రాత్రి దీపం దహిస్తుంది
మసక చీకటి మంత్ర భస్మమై కలలు పొగలు పొటమరిస్తాయి
ఏకాంతధ్వాంతాన మొహమాటాల మొగ్గలు విప్పారి
స్వాగత సౌరభాలు ఎరుపుకొసల అగరుతీగలౌతాయి
పగలంతా సమస్యల పచ్చి గాయాలు రేగి దిగులు స్రవించిన కళ్ళు
నిశాలేపనం పులుముకుని లేవెన్నెల బయళ్ళవుతాయి
దైనిక మర్యాదల నిర్జల ధారలలో
తడిసి మోపెడైన సభ్యతావస్త్రాలు విదిల్చి
వాంఛాస్నానానికి ఉద్యమించి
ఆత్మలు రెండు
నిలువెత్తు నిస్సిగ్గుకి నిర్వచనభంగిమలవుతాయి
దేహం మహతిపై స్పర్శాపవనాలు తరగలెత్తి
మగత నవ్వుల నిక్వాణాలతో మోహం మేఘమల్హారమౌతుంది
చీకటి నదిలో అనాది కాంక్షాకిరణం సోకి
విప్పారిన ఇరుకల్హారాలు పరవశాల పరిమళాలు పై కెగరేస్తాయి
వాంఛోధృతికి వణికిపడే ఒళ్ళూ
రహస్యాల్ని వడికే వేళ్ళూ
ఎప్పటికీ తెగని చిక్కుముడిని విప్పేందుకు పలకాబలపాలవుతాయి
ఊరువులూ నిట్టూరుపులూ
పరస్పర గాత్ర సహకారంతో
జుగల్ బందీ తారాస్థాయిని చేరుతుంది.
నెత్తురంతా నిషా పొంగి
అగాధ రహస్యాలు చెరిసగమై ఆవిష్కరించాక
చెమరించిన నొసట తృప్తి వజ్రం తళుకుమంటుంది
డోలిక ఆగక తప్పదు
ఇంతా జరిగి పోయాక హాయి ఊయల ఆగక తప్పదు
చాలీ చాలని సుఖం దుప్పటి బాహ్యాంతర నగ్నతను పూర్తిగా కప్పదు
హఠాత్తుగా పూచిన పరిమళాలు అంతలోనే ఆవిరవుతాయి
ఒడుపు తెలీక చేజార్చిన కలల పట్టుదారాల కోసం
కళ్ళు వెక్కిళ్ళు పెడతాయి
రూపాల్నీ లోపాలనీ సుతారం చేసి చూపిన
వెన్నెల వెండి అద్దం వెల వెల పోతుంది
యదార్థాల యాంటీక్లయిమాక్స్ ఎప్పటిలా ఎదురొస్తుంది.
సమస్యలు రేగిన వ్రణాల్లా సలపరిస్తాయి
నిజాలు నిప్పుకణికల్లాగే నిగారిస్తాయి
ప్రశ్నల పునర్జ్వలనంతో అంతరాత్మల కమురుకంపుకు
అగరు కొసన వేలాడే బూడిద తీగ ఆఖరి ప్రేక్షకనేత్రమౌతుంది
క్షణం క్రితం గర్వపడ్డ హృదయం గాయమై పగులుతుంది.
మాధుర్య మాణిక్యమై భాసించింది మట్టి ముద్దయి మిగులుతుంది.
నల్లని చల్లని రాత్రి గచ్చు మీద
తొలి కిరణం తురాయి ముల్లయి గుచ్చుతుంది.