నిత్య శంకితుడు – పెనుభూతం వాడు.
ఎవడితో కడుపు? అంటూ చావుదెబ్బలు
పాదాలనంటి ప్రమాణం చేస్తుంది.
ఏ పాపం ఎరుగ నంటుంది….
హఠాత్తుగా దాడి… పిడిఘాతంతో
విచ్చిత్తి అయిన అపురూప సృష్టి
కరుగుతుంది ఏకధారగా
పారుతుంది కన్నీటి ప్రవాహమై
మవునమే సముద్రమైన రాత్రి
క్షణమొక యుగమైన రాత్రి
ముల్ల పడకపై దొర్లిన రాత్రి
రాక్షస భౌతిక భంగానికి లొంగిన
ఒకానొక రాత్రి
మొగ్గ తొడిగిన మరో ప్రాణం
తన వారింట్లో తలదాచుకుంది
శిశువు పరిపూర్ణంగా రూపు దాల్చి
ప్రసవ సమయం దగ్గరవుతుండగా
ప్రత్యక్షమవుతాడు….
భద్రతా బంధాలు ఆదుకుంటాయి
తరిమి కొడుతుంది …..
మళ్ళీ మళ్ళీ వస్తూ పోతూ భయపెడుతూ….
బెదిరిస్తూ…..
మింగుతున్న కన్నీటి జలధి పరిచిన
మమతల ఊయలపై కదలాడుచున్న……
కలువ వన్నెల ఫలం… మురిసి పోతుంది….
పొంచు గాస్తూ…. ఓ రాత్రి
ఆ బిడ్డ నెత్తుటి సాక్షిగా జన్మ నిచ్చిన తండ్రి
నిదురించే పసికందును నేలకు బలి
చేయబోతుండగా…..
ఎక్కడ దాగుందో ఆమెలోని ఆడపులి …
విరుచుకుపడుతున్న
ఈహామృగమై గావుపడుతుంది.
భీకర యుద్ధంలో ఆమెది గెలుపు
……….అతడి ముగింపు
చట్టం ముందు చాచిన చేతులకు బేడీలు
యావజ్జీవ కారాగారశిక్ష !?!?
ఆత్మ రక్షణ కేసుగా
బిడ్డకు పాలు తాపు అనుమతి
బాలింత వాసన వీడక ముందే
బండ చాకిరి…. ఆరని పచ్చి దేహంతో
అశుద్ధ సేవలు – రాత్రనక పగలనక
కాగాగార శ్రామిక….
అమ్మమ్మ చెంత పెరుగుతున్న చిన్నారి నాన్న
గడువుముందే గౌరవంగా విడుదల
గావించిన ఆమె అసమాన విధేయత
ఆమె ప్రాణం తీసిన అపరాధ హంతకి ?
బిడ్డ కొరకు బిడ్డకు తల్లి కొరకు
రెండు ప్రాణాలను రక్షించుకున్న నిరపరాధి ?
ఆ తల్లిని ఏమనాలి? ఎలా పిలవాలి?
