వి. ప్రతిమ
అడవిలోని చెట్టూ మీది ఉసిరికీ, ఎక్కడో సముద్రంలో జనించే ఉప్పుకీ జత కుదరడం అంటే అదే మరి… భూమిక హెల్ప్‌లైన్‌లో పనిచేస్తోన్న కల్పనకీ… నెల్లూర్లో వుంటున్న ప్రశాంత్‌కీ నెల్లూరు బాప్టిస్ట్ చర్చిలో పెళ్ళి నువ్వు నెల్లూరోచ్చావంటే మనిద్దరం కలిసి కల్పనని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుదాం అంటూ సత్యవతి మేఘసందేశం పంపింది.
అప్పుడే ‘సాల్లోగుర్రం సాలినంత ధనం’ కథ చదివి వున్నానేమో భుజాలని కుంగదీస్తోన్న యింటిని ఏ మాత్రం తొణక్కుండా మెల్లగా కిందికి దించి సాల్లో గుర్రెన్నెక్కాను..
సింహపురి ఎక్స్‌ప్రెస్ ఎక్కి విక్రమ సింహపురిలో అడుగుపెట్టిన సత్యవతి బస చేరుకుని మేమిద్దరం కలిసి సదరు చర్చి వెతుక్కుంటూ వెళ్ళే సరికి కల్పన హర్షాతిరేకంతో ఆహ్వానం పలికింది.
మా యిద్దరికీ కూడా క్రైస్తవ వివాహం చూడ్డం యిదే తొలి సారి కావడంతో ఒకింత ఆసక్తిగా మతపెద్ద చేయిస్తోన్న ప్రమాణాలకి గమనించాం. కొన్ని కొన్ని ప్రమాణాలు చాలా అర్ధవంతంగా, అభినందనీయంగా, ఆనందించదగినవిగా అన్పించాయి.. హిందువుల్లాగే క్రైస్తవుల్లో కూడా మాంగల్యధారణ కార్యక్రమం వుంది. ఆ తాళి కట్టే శుభసమయం ఆసన్నమవడానికి ముందు నుండే సత్యవతి చేతిలోని నల్లపిల్లి ఆమెను అప్రమత్తం చేయసాగింది.
దాంతో కల్పన పెళ్ళి అయ్యీ కాకముందే వారిని మనసారా దీవించి, శుభాకాంక్షలు తెలిపి, వీడ్కోలు తీసుకుని చర్చినుండి బయటికొచ్చే వేళకి జిల్లా ఎస్పీగారి కారులో డ్రైవరు కోటేశ్వరరావు, నాగేశ్వరరావులు మా కోసం ఎదురు చూస్తూ..
”అమ్మా! పిల్లలు మనకోసం ఎదురు చూస్తున్నారు..’బీబిచీ’ కి వెళ్దాం ” అన్నారు ..
నిజానికి సత్యవతిని కలవడం, కల్పన వివాహ కార్యక్రమానికి హాజరుకావడం కోసం మాత్రమే నేను నెల్లూరు వెళ్ళాను. అయితే అక్కడొక అందమైన అద్భుతం ఎదురు చూస్తుందని నేను ముందుగా వూహించలేదు.
‘బీబిచీ’ అంటే చిల్డ్రన్ అండ్ పోలీస్’ అట సత్యవతి చెప్పింది. మాములు పోలీసులు అనుకోగానే రాజ్యం పక్షాన నిలబడి ప్రజల ఉద్వేగాలను, ఉద్యమాలను అణగార్చి వేసే వ్యతిరేక శక్తులుగా ఆ క్రమంలో ఏ మాత్రం తేమ లేకుండా బండబారి పోయిన హృదయులుగా మాత్రమే మనం భావిస్తూంటాం.. అదే అపోహ యివ్వాళ సమాజంలో పాతుకు పోయివుంది. అయితే అది నిజం కాదన్న అవగాహన కలుగుతుంది బీబిచీ ని చూసినపుడు.
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకి ఎస్.పిగా పనిచేస్తోన్న శ్రీ రమణకుమార్ గారు ఒక ప్రత్యేకమైన వ్యకిత్త్వం కలవారు. మా జిల్లాకి అధికారిగా వచ్చిన తర్వాత జిల్లాలో స్త్రీల మీద జరుగుతోన్న దాడులకి తీవ్రంగా స్పందించి ఎక్కడిక్కడ పోలీస్‌ని అప్రమత్తం చేశారు. అన్ని రకాల సమస్యల విషయంలోనూ ఆయన తీసుకుంటోన్న జాగరూకత జిల్లా ప్రజలు గమనిస్తూనే వున్నారు.
అయితే ఎవరో కవి అన్నట్లుగా అన్ని రకాల బాధలూ ఒకటి కావు.. అన్ని రకాల దిగుళ్ళూ ఒకటి కావు, అన్ని రకాల కన్నీళ్ళూ ఒకటి కావు…
నెల్లూర్లో బోడిగాడితోట అన్న ప్రదేశం వుంది.. నెల్లూరికి అది బరియల్ గ్రైండన్నమాట… అక్కడ నివాసముంటోన్న కుటుంబాలలోని పిల్లలకి శవాలంటే భయం లేదు.. చీకటంటే వెరపు లేదు.. కాల్చబడిన శవాల యొక్క పొడవాటి కాలి ఎముకల్ని వికెట్ నాటుకుని, వాటినే బ్యాట్‌లుగానూ, పుర్రెల్ని బంతులుగానూ చేసుకుని క్రెకెట్ ఆడుకోడం, నాగరిక జనం కాల్చి పారేసిన సిగరెట్టు పీకల్ని ఏరుకొచ్చి పీల్చడం, పేకాడుకోవడం, అడుక్కుని తెచ్చిన చిల్లర పైసలు తల్లికివ్వడం…ఉంటే తినడం, లేకుంటే నీళ్ళు తాగి నిద్రపోవడం, తిట్టుకోవడం, ద్వేషమేర్పరచు కోవడం…క్రమంగా వాళ్ళు ఎలా నేర ప్రపంచంలోకి కూరుకు పోతున్నారు అన్న విషయాన్ని రమణకుమార్‌గారు పసిగట్టారు. అక్కడ ఆయనకి ఆహ్వానం పలికిన పై పరిస్థితులు, తీవ్రమైన ఆకలి ఆయన్ని ఎంతగానో కలిచి వేశాయి.
