నా వాళ్ళ ఎముకలు ఉన్నచోటే నా ఇల్లు! -మమత. కె

నులివెచ్చని ఎండ నా ఎదురుగా ఉన్న గుట్టకు వింత రంగులు పులుముతోంది. గుట్ట మీద సుపరిచితమైన దృశ్యం. కమానుతో కూడిన ద్వారబంధం. అందులోంచి లీలగా కనిపిస్తున్న ఒక స్మారక స్థూపం. పుస్తకాల్లో, సినిమాల్లో, ఆన్‌లైన్లలో చూసిన దృశ్యం. ఇప్పుడు కళ్ళముందు కనపడేసరికి వెన్నులో గగుర్పాటు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన సౌత్‌ డకోటాలోని ”వూండెడ్‌ నీ” మెమోరియల్‌ అది. సరిగ్గా చెప్పాలంటే, లకోట (సూ) ఉప తెగల్లో ఒకటైన ఒగ్లాల లకోట తెగకు చెందిన ఫైన్‌ రిడ్జ్‌ రిజర్వేషన్‌లో మారణకాండ జరిగిన చోటు.

గుట్ట ఎక్కేముందు ఒకసారి చుట్టూ చూశాను. కొంచెం దూరంగా ఉన్న ఒక చిన్న అరుగు చుట్టూ నిలబడి ఉన్న నలుగురు వ్యక్తులు నన్నే చూస్తున్నారు. వాళ్ళ చేతుల్లో రంగురంగుల పూసల నెక్లెసులు, ఇంకా ఏవో వస్తువులు అంత దూరం నుంచే కనిపిస్తున్నాయి. హెలో అన్నట్లు చెయ్యి ఊపాను. వాళ్ళూ చెయ్యి ఊపి వాళ్ళ మాటల్లో పడ్డారు.

అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా ఆ చిన్ని గుట్ట ఎక్కడం మొదలుపెట్టాను. ఒక్కొక్క అడుగే ముందుకు పడుతూ ఉంటే స్మారక స్థూపం మెల్లగా దృష్టి పథంలోకి వస్తోంది. వేగంగా కొట్టుకుంటున్న నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. స్మారక స్థూపం చుట్టూ ద్వారబంధం తప్ప మిగతా అంతా ఇనుప ఊచలతో చేసిన కంచె. కంచెకు ఎప్పుడెప్పటిి నుంచో కట్టిన రంగు రంగుల రిబ్బన్లు, గుడ్డ పేలికలు గాలికి ఎగురుతున్నాయి. ద్వారబంధంలోంచి లోపలికి వెళ్ళబోయేంతలో గుట్టకు మరోవైపు నుంచి కెవ్వుమని కేక వినిపించింది. అటువైపు పరుగుత్తాను. గుట్టకు దిగువన డొంకలో రెండు ట్రైలర్‌ ఇళ్ళూ, వాటి మధ్య ఒక చెట్టూ. ఆ ఇళ్ళవైపు వెళ్ళాలా వద్దా అని అనుకుంటూ ఉండగానే ఆ చెట్టు దగ్గర్నుంచి పిల్లల కేరింతలు వినిపించాయి.

కళ్ళు చికిలించుకుని చూస్తే ఇద్దరు పిల్లలు… ఒకరు చెట్టు మీద, ఇంకొకరు చెట్టు కింద. ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ నవ్వుతూ

ఉన్నారు. వాళ్ళనే చూస్తూ గడ్డిలో కాసేపు కూర్చున్నాను. నెమ్మదించిన మనసుతో లేచి స్మారక స్థూపం దగ్గరికి వెళ్ళాను.

ఎప్పుడో 1900ల్లో కట్టిన స్మారకం. దానిమీద చెక్కిన అక్షరాలు అల్లుకుపోయి నట్లున్నా తేలికగానే చదవగలిగాను. ”బిగ్‌ ఫుట్‌ సూ ఇండియన్ల గొప్ప నాయకుడు”. ”నా చివరిరోజు వరకూ శాంతి కోసమే నిలబడతాను” అని ఆయన ఎప్పుడూ అంటుండేవారు. ఆయన తెల్లవాడి కోసమూ, ఎర్రవాడి కోసమూ ఎన్నో మంచి పనులూ, సాహసకృత్యాలు చేశారు. ఏ తప్పూ తెలియని అమాయకులైన పిల్లలూ, ఆడవాళ్ళూ ఎంతోమంది ఇక్కడ చనిపోయారు.” ఆ స్మారకం మీద మరోవైపు అక్కడ చనిపోయిన కొంతమంది పేర్లు

ఉన్నాయి. ఆ పేర్లు చదవగలిగినంతసేపు చదివి కాసేపు అక్కడే గడిపి గుట్ట దిగాను.

