– రమాసుందరి
అది నీకు నాపై పాతేననుకొన్న విజయబావుట
నీకది పరస్త్రీ పైట చాటున కూడా
పరాచకాలాడ గల మరీచిక
అది నీకు నీ పుంలింగ నిరూపణ
నీ ఆహాన్ని గెలిపించే గర్వ ప్రదర్శన
కాలం, బలం, కామంతో మాత్రమే తూచి
నీకు నువ్వే కితాబు ఇచ్చు కొనే కపట నాటిక
ఒక్క క్షణం లో నీకు మహా వైద్యం చేయగలదు నా దేహం
కాని మరుక్షణమే నీకది అపరిచితం.
మరి నాకది
నా అణువణువు పై నాకున్న మమకారం
నువ్వు సృజించి నాకందించ గలిగిన గర్వం
అది నా కిష్టమైన నీ సమక్షం
నువ్వు సర్వావస్తల్లో నూ నాకుంచగలిగిన నమ్మకం
అది నేను కాయంతోనే కాదు
జ్ఞానేంద్రియాలతో నిర్వహించే పవిత్ర కావ్యం
నువ్వు, నేనూ చరమాంకం వరకు చేయబోయే సజీవ సాహచర్యం.