‘ఒక అమ్మాయికి పదేపదే పరీక్ష రాసే అవకాశం ఎవరిస్తారు?’ – సంస్కృతి తల్వార్, సంధ్య, / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి
ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందాలని కలలు కనే మహిళలు ముందుగా పితృస్వామ్య సమాజం సృష్టించే అడ్డంకులను అధిగమించడానికి మరింత కష్టపడాలి; ఆ పైన, పరీక్షా విధానంలో ఉన్న లోపాలు వారి పోరాటాన్ని రెండింతలు దెబ్బతీస్తాయి

“పరీక్షకు సిద్ధం కావటం మా బాధ్యత. ప్రశ్నపత్రాల భద్రతను చూసుకోవడం అధికారుల పని,” అని అంశు కుమారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
సుమారు 24 ఏళ్ళ వయసున్న అంశు కుమారికి పోటీ పరీక్షలతో ముడిపడి ఉండే ఒత్తిడి గురించి బాగా తెలుసు. ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూన్న ఆమె ఒక ఓపెన్ యూనివర్సిటీ నుండి బి.ఎడ్. (B.Ed.) కోర్సును చేస్తూనే, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలనే లక్ష్యంతో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) కోసం కూడా సన్నద్ధమవుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఆశతో అంశు 2023, 2024లలో బ్యాంక్ నియామక పరీక్షలకు హాజరయ్యారు. ఆ ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఆమె బోధనా వృత్తి వైపుకు మళ్ళి, రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ నియామక పరీక్షల కోసం రాత్రివేళల్లో చదవుకోవడం ప్రారంభించారు.
బిహార్‌లోని బెగూసరాయ్ జిల్లాకు చెందిన అంశు కుటుంబం 2000వ సంవత్సరం ప్రాంతంలో ఫరీదాబాద్‌కు మారింది. అక్కడ ఆమె తండ్రికి ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో కూలీగా పని దొరికింది.
ఇటీవలి ప్రశ్నపత్రాలు లీక్ అయిన ఘటనలు ప్రభుత్వం పట్ల ఆమెలో నిరాశనూ కోపాన్నీ నింపాయి. “కనీసం దాన్ని (ప్రశ్నపత్రాల లీక్‌లను) కూడా నివారించలేకపోతే, ఒక విద్యార్థి ఎక్కడికి వెళ్ళాలి?” అంశు ప్రశ్నిస్తున్నారు.
“ఒకవేళ మీరు (ప్రభుత్వం) ఆ పని చేయలేకపోతే, పక్కకు తప్పుకోండి,” పోయినవారం మొదట్లో మేం జంతర్ మంతర్ వద్దకు వెళ్ళినప్పుడు జరిగిన మా సంభాషణను శ్రద్ధగా వింటోన్న సాధనా జాదౌన్ అంటున్నారు.
సమీపంలోని హరియాణాలో ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ అయిన సాధన, పదేపదే జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలకు, ప్రజా సంస్థలు, విశాల వ్యవస్థ, ప్రభుత్వ పరిపాలనపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతినటానికి వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రారంభించిన నిరసనలో పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద సాగిన ఈ నిరసన, జూలై 25, 2026న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో తన మొదటి విజయాన్ని సాధించింది.
తమలాంటి తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలే ఏకైక ఆశ అని ఈ ఉపాధ్యాయినులు PARI రిపోర్టర్లతో చెప్పారు. అలాగే, అధికారిక ఉద్యోగ రంగంలో మహిళలకు లభించే కొద్దిపాటి న్యాయమైన అవకాశాలలో ఇది కూడా ఒకటి.
“అసలు ఒక అమ్మాయికి పదే పదే పరీక్షకు హాజరయ్యే అవకాశం ఎవరిస్తారు?” ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన సాధన ప్రశ్నిస్తారు. 18 ఏళ్ళ వయసులోనే ఆమెకు వివాహం జరిగింది. ప్రస్తుతం 35 ఏళ్ళ వయసున్న ఆమె, ఒకప్పుడు ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే పోటీ పరీక్షలకు ఎంతో శ్రమతో సన్నద్ధమయ్యేవారు. ఆమె స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పరీక్షకు రెండుసార్లు హాజరయ్యారు కూడా. “ఆ రెండుసార్లూ కూడా రాష్ట్రంలో చెలరేగిన మతపరమైన ఘర్షణల కారణంగా పరీక్ష రద్దయింది,” అని ఆమె ఆ రోజులను గుర్తుచేసుకున్నారు. తన ప్రయత్నాన్ని విరమించుకోవడానికి సిద్ధంగా లేని సాధన, ఉత్తరప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UPTET)ను దృష్టిలో పెట్టుకొని, తన బి.ఎడ్. (B.Ed) చదువును పూర్తి చేశారు. ఒక సందర్భంలో అవే మతపరమైన ఘర్షణల కారణంగా ఒక పరీక్ష రద్దు కాగా, మరో సందర్భంలో ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్షను నిలిపివేశారు.