అరుగు దగ్గర మాట్లాడుకుంటున్న వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ చేతుల్లో రంగు పూసలతోనూ, జంతువుల ఎముకలతోనూ చేసిన నెక్లెసులూ, డ్రీం క్యాచర్లూ, బ్రేస్‌లెట్లూ ఉన్నాయి. ”కొంటాను కానీ, నాకు ఒక కథ చెప్పండి” అన్నాను. నా వైపు వింతగా చూసి ముగ్గురూ పక్కకు వెళ్ళిపోయారు. ఒకతను మాత్రం తన సరంజామాను భుజానికి వేలాడుతున్న సంచీలో సర్దుకుని, అందులోనుంచే ఒక డబ్బా బయటకు తీశాడు. మంచి పొగాకు వాసన గుప్పుమంది.

సిగరెట్‌ చుట్టుకుంటూ, ”ఏం కథ కావాలి మీకు?” అని అడిగాడు. ఆయన ముఖంలో నిరాసక్తత, గొంతులో అవహేళన కలగలిసిన జీర. ఎందరెందరో వచ్చిపోయే చోటు ఎటువంటి మనుషులనూ, మనస్తత్వాలనూ చూసి ఉంటాడో. ఆ మధ్య స్నేహితురాలితో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. మా మధ్య నేటివ్‌ అమెరికన్ల ప్రసక్తి వచ్చింది. కొన్ని రోజుల క్రితమే జరిగిన సాహిత్య సమావేశంలో మాట్లాడిన నేటివ్‌ అమెరికన్‌ కవుల గురించి చెప్పాను.

”వాళ్ళు ఎలా ఉంటారు? మనలాగానే డ్రెస్‌ చేసుకుంటారా లేక జంతు చర్మాలనే కట్టుకుంటారా? ఇంకా జంతువులను వేటాడుతుంటారా?” ఆమె అడిగిన ఆ ప్రశ్నకు ఎట్లా సమాధానం చెప్పాలో కాసేపు అర్థం కాలేదు. ఈ దేశాన్ని స్వంత దేశం చేసుకున్నవాళ్ళం. ఈ గడ్డమీద పిల్లల్ని కన్నవాళ్ళం. ఈ గడ్డ పూర్వీకుల గురించీ, మూలవాసుల గురించీ ఏమీ తెలీదు. ఆమె నన్ను అడిగిన ప్రశ్నే ఇక్కడికి పర్యాటకులుగా వచ్చేవాళ్ళ ముఖాల్లో కనిపిస్తుందేమో ఆయనకు.

”నా ప్రశ్న మీకు వింతగా ఉండొచ్చు. నేను న్యూజెర్సీ నుంచి వస్తున్నాను. కానీ పర్యాటకురాలిగా కాదు. మీ గురించి చెప్పండి. ఈ స్మారకం గురించి చెప్పండి. మధ్యలో సందేహాలేవైనా వస్తే అడుగుతాను. అంతకంటే ముందు మీరు చెప్పబోయేదానికి అడ్డు రాకుండా ఇందాక లోపల పెట్టేశారే తెల్ల పూసలతో చేసిన నెక్లెస్‌ అది ఇవ్వండి” ఆ నెక్లెస్‌ను తీసి ప్లాస్టిక్‌ కవర్లో భద్రంగా పెట్టి ఇచ్చి ”ఇరవై డాలర్లు. బేరం లేదు. కథకు డబ్బు ఇవ్వక్కర్లేదు” చిర్నవ్వుతో అన్నాడు. నెక్లెస్‌ నా బ్యాగులో పెట్టుకుని డబ్బు ఇచ్చి ”నా పేరు మమత. మీ పేరు?” అడిగాను. ”నా పేరు విల్సన్‌. మాది ఒగ్లాల లకోట తెగ. న్యూ జెర్సీ నుంచి వస్తున్నారా? ఇదేనా మీ చివరి స్టాప్‌? బ్యాడ్‌ ల్యాండ్స్‌ వెళ్ళారా?”

