(గత సంచిక తరువాయి…)
` అనువాదం: ప్రభాకర్ మందార
అన్ని రకాల ప్రభుత్వ వ్యవస్థల పట్లా వామపక్షాలు చాలా మొండిగా, తీవ్రమైన విముఖత చూపించేవి. ఆంధ్ర ప్రదేశ్‌లో ఒకానొక దశలో అయితే` ఎంఎల్ కార్యకర్తలు ప్రభుత్వం తమ మీద బనాయిస్తున్న క్రిమినల్ కేసుల్లో తమ తరఫున వాదించేందుకు న్యాయవాదులను నియమించుకోవటాన్ని కూడా వాళ్లు నిరాకరించారు.
కోర్టులను బాయ్‌కాట్ చేశారు, తమ పైన విచారణ జరుగుతున్నప్పుడు తమను తాము సమర్థించుకునేందుకు కూడా ఎలాంటి ప్రయత్నం చేయకుండా దూరంగా ఉండిపోయారు. వాళ్లే రకమైన పోరాట రాజకీయాల వైపు మొగ్గుతారో ఈ వైఖరి స్పష్టం చేస్తుంది.
ఇలాంటి ఆలోచనా ధోరణి నుంచి బయటపడటం చాలా అవసరమనీ, అది అనివార్యమనీ నాకు అనిపించింది. రాజ్యం ఏ చట్టాలనైతే చేసిందో ఆ చట్టాలే ఉల్లంఘనలకు గురవుతున్నాయని ప్రత్యక్షంగా నిరూపిస్తూ యాక్టివిస్టులు ఉద్యమిస్తే విజయం సాధించటానికి మెరుగైన అవకాశాలుంటాయి. అలాంటి పోరాటాలకు భిన్న సామాజిక వర్గాల నుంచి మద్దతు, సానుభూతి కూడా లభిస్తుంది. రాజ్యం కూడా తనను తాను చట్టబద్ధమైన, పాలనార్హత గల వ్యవస్థనని చెప్పుకొనేందుకైనా సానుకూలంగా స్పందించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. అప్పుడు చట్టవిరుద్ధమైన చర్యల మీద, అక్రమాల మీద మరింతగా దృష్టి పెట్టటం, వాటికి వ్యతిరేకంగా పోరాటాలను నిర్మించటం కూడా కొంతలో కొంత సులువవుతుంది. అలా కాకుండా ఒకవైపు చట్టబద్ధమైన ప్రభుత్వ వ్యవస్థల పరిధిలో పని చేస్తూనే మరోవైపు రాజ్యం యొక్క చట్ట స్వభావాన్ని ప్రశ్నిస్తుండటం చాలా సంక్లిష్టమైన ప్రయాసగా తయారవుతుంది.
ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు విజయం కోసం ఎప్పటికప్పుడు వ్యూహాలను రచించుకోవటం ఎంత ముఖ్యమో ఉద్యమ అస్తిత్వాన్ని కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. ఈ రెంటినీ సమన్వయం చేసుకుంటూనే ముందుకు నడవాలి. లక్ష్యాలన్నవి ప్రజల దైనందిన జీవితాలకు తగినట్లుగా నిర్దేశించుకోవాలి. అది కూడా వాళ్ల సమక్షంలో, వాళ్ల పర్యవేక్షణలోనే జరగాలి. వ్యవస్థాపరమైన మార్పు తీసుకురావటం కోసం భారీఎత్తున ప్రజలను సంఘటిత పరచటం, నిరసన రాజకీయాలను నిర్వహించటంతోనే సరిపోదు. ఉద్యమం నడిపే క్రమంలో దాని మనుగడనే ప్రశ్నార్థకం చేసే ఎన్నో తక్షణ ప్రమాదాలు ఎదురవుతుంటాయి. అలాగే