మూడవసారి పరీక్ష రాయడం మరింత బాధాకరంగా ముగిసింది. సాధన తన జవాబు పత్రంలో సగానికి పైగా పూర్తి చేసి ఉండగా, అధికారులు పరీక్ష జరుగుతోన్న గదిలోకి వచ్చి జవాబు పత్రాలను తీసేసుకోవటం ప్రారంభించారు.
“ఆ ప్రశ్నపత్రం మళ్ళీ లీక్ అయ్యింది,” భావోద్వేగం నిండిన స్వరంతో చెప్పారామె. కళ్ళలో నీళ్ళు నిండగా, “ఈ బాధను మాటల్లో చెప్పలేను,” ఆమె చెప్పారు. సరిగ్గా అప్పుడే, నిశ్శబ్దంగా నిలబడి ఆమె మాటలు వింటోన్న ఒక యువ నిరసనకారుడు ఆమెకు నీళ్ళ సీసా అందించారు. ఇలాంటి ఆటంకాలు పదేపదే ఎదురవ్వడం ఆమెకు పరిస్థితులను మరింత కష్టతరం చేస్తూ వచ్చింది; ఎందుకంటే, వివాహం తర్వాత చదువును కొనసాగించడమే ఒక పెద్ద పోరాటం.
“భారతదేశంలో అమ్మాయిలు ఎక్కువ చదువుకోవడాన్ని ప్రోత్సహించరు. నేను ఆ పరిస్థితిని తట్టుకుని నిలబడ్డాను… నా ప్రాణం తీసుకునే పని చేయలేదు. కానీ రాబోయే తరం గానీ, నా సొంత పిల్లలు గానీ, దీనిని తట్టుకొని నిలబడగలరనే గ్యారంటీ ఏమీ లేదు,” ఆమె PARIతో చెప్పారు.
జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజా రవాణా సేవలన్నిటినీ నిలిపివేయడంతో సంధ్య, సాధన, అంశు, ప్రియాంక నిరసనలో పాల్గొనేందుకు ఫరీదాబాద్ నుండి ఆటో రిక్షాలో వచ్చారు.
వీరెవరూ తాము నిరసనలో పాల్గొనడానికి వెళ్తున్నట్లు తమ కుటుంబాలకు చెప్పలేదు; తాము బోధించే పాఠశాలల నుండే నేరుగా ఇక్కడికి వచ్చారు. “నిరసనల సమయాల్లో పోలీసులు అమ్మాయిలను ఇష్టానుసారం ఈడ్చుకుపోవడాన్ని, దౌర్జన్యం చేయటాన్ని వీడియోల్లో చూశాక, ఏ కుటుంబమైనా అమ్మాయిలను ఇక్కడికి రావడానికి ఎలా అనుమతిస్తుంది?” అంశు అడిగారు. “మా కుటుంబాలు మాకు అనుమతి ఇవ్వలేదు, కానీ విద్య లేకుండా నీ భవిష్యత్తును నువ్వు నిర్మించుకోలేవని మేం నమ్ముతున్నాం.”
ప్రిన్సిపాల్ సాధన అందరినీ తనతో పాటు తీసుకువచ్చారు. “ఈ రోజున మేం నిలబడకపోతే, మాలో దాచుకున్న ఆ బాధ గురించి ఎప్పటికీ మాట్లాడలేకపోయామే అని చింతిస్తామని మాకనిపించింది. కనీసం, ఇంతకాలం మాలో అణచిపెట్టుకున్న ఆగ్రహాన్నైనా బయటపెట్టాలని మేం కోరుకుంటున్నాం,” సాధన PARIతో చెప్పారు.
పోటీ పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే సంధ్య, ఆమె కుటుంబం పేదరికం నుండి బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం. “నా కుటుంబం ఆశలన్నీ నాపైనే ఉన్నాయి. నేను చదువు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని వారు కలలు కంటున్నారు,” నలుగురు తోబుట్టువులలో ఒకరైన 23 ఏళ్ళ సంధ్య చెబుతున్నారు. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ఆమె దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారు.
సంధ్య ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లా, తులసీపూర్ గ్రామానికి చెందిన ఒక చిన్న రైతు కుటుంబం నుండి వచ్చారు. ఆ కుటుంబానికి రెండు బీఘాల (సుమారు 1.2 ఎకరాలు) కంటే తక్కువ భూమి ఉంది, అందులో వారు తమ ఇంటి అవసరాల కోసం గోధుమలు, వరి పండిస్తారు. పేదరికం కారణంగా కుటుంబ అవసరాలు తీర్చుకోవాల్సిన అనివార్యతతో, ఆమె తమ్ముడు చిన్న వయసులోనే పని చేయడం మొదలుపెట్టాడు, అదే సమయంలో సంధ్య తన చదువును కొనసాగించింది. ఆమె అక్కలందరికీ వివాహాలయ్యాయి.