”నార్త్‌ డకోటాలో పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా ప్రొటెస్ట్‌ జరుగుతోంది కదా. ఆ ప్రొటెస్ట్‌లో కొన్ని గంటలు పాల్గొని, రాత్రికి న్యూజెర్సీకి తిరుగు ప్రయాణం. బ్యాడ్‌ ల్యాండ్స్‌ గుండానే డ్రైవ్‌ చేశాను కానీ ఆగలేదు. ఇక్కడ ఎక్కువసేపు ఉండాలని అనుకున్నాను”.

”ప్రొటెస్ట్‌లో పాల్గొనడానికి అంత దూరం నుంచి వస్తున్నారంటే మీరు సీరియస్‌ మనిషే అని అర్థమవుతోంది” సిగరెట్‌ ఓ రెండు దమ్ములు పీల్చుకుని పక్కన చెత్తబుట్టకు నులిమి బుట్టలో పడేశాడు. చెయ్యితో నలుదిక్కులా చూపించి అన్నాడు. ”ఓ రెండు వందల ఏళ్ళ క్రితం ఈ భూమి ఇలా లేదు. ఈ భూమి మీద పుట్టిన మనుషులూ ఇలా లేరు. ఈ భూమి మీద స్వేచ్ఛగా తిరిగినవాళ్ళం. ఇచ్చిపుచ్చుకోవడాలే గానీ అమ్మకాలు ఉండేవి కాదు. 1800ల్లో మొదలైన గోల్డ్‌ రష్‌ మా పొలిమేరల్లోకి రావడానికి మరో ఇరవై ఏళ్ళు పట్టింది. ఆ ఇరవై ఏళ్ళలో కూడా తూర్పు నుంచి పడమరకు చొచ్చుకొచ్చిన తెల్లవాడి దురాశ మాకు రోగాలను అంటగట్టడమే కాకుండా మేం వేటాడే జంతువుల సంఖ్య కూడా తగ్గించేసింది. మాకు అమెరికన్‌ సైన్యానికి యుద్ధాలు అప్పుడే మొదలయ్యాయి. ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకుంటూ, నయానో భయానో మా వాళ్ళను వేర్వేరు ప్రాంతాలకు పరిమితం చేసేశారు. దేశమంతటా వేల ఎకరాల్లో తిరుగాడిన తెగలన్నీ ఒక్కొక్కటిగా అమెరికా ప్రభుత్వం కేటాయించిన భూభాగాలకు పరిమితమై పోయాయి. మా లకోట తెగలో ఏడు ఉపతెగలు ఉన్నాయి. ఒక్కో

ఉపతెగకు దూరం దూరంగా ఉన్న ప్రాంతాలను కేటాయించారు”.

”డివైడ్‌ అండ్‌ రూల్‌ సూత్రం అన్నమాట” విరక్తిగా నవ్వి అన్నాను. ”అవును! తెగలతో విడివిడి ఒప్పందాలూ, ఒప్పందాల మీద ఒప్పందాలూ కుదుర్చుకుంటూ ఒక్కొక్క ఒప్పందాన్నీ తుంగలో తొక్కేస్తూ, తెగలకు కేటాయించిన భూములను మెల్లగా ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు”. ”ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు తెగల కదలికలు కొంత ప్రాంతానికే పరిమితమైతే వేట ఎలా సాధ్యమవుతుంది? లకోట తెగలకు వేటే ప్రధాన జీవనోపాధి కదా?” ”వ్యవసాయం చేసుకోవడానికి గింజలూ, పనిముట్టూ ఇస్తామన్నారు. పంట చేతికి వచ్చేవరకు ఆహారధాన్యాలు సమకూరుస్తామన్నారు. అవేవీ సరిగ్గా జరగలేదు. ఆహారం ఎవరికీ సరిపోని దుర్భర పరిస్థితి ఉండేది. అడపాదడపా యుద్దాలు జరిగేవి. 1868లో అమెరికన్‌ ప్రభుత్వానికీ, నేటివ్‌ అమెరికన్‌ తెగలకూ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం నేటివ్‌ అమెరికన్లకు కేటాయించిన భూభాగాన్ని తెల్లవాళ్ళెవరూ ఆక్రమించుకోకూడదు, నివాసాలు ఏర్పరచుకోకూడదు. మా అనుమతి లేకుండా ఈ ప్రాంతం గుండా ప్రయాణించకూడదు. కానీ అది మూలన పడడానికి ఎంతోకాలం పట్టలేదు. తెల్లవాడు మాకు లెక్కపెట్టలేనన్ని ప్రతిజ్ఞలు చేశాడు. ‘మా భూమిని ఆక్రమించుకుంటానన్న’ ఒక్క ప్రతిజ్ఞ తప్ప మరేదాన్నీ నిలుపుకోలేదు’ అని మా తెగ నాయకుడు రెడ్‌ క్లౌడ్‌ అన్నాడు. మా నాయకులు కొంతమంది యుద్ధాల్లో చనిపోయారు. కొంతమంది మోసపూరితంగా హత్య చేయబడ్డారు. నేటివ్‌ అమెరికన్‌ తెగలన్నింటినీ రూపుమాపేంత వరకు తెల్లవాడు ఊరుకోడని నిరాశలో కూరుకుపోయారు జనం”. ఈ ప్రాంతాల్లో సరైన జీవనోపాధి లేక, ఇక్కడినుంచి బయటపడే దారిలేక ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో, ఆయనైతే చెప్పుకుపోతున్నాడు కానీ నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

