డియర్ బంగారం
ఒక్కోసారి అన్నీ ఉన్నా ఏదో వెలితిగా అనిపిస్తుంది. అన్నీ ఉన్నాయని అనుకోవడం కూడా మిథ్య అనిపిస్తుంది. మనసు, మైండ్, హృదయం, ఆలోచనలు ఎన్ని రకాలుగా అనుకున్నా లోపల ఉన్న సాఫ్ట్వేర్ అంత సులభమైనది ఏమీ కాదు… అది దాని ఆటలు ఆడుతూనే ఉంటుంది. ఎంత విచిత్రం కదా. ఏది బాగా కావాలనుకుంటామో అది నెరవేరిన తర్వాత కూడా కొత్త లక్ష్యాలు, కొత్త గమ్యాలు ఏర్పడి, అవి దొరకలేదు, అవి మనం అనుకున్నట్లుగా కూడా అవలేదు అని ఆలోచిస్తూ ఉంటాం…!!
చాలాసార్లు మనం గతం తాలూకా నీడలోనో, భవిష్యత్తు భయంలోనో, ప్రస్తుతాన్ని బేరీజు వేస్తూ ఉంటాం. ఆ తక్కెడలో ఒక్కోసారి అంతా ఫెయిల్యూర్లాగా అనిపిస్తుంది. పైగా మనం ప్రేమించే వాళ్ళ ఫెయిల్యూర్స్, దుఃఖాలు, డిసప్పాయింట్మెంట్స్ ఇవన్నీ మనల్ని కుదిపేసి రోజువారీ ఆనందానికి మనల్ని దూరం చేస్తాయి. జీవితాన్ని, మనుషుల్ని మనం ఎంత కంపేర్ చేస్తే అంత జడ్జిమెంటల్‌గా ఆలోచిస్తాం, చాలా దుఃఖపడతాం కూడా. మనకు కూడా లోపల తెలుస్తూనే ఉంటుంది ఇది ఒక ఫేజ్ అని, మనం అనుభవించిన దానిలో ఇది చాలా చిన్న విషయమని. కానీ కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఒక విషయం మీదే కేంద్రీకృతం అయినప్పుడు, మన ఆశలు, కోరికలు, అన్నీ కూడా ఆ ఒక్క విషయం మీద, మనిషి మీద బేస్ చేసుకుంటాం. నిజానికి, మనం అనుభవించే చాలా దుఃఖాలు మనకి దొరకడానికి మనం… అన్ని నేరాలు, ఘోరాలు ఏమీ చేయలేదని కూడా మనకు తెలుసు. కానీ, భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయం కావచ్చు, గతం తాలూకు నీలి నీడలు కావచ్చు… అదే బెంచ్ మార్క్‌గా చేసుకుని మనం దుఃఖంలో ఉంటాం. కొన్నాళ్ళకి ఇది ఇంతే అనే నిరాశావాదం లాంటివి మనల్ని పలకరిస్తాయి. నిరాశ చాలా విచిత్రమైనది. అది మన చుట్టూ వైఫైలా తిరుగుతూనే ఉంటుంది. నేనే ఎందుకు, నాకే ఎందుకు, నా జాతకం బాగోలేదేమో, నాకెందుకు ఇబ్బందులు లాంటి ఆలోచనల మధ్యనే ఉండే వైఫై నెట్వర్క్ అది.
చాలాసార్లు మనం ఏదైనా నెట్‌వర్క్‌లోకి వెళ్ళేముందు అది మనల్ని అడుగుతుంది ‘ఇది సురక్షితమని నువ్వు అనుకుంటున్నావా? ఈ నెట్వర్క్ని నువ్వు సేవ్ చేసుకోవాలని అనుకుంటున్నావా?’ అని. ఏ రోడ్డు మీదో, ఎయిర్పోర్టులోనో నెట్వర్క్ సురక్షితం కాదని మనకి కూడా తెలుసు కదా. ఇకపోతే మనం కంట్రోల్ చేయలేని కొన్ని విషయాల గురించి… భయం ఒక వైరస్ లాంటిది. నీకు తెలుసు కదా వైరస్‌ని ఎదుర్కోవాలంటే ఎన్ని యుద్ధాలు చేయాలో. భయం లేని వాడు, భయపడని వాడు మనిషే కాదు. కానీ, ఎదుర్కో గలిగి కూడా ఎదుర్కొనని అశకత్త ఆవరిస్తుంది అప్పుడప్పుడూ. దాని గురించి నేను మాట్లాడేది…!! నిజానికి ఇవన్నీ నీకు తెలియవని కాదు… కానీ రోజూ చూసుకునే ముఖమే అయినా, బయటికి వెళ్ళేముందు ఒకసారి అద్దంలో మొఖం చూసుకుని వెళ్తాం కదా. అలా అద్దంలో కనబడే ఆలోచనల గురించి నేను మాట్లాడేది…!!
మనం ప్రేమించే వాళ్ళకి మనం ఎప్పుడూ ధైర్యమే. మనం ఉన్నామని వాళ్ళు చాలా పనులు చేస్తూ ఉంటారు.
వాళ్ళు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా వాళ్ళ వెనుబలం మనం. ఈ శరీరాన్ని మోయలేను అని వెన్నెముక ఎప్పుడైనా అనుకున్నా సర్వం కొలాప్స్ అయినట్లే కదా…!! కాబట్టి బంగారం… గొడవపడు, భయపడు, భయపెట్టు, బెదిరించు, బతిమాలు, నెగోషియేట్ చేయి, కష్టపడు, కష్టం తెలిసేలా చెయ్. కానీ… జీవితం మీద, జీవనం మీద, నీ నిర్ణయాల మీద పట్టు మాత్రం వదిలేయకు. ఎందుకంటే, ఆ పట్టులోనే నువ్వు అనే ఒక నిర్దిష్టమైన చిరునామా ఉంది కనుక!!
ఇంత ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు కూడా నా వెనుబలం కాబట్టి…!! నువ్వంటే నాకు ఇష్టం మాత్రమే కాదు, ప్రేమ, గౌరవం కూడా. ఇష్టాయిష్టాలు నువ్వు చేసే పనులను బట్టి మారుతాయి లేదా నేను చూసే తీరును బట్టి కూడా మారుతాయి… కానీ, ప్రేమ, గౌరవం లాంటివి నిశ్చలం… అచలం…!!
ప్రేమతో… సాయిపద్మ
(ఒక స్నేహిత కోసం రాసిన ఉత్తరం… నా దుఃఖంలో వెనుబలం అయిన స్నేహితులకి అంకితం)