వడ్డెపల్లి లలిత, యం.డి. సర్దార్, ఆగపాటి రాజ్‌కుమార్
సమాజంలో సగభాగం స్త్రీలు. అందువల్ల స్త్రీ విముక్తిని సాధించకుండా సమాజం విముక్తిని సాధించలేదు. స్త్రీలు కులాలకు, మతాలకు అతీతంగా ఒక ప్రత్యేక వర్గంగా అణిచివేతకు గురవుతున్నారు. మహిళా సమస్యల్ని ముఖ్యంగా మూడు కోణాలుగా చూడవచ్చు. అవి : సామాజిక, ఆర్థిక, రాజకీయాంశాలు.
సామాజిక అంశాలు :
ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, విద్యా, వైద్య రంగాలన్నింటిలోను స్త్రీల పట్ల వివక్ష కనపడుతుంది. యస్.సి., యస్.టి. కులాలపట్ల ఈ వివక్ష ఇంకా ఎక్కువ. ప్రభుత్వ విధానాలు, కుటుంబవ్యవస్థ స్త్రీ, పురుష వివక్షను మరింత పటిష్టపరుస్తున్నాయి. మతం, సాంప్రదాయాలు, ప్రసారసాధనాలు ఇందుకు తోడవుతున్నాయి కూడా. వీటి దుష్ప్రభావాలు ప్రత్యక్షంగా స్త్రీలపై, పరోక్షంగా మొత్తం సమాజంపైన పడుతున్నాయి. భారతీయ మహిళల పరిస్థితి ప్రపంచంలోని ఏ ఇతర దేశాల స్త్రీల కన్నా, ఆఖరికి ఆఫ్రికా దేశాల స్త్రీలకన్నా కూడా నిమ్నంగా ఉంది. భారత మహిళలపై సాగుతున్న వివక్ష కారణంగా గత శతాబ్దంలో 3, 7 కోట్ల మంది భారతీయ మహిళలు అంతర్ధానమయ్యారని నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ అమర్త్యసేన్ విశ్లేషించారు.
జనాభా లెక్కల ప్రకారం 1901లో ప్రతి 1000 మంది పురుషులకు 990 మంది స్త్రీలుండగా, 2001 నాటికి ఇది 993కి పడిపోయింది. జనాభా పరంగా స్త్రీ నిష్పత్తి తగ్గటం అనేది సమాజంలో స్త్రీ స్థానాన్ని చెప్పకనే చెబుతుంది. సమాజం గాని, కుటుంబం గాని ఇప్పటికీ స్త్రీలను స్వతంత్ర పౌరులుగా గుర్తించడం లేదనే విమర్శ ఉంది. ఇక పెట్టుబడిదారీ విధానం తెచ్చిన స్వేచ్ఛ కన్నా, హక్కులు ఇచ్చినట్లే ఇచ్చి అదనపు భారాలు మోపింది.
పెరుగుతున్న హింస :
తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇతరులపై సాగించే దౌర్జన్యం లేక అణిచివేతను హింస అని చెప్పవచ్చు. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 17% చొప్పున స్త్రీలపై హింస పెరుగుతున్నదని నివేదికలు తెలుపుతున్నాయి. దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటా బయటా స్త్రీలపై హింస పెరుగుతోంది. కనుకనే ఐక్యరాజ్యసమితి స్త్రీలపై సాగుతున్న హింసను మానవహక్కుల సమస్యగా గుర్తించింది. యు.ఎన్.ఓ. స్త్రీలపై జరుగుతున్న వివక్షను రూపుమాపడానికి ఎంతో కృషి చేసింది. అందులో భాగంగానే స్త్రీల సంవత్సరంగా కూడా యు.ఎన్.ఓ. ప్రకటించడం జరిగింది. రాజకీయాలు నేరపూరితం కావడం, పెట్టుబడిదారీ విషసంస్కృతి, విశృంఖలత్వం, కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం కావడం ప్రచార సాధనాలు కూడా హింస పెరగడానికి దారితీస్తున్నాయి.
స్త్రీలపై హింసను రెండు రకాలుగా చెప్పవచ్చు.
