కథగా గొప్పగా లేకున్నా కొన్ని కథనాల్లోని జీవానికి అంతం అంటూ ఉండదు. కాలం పొడుగూతా ఉంటూనే ఉంటుంది.
అవసరం, అవకాశం, పిరికితనం, స్వార్థం… ఈ గుణాలు ఎప్పుడూ కాలాతీతమే. మనిషికి స్వంతమైన ఈ గుణాలన్నిటినీ బలంగా చెప్పగలిగే పాత్రలు కుదరటం ఏ కొన్ని సార్లో జరుగుతుంది.
ఈ కోవలోకి వచ్చే పుస్తకమే అరవై ఏళ్ళ క్రితం డా||పి. శ్రీదేవి రాసిన ”కాలాతీత వ్యక్తులు”.
నిజానికి కాలాతీత వ్యక్తులు నవలలో కథగా చెప్పటానికి పెద్దగా ఏమీ ఉండదు.
ముగ్గురు అమ్మాయిలు… ముగ్గురు అబ్బాయిల కథ. ఇంకా చెప్పాలంటే ప్రధానంగా ఇద్దరు అమ్మాయిల కథ. విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల జీవన ప్రస్థానం ఇది.
ప్రకాశం మెడికల్ కాలేజీ స్టూడెంట్. తను ఉన్న ఇంట్లోనే మరో వాటాలో బాధ్యతారాహిత్యమైన తండ్రితో కలిసి
ఉంటుంది టైపిస్టుగా పనిచేస్తున్న ఇందిర. ఇందిర చాలా గడుసైనది. తన కలుపుగోలుతనంతో ప్రకాశంతోనే కాక ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తితో కూడా మొదటి పరిచయంతోనే స్నేహం కలిపేసుకుంటుంది. అద్దెకు వెసులుబాటుగా ఉంటుందని, బియ్యే ఆనర్స్ చెయ్యటానికి వచ్చిన తన చిన్ననాటి స్నేహితురాలు కల్యాణిని తమతో పాటే మరో గదిలో ఉండనిస్తుంది. ఈమెకి రోగిష్టి తండ్రి తప్ప మరో ఆధారం ఉండదు.
ఒకేచోట ఉంటున్న క్రమంలో కల్యాణికి, ప్రకాశానికి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అదే సమయంలో తండ్రికి సీరియస్‌గా ఉండడంతో తన ఊరికి వెళుతుంది కళ్యాణి.
కళ్యాణి… ప్రకాశం మధ్య పెరిగిన చనువుని సహించలేని ఇందిర, తనదైన పంథాలో తనవైపు తిప్పుకుంటుంది. ప్రకాశం కళ్యాణిని విస్మరిస్తాడు. తన తండ్రి పోయాడని చెప్పినా పట్టించుకోని ప్రకాశం ఇక తనకు లేడని, ఇందిర తన స్వార్థం తాను చూసుకుందనుకున్న కళ్యాణి ఊరినుండి రాగానే తన క్లాస్‌మేట్ వసుంధర ఇంటికి మారిపోతుంది.
ఇక ప్రకాశం విషయానికి వస్తే, తన మేనమామ కాలికింద చెప్పులాంటివాడు. పిరికివాడు. అవకాశవాది. తనదైన వ్యక్తిత్వం లేనివాడు. వెన్నెముక లేని మనిషి. పరిస్థితులతో రాజీపడి ఎప్పటికైనా బంధువులే తనవారు అనుకుని మేనమామ కుదిర్చిన సంబంధం చేసుకున్న సాదాసీదా మనిషి.
ఇద్దరి అమ్మాయిల మధ్య ప్రకాశం ప్రధాన పాత్రగా మెసిలినప్పుడు, కేవలం అతని స్నేహితుడన్న ఒక నీడ పాత్రలా, కేవలం జల్సారాయుడిలా అనిపించిన కృష్ణమూర్తి అటుపై ముఖ్య పాత్రగా మారిపోవడం, ఎప్పుడూ ఎవరో ఒకరి ఆశ్రయం కోసమే వేచి
ఉంటుందా అన్నట్లు ఉండే కళ్యాణికి గిరి నాయుడు, వసుంధర, డాక్టర్ చక్రవర్తి, కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఆయా సందర్భాలలో ఆప్తులుగా మారటం సహజంగా జరిగిపోతుంది.
కొన్ని వ్యక్తిత్వ సంఘర్షణల అనంతరం ఇందిర, కృష్ణమూర్తి మరియు చక్రవర్తి, కళ్యాణిలు జంటలుగా మారటంతో కథ ముగుస్తుంది.
నిజానికి ఇది కథగా కన్నా పాత్రల వ్యక్తిత్వాలే ప్రధానంగా సాగే కథనం. అందులోనూ ప్రధానంగా ఇందిర వ్యక్తిత్వ చిత్రణ. ఆ నవలా కాలానికి అది ఒక పెద్ద సాహసమే అని చెప్పాలేమో. ఇందులో అడుగడుగునా ఇందిర మాటల్లో ఆమె బలమైన వ్యక్తిత్వం వెల్లడవుతూ ఉంటుంది. ఆధునిక మహిళలకి ఆమె ప్రతిరూపం.