ఉద్యమాన్ని మెరుగుపరచుకునేందుకు చిన్న చిన్న అవకాశాలూ వస్తుంటాయి. ఉన్న వ్యవస్థలోనే కొద్దికొద్దిగా చోటు కల్పించుకోవటం, మెల్లగా దాన్ని విస్తరించుకోవటం, క్రమేపీ వాటినే ప్రజాస్వామికీకరణకు బలమైన కార్యక్షేత్రాలుగా మలచుకోవటం చాలా ముఖ్యం. కొత్త వ్యవస్థలను ఆవిష్కరించే క్రమంలో` ఉన్న వ్యవస్థలో మనకున్న అవకాశాలను ఎంత వరకూ సాధ్యమో అంత వరకూ విస్తరించటం, ఆ వ్యవస్థను గరిష్ఠస్థాయిలో అంచుల వరకూ నెట్టటమన్నది చాలా ముఖ్యమైన ప్రక్రియ. దీన్ని ఎలా సాధించాలి? అది కూడా, ప్రస్తుత వ్యవస్థలో అంతా బాగానే వుందన్న భ్రమలను సృష్టించకుండా జాగ్రత్తపడుతూ, మరోవైపు ప్రగతిశీల రాజకీయాలను నిర్మాణాత్మక పంథాలో నడిపించేలా విస్తృత చైతన్యాన్ని తీసుకువస్తూ దీన్ని సాధించటమెలాగన్నది అత్యంత సందిగ్ధమైన అంశం.
అప్పటికి నేను అంబేడ్కర్‌ను పెద్దగా చదవలేదు. ఆయన రాసిన ‘ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట’ (కుల నిర్మూలన), అలాగే ధనంజయ్ కీర్ రాసిన అంబేడ్కర్ జీవిత చరిత్ర ‘డా. బాబాసాహెబ్ అంబేడ్కర్: లైఫ్ అండ్ మిషన’ వంటి ఒకట్రెండు పుస్తకాలు మాత్రమే చదివినట్లు గుర్తు. రాజ్యాంగంలో దళితులకు కచ్చితంగా కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించాలని ఆయన పట్టుబట్టారనీ, అలాగే ఆయన హింసను వ్యతిరేకించారనీ తెలుసుకోవటానికి, దాన్ని గురించి వివరంగా చదువుకోటానికి నాకు మరో దశాబ్ద కాలం పట్టింది. ఇబ్రహీంపట్నం వచ్చినప్పుడు నేను దళితులతో కలసి పనిచేయడం, వారికి నా వంతు సహకారం అందించడమన్నది సహజంగానే మొదలుపెట్టాను తప్ప అప్పటికి అంబేడ్కర్‌ను చదవడం వల్ల కాదు. అంబేడ్కర్‌ను చదివి నేను దళితులతో పని చెయ్యాలని బయల్దేరలేదు. నిజానికి దళితులే నన్ను అంబేడ్కర్ వద్దకు తీసుకెళ్లారు. అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందంటే ఈ దేశంలో` వామపక్షాలే గనక అంబేడ్కర్‌ని అధ్యయనం చేసివుంటే, దళిత వర్గాలతో కలసి పనిచేసి వుంటే` రాజ్యాంగపరమైన అంశాలలో వారికి ఉన్న చాలా సందిగ్ధతలు తొలగిపోయి, మరింత స్పష్టతతో పని చేయటం సాధ్యమయ్యేదని.
అప్పటికే భూమి, వేతనాలు, దళితులపై అత్యాచారాలు వంటి సమస్యలపై ఇతర వేదికల ద్వారా బాగా పని చేసిన అనుభవం వల్ల 1987లో దళితులతో నిర్మాణాత్మక కార్యాచరణకు పూనుకోవటం నాకేమంత కష్టం కాలేదు. 1987`1994 మధ్య మేం గృహ నిర్మాణం, విద్య, రుణాలు, అటవీ భూముల ఉమ్మడి నిర్వహణ, ఆరోగ్యం, జీవనోపాధి వంటి సమస్యలపై ఉద్యమించాం. ఒకరకంగా అప్పటి జిల్లా పాలనా యంత్రాంగం కూడా మమ్మల్ని బాగా ప్రోత్సహించేదని నాకు అనిపిస్తుంది. బహుశా, తద్వారా మమ్మల్ని వ్యవస్థలో భాగం చెయ్యొచ్చన్నది వాళ్ల ఉద్దేశం కావొచ్చు. మేం మాత్రం అభివృద్ధి కార్యక్రమాల్లో పేదలకు, దళితులకు పనికొచ్చే ఏ ఒక్క అంశాన్నీ వదిలిపెట్టలేదు. ఎక్కడ చోటు దొరికితే అక్కడ, ప్రతి ఒక్క అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నాం. ఒకానొక దశలో అయితే రంగారెడ్డి జిల్లా అభివృద్ధి మండలిలో ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు మా ఐటీవీసీఎస్ పైన ఫిర్యాదులు కూడా చేశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి మా సంఘం.. జిల్లా నిధుల్లో అత్యధిక భాగాన్ని ఇబ్రహీంపట్నం, యాచారం మండలాలకే తరలించుకుపోతోందని గగ్గోలు పెట్టారు.
మేం మొట్టమొదటగా చేపట్టిన అంశం` వెట్టి చాకిరీ కూలీలకు పునరావాసం కల్పించడం. అప్పట్లో, అంటే 1985 ప్రాంతంలో వెట్టి నుంచి విముక్తి పొందిన ప్రతి ఒక్కరికీ పునరావాసం కింద ప్రభుత్వం రూ. 4,000ల చొప్పున ఇచ్చేది. అధికారులు సాధారణంగా దీన్ని డబ్బు రూపంలో కాకుండా ఒక జత ఎద్దుల రూపంలో ఇచ్చేవారు. అయితే, ఇక్కడే అధికారులు మోసానికి తెర తీసేవాళ్లు. రూ.4 వేల కింద జత ఎడ్లను ఒకరికి ఇవ్వటం, వెంటనే అవే ఎద్దుల్ని రూ.3,000లకు ఆ కూలీ వద్ద నుంచి తీసేసుకుని.. మళ్లీ 4 వేల కింద ఆ జత ఎద్దుల్నే మరొక కూలీకి ఇచ్చినట్లు చూపించటం… మళ్లీ మళ్లీ ఇదే తంతు కొనసాగుతూ వుండేది. అంటే పునరావాసం కింద వెట్టి కూలీలకు రూ.నాలుగు వేలకు బదులు వాస్తవంగా మÖడు వేలే దక్కేవన్న మాట. మిగతా వెయ్యి రూపాయలూ అధికార్ల జేబుల్లోకి వెళ్లిపోయేవి. ఇది గుర్తించిన మేం అసలు కూలీలకు పునరావాసంగా డబ్బు వద్దు, దానికి బదులు భూమి ఇవ్వాలని పోరాడాం. గ్రామం తర్వాత గ్రామం తిరుగుతూ, ఇందుకు పనికొచ్చే భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి, భూ యజమానులతో మాట్లాడి వాళ్లను ఒప్పించి, ఆ భూములు కొనేలా ఎస్సీ కార్పొరేషన్‌తో సంప్రదింపులు జరిపాం. వాటిని కార్పొరేషన్ కొని, కూలీలకు కేటాయించింది. అలా యాచారం మండలం, మొండిగౌరెల్లి గ్రామంలో 1986లో ఇరవై మÖడు ఎకరాల భూమిని కొనుగోలు చేసి వెట్టి నుంచి విముక్తిని పొందిన ఇరవై మÖడు మంది కూలీలకు ఇచ్చారు. వారిలో అత్యధికులు దళితులే. అయితే భూమి అయితే వచ్చిందిగానీ ఆ భూమిని అభివృద్ధి చేసుకునేందుకు వాళ్ల దగ్గర డబ్బు లేదు. దీంతో మళ్లీ మా సంఘమే కో`ఆపరేటివ్ సొసైటీ వారితో సంప్రదింపులు జరిపి, ఆ 23 ఎకరాల భూమి మీద ఒక ఉమ్మడి కుటుంబ సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి, ఆ భూములను అభివృద్ధి చేసుకునేందుకు, బోరు బావులను తవ్వించుకునేందుకు, ఓ పాల డైరీని పెట్టుకునేందుకు అవసరమైన మొత్తాలను ఇప్పించింది. ఆ పాల డైరీ ఇప్పటికీ కొనసాగుతోంది. అలాగే పునరావాసం కింద భూములు పొందిన కూలీల కుటుంబాల వద్ద ఆ భూములు ఇప్పటికీ వున్నాయి.
జనానికి చాలా అవసరమైన మరో పథకం` రుణాల మంజూరు. ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా జిల్లా గ్రామీణాఅభివృద్ధి సంస్థ, షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్, అక్కడి బ్యాంకులు నిర్వహిస్తుండేవి. అక్కడ కూడా రుణాల పేరిట పశువులను ఇస్తున్నట్టు కాగితాల మీద చూపించి, వాటినే మార్చి మార్చి చూపిస్తూ మాయ చేస్తుండేవాళ్లు. ఆ టైముకి అక్కడ కనబడిన పశువులు, మరుక్షణం మాయమైపోతుండేవి. ఈ మాయదారి తంతుని మేం గట్టిగా వ్యతిరేకించాం. ఆ సంస్థలను ఎదిరించి, ఈ మోసాన్ని అడ్డుకోవటంలో మాకు చీదేడ్ గ్రామానికి చెందిన తెలగ కులస్తుడు మేకల గాలయ్య ఎంతో సహకరించాడు. మనిషి కాస్త పొట్టిగా ఉండేవాడు. అతని చూపులూ, మాటలూ మాత్రం ఎంతో పదునుగా వుండేవి. నేను తరచూ చీదేడ్కు వెళ్తుండటం, పైగా తను ఎక్కడికి పోవాలన్నా నేనుండే గుంగల్ మీదుగానే పోవాల్సి ఉండటంతో మేం తరచూ కలుసుకునే వాళ్లం. తను బావులు తవ్వే కూలీల బృందంలో పని చేసేవాడు. అప్పటికింకా బావులు తవ్వే పనిలోకి కాంట్రాక్టర్లు దిగలేదు. 1980ల వరకూ కూడా కూలీలే బృందంగా ఏర్పడి, ఓ క్రేన్‌ను అద్దెకు తెచ్చుకుని ఆ పని చేసుకునేవాళ్లు. ఎక్కడైనా రుణం దొరికితే తామే సొంతగా ఓ క్రేన్‌ను కొనుక్కోవాలని, ఎలాగైనా ఆ క్రేన్ అద్దె భారం తగ్గించుకోవాలని గాలయ్యా వాళ్ల బృందం తంటాలుపడుతుండేది.
తమ బృందం పరిధిలో వాళ్ల ఖర్చుల లెక్కలన్నీ చాలా పకడ్బందీగా ఉండేవి. తమలో ఎవరైనా జబ్బుపడి, లేదా ఏదైనా ఇబ్బంది వచ్చి ఒకట్రొండు రోజులు పనికి రాలేకపోయిన సందర్భాల్లో మిగతా వాళ్లంతా ఆ పనిని పంచుకుంటూ పరస్పరం సహకరించుకునేవారు. డబ్బుల లెక్కల్ని బొగ్గు ముక్కలతో రాసుకునేవాళ్లు. ఆర్థికపర పనుల్లో జనాలకున్న వాస్తవిక అవసరాలేమిటి అనే విషయంపై మేము దృష్టి పెట్టాల్సిన అవసరం వుండేదని గాలయ్య నాతో అనేవాడు. తమ బృందం నిలకడగా సాగాలంటే వీలైనంత త్వరగా మాకొక సొంత క్రేన్ కావాలి అనేవాడు. కానీ రుణాల మంజూరుకు అర్హమైన వాటి జాళితాలో క్రేన్ లేదనీ క్రేన్ కొనుగోలుకు రుణం ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంకు అధికారులు చేతులెత్తేశారు. దీంతో మేం క్రేన్లను కూడా రుణాలిచ్చే వాటి జాబితాలో చేర్చాలని పోరాడాం. దాంతో వాళ్లు రుణం ఒక వ్యక్తిపేరిటే ఇస్తాంగానీ బృందానికి ఇవ్వలేం అన్నారు. అప్పుడు బృందాలకు కూడా క్రేన్ కొనుగోలుకు రుణం ఇవ్వాలంటూ కొట్లాడాం. ఎలాగైతేనేం చివరికి క్రేన్ కొనుక్కోవటానికి వాళ్లకు రుణం ఇప్పించగలిగాం. రుణ సాధన విషయంలో మా ఆ మొదటి విజయం` మరెంతో మంది, రకరకాల సృజనాత్మక మార్గాలను ఎంచుకుని ముందుకొచ్చేందుకు, కొత్తకొత్త ఉపాధి అవకాశాలను ఎంచుకునేందుకు ప్రేరణనిచ్చింది.
