అణువణువునా ఆప్యాయత నింపుతున్న అమ్మలూ!
అడుగడుగునా అభిమానం పంచే అక్కలూ!
కలలోనూ వాళ్ళనే కలవరించే అమ్మమ్మలూ!
కళ్ళనిండా వారిపై ఆశల్ని నింపుకున్న నాన్నమ్మలూ!
మీ ముంగిట వికసించే చిరు మొగ్గలకు…
యవ్వనాన అడుగిడే చిన్నారులుకు…
మీ యింట వయసుకొచ్చిన ముగ్ధలకు…
నూత్న సోయగాల తడబడే స్నిగ్ధలకు…
స్త్రీత్త్వపు అర్థమేమిటో తెలియజెప్పండి!
స్త్రీ తత్త్వపు మర్మాలేమిటో తేటపరచండి!
స్త్రీ పురుష సంబంధాల గూఢత గుట్టు విప్పండి!
స్త్రీ పురుషుల చెలిమికి హద్దెక్కడో విడమరచండి!
చిన్నపిల్లలనో… సిగ్గుపడ్తారనో… చెప్పడం దాటేయకండి!
చూద్దాం తెమ్మనో… తొందరేముందనో… తాత్సారం చేయకండి!
వారి అమాయకత్వంతో ఆడుకునేందుకు ఏ మాయగాడికో అవకాశమివ్వకండి!
వారి అజ్ఞానాన్ని వాడుకునేందుకు ఏ పశు ప్రాయుడికో అదను కల్పించకండి!
కాదనకుండా ఆలకించాడో ”విన్నపం”
కాదనుకుంటే తప్పదు సుమండీ ఆపై పరితాపం!