తూనీగ రెక్కలు చాచి రమ్మంటుంటే
గోగుపూల జాబిలి జాజిమల్లి పరిమళాలకు
హృదయం మధురగాన మవుతుంటే
అమ్మాయికి పనిముద్దు కుప్పిగంతులు కూనిరాగాలు కావు
అవ్వ! పరువేం కాను? అంటూ అమ్మమ్మ కన్నెర్ర.
పరాగ వీచికలు విచ్చుకున్న విరులను మురిపిస్తుంటే
అపురూపంగా పెదవుల్లో చిరునవ్వు లొలుకవూ!
నవ్వే ఆడదాన్ని ”నంగనాచి…”
అంటుందే లోకం అంటూ నానమ్మ బెదిరింపు
అందాల ప్రకృతి, పశుపక్షి కూనల
అనురాగ చిందులు ముద్దుగా పలకరిస్తుంటే
పరవశించకుండా ఎలా ఉండగలను?
పరవశాలు పరధ్యానాలు కూడదంటూ
అర్థం కాని కఠిన క్రమశిక్షణ మామయ్యది.
నల్లని మబ్బులు చిరుమంచు జల్లులు
నా లేతపాదాలలో అల్లరి చేస్తాయి
ఆలయనాధాలు విస్మయానంద అలలు
మృదు హృదయదేహం తన్మయానందంతో
అభినయిస్తుంది
బరితెగిన భాగవతబ్బామలా
ఎగురుళ్ళూ తిప్పడాలు
ఇరుగు పొరుగు చూస్తే ఇంకేమైనా ఉందా
పిచ్చి వేషాలు వేశావంటే
కాళ్ళు విరగ్గొడతాము… జాగ్రత్త.
అమ్మ నాన్న గద్దింపు
ఉదయ సాయంసంధ్యలు గగనతారలు
వెన్నెల… చీకటి.. పగలు రాత్రి విశ్వోద్భవ స్పృహ..
నా విశాల నేత్రాలలో ఆలోచనలై ప్రతిబింబిస్తుంటే
తెగవిడిచిన భూతంలా ఏమిటా పిచ్చిచూపులు
ఛీ! ఛీ!! అంటూ ఛీత్కార పరిహాసాలు…
ఇంటా బయటా ఆడపిల్లకు సమాజమంతటా
అన్నీ ఆంక్షలే… అడ్డుగోడలే.
నేను వికసించకూడదు ప్రవహిస్తూ విస్తరించకూడదు
… మనస్సు పురివిప్పకూడదు
నా బాల్యం… కౌమారం… ఆశలు కలలు కోరికలు
అనురాగం సృజన ఉత్సాహం సర్వస్వం చచ్చిపోయాయి
నాలో ఇంకా మిగిలి ఉన్నదేమిటి?
సకలం కోల్పోయిన శకలాన్ని
భౌతికంగా కదిలిస్తున్న శక్తి ఎక్కడ దాగుంది
నేనింకా క్షీణించి నశించిపోలేదెందుకు?
ఏకాత అంతరాలలో అంతరాంతరాలలో
ఒక అమరమైన అమృతవాణి మృదువుగా వినిపిస్తోంది
నా హృదయాంధకారంలో సానబట్టని ‘వజ్రకణం’
ఒకటి ఇంకా బ్రతికే ఉందని
అదే ‘తిరస్కార’, ‘ధిక్కార’ దివ్యకణమని
నివురు కప్పిన పోరాట ‘అగ్నికణ’మని
దానిని విభజించి నిప్పురవ్వలు రగిలించే
చైతన్య అంతర్ధర్మం నాదేనని…