జనం మా దృష్టికి తెచ్చిన మరో సమస్య గృహ నిర్మాణ రుణాలు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలన్నీ పూర్తిగా భూస్వామ్య కాంట్రాక్టర్ల చేతుల్లో ఉండేవి. లబ్ధిదార్ల జాబితాలనేమో రాజకీయ నాయకులు తయారు చేసేసేవాళ్లు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపే వారికి, అలాగే కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు తెలుగుదేశం వైపు ఉండేవారికి ఆ జాబితాలో చోటు దక్కేదికాదని ప్రతీతి. మేం రంగంలో దిగిన తర్వాత మా సంఘమే సొంతంగా జాబితాను సిద్ధం చేసింది, గృహ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. దళిత వాడల్లో అందరినీ సమావేశపరిచి, అందరి ముందే బహిరంగంగా మా జాబితాను తయారు చేశాం. అందులో వున్న వాళ్లంతా నిజంగా ఇండ్లు లేని, భూముల్లేని నిరుపేదలు. మా కార్యక్రమాలకు సుపరిచితులే కావటంతో.. అనర్హులను అందులో చేర్చాలన్న ఒత్తిళ్లు మాపై లేవు. మా జాబితాలో అర్హులు కానివాళ్లు ఒక్కరు కూడా లేరు. అధికార్లు, ఎమ్మెల్యేలు రూపొందించిన జాబితాలను మేం క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ లోపాలున్నాయో పట్టుకున్నాం. వాళ్ల లిస్టుల్లో` అప్పటికే సొంతగా పక్కా ఇళ్లు వున్నవాళ్లు, ప్రభుత్వోద్యోగులు, అసలా గ్రామాల్లో లేని వాళ్ల పేర్లు కూడా బయటపబడ్డాయి. వాటన్నింటినీ గుర్తించి, బయటపెట్టి, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించగానే అధికారులు, ఎమ్మెల్యేలు వెంటనే దారికొచ్చి మా జాబితాలను ఆమోదించేశారు.