రెండేళ్ళ క్రితం, సంధ్య కుటుంబం ఇటావా నుంచి హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఒక అద్దె గదిలోకి మారింది. ప్రస్తుతం సంధ్య ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రాథమిక పాఠశాల పిల్లలకు బోధిస్తుండగా, ఆమె తమ్ముడు మందులను సరఫరా చేసే పని చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి నెలకు సుమారు రూ.22,000 సంపాదిస్తున్నారు, ఇందులో నాలుగవ వంతు మొత్తం కేవలం ఇంటి అద్దెకే పోతుంది.
ప్రైవేట్ రంగంలో పనిచేయడం సంధ్య లక్ష్యం కాదు. కేవలం సొంతంగా ఇంటి ఖర్చులను జరుపుకోవటానికే తానీ ఉద్యోగం చేస్తున్నానని ఆమెకు స్పష్టంగా తెలుసు. అదే సమయంలో, ఆమె ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాయడాన్ని కూడా కొనసాగిస్తున్నారు.
2022లో ఆమె ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష రాసి, ఆ పరీక్షలో ఉత్తీర్ణత కూడా సాధించారు. అది ఒక పురోగతిలా అనిపించింది. కానీ ప్రశ్నపత్రం లీక్ కావటంతో ఆ పరీక్షను రద్దుచేశారు. “అది నా మొదటి ప్రయత్నం. మళ్లీ ప్రయత్నించమని నా కుటుంబం నాకు మద్దతునిస్తూ ప్రోత్సహించింది,” అన్నారు సంధ్య.
ఆమె తర్వాత రాసిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షలో కట్-ఆఫ్ మార్కుల కంటే తక్కువ వచ్చాయి. ఈ ఏడాది ఆమె ఉత్తర ప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం క్లర్క్ వంటి గ్రూప్ సి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉద్దేశించిన ప్రిలిమినరీ ఎలిజిబిలిటీ టెస్ట్ (PET)) కోసం సన్నద్ధమవుతున్నారు.
వైశాలి జిల్లాకు చెందిన 31 ఏళ్ళ ప్రియాంక యాదవ్, 2015లో వివాహం తర్వాత ఫరీదాబాద్‌కు మారారు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆమె తన బి.ఎడ్. విద్యను పూర్తి చేశారు. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)కు పలుమార్లు హాజరైన ఆమె, చివరకు గత ఏడాది ఆ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. బిహార్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ప్రకటించినప్పుడు, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని ఆమె ఆశిస్తున్నారు. అయితే, ఆ నియామక ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు.
“మేం పరీక్షలకు సిద్ధపడుతూ, ఎదురుచూస్తూ ఉంటాం. కానీ నియామక ప్రకటనలు ఎప్పుడూ రావు,” అంటారు ప్రియాంక యాదవ్. ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలైన ప్రియాంక, తమ పిల్లలకు మెరుగైన విద్యావకాశాలు లభిస్తాయని, అలాగే పోటీ ప్రవేశ పరీక్షలలో మంచి అవకాశాలు ఉంటాయని ఆశిస్తూ బిహార్ నుండి ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో స్థిరపడటానికి వలస వచ్చే అనేక కుటుంబాలను చూశారు.
… … …
“ప్రభుత్వం, వ్యవస్థ నాకు అవకాశం ఇవ్వనప్పుడు, నేనే స్వయంగా ఒక అవకాశాన్ని సృష్టించుకోవాలనుకున్నాను,” అన్నారు సాధన. “ఎవరూ గుర్తించకపోయినా, విలువనివ్వకపోయినా, నాలో ప్రతిభ ఉందని నిరూపించాలనుకున్నాను. అందుకే నేను నా సొంత పాఠశాలను ప్రారంభించాను.”
ఇక్కడ జరుగుతున్న నిరసనకు మద్దతుగా సాధన నిలిచి ఉండగా, ఆందోళనలో పాల్గొనకుండా ఉన్న ఉపాధ్యాయులు పాఠశాల నిర్వహణను చూసుకుంటున్నారు. నిరసనలో పాల్గొనడానికి వచ్చే ముందే ఆమె వారితో, “ఆప్ యహాఁ స్కూల్ సంభాల్ లీజియే, హమ్ మోర్చా సంభాల్ లేనే హైఁ (ఇక్కడ పాఠశాల బాధ్యతను మీరు చూసుకోండి, ఉద్యమ వ్యవహారాన్ని మేం చూసుకుంటాం),” అని చెప్పారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేసినప్పుడు, ఆమె సహోద్యోగి సంధ్య ఇలా చెప్పారు: “ఇది విజయమే, కానీ నేను దానిని జరుపుకోవడం లేదు.” ఫోన్‌లో PARIతో మాట్లాడుతూ “ఆమె, ఇక పేపర్ లీక్‌లు ఉండవని గ్యారెంటీ ఏముంది? మొత్తం విద్యా వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉంది,” అన్నారు.
(ఈ వ్యాసం https://ruralindiaonline.org/article/who-gives-a-girl-multiple-chances-to-sit-for-an-exam-te)జులై 30, 2026 లో మొదట ప్రచురితమైనది.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.