ఓ మగ మద మృగాల్లారా
మీరు మీ ఇళ్ళల్లో చావండి
మీ భార్యల ఒళ్ళల్లో చావండి
మీ తల్లుల గుండెలపై చావండి
మీరు చావడానికి దేశంలో
పరమ పవిత్ర స్థలాలెన్నో ఉన్నాయి.
మీ గృహ స్వర్గసీమలూ
మీ పవిత్ర బంధాల పొదరిళ్ళూ ఉన్నాయి.
నదులూ, సముద్రాలూ
పర్వతాలూ, ఎడారులూ
ఎత్తైన మేడలూ
లోతైన బావులూ
పంట చేలూ, కాలువ గట్లూ
హోటలు గదులూ
ఎక్కడైనా చావొచ్చు-
మాకు మిమ్మల్ని బతికించటమే తెలుసు
ప్రపంచం మీద కసి మిమ్మల్ని దహించిన వేళ
మిమ్మల్ని మీరు అసహ్యించుకున్న వేళ
లోకం మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా
నేల రాసిన వేళ
ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని
మీ కసినీ, రోతనూ, ద్వేషాన్నీ
మా ముఖాలకు పులుముకున్నాం.
మీ ఏడుపు గొట్టు ముఖాల్లో
మా నవ్వుల కాంతులు పూయించాం.
మమ్మల్ని కొట్టి, గిచ్చి, రక్కి, ముద్దాడి
మీ అశాంతుల్ని అలవగొట్టుకుని
మీ వికృత వాంఛాగ్నుల్ని
మా ఒడిలో చల్లార్చుకుని
ఎన్ని సార్లు తృప్తిగా తేన్చారు –
మాకు మిమ్మల్ని సుఖపెట్టడమే తెలుసు.
చావటానికి మా దగ్గరకు రాకండి.
బతకటానికి నానా చావూ చస్తున్న వాళ్ళం!
(ఒక శనివారం నాడు (15.7.88) మెహందీలోని ఓ అమ్మాయి దగ్గరకు ఎవరో ఒక యువకుడు వచ్చి పదిహేను రూపాయిలిచ్చి కాసేపటికి నాకేం బాగోలేదంటూ పడిపోయాడు. అయ్యో ఎవరో ఏ తల్లి కన్నబిడ్డో అని ఆ అమ్మాయి ఆటోలో అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళింది. తన పేరూ అడ్రసూ ఇచ్చి చేర్పించింది. అతను చచ్చిపోయాడు. విషం తినటం వల్ల చచ్చిపోయాడట. పోలీసులు మెహందీ మీద పడ్డారు. ఆ అమ్మాయితో పాటు మరో ముగ్గుర్ని అరెస్టు చేశారు. చుట్టు పక్కల ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళను బైటికి లాగారు. ఇష్టం వచ్చినట్లు కొట్టారు. వాళ్ళ సామాన్లు ధ్వంసం చేశారు. వారం రోజుల పాటు ఇళ్ళల్లోకి పోనివ్వకుండా బజారులో నిలబెట్టారు. వానలో చలితో, ఆకలితో వాళ్ళు అల్లాడిపోయారు. ఆ తర్వాత ఇళ్ళల్లోకి వెళ్ళనిచ్చినా వీథంతా పోలీసులు. ఎవరూ అటు రావటానికి సాహసించటం లేదు. ఆ నలుగురు స్త్రీలు వెయ్యి వెయ్యి రూపాయలు జామీను కట్టి బైటికి రావాల్సి వచ్చింది.
ఈ వార్త పేపర్లో చదివి వాళ్ళకేమీ చేయకపోయినా కనీసం వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళ గోడు విందామని వెళ్ళిన నలుగురు స్త్రీలతో ఆ మెహందీ స్త్రీలు చెప్పిన మాటలు- వారి ఈ విజ్ఞప్తి వీలైతే పేపర్లో ప్రకటించమని కోరారు.)