ప్రభుత్వం ప్రతిపాదించే ఇళ్ల నమÖనాలో రెండు చిన్నచిన్న గదులు, ఒక బాత్రూం మాత్రమే ఉండేవి. అవి సిమెంటు స్లాబు ఇళ్లు. మేం ఆ నమÖనాను తిరస్కరించాం. ఒక పెద్ద గది, బాత్రూముతో సాంప్రదాయిక పద్ధతిలో నిర్మించే పెంకుటిళ్ల నమÖనాని మేం ప్రతిపాదించాం. ఎందుకంటే భారీ వర్షాలు పడ్డప్పుడు పేదలు తమకున్న ఒకటి రెండు పశువులు, కోళ్లను కూడా ఆ పెద్ద గదిలోనే ఉంచుకుని, రక్షణ కల్పించుకునేందుకు వీలుంటుంది. జిల్లా అధికారులు మా ప్రతిపాదనల్లో చాలా భాగం అంగీకరించారు. మొదటి దఫాగా 1987లో యాచారంలో పూర్తిగా ప్రజలే సొంతంగా నిర్మించుకున్న అలాంటి 52 ఇళ్లు సిద్ధమైనప్పుడు.. ఆ ప్రాంతం ఎంత మనోహరంగా తయారైందో మాటల్లో చెప్పలేం. ఆ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ఇరుగు పొరుగు గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఇక ఆ తర్వాత మా గృహ నిర్మాణ కార్యక్రమం నిరాఘాటంగా కొనసాగింది. లక్ష్యాలు సకాలంలో పూర్తయిపోతున్నాయి కాబట్టి జిల్లా అధికార్లు కూడా మరీ అంత అసంతృప్తిగా ఏమీ లేరు. వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చి ఉంటే` చాలా పనులు అసంపూర్తిగానే మిగిలేవి, లంచాల వాటాలు త్వరగా తేలక బిల్లుల సొమ్ము మంజూరయ్యేది కాదు, ఇండ్లు నాసిరకంగా వుండటంతో జనాలూ వాటిలోకి వెళ్లేవారు కాదు.
మాకు పెద్ద సమస్య అధికారుల కమీషన్ల దగ్గర ఎదురైంది. బాగా అలవాటైపోయి, ఒక సంప్రదాయంలా తయారైన లంచాలకి వాళ్లు పెట్టుకున్న ముద్దు పేరే ఈ కమీషన్. మేం బిల్లులు సమర్పించినప్పుడు అధికారులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. మొదటగా మండల స్థాయి అధికారి ఒకరు మా దరఖాస్తును పైకి పంపకుండా పక్కన పెట్టాడు. మా సంఘం పట్ల వున్న భయంతో మమ్మల్ని నేరుగా కమీషన్ అడగలేకపోయాడు. అలాగని పైకీ పంపలేదు. మా వాళ్లు ఒకటికి రెండు సార్లు అతని చుట్టూ తిరిగినా ఫలితం కనబడలేదు. దాంతో ఇంక లాభం లేదని, మేమంతా కలిసి కూర్చుని ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాం. దాని ప్రకారం అందరం ఒక్కో ఆఫీసర్ దగ్గరకు వెళ్లి ‘మేం కమీషన్లు ఇవ్వలేం, మేం ఏం ఖర్చు పెట్టినా అదంతా గ్రామంలో జరిగే బహిరంగ సమావేశంలో అందరి ముందూ చదివి వినిపించాల్సి ఉంటుంది. మీ పేరు కూడా అలా చదవటం మీకు ఇష్టమేనా?’ అని అడిగే వాళ్లం. వాళ్లు గాభరాతో వద్దు వద్దు అనేవాళ్లు. అయితే వెంటనే మా నిధులు మంజూరు చెయ్యండి, ఎక్కడ జాప్యం జరిగితే అక్కడ మేం నిరసన ప్రదర్శనలు చెయ్యాల్సి వుంటుందని హెచ్చరించాం. మా నిరసనలంటే వాళ్లకు చాలా భయం. మా ప్రదర్శనల్లో ‘జిందాబాద’, ‘మురదాబాద’ లాంటి సంప్రదాయ నినాదాలేం ఉండేవి కాదు. మా సభ్యులు కమÖ్యనిస్టు పార్టీ వాళ్లు కాదు, వాళ్లకు అలాంటి నినాదాలు తెలియవు. వాళ్లు సొంతంగా, అక్కడికక్కడే నినాదాలు రూపొందించేవారు. అవి చాలా సూటిగా, పదునుగా ఉండేవి. వాటిలో ఆ లంచగొండి అధికారుల పేర్లూ, వాళ్ల వ్యక్తిగత వివరాలన్నీ వచ్చేవి. మహిళలైతే మరో అడుగు ముందుకేసి అక్కడే పాటలు కూడా కట్టేవాళ్లు. తమను ఇబ్బంది పెడుతున్న అధికారి పేరు మీదే పాటలు కట్టి సామÖహికంగా, ఆవేశంగా పాడేవాళ్లు. ఈ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు నేను చివరగా కూర్చుని జానపదాల్లాంటి ఆ అందమైన పాటల్నీ, సృజనాత్మకమైన నినాదాలనీ వింటూ వాటిని ఆస్వాదించేదాన్ని. అక్కడేం జరుగుతోందో చూడటానికి పోగయ్యే జనం కూడా ఆ పాటలకి ఊగిపోతూ, క్రమంగా వాళ్లూ గొంతు కలిపేవాళ్లు. ఆ అధికారి ఆఫీసులోంచి బయటికి వచ్చాడంటే చాలు, నినాదాలు ీVAరెత్తిపోయేవి. ఇలా నేరుగా తమ పేర్లు పెట్టి స్లోగన్లు యిస్తుంటే అధికారులు వణికిపోయేవారు. ఆ విషయాన్ని స్వయంగా వాళ్లే ఆ తర్వాత నాతో అనేవాళ్లు. ఒక్క సందర్భంలో తప్ప మా నుంచి ఎప్పుడూ, ఎవరికీ లంచాలు వెళ్లలేదు. అప్పుడు కూడా ఇద్దరు అధికారులు మాకు ఇవ్వాల్సిన బిల్లు మొత్తం నుంచి కొంత వాళ్లే కోత బెట్టి, మిగతాది ఇచ్చారు. దీంతో దండు కట్టినట్టుగా ఊళ్లో చిన్నాపెద్దా అంతా కలిసి ఇబ్రహీంపట్నం ఎండీఓ కార్యాలయం దగ్గరకు వెళ్లారు. అక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు. ఒకరిద్దరు గ్రామస్తులు కార్యాలయం లోపలికి వెళ్లి మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని బయటికి పిలుచుకొచ్చారు. అందరి ముందూ తమ బిల్లుల్లో ఏయే అధికారులు ఎంత కోత పెట్టారో, ఎవరెంత నొక్కేశారో వివరంగా చెప్పి, వాళ్లపై ఏం చర్య తీసుకుంటారో చెప్పండంటూ పట్టుబట్టారు. కొద్ది నిమిషాల్లోనే ఆ ఇద్దరు జూనియర్ అధికారులూ బయటకొచ్చి, తాము తీసుకున్న మొత్తాలను అప్పటికప్పుడు తిరిగిచ్చేశారు.
ఇబ్రహీంపట్నంకు తూర్పున ఓ పది కిలోమీటర్ల దూరంలో పోల్కంపల్లి అనే గ్రామం ఉంది. దానికి శివారు పల్లె అయిన ఎండ్లగూడెంలో వెట్టి చాకిరీ నుంచి విముక్తులైన ఎంతో మంది కూలీలుండేవారు. వాళ్లందరికీ నాయకుడు దండుమైలారం అచ్చయ్య. తనే వాళ్లందరి మంచి చెడ్డలూ శ్రద్ధగా చూసుకునేవాడు. తరచుగా మా సంఘం పరిధిలోని ఇతర గ్రామాలను సందర్శిస్తూ, అక్కడ ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి.. అవి తమ వాళ్లకు ఏమైన ఉపయోగపడతాయా అని గమనిస్తుండేవాడు. ‘సంఘం మా వాళ్లకు వెట్టి నుంచి విముక్తి కల్పించింది. కానీ మనం ఇప్పుడు వాళ్లకు ఏదో ఒక బతుకుదెరువు చూపించాలి. లేకపోతే మళ్లీ వెట్టి చాకిరీలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది’ అని పదే పదే చెబుతుండేవాడు. ‘పనులన్నీ పోల్కంపల్లి వాళ్లే దక్కించుకుంటున్నారు. మాది అందరికీ దూరంగా ఉండే మారుమÖల పల్లె కావడంతో మాకు పనులేవీ దొరకటం లేదు’ అని వాపోతుండేవాడు.
