డాక్టర్ జె.భాగ్యలక్ష్మి
యునైటెడ్ కింగ్డమ్ ‘సమానత్వాల’ మంత్రి లిన్ ఫెదర్ స్టోన్ జూన్ 15 నుంచి 17 వరకు నేపాల్, భారతదేశాలను సందర్శించారు. భారతదేశంలో స్త్రీలకు ఎదురవుతున్న ప్రముఖమైన సవాళ్ళ గురించి తెలుసుకోటానికి, ప్రపంచ సమస్యగా మారిన స్త్రీల పట్ల హింస విషయంలో బ్రిటన్, భారతదేశం కలిసి పనిచేసే అవకాశాలున్నాయేమో కనుక్కోటానికి తాను భారతదేశ పర్యటనకు వచ్చినట్లు ఫెదర్స్టోన్ తెలియజేశారు.
2005లో బ్రిటిష్ పార్లమెంటుకు ఆమె ఎన్నికవగానే ”పార్లమెంటులో స్త్రీల ప్రాతినిథ్యం చాలా తక్కువ” అని తొలిపలుకుల్లోనే తెలియజేశారు. బ్రిటిష్ ప్రధాని 14 మే 2010న వీరిని సమానత్వాలకు మంత్రిగా నియమించారు. సమానత్వానికి, స్త్రీల హక్కులకు, స్త్రీలపట్ల హింసను నిరోధించటానికి అంతర్జాతీయ స్థాయిలో ఈమె బ్రిటిష్ మంత్రిగా పనిచేస్తారు.
ఏదేశంలోనైనా తగిన చట్టాలుండవలసిన అవసరం ఎంతయినా వుంది. అప్పుడే నేరస్థులను శిక్షించటానికి వీలుంటుంది. గృహహింసకు సంబంధించిన వ్యూహంలో నాలుగు ప్రముఖాంశాలున్నాయి. అత్యవసర పరిస్థితులలో వైద్యచికిత్సకు ఆస్పత్రులు, నేరస్థులను విచారించి, శిక్షవేసే మార్గాలు, స్వయంసేవక సంఘాల కృషి, ప్రజల దృక్పథంలో మార్పు తీసుకురావలసిన ప్రయత్నాలు అవసరమవుతాయి. కొన్నిసార్లు ఏకారణమూ లేకుండా స్త్రీలను వేధించటం, హింసించటం జరుగుతుంటుంది. యాదృచ్ఛికంగా ఈ కార్యకలాపాలు సాగుతాయి. ఈ దృక్పథాలు మారటానికి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావటానికి ప్రచారాలు జరగాలి.
బ్రిటన్లో ఆసియా స్త్రీలతో వ్యాపారాలు, చట్టబద్ధంకాని వివాహాలు పెద్దసమస్యలుగా పరిణమించాయి. వీటిని ఎదుర్కోటానికి మంత్రిత్వశాఖలు పనిచేస్తున్నాయి. గృహహింస విషయానికి వస్తే ప్రతి నలుగురిలో ఒక స్త్రీ గృహహింసకు గురవుతోంది. గృహహింసకు గురవుతున్న పురుషుల కేసులు కూడా ముందుకొస్తున్నాయి. ఆసియా స్త్రీలు ఎదుర్కొంటున్న మరో సమస్య బలవంతపు పెళ్ళిళ్ళు. బ్రిటిష్ కోర్టులు ”ఫోర్స్డ్ మేరేజి ప్రొటెక్షన్ ఆర్డర్స్” జారీ చేసి బలవంతపు పెళ్ళిళ్ళకోసం స్త్రీలను విదేశాలకు పంపించకుండా నిరోధించవచ్చు. ”భారత ప్రభుత్వాధికారులను సంప్రదించి వారి సహాయంతో ఇటువంటి స్త్రీలను కనుక్కొని వారిని రక్షించటానికి ప్రయత్నిస్తుంటాము. ఈ ఏర్పాటును చట్టబద్ధం చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం ఎంతో ఆసక్తిగా ఉంది” అని లిన్ పెదర్స్టోన్ చెప్పారు.