”స్వేచ్ఛగా తిరుగాడిన భూమీ పోయి, జీవనోపాధీ పోయి, అవమానాలతో పేదరికంలో అలమటిస్తున్న జనం మధ్యకు ‘భూత నృత్యం’ (+ష్ట్రశీర్‌ ణaఅషవ) అనే మతాన్ని తీసుకొచ్చాడు వొవోక అనే మెడిసిన్‌ మ్యాన్‌. మెడిసిన్‌ మ్యాన్‌ అంటే మా మత గురువు. మూలికలతో, ప్రార్థనలతో మానసిక, శారీరక జబ్బులకు చికిత్స చేస్తారు. పాట పాడుతూ, నృత్యం చేస్తూ ఉంటే కొన్నాళ్ళకు మునుపటి కాలం మళ్ళీ వస్తుందనీ, తెల్లవాడితో జరిగిన యుద్ధాల్లో చనిపోయిన వీరులూ, తెల్లవాడు జరిపిన జనసంహారంలో చనిపోయిన పిల్లలూ, ముసలివాళ్ళూ, ఆడవాళ్ళూ బతికి వస్తారని ఆ మతం నమ్ముతుంది. వొవోక చెప్పిన మాటలు దేశం నలుమూలల్లా వ్యాపించాయి. తెగలకు తెగలు భూత నృత్యం చేయడం ప్రారంభించారు. అదంతా అమెరికన్‌ ప్రభుత్వాన్ని హడలెత్తించింది. అప్పటికీ చెదురుమదురుగా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. తెల్లవాడు భయపడుతూనే, మా నాయకులను ఒక్కొక్కరిని హతమారుస్తూ ఉన్నాడు”.

”క్రేజీ హార్స్‌, సిటింగ్‌ బుల్‌ నాయకత్వంలోని తెగలు ఇతర తెగలతో కలిసి లిటిల్‌ బిగ్‌ హార్న్‌ యుద్ధంలో కస్టర్‌ను ఓడించారు కదా?”

”అవును. అమెరికా సైన్యానికి గర్వకారణమైన 7వ అశ్విక సైన్యానికి నాయకుడు జనరల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ కస్టర్‌. తాషుంక వీట్కో అంటే క్రేజీ హార్స్‌ మా ఓగ్లాల లకోట వీరుడూ, నాయకుడు. మనుషులూ, జంతువులూ తిరుగాడే చోట్లను ఎవరూ అమ్మలేరు అని నమ్మినవాడు”. నీ భూమి ఎక్కడ అని ఎవరో అడిగితే

‘తొయేక మిత ఒయాతే

లుహ యంత కిన్‌

హేన వాతి ఏలో’

అని చెప్పాడట. అంటే, నా వాళ్ళ ఎముకలు ఎక్కడున్నాయో అదే నా భూమి, నా ఇల్లు అని అర్థం. తతంక ఇయోతక, అంటే సిటింగ్‌ బుల్‌ హుంక్పప లకోల తెగ నాయకుడు. తాషుంక వీట్కో కంటే బాగా పెద్దవాడు. ఎన్నో యుద్దాల్లో పాల్గొన్నాడు. ఈ ఇద్దరి నాయకత్వంలో, చెయాన్‌ తెగ ఇంకా కొన్ని తెగలతో కలిసి పకడ్బందీ వ్యూహం పన్ని కస్టర్‌ను ఓడించారు. ఆ యుద్ధంలో కస్టర్‌ చనిపోయాడు. ఆ యుద్ధాన్ని కస్టర్‌ లాస్ట్‌ స్టాండ్‌ అని అంటారు గానీ అది మా వాళ్ళ లాస్ట్‌ స్టాండ్‌. ఆ యుద్ధం తరువాత తాషుంక వీట్కోనూ, తతంక ఇయోతకనూ మోసపూరితంగా హత్య చేశారు. తాషుంక వీట్కోను ఆయన తల్లిదండ్రులు ఈ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారు. ఇక భూత నృత్యం చెయ్యడం తప్ప మరోదారి కనిపించలేదు వాళ్ళకు.” గొంతు బొంగురు పోవడంతో సంచీలోంచి నీళ్ళ సీసా తీసి నీళ్ళు తాగి ఒక చాక్లెట్‌ తీసి నాకు ఇవ్వబోయాడు. ఇబ్బందిగా చూసి వద్దన్నాను. ”మంచిది. ఎవర్నీ నమ్మొద్దు. పేదరికం ఎన్నో చెడ్డపనులు చేయించగలదు. కానీ ఇది ఉత్తి చాక్లెటే” చాక్లెట్‌ లోపల పెట్టేస్తూ అన్నాడు.

”నృత్యం చెయ్యడం వల్ల ఏమొస్తుంది?” ఇది ప్రార్థనా, లేక ఆయుధాలు చేపట్టమని ఇచ్చే పిలుపా అని నా సందేహం.

”పాట, నృత్యం అనేవి దాదాపు తెగలన్నింటిలోనూ అతి ముఖ్యమైన సంప్రదాయం. ఉనికిని పోగొట్టుకుంటూ నిరాశలో పడిపోతున్న జనానికి ఆసరాగా ఈ భూత నృత్యాన్ని కనుక్కొన్నాడేమో వొవోక. ఏదైతేనేం తెల్లవాడికి భయమేసి ఎక్కడ నృత్యం జరుగుతుందో అక్కడికి సైన్యాన్ని పిలిపించుకున్నాడు. నిజానికి ఈ నృత్యం శాంతిని కోరుతుంది. హింసను ప్రేరేపించదు. పాట, నృత్యం అనేవే ఆ మతాన్ని చేపట్టిన వారి ఆయుధాలు. ‘మన ప్రాణాలు కాపాడమని మనం ప్రార్ధిస్తుంటే మనం వాళ్ళ ప్రాణాల్ని అడుగుతున్నామని అనుకున్నాడు తెల్లవాడు’ అని మా నాయకుడు రెడ్‌ క్లౌడ్‌ ఆ ఉద్రిక్త పరిస్థితుల గురించి అన్నారు”.

”ఇంతకీ సిటింగ్‌ బుల్‌నూ, క్రేజీ హార్స్‌నూ చంపేసినప్పుడు లకోట ప్రజలు తిరగబడలేదా?” అంతటి గొప్ప నాయకులను హత్య చేస్తే తిరుగుబాటేమీ జరగకపోవడం నాకు నమ్మశక్యంగా అనిపించలేదు.

”దశాబ్దాలపాటు తెల్లవాడిని ఎదిరించిన జనం వాళ్ళు. తుపాకులను విల్లులతో, మర ఫిరంగులను తుపాకులతో ఎదుర్కొన్నారు. పోరాడగలిగిన వీరుల రక్తంతో ఈ నేల తడిసిపోయింది. తెగలకు తెగలు రూపుమాసిపోవడం తప్ప వేరే దారిలేదు. ప్రజల్లో యుద్ధాలు చేసే సత్తువ లేకపోయింది గానీ, మీకు వచ్చిన ప్రశ్నే అమెరికన్‌ సైన్యానికీ వచ్చినట్లుంది. ఆ ప్రశ్నకు జవాబే మీరు ఇందాక చూసి వచ్చిన స్మారక స్థూపం.” ఆయన గొంతులో కోపం ఏ దేశం నుంచో వచ్చి ఆయన కష్టపడి చేసిన నెక్లెసులు కొనగలుగుతూ పిచ్చి ప్రశ్నలు వేసి విసిగిస్తున్న నా మీదా, తననూ తన వాళ్ళను ఈ దుస్థితికి తీసుకువచ్చిన తెల్లవాడి మీదా?