‘ఇదొక పోటీ ప్రపంచం, పెద్ద చేప, చిన్న చేపను మింగుతుంది. ఈ సంధి యుగంలో అందరం గొంగళ్ళలోనే అన్నాలు తింటున్నాం’.
‘నా ఇల్లు నేను కట్టుకుంటుంటే పక్కనించి వెళ్ళే వారి నెత్తిమీద ఇటుకలు పడ్డాయంటే నేనేం చెయ్యను’ అన్నప్పుడు కనిపించిన స్వార్థంలో ప్రతి నాయకత్వం.
‘నేను బలపడి ఇంకొకరికి బలమివ్వాలనే తత్వం నాది’.
‘నీతో ఎంత దూరం రమ్మన్నా వస్తా గానీ, ఏ ఘట్టంలోనూ నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను’ అన్న అదే ఇందిరలో నాయకత్వం కనిపిస్తుంది.
ఒకే పాత్రలో నాయకత్వం… మరో కాసేపు ప్రతి నాయకత్వం కనిపించటం వల్ల ఇది కథగా అనిపించదు. ఇది ప్రతి మనిషి యొక్క వాస్తవ నైజంలా అనిపిస్తుంది. ఆయా పరిస్థితులను బట్టి మానవ నైజంలో మనకి కనిపించే తీరుతెన్నులే ఈ మంచి చెడులు.
‘నువ్వు పురుగులాగా బతికేస్తే అందరూ నీ మీద కాలువేసి తొక్కేస్తుంటారు. అన్ని హంగులూ ఉన్న వాళ్ళకి రూల్సు పాటించడం సులువు. అతక్రమించడం కూడా సులువే. ఇప్పుడు దొరలు మారారేమో కానీ దొరతనం అలానే ఉంది. వేటికోసమూ బెంగ పెట్టుకోకుండా ఎక్కడికక్కడ సదుపాయంగా బతకడమే ఆ అమ్మాయి ఆశయం’ అన్న మాటల్లో ఈనాటికి వర్తించనిది ఏమైనా ఉందా?
‘రెక్కలున్నాయనుకుని ఎగరడానికి ప్రయత్నించుతాం. రెక్కలు లేవు మనకి. ఉన్నా అవి తడిసిపోయాయి’ అన్న నిరాశలో ఎంతటి జీవనసారం వడబోచినట్లో కదా!
విశ్లేషించుకుంటూ పోతే ఇందిర పాత్ర ఆకాశాన్ని తాకుతుంది.
మనకు నచ్చింది మనం చెయ్యాలి కానీ, లోకానికి వెరవకూడదు అన్నట్లుండే ఇందిర పాత్ర 60 ఏళ్ళక్రితమే సృష్టించబడిందంటే ఆ రచయిత్రి కాలానికి ఎంత ఎదురీదినట్లో కదా?
కేవలం ఇందిర పాత్రే కాదు…
ప్రతి క్షణం ఏదో ఒక ఆలంబన అవసరమైనట్లుండే కళ్యాణి, బలమైన వ్యక్తిత్వమంటూ లేక పిరికితనం మాటున, పచ్చి అవకాశవాదం వైపు మళ్ళిన ప్రకాశం, ఏ బాధ్యతలంటూ లేక జల్సా రాయుడిలా అనిపించినా, లోలోపల ఉన్నత వ్యక్తిత్వపు వెలుగులు దాచుకున్న కృష్ణమూర్తి జీవిత సమస్యలని దులిపేసుకుని ఏ క్షణానికా క్షణం సుఖంగా బతికేయాలనుకునే ఆనంద రావు, తన స్వార్థం కోసం మేనల్లుడు ఆస్తులని దిగమింగే శేషావతారం, ఏ సమస్యలూ లేకపోవడమే సమస్య అయి, మంచితనమే వ్యక్తిత్వమై చివరి వరకూ కళ్యాణికి చేయూతనిచ్చిన వసుంధర, స్నేహితుడి కూతురైనందుకు ఆమె మంచి చెడుల బాధ్యత తనదిగా అనుకున్న గిరినాయుడు, అనుకోని పరిస్థితిలో కళ్యాణికి సహాయం చేసి ఆమె జీవితంగా మారిపోయిన చక్రవర్తి .. ప్రతి పాత్రా మనిషిలోని భిన్న వ్యక్తిత్వాలకి ప్రతీకలు.