ఇతర దేశాలతో పాటు ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్లనుండి ఇటువంటిసమస్యలు ఎదురవుతుంటాయి. బ్రిటన్లో బలవంతపు పెళ్ళిళ్ళ రక్షణ యూనిట్ ఒకటి ఈ విషయాలతో వ్యవహరిస్తుంది. ఇటీవల హౌస్ ఆఫ్ కామన్స్ (పార్లమెంటులో దిగువ సభ) కు చెందిన ఒక కమిటీ బలవంతపు పెళ్ళిళ్ళను అపరాధంగా పరిగణించాలని నిర్ణయించింది. భారత్, బ్రిటన్ దీనికి సంబంధించిన సమాచారాన్ని, దృక్పథాలను ఒకరికొకరు తెలియజెప్పుకొంటారని, భారత రాయబార కార్యాలయంలో ఈ కేసులు నమోదు చేసుకోటానికి వీలు కల్పించే ఆలోచన కూడా ఉందని ఫెదర్స్టోన్ చెప్పారు.
ఆమె నేపాల్ పర్యటన గురించి అడుగగా నేపాలులో స్త్రీలు బిడియస్తులని అయినా ఉన్నత పదవులలోనూ, పోలీసు ఆఫీసర్లగాను స్త్రీలున్నారని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొంటారని ఆమె తన అభిప్రాయం తెలియజేశారు. భారతదేశంలో బీహారుకే వెళ్ళాలని ఎందుకు నిర్ణయించారని అడిగితే అక్కడ గృహహింస ఇంచుమించు 69 శాతం ఉందని స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలూ అక్కడున్నాయని, వాటిని పరిశీలించవలసిన అవసరముందని అన్నారు. బ్రిటన్లో ఇతర స్త్రీలకంటే ఆసియా స్త్రీలు గృహహింసకు ఎక్కువగా గురవుతున్నారా అని అడిగితే అటువంటి వివరాలు తమవద్ద లేవన్నారు. అయితే బ్రిటన్లో గొప్ప సాఫల్యతను పొందిన స్త్రీలు ఆసియా దేశాలకు చెందినవారేనన్నారు. లింగ వివక్షతో భ్రూణహత్యలకు పాల్పడిన సందర్భాలు ఏవీ తమ దృష్టికి రాలేదన్నారు.
స్త్రీల సమస్యలంటే కేవలం స్త్రీలే వీటిగురించి పట్టించుకోవాలని అనుకోరాదు. ఇవి సమాజానికి సంబంధించిన సమస్యలు కాబట్టి సమాజం మొత్తం స్పందించాలి. పార్లమెంటులో స్త్రీలకు రిజర్వేషన్లు అవసరమా అని అడిగితే ఒక మార్పు తీసుకువస్తున్నప్పుడు ప్రారంభదశలో రిజర్వేషన్లు అవసరమవుతాయని అన్నారు.
లిన్ ఫెదర్స్టోన్ సంభాషణ ముగించి వెళ్ళిపోతున్నప్పుడు ఆమెకు థ్యాంక్స్ చెప్పి ”నిజంగానే ప్రభుత్వాలు స్త్రీల విషయాలకు, సమస్యలకు ప్రాధాన్యమిస్తున్నాయా” అని అడిగితే అర్థవంతంగా చిరునవ్వుతో ”ప్రాధాన్యమివ్వవు కాని ఇచ్చినట్లు కనిపిస్తాయి, వాళ్ళు ప్రాధాన్యమిచ్చేటట్లు మనం ఒత్తిడి తీసుకురావాలి” అని అన్నారు.
(జూన్ 15 న మిస్ లిన్ ఫెదర్స్టోన్ ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కోర్, ఢిల్లీ సందర్శించిన సందర్భంగా)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags