపడం నా అదృష్టంగా భావిస్తాను. ఆ ప్రతిని నేను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు, నన్ను అభినందించారు. పుస్తకం గురించి ఆమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పరిపూర్ణ గారి విశ్లేషణ నుంచి కొన్ని మాటలు ఇక్కడ అందరితో పంచుకుంటున్నాను.
‘‘డిశంబరు 22, శుక్రవారం సాయంత్రం ` మా అమరేంద్ర ఓ పెద్ద సాహితీ సభకు హాజరై చేతబట్టుకొచ్చిన కొన్ని సాహిత్య సంబంధ పుస్తకాలలోంచి, ఓ కథల సంపుటి ` దేవుడమ్మ పేరున నా కంటపడిరది. అది ఒక రచయిత్రి`రచన అన్నది గుర్తించి, వెంటనే చేతబట్టి, చదవడం ప్రారంభించాను.’’
‘‘ఇంత మాత్రం చదివినప్పుడు`నాలో కలిగిన అభిప్రాయాలను తెలియజేయకుండా ఉండడం అసాధ్యం. రచయిత్రి` రaాన్సీ`ఆంధ్ర దేశ అన్ని ప్రాంతాల భాషలను, పలుకుబడులను స్వంతం చేసుకోవడంలో మంచి నిష్ణాత!
ఈనాటికీ అమలవుతున్న నేటి సమాజ ఆలోచన ఆచరణలలో ఆదిమ, మధ్యయుగాల మూర్ఖ విశ్వాసాలు, సంబంధిత అణచివేత హింసలు అధిక వర్గ వర్గాల ఆధ్వర్యాలలో, పెత్తనాలలో జరిగిపోతున్నవి. సామాన్య నిరుపేదలు, అంటరానివన్న వర్గ ప్రజలను మనుషులుగా గుర్తించకపోతూ, వారి శ్రమ చాకిరీలను`రాత్రింబవలు అతి క్రూరంగా దోచుకుని, వారిని ఆకలికీ, అతి అసమానతలకు బలిగావించుతున్న రాక్షస వాస్తవాలను ప్రజల దృష్టికి తెస్తున్న కథలు`రaాన్సీ గారి కథ వస్తువులని నా అభిప్రాయం.
ఇంతటి అభ్యుదయ రీతిలో, సామాన్య ప్రజలను, తన రచనలతో స్పందింపజేస్తూ, వారిని అన్ని రకాల దోపిడీలను సమైక్యతతో, ధీరత్వంతో ఎదుర్కొనేలా రచయిత్రి తన కథాకథనాలను కొనసాగించుతున్నందుకు`అత్యంత అభినందనీయురాలు. దేవుడమ్మ రచయిత్రి`శ్రీమతి రaాన్సీ పాపుదేశి గారికి`నా హృదయపూర్వక అభినందనలు.
నంబూరి పరిపూర్ణ
24.12.2022’’
పుస్తకం రాసింది ఒక రచయిత్రి అన్నది గుర్తించి చదవడం ప్రారంభించానని చెప్పడంలోనే ఆమె మహిళా పక్షపాతి అన్న విషయం స్పష్టమైపోతుంది. అక్కడే పరిపూర్ణ గారు నాతో ఒక బంధాన్ని ఏర్పరచుకున్నారు. ఎప్పుడూ కలవకపోయినా ఆమె వివరాలు అపర్ణ, అమరేంద్ర గారి ద్వారా ఏదో రకంగా తెలుస్తూనే ఉండేవి. పరిపూర్ణ గారు వెళ్ళిపోయినా ఆమె పంపిన ఈ చిన్న లేఖ ఎప్పటికీ నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహిస్తుంది, ఉత్సాహపరుస్తుంది, ప్రేరణనిస్తుంది.