నిజం చెప్పాలంటే… ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్నట్లు కనిపించినా, ఇందులో పరాన్న భుక్కులాంటి పాత్ర కళ్యాణిది. ఆత్మాభిమానం పేరుతో తన చుట్టూ తాను గిరి గీసుకున్నట్లు కనిపించినా జీవితపు ప్రతి మలుపులో తనకు ఎవరో ఒకరి అండ దొరుకుతూనే ఉంటుంది. గత ఆరేడు దశాబ్దాలలో ఇలాంటి పాత్రలు కోకొల్లలు. మన నవలా నాయికల్లో ఎక్కువమంది ఇలాంటివారే. ఆడవాళ్ళలో ఎక్కువగా ఉన్న ఫియర్ ఆఫ్ సోషల్ డిఫీట్ అనేది ఇప్పటికీ ఇలాంటి కళ్యాణిలని ఎక్కువగా కొనసాగించేలా చేస్తుంది. సమాజానికి కూడా ఇలాంటి వాళ్ళతోనే భద్రతాభావం ఎక్కువ అనిపిస్తుంది. అందుకేనేమో… అరవై ఏళ్ళ క్రితమే కాదు ఈనాటికీ కళ్యాణిలాంటి వాళ్ళని అక్కున చేర్చుకోవడం… ఇందిర లాంటి వాళ్ళని చూసి ముఖం చిట్లించి దూరం పెడుతూ ఉండటం ఎక్కడా రాయబడని రివాజు.
కథ మొదట్లో ఉథృతంగా కధానాయకుడేమో అన్నట్లుగా కనిపించే ప్రకాశం, మధ్యలోకి వచ్చేసరికి కనుమరుగై, మొదట్లో వామనుడిలా కనిపించే కృష్ణమూర్తి త్రివిక్రముడిలా ఉన్నత వ్యక్తిత్వం సంతరించుకోవటం మనిషి ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వవచ్చో చెప్తున్నట్లు ఉంటుంది. కాకపోతే నవల ఆసాంతం అతని పాత్ర, మరొక పాత్ర చేత డామినేట్ చేయబడి ఎప్పుడూ అస్పష్టంగా ఒక నీడలానే
ఉంటుంది.
మన వ్యక్తిత్వం మీద చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణపు పునాదులు ఎంత ప్రభావం చూపిస్తాయో ఆయా పాత్రల పరిచయంలో అర్థమవుతుంది.
పాత్రల పరిచయంలోనే వారి వ్యక్తిత్వపు లోతులను అర్థమయ్యేలా రాయడం ఇంత సులభమా అన్నట్లు ఉన్న శైలి.
ప్రకాశం లాంటి పిరికి బాటసారులని చూడని జీవితమంటూ ఈనాటికీ లేదనే అనిపిస్తుంది. ప్రకాశం లాంటి వాళ్ళు సుఖంగా
ఉన్నామనుకుంటారు కానీ… వాళ్ళు ఎప్పటికీ పరాజితులే.
మన చుట్టూ ఉన్న సమాజంలో నేడు వేరే వేరు పేర్లతో ఎందరో ఇందిరలు, ప్రకాశాలు, కళ్యాణిలు, కృష్ణమూర్తులూ మనకు రోజువారీ తారసపడుతూనే ఉంటారు. కానీ వసుంధరలూ… చక్రవర్తులూ దొరకడమే కష్టం. రచయిత్రి కూడా ఈ పాత్రలని ప్రధాన పాత్రలకి నీడలుగా మార్చేశారు.
మానవ నైజంలోని విభిన్న పోకడల సమాహారమే ఇందులోని పాత్రలు. ఇందులోని ప్రతి పాత్రా కాలాతీత పాత్రలే.
ఇప్పుడు ఉన్న సమాజమంతా ఇందులో ఉన్న పాత్రల క్లోనింగ్‌లే.
కథా రచయిత్రిగా, గేయ రచయిత్రిగా, సాహిత్య విమర్శకురాలిగా పేరు తెచ్చుకున్న రచయిత్రి డా||పి.శ్రీదేవి జన్మస్థలం అనకాపల్లి. అతి పిన్నవయసులోనే కన్ను మూసిన ఈమె నవలగా రాసింది ”కాలాతీత వ్యక్తులు” ఒక్కటే. గోరాశాస్త్రి గారి సంపాదకత్వంలో వెలువడిన తెలుగు స్వతంత్రలో 7-9-1957 నుండి 25-1-1958 వరకు ధారావాహికంగా వెలువడి పాఠకుల మన్ననలను అందుకుందీ నవల. ఈమె కాలాతీత వ్యక్తులు నవల కోసమే జన్మించిందా అనిపిస్తుంది. రచయిత్రిగా ఈమె శైలి, భాషపై పట్టు పాఠకుడిని కట్టిపడేస్తుంది. అంతకంటే కూడా మనుషుల మనస్తత్వాలపై ఈమెకున్న పట్టు తన రచనని ఉన్నత స్థానంలో నిలబెట్టిందని చెప్పవచ్చు. ఈమె ఇతర రచనలు మధుకలశం (కవితాసుమం), ఉరుములు-మెరుపులు, కలతెచ్చిన రూపాయిలు అనే కథా సంకలనాలు.