– ఉదయమిత్ర
కుటుంబీకులకు జెప్పండి
స్నేహితులకు జెప్పండి
క్లాసురూముల్లో జెప్పండి
ప్రార్థనామందిరాల్లో ప్రవచించండి
మనం స్వేచ్ఛా జీవులమని
రాత్రీ పగలూ మనవేనని…..
గోడలెక్కి జెప్పండి
గట్లమీద నిల్చి అరవండి
నిస్త్రాణపు భూముల్లో
జెండా పాతి చెప్పండి
చిత్తు కాగితం మీద
కవిత రాసి పంచండి
రోడ్ల పక్కన
హోర్డింగుల్లో హోరెత్తండి
ఈ చిత్రహింసలకిక సెలవని
ఈ లక్ష్మణ రేఖల్ని తన్ని తగలేద్దామని
ఐఖఐలు పంపండి
ఇంటర్నెటలలో పెట్టండి
కరెంటు తీగల్లో
విద్యుత్తులా ప్రవహించి చాటండి
శతాబ్ధాల విషాదాల్ని
అగాధాల్లోకి విసిరేస్తామని…
అరెయార్…
ఢర్నా మనా హై
యహా జీనా ఎక్ జంగ్ హై….
ఆశ లేదని చెప్పకు
దేశమంతా మనదే…
గల్లీ నుండి ఢిల్లీ దాకా
లేచిన పడికిళ్ళన్నీ మనవే….
సూర్యోదయాలూ, ఇంద్రధనస్సులూ
సముద్ర కెరటాల మీద
దోబూచులాడే వెన్నెల సోయగాలో
అన్నీ… అన్నీ…. మనవే…
ఎక్కడా ఆగొద్దు…..
సంక్షోభ వర్తమానం పిలుస్తుంటే
ఇండ్లల్లో మిగిలిపోవొద్దు…
పిరికితనపు దుప్పటి గప్పుకు
మురికి కలలు కనకండి…
రాజీ గుంజకు గట్టేసుకు
నాజీలకు బతుకు నేర్పించకండి…
చరిత్ర ప్రవాహంలో
చెల్లని నాణేలయి మిగలకండి…
రండి…..
మీ భయాల్ని, భద్రతల్ని దాటేసి రండి
సంకోచాల్ని వదిలి
విశ్వాసాల్ని వెంట బెట్టుకురండి
ముసలి తనాన్ని వదిలి
యౌవనాన్ని వెంటబెట్టుకు రండి
ఒక ప్లకార్డో, ఒక నినాదమో
కళ్ళలో మెరుపో, చెదరని స్వప్నమో…
ఏదో ఒకటి వెంట బెట్టుకురండి….
రండి….
జలపాతాలై దూకుదాం….
వాగులై, వరదలై, సముద్రాలై ఉప్పొంగుదాం…
ఇదివరకెప్పుడూ వినని
ఇకముందెప్పుడూ అగని
పెనుగర్జన వినిపిద్దాం
పురుషాధిక్య ప్రపంచాన్ని బద్దలు గొడదాం…..