1. కుటుంబ హింస
2. సామాజిక హింస
భారతీయ సాంప్రదాయం ప్రకారం కుటుంబంలోనూ, మన వివాహ వ్యవస్థలోనూ స్త్రీకి గౌరవం, భద్రత వగైరా ఉన్నాయన్న ప్రచారం ఉంది. కాని వాస్తవ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదికల ప్రకారం హత్యకు గురయ్యే స్త్రీలలో నూటికి డెబ్భై మంది భర్త చేతుల్లోనే మరణిస్తున్నారు. ప్రభుత్వ లెక్కలు వివాహ వ్యవస్థలో ఉన్న పురుషాధిక్యతని, స్త్రీల నిస్సహాయతని తెలియచేస్తున్నాయి. భార్యని కొట్టడం, తూలనాడటం, మానసికంగా హింసించటం, శీలాన్ని శంకించటం, ఇంటినుండి గెంటివేయడం, న్యూనత ఏర్పడడం, ఆంక్షలు విధించడం వంటి నేరాలు సమాజం కూడా మౌనంగా చూస్తూ అంగీకరించే పరిస్థితి ఉంది. అయితే గృహహింస చట్టం, ఇతర పలుచర్యల వల్ల ఈ పరిస్థితి క్రమంగా మారుతూ వస్తోంది.
2. సామాజిక హింస :
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలపై, అకృత్యాలపై వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఎ.ఐ.డి.డబ్ల్యు.ఎ. ఢిల్లీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనల్లో ఎక్కువభాగం కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, స్నేహితులే కారణమని తేలింది. శ్రామిక మహిళలు, ఉద్యోగవర్గాలు కూడా పై అధికార్ల, తోటి ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నారు.
దళిత, గిరిజన స్త్రీలు :
మన రాష్ట్రంలో దళిత, గిరిజన స్త్రీలు 23% ఉన్నారు. అభివృద్ధిలో అసమానతల కారణంగా వీరి పట్ల వివక్ష పెరిగింది. స్త్రీ పురుష నిష్పత్తి దళిత గిరిజనుల్లో కూడా పడిపోతోంది. ఈ వివక్ష ఇతర వర్గాల స్త్రీలకన్నా, దళిత గిరిజన పురుషులకన్నా కూడా తీవ్రంగా ఉంది. వ్యవసాయ కూలీలు, పేద రైతులు, బాడి, భవన నిర్మాణం తదితర అసంఘటిత కార్మికుల్లో, దళిత, గిరిజన స్త్రీలే ఎక్కువ ఆరోగ్యం, ఆహారభద్రత తీవ్రమయిన సమస్యలుగానే ఉన్నాయి. 80% పైగా స్త్రీలలో రక్తహీనత ఉంది. పేదరికానికి తోడు ఇంటా బయటా చేస్తున్న అధిక శ్రమ, మగవాళ్ల తాగుడు హింస వీటికి కులవివక్ష, పురుషాధిక్యత తోడై బ్రతుకులు బండబారుతున్నాయి. వ్యవసాయంలో సంక్షోభం పెరగటంతో పేద, చిన్న రైతు కుటుంబాల వలసలు పెరిగి, భవన నిర్మాణ రంగంలో ఈ తరగతుల స్త్రీ కార్మికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. గతంలో 20% ఉండేది, ఇప్పుడు 40-50 శాతానికి పెరిగింది. పని గ్యారంటీ లేకపోవడం వలన లైంగిక దోపిడీకి బలి అవుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చాక పరిస్థితి కొంతవరకు మెరుగైందని చెప్పవచ్చు. ఫలితంగా గ్రామీణ స్త్రీలలో భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి.