ఆ కుటుంబాల వారితో మాట్లాడి తల్లిదండ్రులకు నచ్చజెప్పి కొంతమంది పిల్లల్ని తీసుకువచ్చి వాళ్ళకో రెసిడెన్స్ ఏర్పాటు చేసి బడికి పంపించడం మొదలుపెట్టారు.
‘బీబిచీ’ ఏర్పాటు చేసి, దాని తరఫున ఆ పిల్లలకి మంచి, మంచి అలవాట్లు నేర్పడమే కాకుండా మంచి పోషకాహారమందించి విద్య గరపుతూ బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దు తున్నారు. ఇప్పుడు బీబిచీ లో దాదాపు ఎనభయి మంది పిల్లులున్నారు… నలభయిమంది మగ పిల్లలు, నలభయి మంది ఆడపిల్లలు.
మేము అక్కడికి చేరుకోగానే ఒఎస్డీ నరసింహ కిషోర్ కుమార్‌గారు, యింకా యితర పోలీస్ అధికారులూ సాదరంగా ఆహ్వానించి ముందుగా ఆ పిల్లల పాత జీవితం తాలూకూ సిడిని చూపించారు (విజువల్స్)..నాగరిక ప్రపంచం నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన స్థితి..
బరువెక్కిన హృదయాలతో, ఒక రకమైన ఉద్వేగాన్ని నింపుకుని ఆ పిల్లల్ని చూడ్డానికెళ్ళాం. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించిన తీరు, తమని తాము పరిచయం చేసుకోవడం, కరచాలనం చేయడం, గులాబీలందించడం చాలా హృద్యమైన సన్నివేశం..మనం యిప్పుడు విజువల్స్ చూసి దిగులు పడిన పిల్లలేనా వీళ్ళు అని విస్తుపోయాను.. చిత్రమేమిటంటే అత్యంత తక్కువ కాలంలో ఆ పిల్లలంతా పాత జీవితాలలో నుండి చైతన్య వంతులుగా పరిణామం చెందడం చాలా ఆనందానికి గురి చేసింది… ఈ మొత్తం పరిణామానికి మూల కారణమైన రమణకుమార్‌గార్ని అభినందించకుండా వుండలేం…
వాళ్ళు డాన్సులు చేయడం, పాటలు పాడడం, కథలు చెప్పడమే కాకుండా బీబిచీ కి ఎవరయినా పెద్ద వాళ్ళు వచ్చి విలువల్ని బోధిస్తుంటే ఆ విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం, ప్రశ్నించడం, సమాధానం చెప్పడం చేస్తూ వున్నారు.. సత్యవతినీ, నన్నూ పదే పదే మా పేర్లడిగి వల్లె వేస్తూ అవి వాళ్ళకు నచ్చాయంటూ సంబరపడ్డారు.
మనం మాట్లాడడం మొదలుపెట్టగానే వాళ్ళు కొనసాగిస్తూ వున్నారు..అంత ఉత్సాహంగా వున్న ఆ పిల్లల్ని చూస్తే ఆనందించ కుండా వుండడం సాధ్యం కాదు..నిజానికి వాళ్ళల్లో అంత మార్పు తీసుకు రాగలగడం చిన్న విషయమైతే కాదు. ”ఇది మా ఎస్పీగారి ”బ్రెయిన్ ఛైల్డ్” అంటూ ఉద్వేగంగా పరిచయం చేసిన కిషోర్ కుమార్‌గారు.. యింకా ఈ మొత్తం యజ్ఞంలో పాలు పంచుకుంటోన్న యితర అధికారులూ, పోలీసులూ అంతా కూడా అభినందనీయులే… ఇది ఒకరు చేయగలిగే పని కాదు.
మొత్తం మీద అక్కడ కూర్చున్నంత సేపూ మహాకవి చెప్పిన ”మానవుడే నా సందేశం.. మనుష్యుడే నా సంగీతం” అన్న వాక్యాలు.. పదే పదే నా హృదయాన్ని తాకి విడిపోతూ వున్నాయి. ఈ సన్నివేశాన్ని, ఈ స్పందననీ నలుపూ, తెలుపూ చేయాలన్న ఆలోచన కలగడానికి కారణం ఇతర జిల్లాల పోలీస్ అధికారులూ, చేవగల సామాజిక కార్యకర్తలు..యింకా ఎందరో మహానుభావులు అందరికీ బీబిచీ స్ఫూర్తిదాయకంగా వుండాలన్న ఆకాంక్ష, మరికొన్ని చీకటి జీవితాలు వెలుగులోకి రావాలనీ, మరికొందరు పిల్లలు తమ చుట్టూ వున్న బురదలో నుండి తామర పుష్పాల్లా ఉజ్జ్వలంగా పైకి తేవాలన్న ఆశ మాత్రమే.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags