వాడూ నేనూ
ఎదురెదురుగా కూర్చున్నాం
టేబుల్ మీద టీ పొగలు కక్కుతోంది
ప్లేటులో ఉస్మాన్ బిస్కెట్లున్నాయ్
ఏందిరా! మాట్లాడవ్
మాట్లాడాలని పిలిచావ్ కానీ
ఏందీ మౌనం? ఏమైందిరా?
వాడు ఏడుస్తున్నాడు
కళ్ళల్లోంచి నీళ్ళు ధారకట్టాయ్
ఏమైందిరా! ఊర్లో అందరూ మంచిగున్నరా
ఏం మాట్లాడడు
ఏడుపే సమాధానం
కాసేపటికి కళ్ళు తుడుచుకున్నాడు
కళ్ళెత్తి నా వేపు చూశాడు
ఎర్రబడ్డ కళ్ళు
దుఃఖపు జీరలు తారాడుతున్న కళ్ళు
సారీ రా! ఆపుకోలేకపోయాను
టీ ఆరిపోతోంది
బిస్కట్ల మీద ఈగలు వాలుతున్నాయ్
చెరో కప్పు తీసుకున్నాం
వాడి కళ్ళల్లోంచి ఉబికి వస్తున్న కన్నీళ్ళు
టీ కప్పులోకి జారుతున్నయ్.
వెంటనే లేచెళ్ళి పోయాడు
సింక్ దగ్గరకెళ్ళి ముఖం కడుక్కున్నాడు
పోదాం పదరా! అంటూ బయటకు దారితీశాడు
ఏమైంది వీడికి? ఏం చెప్పడు
ఊరికే ఏడుస్తున్నాడు అనుకుంటూ
సరే పద పోదాం, నేనూ బయటకు నడిచాను
ఈ రోజు శలవే కదా నా రూమ్‌కొస్తావా అన్నాడు
ఇప్పుడు కొంచెం పనుందిరా
రాత్రికి నీ రూమ్‌కొస్తా బయటికి పోదాం
సర్లే అయితే నేను పోతా అంటూ
బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.
వెనక్కి తిరిగి చూడలేదు
చూస్తే కన్నీళ్ళు కనబడతాయనుకున్నాడేమో.
వాని రూమ్‌కెళ్ళేసరికి చీకటి పడుతోంది
తలుపు తీసుకుని లోపలికెళ్ళాను
లైటు వేసుకోకుండా మంచం మీద పడుకున్నాడు
లైట్ వెయ్యగానే లేచాడు
ఏమిరా? చీకట్లో పడుకున్నావ్
లైటెందుకు వేసుకోలేదు.
రారా కూర్చో! నీ పనయిపోయిందా?
పనేం కాదులేరా? రశ్మిని కలిసేదుంది
ఓహో! అదా సంగతి అని నవ్వాడు.
హమ్మయ్య! నవ్వావా?