వితంతువులు :
ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా వితంతువుల దయనీయస్థితి మారలేదు. మనదేశంలో 2001 నాటికి 33 మిలియన్ల మంది వితంతువులున్నారు. భార్య చనిపోయిన పురుషులు 2.5% ఉంటే స్త్రీలలో భర్త చనిపోయిన వాళ్ళు 8% ఉన్నారు. వితంతువులకు పునర్వివాహం విషయం నేటికీ పెద్ద సమస్యగానే ఉన్నది. ఆస్తి పురుషులవద్ద ఉంటుంది. కాబట్టి అతని పునర్వివాహానికి సమాజం అంగీకారం, కుటుంబం, పిల్లల అంగీకారం ఉంటుంది. అసలు పిల్లలు లేని వితంతువులు పునర్వివాహానికి కొంతవరకు అవకాశాలున్నప్పటికీ, పిల్లలున్న స్త్రీకి మాత్రం పునర్వివాహం జరిగే పరిస్థితి లేదు. వితంతువు ఇప్పటికీ చనిపోయి స్వర్గంలో ఉన్న ఆమె భర్త యొక్క ఆస్తిగానే చూడబడుతోంది. సాంప్రదాయాలు, కట్టుబాట్లు, బొట్టు, గాజులు తీసివేయడం, మూఢనమ్మకాలతో సాంఘికంగా వాళ్ళని ప్రక్కన ఉంచటం, మానసికంగా బాధించటం జరుగుతోంది. భర్త చనిపోతే కుటుంబ ఆదాయం తగ్గిపోతుంది. పేదరికం పిల్లల పోషణ భారం, సాంఘిక వివక్ష వారిని కృంగదీస్తున్నాయి. ఎటువంటి శుభకార్యాలకు రానివ్వక పోవడం, పదేపదే వారి వైధవ్యాన్ని గుర్తుచేయడం, ఉమ్మడి కుటుంబంలో చాకిరీ చేయటమే కాని నివాసానికి ఎటువంటి హక్కులు లేని పరిస్థితి. లేదా పెండ్లి కాని పిల్లలతో గాని, పెండ్లి అయిన కొడుకులతో గాని కలిసి ఉండాలి. వితంతు స్త్రీల ఆస్తి హక్కులను హరించివేయడానికి అనేక ప్రయత్నాలు జరగటం, బాణామతి వంటి మూఢనమ్మకాలను కూడా ఉపయోగించడం, వీరిపై జరుగుతున్న అత్యాచారాలలో అధికభాగం ఆస్తి వివాదాలకు సంబంధించినవే కావడం విచారకరం.
ఆర్థిక అంశాలు :
సమాజంలో స్త్రీలు రెండో తరగతి పౌరులుగా చూడబడుతున్నారు. ఆర్థిక స్వాతంత్య్రం లేదు. స్త్రీలకు సొంత ఆస్తులు, ఉద్యోగాలు ఉన్నా, వారి సంపాదనపై వారికి హక్కు లేదు. స్త్రీలకి ఆస్తి హక్కు లేదు. కొద్ది మంది ధనికవర్గాల కుటుంబాల్లో స్త్రీలకు ఆస్తులు ఉన్నా, వారికి యాజమాన్యంలో గాని, సంపదపైగాని హక్కు లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం స్త్రీలపైనే ఆధారపడిన కుటుంబాలు (ఫిమేల్ హెడెడ్ ఫ్యామిలీస్) సమాజంలో మూడవవంతు ఉన్నాయి. మిగిలిన రెండవవంతు కుటుంబాల్లో కూడా ఆర్థికంగా స్త్రీల శ్రమ, సంపాదన లేకుండా నడిచే కుటుంబాలు చాలా కొద్ది. పేద, మధ్యతరగతి వర్గాల స్త్రీలు వ్యవసాయంలోను, పారిశ్రామిక రంగంలోను కూడా గణనీయమైన పాత్ర నిర్వహిస్తున్నారు. వ్యవసాయంలో 70-80% స్త్రీల శ్రమ ఉన్నది, ఇది కాక గృహ కార్మికులుగా (హోమ్ బేస్డ్ వర్కర్స్) కూడా స్త్రీల శ్రమ గణనీయంగా ఉన్నది. ఇంకా పరోక్షంగా కూడా స్త్రీలు ఆహారోత్పత్తుల్లోను, సేవారంగంలోను దోహదపడుతున్నారు. అయితే ఈ శ్రమ విలువను ప్రభుత్వంగాని, సమాజంగాని గుర్తించడంలేదు. అంతర్జాతీయంగా ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం స్థూల జాతీయోత్పత్తిలో స్త్రీల వాటా కూడా పెరుగుతుండడం గమనించదగ్గ విషయమే.
అయితే సమాజంలో ఉన్న అణచివేత కారణంగా ఎక్కడయితే అధికశ్రమ, విసుగుపుట్టించే ఎక్కువ పనిగంటలు అవసరమయ్యి పెద్దగా నైపుణ్యం అవసరంలేని, తక్కువ ప్రతిఫలం లభించే పనులుంటాయో, ఆ పనులు స్త్రీలకు కేటాయించబడుతున్నాయి. కనిపించని అణచివేత, వివక్ష ఉత్పత్తిరంగంలో కొనసాగుతుండడం, వ్యవసాయరంగంతో సహా అన్ని రంగాల్లో పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం ప్రవేశించడం వల్ల మధ్యతరగతి, ఉన్నత వర్గాల స్త్రీలు సంకుచితమైన కుటుంబ పరిధిదాటి బయటికివచ్చారు. ఉత్పత్తి సేవారంగాల్లో ప్రవేశించారు. సామాజికంగా తమ స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు. కాని పేద, కింద మధ్యతరగతి స్త్రీలు ప్రముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, ఇతర ఉప వృత్తుల్లోని స్త్రీలు, పట్టణ పేదలు పెట్టుబడిదారీ విధానపు చెడు ఫలితాలు మాత్రమే అనుభవిస్తున్నారు. వీరు తమ తోటివర్గంలోని పురుషులలాగగాని, పై వర్గాలలోని తమ తోటి స్త్రీలలాగగాని శ్రమలో నైపుణ్యాన్ని సాధించలేకపోయారు. ఈ స్త్రీలు పూర్తిగా నిర్లక్ష్యం (మార్జినలైజ్) చేయబడ్డారు.
ఐక్యరాజసమితి అభివృద్ధి కార్యక్రమం (యు.ఎస్.డి.పి) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం శ్రమలో మూడింట రెండు వంతుల శ్రమ మహిళలు చేస్తారు. అయినా ప్రపంచ ఆదాయంలో కేవలం 10వ వంతు మాత్రమే పొందుతున్నారు. నూటికి ఒకటి కన్న తక్కువ శాతం మంది ఆస్తులు కలిగి ఉన్నారు. వేతనాల్లో వ్యత్యాసం కొనసాగుతొంది. పురుషుల వేతనాలకన్నా స్త్రీల వేతనాలు 30-40% తక్కువగా ఉంటున్నాయి. ప్రపంచంలోని పేదలలో ఉన్న 70% స్త్రీలలో భారతీయులే ఎక్కువ. అయితే ప్రస్తుతం, దేశ వ్యాప్తంగా అమలులో ఉన్న ”ఉపాదిహామి చట్టం’ లాంటి పథకాల్లో స్త్రీలకు, పురుషులకు సమాన స్థాయి వేతనాలు కల్పించడం ఆహ్వానించదగ్గ పరిణామం. దేశంలో పారిశ్రామిక, సమాచార, సాంకేతిక ఐటి రంగాల వృద్ధి కారణంగా ఇటీవల ఉపాధి పొందుతున్న స్త్రీల సంఖ్య గణనీయంగా పెరిగింది.
వ్యవసాయరంగం :
వ్యవసాయంలో 70-80% స్త్రీల శ్రమ ఉన్నది. అయినా వారికి భూమిపై యాజమాన్యపు హక్కు లేదు. వీరిలో ఎక్కువమంది వ్యవసాయ కూలీలు, 2001 లెక్కల ప్రకారం ఈ రంగంలో 64 లక్షల మంది పురుషులు, 74 లక్షల మంది స్త్రీ కార్మికులు ఉన్నారు మొత్తం శ్రామిక మహిళల్లో 56% ఈ రంగంలోనే ఉన్నారని అంచనా. కాని వాస్తవానికి అంతకంటే ఎక్కువ సంఖ్యలోనే స్త్రీలున్నారు. వారికి పురుషులతో సమానకూలి లేదు. పిల్లకు బాల్వాడీ సౌకర్యాలు, ప్రసూతి సౌకర్యాలు లేవు. యంత్రీకరణ కారణంగా వ్యవసాయంలో పని దినాలు తగ్గిపోతున్నాయి. అయితే భూమి లేని వ్యవసాయకూలి స్త్రీలకు మరో ప్రత్యామ్నాయం లేదు. వ్యవసాయ కూలీ పురుషులు, భవన నిర్మాణం, రిక్షా వంటి వివిధ వృత్తులు చేసుకుంటూ ఇతర ప్రాంతాలకు వలసలు పోతుండగా స్త్రీలకు వ్యవసాయం తప్ప మరో మార్గం లేకపోగా కుటుంబ భారం కూడా పడుతుంది. వ్యవసాయ కూలీలలో పురుషుల కన్నా స్త్రీల సంఖ్య పెరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి వేతనాల్లో వ్యత్యాసం. చేతివృత్తులు దెబ్బతినడంతో వ్యవసాయ కూలీల సంఖ్య పెరుగుతోంది.
రైతు స్త్రీలు :
ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం మొత్తం రైతుల్లో 30% స్త్రీలు ఉన్నారు మొత్తం మహిళా శ్రామికుల్లో 20% ఉన్నారు. సమాజం దృష్టిలో రైతు అంటే పురుషులేగాని, ప్రధానంగా స్త్రీలను రైతులుగా గుర్తించదు. ఇటీవలి కాలంలో స్త్రీలకు ఆస్తిహక్కు కల్పించబడింది హిందూ వారసత్వ చట్టం మరియు హిందూ వివాహచట్టంలో 1986లో సవరణలు చేసి 1986 తర్వాత వివాహ వైఖరీ స్త్రీలకు పురుషులతో సమానంగా వ్యవసాయ భూమిపైకూడా హక్కులు కల్పించబడ్డాయి.
పారిశ్రామిక సేవారంగాలు :
వ్యవసాయరంగం తరువాత స్త్రీలకు ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్నది సంఘటితరంగం. 200వ సంవత్సరం నాటికి మొత్తం మహిళా శ్రామికుల్లో కేవలం లక్షా 60 వేల మంది మాత్రం అంటే ఒక్క శాతం మాత్రమే సంఘటిత రంగంలో ఉన్నారు. వారు కూడా విద్యా, వైద్య రంగంలోను గుమాస్తాలుగాను ఉన్నారు. స్త్రీల పట్ల వివక్షత పారిశ్రామిక రంగంలో ఎక్కువగా కనపడుతున్నది. అసంఘటిత రంగంలో సుమారు 8 లక్షల మంది బీడి పరిశ్రమలలోనే ఉన్నారు. తరువాత అంగన్వాడీ ఉద్యోగులుగా, నూలు మిల్లుల్లో, భవన నిర్మాణం, చేపల పరిశ్రమ, షాపులు, చేనేత, ప్రయివేటు స్కూలు వంటి వివిధ వృత్తులలో స్త్రీలు అసంఖ్యాకులుగా ఉన్నారు. ఏ రకమైన కనీస వేతనాలు, ఉద్యోగభద్రత, స్థిర నివాసం లేక అభద్రతకు, అధిక శ్రమకు, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. నూతన ఆర్థిక విధానాల ప్రభావం ఈ రంగంలోని స్త్రీలపై ప్రత్యక్షంగా పడుతున్నది.
గృహకార్మికులు :
ఇంట్లోనే ఉండి ఏదో ఒక వృత్తి / ఉపాధి నిర్వహిస్తూ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటునిచ్చేవారే గృహ కార్మికులు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 50,000 మంది లేసు పనివారున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇంటిపనివారు. కూరగాయల దుకాణదార్లు. రెడీమేడ్ బట్టలు, బ్యాగులు, పిన్నీసులు, అప్పడాలు, తినుబండారాలు తయారీ వంటి వృత్తుల్లో లేదు. ఉదా|| హైదరాబాద్‌లో లక్షకుపైగా గృహ కార్మికులుంటే కేవలం 4000 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వారు కూడా బీడీ కార్మికులు, ప్రభుత్వం బీడీ కార్మికుల్ని మాత్రమే గృహ కార్మికులుగా గుర్తిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఒక్కటే. జనాభా లెక్కలు సేకరించేటప్పుడు గృహకార్మికుల కుటుంబాల్లో ఇంటి యజమాని వృత్తిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతున్నది. గృహ కార్మికుల వివరాలు సేకరించేందుకు ఏ నిర్దిష్ట పద్ధతి లేదు. జనాభా లెక్కల్లో వీరిని ప్రత్యేక తరగతి శ్రామికులుగా చూపించరు. ఆర్థికంగా వీరు చేసే పనికి లెక్కలు కట్టే యంత్రాంగం లేదు. వీరు విపరీతమైన శ్రమ దోపిడీకి గురవుతున్నారు. యజమాని కార్మికల సంబంధం స్పష్టంగా ఉండదు. పని గంటలు ఉండవు వృత్తి రుగ్మతలు కూడా ఎక్కువ. ఇటీవల ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు, ప్రోత్సాహాకాలు ఇలాంటి పథకాలు స్త్రీలకు ఊరట కల్పిస్తున్నాయి.
