ఆరంభాలు యాధృఛ్చికం అవ్వొచ్చు
కానీ ముగింపు ఎప్పుడూ మన చేతుల్లోనే
ముగింపు – మనకున్న ఆయుధం
మన పోరాటపు విజయం
ముగింపు – రెక్కలు టపటపలాడిస్తున్న స్వేచ్ఛ
ముగింపు ధిక్కారపు సంబురం
కుళ్ళిన ఇరుకు దారులను మరలి
మైదానాలకు పరిగెత్తి చెట్ల
చిటారుకొమ్మలతో సయ్యాటలాడే గాలి
అసలు ముగింపు అంటేనే
బంధాల పీటముడి వీడేవేళ
వినపడే వేయి తీగ తంత్రుల సింఫనీ
ఆరంభాలు అందమైనవైనప్పుడు ముగింపు లోని అందాన్ని వెతకమెందుకు?
ముగింపు – చుక్క, నిశ్శబ్దం.
అద్భుత సంగీత రaరిలో తడిచి మునిగి మునకలేస్తున్న తర్వాత అందుకునే మౌనం.
ఆ మౌనంలో బిందువు.
నువ్వు.
…
ముగింపు అంటే బరువు దింపుకోవడం, హింసను నిలిపివేయడం, కళ్ళాలు మన చేతిలోకి తీసుకోవడం.
ముగింపు విజయకేతనం. స్వావలంబనకు ఆరంభం.
ముగింపు మరో తొలి అడుగుకు ముందు తీసుకునే దీర్ఘ నిశ్వాస.
…
ఆరంభాలు ఒంటరి కావచ్చు. ప్రయాణా లలో కొందరిని కలవచ్చు. కలిసి కొంత కాలం సాగవచ్చు. చివరి దాకా లేరు అని బాధపడడం. మధ్యలోనే కలలు కరిగి పోవడం చూస్తాం.
ఆ కలలను పట్టి ఆపడానికి చేసే నిస్సహాయపు ఆర్తనాదాలు! అందులో నుండి వలయాలు వలయాలుగా పైపైకి రేగే హింస!
అందరు అనుకునే దారిలో వెడుతూ ఉన్నట్టుండి వేరే దారిని ఎంచుకోవడం భయపెట్టే విషయమే అయి ఉండొచ్చుగాక!
మనం వెళ్తున్న దారి ముళ్ళదారిగా మారిపోతున్నప్పుడు, ఏ అడుగు ఎంత లోతులో పడుతుందో తెలియనప్పుడు, ఊబిలో చిక్కుకు పోతున్నామని తెలిసినప్పుడు
తెలీదూ… ముగించాలని! అయినా ఎందుకు అంత భయం.
బలవంతపు ముగింపులు వద్దు. కానీ బలవంతపు సాగతీతలు అసలే వద్దు కదా.
ఎటువైపుకు సాగుతున్నామో స్పష్టత లేకపోవడం, పిచ్చెక్కిపోయేలా ఆలోచిం చడం, న్యూనత, అవమానం – జరిగిన లేక జరుగుతున్న విషయాలను గురించి పదేపదే బాధపడడం
ఆరోగ్యాలు పాడవడం, స్వయంగా హింసించుకోవడం లేదా పిల్లలను హింసిం చడం, స్నేహితులను దూరం చేసుకోవడం, మనలను మనమే మభ్యపెట్టుకోవడం.
ఎందుకమ్మా ఇవన్నీ..?!
అపరాధ భావనలు, అనుమానాలు వద్దు ఇక! చేతులు సాచి సాయం అడుగుదాం, అర్థం చేసుకుందాం, ధైర్యం కూడగట్టుకుని, నిర్ణయించుకుందాం, సంభాషణ ప్రారం భిద్దాం.
గతం కాదు, భవిష్యత్తు పై చూపు సారిద్దాం
….
జ్ఞాపకాలు గాలిలో తుంపరలై తాకుతు ంటాయి. కలిసి గడిపిన నిమిషాలు మబ్బులై పైకి చేరి గొడుగు పడతాయి. బరువె క్కినప్పుడు వర్షిస్తాయి.
వర్షానికి మనసు తడుస్తుంది. ఆ తడి అంచున కొత్త చిగురులు మెరుస్తాయి.
కొన్ని స్నేహాలు మొలకలెత్తుతాయి. అనుభవాలు వికసిస్తాయి.