కొంచెం దూరంగా నిలబడి ఉన్న ముగ్గురిలో ఒకరు లకోట భాషలో ఏదో అన్నాడు ‘ఏం ఫర్వాలేదు’ అని జవాబిచ్చి నా వైపు తిరిగాడు విల్సన్‌. ”తిరుగుబాటు జరుగుతుందని భయపడ్డారనే అనుకుందాం. ఈ ప్రాంతంలో భూత నృత్యం పెద్ద ఎత్తున జరగబోతోందని తెలిసి 500 మంది అమెరికన్‌ సైన్యం ఆ చుట్టు పక్కల తుపాకులతో, మర ఫిరంగులతో మోహరించారు. మినికాంజౌ లకోట నాయకుడు స్పాటెడ్‌ ఎల్క్‌. ఆయనను బిగ్‌ఫుట్‌ అని కూడా అంటారు. ఆయన కూడా ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నాడు. తన తెగ ప్రజలకు ఎంతో ఇష్టుడు. సిటింగ్‌ బుల్‌తో పోట్లాడడానికి వచ్చిన ఆయనకు, సిటింగ్‌ బుల్‌ను హత్య చేశారని, తరువాత వంతు తనదే అనీ, తన తెగ ప్రజల్ని తీసుకొని వెళ్ళిపొమ్మని హెచ్చరిక వచ్చింది. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన తన తెగ ప్రజలతో కలిసి రెడ్‌ క్లౌడ్‌ నాయకత్వంలో ఉన్న మా పైన్‌ రిట్జ్‌ రిజర్వేషన్‌కు బయల్దేరాడు. దార్లో వాళ్ళను అడ్డగించిన ఏడవ అశ్విక దళం వాళ్ళను ”వూండెడ్‌ నీ” ఏరు దగ్గర విడిది చెయ్యమనీ ఆదేశించారు. మరుసటిరోజే విడిది అంతా వెతుకుతూ తుపాకులనూ, ఆయుధాలనూ అప్పగించాలని ఆదేశించారు. తుపాకులను కుప్ప బోస్తున్న సమయంలో ఒక చెవిటి యువకుడు తన తుపాకిని ఎంతో డబ్బుపోసి కొన్నాననీ, దాన్ని వెనక్కి ఇవ్వననీ మొండికేశాడు. భాష రాక, దానికి తోడు చెవిటి వాడవడం వల్ల తెల్లవాడి ఆదేశాలను అర్థం చేసుకోలేకపోయాడు. తెల్ల సైనికులు అతని దగ్గర్నుంచి తుపాకీని లాక్కుంటూ ఉండగా ఆ తుపాకీ పేలి అయోమయం నెలకొన్నది. వెనువెంటనే తెల్ల సైనికులు కాల్పులు మొదలెట్టారు. పోగుపోసిన తుపాకీ కుప్ప నుంచి తుపాకులను తీసుకోగలిగిన కొంతమంది యువకులు తెల్ల సైన్యాన్ని ఎదిరించారు. కానీ కొన్ని నిమిషాల్లోనే ఆ యువకులను హతమార్చింది తెల్ల సైన్యం. అక్కడి నుంచి పారిపోతున్న వాళ్ళనూ, గుట్టల్లో, కనుమల్లో దాక్కున్న వాళ్ళనూ చాలామందిని వేటాడి మరీ చంపేశారు. తన గుడారంలో తీవ్రమైన జ్వరంతో పడుకొని ఉన్న బిగ్‌ ఫుట్‌ను హతమార్చారు. కస్టర్‌నూ, ఏడవ అశ్విక దళాన్నీ యుద్ధంలో ఓడించినందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు ప్రవర్తించారు. అంతా ముగిసేసరికి దాదాపు 300 మంది తెగ జనం, 25 మంది తెల్ల సైనికులూ చనిపోయారు. అదే చివరి ఇండియన్‌ యుద్ధం అని అంటారు కానీ, అది యుద్దం కాదు మారణకాండ”. ఆయన మాటలు ఆపి చేతులతో ముఖం తుడుచుకున్నాడు. నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ”అయాం సారీ” అని మాత్రం అనగలిగాను.

