నా పుట్టిన రోజు వేడుకనెవరూ
ఆచరించకున్నా…
నా ఎదుగుదల ఎత్తులనెవరూ
అభిలషించకున్నా…
నా చదువు సంస్కారాల పూ పరిమళాన్నెవరూ
ఆఘ్రాణించకున్నా…
నా ఆటపాటల విజయ సోపాలనెవరూ
ఆమోదించకున్నా…
నా గుణాల ముత్యపు రాశులనెవరూ
అభిమానించకున్నా…
నాలోని భూదేవంత ఓరిమినెవరూ
అభినందించకున్నా…
అలక్ష్యపు అలల తాకిడిని సృష్టించి
అనుక్షణం వెనక్కే నెడుతున్నా…
అవహేళనల రాళ్లను విసిరి
అనుకోని గాయాలు చేస్తున్నా…
సంయమనపు చెరకు తీపి రుచి చూపాలని…
చెలిమి చెలమనై బీడు గుండెల్ని మెత్తబరచాలని…
సంతోషపు దివ్వెగా హృదయాలయాలలో వెలగాలని…
సంబంధాల పదిలానికి తాళపు చెవినై నిలవాలని…
మమతల మల్లియనై మదిమదిలో విరియాలని…
మానవ తత్వాలను మనసు పొరల్లో పాదుకొలపాలని…
మారణ హోమాలు లేని మహత్తరమైన భవితకు నాందినవ్వాలని…
మళ్లీ మళ్లీ సహనంగా ప్రయత్నిస్తూనే వుండే ‘స్త్రీ మూర్తి’ని!