రాజకీయాంశాలు :
వివిధ పోరాటాలలో అవి రాజకీయంగాని రైతు, కార్మిక ఉద్యమాలు గాని, ప్రపంచీకరణ వ్యతిరేకపోరాటం గాని మహిళల పాత్రలేనిదే జయప్రదం కాదు. స్వాతంత్రోద్యమ కాలంలో మహిళల పాత్ర, తదనంతర కాలం రాజకీయాల్లో స్త్రీల వ్యాపార పెరుగుదలకు, చట్ట సవరణలకు దోహదపడింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కారణంగా వేలాది మంది మహిళలు రాజకీయ రంగప్రవేశం చేశారు. చట్టసభల్లో ప్రవేశానికి రిజర్వేషన్లు మినహా మరోమార్గం లేదు. రాజకీయ రంగంలో ప్రభుత్వం తగిన స్థాయిలో అవకాశాలు కల్పించడం లేదనేది ప్రస్తుతం నలుగుతున్న అంశం. అయితే ఇది నాణానికి ఒక పార్శ్వం మాత్రమే. మరో పార్శ్వంలో ప్రస్తుతం కల్పిస్తున్న అవకాశాలు కూడా పెద్ద ప్రయోజనకరంగా లేవు. ఉదాహరణకు రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక సంస్థల్లో స్త్రీలు గెలిచినప్పటికి పురుషుడి చాటుగానే ఉంటూ, ఆ పురుషుడు తండ్రి కావచ్చు భర్త కావచ్చు కానీ వారి పాత్రే ఉంటుంది. తప్ప, ఆ స్త్రీ పాత్ర ఆశించిన స్థాయిలో లేదనే విమర్శ కూడా లేకపోలేదు.
వేల సంవత్సరాల అణచివేత ఫలితాలు ఈ నాటికి స్త్రీలు అనుభవిస్తున్నారు. దానికి తోడు పెట్టుబడిదారి అభివృద్ధి కారణంగా పెరుగుతున్న అసమానతలు స్త్రీల స్థాయిని ఇంకా తగ్గిస్తున్నాయి. వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు స్త్రీ సమస్యకు సముచిత స్థానం ఇచ్చే ఉద్యమాల వైపు వారిని సమీకరిస్తున్నారు. ప్రజానీకంలో పనిచేసే మహిళా సంఘాలపైన ఈ బాధ్యత ఇంకా ఎక్కువ ఉన్నదని చెప్పవచ్చు. ”ఐద్వా” ”ప్రగతి శీల మహిళా సంఘం” మొదలైనవి ఆ దిశగా కృషి చేస్తున్నాయి కూడా.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
మీరు వితంతువుల పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు కానీ పల్లెటూర్లలో ఇంకా చాలా మూఢ నమ్మకాలు ఉన్నాయి. పల్లెటూర్లలో ఇప్పటికీ చాలా మంది పెళ్లి విషయంలో వయసు, ఎత్తు పట్టింపులకి పోతారు. మా అమ్మమ్మ గారి ఊరిలో ఒక పొడుగావిడని పొట్టి అతనికి ఇచ్చి పెళ్లి చేసారు. పండగల టైమ్‌లో వీధి నాటకాలు చూడడానికి ఆ భార్యభర్తలు వచ్చినప్పుడు జనం వాళ్లని చూసి నవ్వుకునేవాళ్లు. పట్టణాలలోనూ అలాంటివాళ్లు ఉన్నారు. ప్రముఖ సినిమా నటి జరీనా వాహబ్ తన కంటే ఐదేళ్లు చిన్నవాడైన ఆదిత్య పాంచోలీని పెళ్లి చేసుకుందని ఆమె వ్యక్తిగత జీవితం గురించి చెడుగా మాట్లాడుకునేవారు.
ఈ లింక చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/9jsZV2e1agi