విల్సన్‌ వెంటనే అన్నాడు. ”ఇప్పుడు ఇక్కడ చాలా పేదరికం ఉంది. కానీ పోరాటం మాకు కొత్త కాదు. తెల్లవాడు కొత్త కొత్త పద్ధతుల్లో మమ్మల్ని అణచాలని చూశాడు. మేమూ అంతే కొత్త పద్ధతుల్లో బతకడం నేర్చుకుంటున్నాం. 1973లో అమెరికన్‌ ఇండియన్‌ మూవ్‌మెంట్‌ అనే నేటివ్‌ అమెరికన్‌ తెగల సమూహం 71 రోజులపాటు ఈ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని నేటివ్‌ అమెరికన్ల డిమాండ్లను అమెరికా ప్రభుత్వానికి తెలియజేసింది. కొన్ని డిమాండ్లను సాధించింది కూడా. దేశ రాజధానిలోనూ, దేశంలో ఎన్నోచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు వాళ్ళు. అమెరికన్‌ ప్రభుత్వం అణిచేసిన మా భాషనూ, మా సంస్కృతీ సంప్రదాయాలనూ, ఆత్మగౌరవాన్నీ మాకు గుర్తు చేసింది ఆ ఉద్యమం. ఇప్పుడు చూడు, ఈ దేశంలో పర్యావరణానికి సంబంధించిన ప్రతిఘటనలన్నింటికీ నేటివ్‌ అమెరికన్లే నాయకత్వం వహిస్తున్నారు. గ్యాస్‌ పైప్‌లైన్లకు వ్యతిరేకంగా దేశమంతటా ప్రతిఘటనలు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు నార్త్‌ డకోటాలో జరుగుతున్న ప్రతిఘటనకు ప్రపంచ తెగలెన్నో మద్దతు ఇస్తున్నాయి. ఏమో, ఈ

ఉద్యమమే మా జీవితాల్ని కూడా మార్చేసే ఉద్యమమేమో. ఇందులో కొన్ని గంటలైనా పాల్గొనబోతున్నందుకు మీకు ధన్యవాదాలు”.

నా కోసం అంత టైం ఇచ్చినందుకు విల్సన్‌కు ధన్యవాదాలు తెలుపుకున్నాను. నార్త్‌ డకోట, స్టాండింగ్‌ రాక్‌ రిజర్వేషన్‌లో జరుగుతున్న డకోట ఆక్సెస్‌ పైప్‌ లైన్‌ ప్రొటెస్ట్‌ క్యాంప్‌ వైపు కారు పోనిచ్చాను.

గమనిక : 1. డిసెంబర్‌ 29, 2020 నాటికి ‘వూండెడ్‌ నీ’ మారణకాండ జరిగి 130 సంవత్సరాలు అవుతోంది. 2. పై సంభాషణ 2016 అక్టోబర్‌లో జరిగింది. నార్త్‌ డకోటలో ముడి చమురు పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా పోరాటం ఇప్పటికీ నడుస్తోంది. ఆ ఉద్యమం గురించి ఇంకొంచెం తెలుసుకోవాలంటే ఈ లింక్‌ చూడండి: saarangabooks.com/retired/2016/12/01/ఈ-భూమి-అమ్మకానికి-లేదు/. పైప్‌లైన్‌ ప్రారంభానికి అవసరమైన అన్ని ప్రణాళికలూ పూర్తవకుండానే పని మొదలుపెట్టిన కంపెనీకి సుప్రీం కోర్టు 2020, జూన్‌ 6న స్టే ఆర్డర్‌ ఇచ్చింది. అన్ని పనులనూ నిలిపివేయమనీ, పైప్‌లైన్ల నుంచి ముడి చమురును తీసెయ్యాలనీ ఆర్డర్‌ జారీ చేసింది. ఈ పోరాటానికి ఇప్పటికీ నేటివ్‌ అమెరికన్లే నాయకత్వం వహిస్తున్నారు.)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.