మనసుని మెలిపెట్టే
వ్యథలెన్ని ఉన్నా
మత్తుకు వశమై బజారున బడకుండా
మంచుకొండలా మౌనంగా నిలిస్తే…
మనువున చెలిమి కొరవది
తోడ్పాటు నిండుకున్నా
పక్కదారి పట్టకుండా
గజరాజులా స్థిమితంగా అడుగు ముందుకేస్తే…
పిడుగుల్లాంటి ఆపదలు
అడుగడుగున ఎదురవుతున్నా
పిరికిదనంతో పారిపోకుండా
ఒంటరి సైన్యమై పోరాటం చేస్తే…
అవకాశాల నిచ్చెన లెక్కి
ఆకాశాన్నే అందుకున్నా
అహంకారంతో విర్రవీగకుండా
అణకువనే ఆభరణంగా ధరిస్తే…
సౌఖ్యాల సెలయేరు
చెంతనే పారుతున్నా
విచ్చలవిడిగా సంచరించకుండా
వటవృక్షమై సంయమనం పాటిస్తే…
వెల్లువయ్యే రాకాసి అలలు
కల్లోలమే రేపినా
ఏ కెరటాన్నీ ఒడ్డుదాటనివ్వకుండా
మహా సంద్రమై కడుపులోనే దాచేస్తే…
అనుమానం వీడి విశ్వసించండి
ఆ సౌజన్యశీలి ‘మహిళ’యని!
ఆమె సహిష్ణుతాయుత నైజమే
మానవ మనుగడ కాధారమని!