అలాగే పెరగనిస్తే…
బలమైన వృక్షంగా మారే
చిరుమొలకను
కరుణ మాలి పీకేస్తే…
అందంగా అల్లుకోనిస్తే…
ముంగిటి పందిరయ్యే
లే తీవెను చిగురులోనే
దయ లేక తుంచేస్తే…
సహజంగా విరియనిస్తే…
సమ్మోహక పరిమళాన్నందించేలీ
పసి మొగ్గను ఆదిలోనే
కసి బట్టి చిదిమేస్తే…
పక్వాని కొచ్చిందాకా వేచి చూస్తే…
మధురమైన ఫలమయ్యే
పాలుగారు పిందెను
జాలి మరిచి నేల రాలిస్తే…
వృక్ష జాతి ఉనికి
ప్రశ్నార్థకమవదా?
యుక్త వయసున పెండ్లి జేస్తే…
ముందు తరాలకు వారసులనందించే
భవిష్యత్ తల్లిపై
బాల్యంలోనే అఘాయిత్యం చేసి, అంతమొందిస్తే…
మానవ చరిత్రే
ముగిసిపోదా?