ఉన్న అన్నం అందరికీ సర్దిపెట్టి
ఆగని ఆకలిని మంచి నీళ్ళతో చల్లార్చుకుని
తృప్తిగా నెమరేసే ఆవులా…
మౌనాశీస్సులతో మమ్మల్ని జోకొట్టావు!
ఇంటిల్లిపాదికీ కొత్త బట్టలమర్చి
పెళ్ళినాటి పట్టుచీరని మురిపెంగా కట్టుకుని
పసిపిల్లలా పకపకలాడుతూ…
పండుగ పరిమళాన్ని ఇల్లంతా వెదజల్లావు!
మా చిరు నలతకే తల్లడిల్లి
మేం లేచి పథ్యం తినగానే
గ్రహణం విడిచిన చంద్రునివై
నవ్వుల వెలుగుల్ని చుట్టూ విరజిమ్మావు!
నీ వైన వ్యథల్ని… సంసారపు బాధల్ని
బయటకు పొక్కనీక
ఆటుపోటుల సంద్రానివై…
అల తాకిడిని మాకు సోకనివ్వనే లేదు!
డబ్బుల్లేకుంటే జబ్బేదైనా
లోన దాచుకుని… అంతా బావున్నట్టు
గారడీ వానిలా ఏమార్చి…
భ్రమల తీరాల్లో మమ్మల్ని నిలిపావు!
అర్థరాత్రి దాటేదాకా చదువుకుంటుంటే
అరగంటకో టీతో అలరిస్తూ
శక్తినిచ్చే సంజీవినిలా…
కళ్ళతోనే ధైర్యపు మూటల్ని మాలోకి పంపావు!
దూర దేశాల కొలువు కెళ్తుంటే
భారమైన గుండెను గుట్టుగా బ్రతిమాలుకుని
గీతా కృష్ణునిలా అభయముద్ర చూపిస్తూ…
కంపించే మనసుతోనే కర్తవ్యం నెరవేర్చావు!
కొత్త కాపురం రంధిలో కాస్త దూరం జరిగినా
చిన్నబోతున్న మనసును చిక్కబట్టుకుని
వరాలివ్వడమే తెల్సిన దేవతలా…
వేల దీవెనల సంపదతో సాగనంపావు!
నీవు లేని ఈ వేళ…
నీ జ్ఞాపకాల పచ్చని పందిరిలో కూర్చుని
నీ త్యాగాల పూలగాలిని పీలుస్తూ
నీ ప్రియమైన మోసాల మధుర ఫలాలనాస్వాదిస్తూ
నీ మొత్తం వ్యక్తిత్వానికి ప్రణమిల్లుతున్నా అమ్మా…