బ్రిటిషాంధ్రలో మహిళా చైతన్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెల్లివిరిసింది. పలువురు స్త్రీలు 20వ శతాబ్ది ప్రారంభం నుండి స్పష్టమైన స్త్రీవాద భావజాలంతో రచనలు చేయడం ప్రారంభించారు. 1920ల్లో వీరి రచనలు పదును సంతరించుకున్నాయి. వివిధ స్త్రీల పత్రికల్లో రచనలు చేసిన స్త్రీలు పితృస్వామ్య భావజాలాన్ని సూటిగా ప్రశ్నించి జెండర్ న్యాయాన్ని బలంగా ప్రతిపాదించారు. ఈ విధంగా పితృస్వామ్య వ్యవస్థను ప్రశ్నించి దానికి వెన్నుదన్నుగా ఉంటున్న హిందూ మతాన్ని విమర్శకు పెట్టిన వారిలో ప్రముఖురాలు పూర్తిగా మరుగున పడిన స్త్రీ వాది అయిన శ్రీమతి వి.సరస్వతి.
రచనలు మినహా సరస్వతి వ్యక్తిగత సమాచారమేమీ లభ్యం కావడం లేదు. ఆమె 1920ల నుండి 1930ల వరకు రచనలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఎన్ని రాసిందో తెలియదు. సరస్వతి రాసిన మూడు రచనల్ని నేను సేకరించగలిగాను. ఇప్పటిదాకా లభిస్తున్న ఆధారాలను బట్టి వి.సరస్వతి మొట్టమొదటి రచన ”స్త్రీ స్వాతంత్య్రం” అనే వ్యాసం స్రీల పత్రిక అయిన ”గృహలక్ష్మి”లో అక్టోబరు 1929 (పు.616-617) లో ప్రచురించబడింది. ఈ వ్యాసానికి ప్రఖ్యాతి గాంచిన బెంగుళూరు నాగరత్నమ్మ సమాధానం ఇచ్చింది. (”శ్రీమతి వి.సరస్వతి గారికి”, గృహలక్ష్మి , నవంబరు 1929, పు.737). దీనికి ప్రతిస్పందనగా సరస్వతి ఇంకో వ్యాసాన్ని ప్రచురించింది. (”శ్రీమతి విద్యాసుందరి-బెంగుళూరు నాగరత్నమ్మ గారికి శ్రీమతి వి.సరస్వతి గారు”, డిసెంబరు 1929, గృహలక్ష్మి, పు.917-919). సరస్వతి వ్యాసాలను విమర్శిస్తూ ఎస్.కమలాదేవి, అద్దంకి అనసూయాదేవి, ఐ.ఎస్.పి.శర్మ తమ అభిప్రాయాలను ప్రచురించారు. (”శ్రీమతి వి.సరస్వతి గారికి”, గృహలక్ష్మి, ఫిబ్రవరి 1930, పు.1037-1041). ‘సుధ’ అనే కథలో వి.సరస్వతి వితంతు సమస్యను చర్చించింది (గృహలక్ష్మి, మే 1933, పు.223-226). సరస్వతి రచయితే కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసిన మహిళోద్యమ కార్యకర్త కూడా. 1939 డిసెంబరులో కడపలో జరిగిన 14వ ఆంధ్ర రాష్ట్ర మహిళా సభలో సరస్వతి పాల్గొన్నట్లు ఆధారాలు తెలుపుతున్నాయి.
సరస్వతి రచనల్లో ”స్త్రీ స్వాతంత్య్రం” అనే వ్యాసం అత్యంత ప్రభావవంతమైనదే కాకుండా బ్రిటిషాంధ్రలోని పలువురు స్త్రీ వాదుల జెండర్ చైతన్యానికి అద్దం పట్టేలా ఉంది కాబట్టి దానిలోని కొన్ని భాగాలను ఉటంకిస్తున్నాను.
”మనదేశమునందిప్పుడెల్లయెడల స్వాతంత్య్ర సంపాదమునకై ప్రయత్నములు పరుగులు వాఱుచున్నవి. కాని యవి ఫలసాయుజ్యమునొందుట లేదు. కారణమేమి? భారత జాతిలో సగభాగము ఆక్రమించుచున్న స్త్రీ పురుషునికి బానిసయై యుంటియున్నది. బానిసయైయున్న స్త్రీతో కలిసిమెలసియుండు భారతీయునకు బానిసత్వము తొలగి స్వాతంత్య్రము గలుగనేరదుకదా! స్త్రీ స్వాతంత్య్ర విషయమై చర్చ వచ్చినపుడెల్ల శాస్త్రవిదులు హిందూ ధర్మ శాస్త్రము నందెన్నో హక్కులు స్త్రీలకీయబడియున్నవని పెద్దపెట్టున పేర్కొందురు. కాని పరికించి చూచితమేని భారతస్త్రీ కట్టి దాస్య జీవనము తెచ్చిపెట్టినవి మన ధర్మశాస్త్రములేనని నా అభిప్రాయము. మనుధర్మశాస్త్ర ప్రకారము స్త్రీకి ఆజన్మాంతము తన దేహము పైననే తనకు స్వాతంత్య్రము లేదు. చిన్నతనమున తండ్రి, నడమి కాలమున భర్త, చివర కాలమున పుత్రుడు – ఆమెకు రక్షకులు. స్త్రీ పురుషులిరువురును మానవ వర్గములో చేరినవారే కదా! అందు ఒకరికి వారి దేహము పైననే స్వాతంత్య్రము లేదు. ఇక రెండవవారికి దేశముపై స్వాతంత్య్రము కావలెనట! ఎంత పొందికలేనిమాట! భారత పురుషుడు మిక్కిలి స్వార్థపరుడు. స్త్రీ తనయెడ ఎట్లు ప్రవర్తింపవలయునో ఆతడు ఉద్గ్రంధముల యందు లేఖ్యారూథము చేసియున్నాడు… పతి ఎంత పనికిమాలినవాడైనను స్త్రీ – వానిని పరమేశ్వరునివలె భావించి పాదదాసియైయుండవలెను…
పదిమంది పిల్లల తల్లియైన భార్యనైననున కొంచము దుర్గుణము ఉన్నచో పురుషుడు ఆమెను వదలివేయవచ్చునట. పనికిరాని పాడెకట్ట అయినను మగడను వానిని స్త్రీ త్యజించనేరాదట. అతడే గతియని నమ్మియుండ – వలెనట. ఇదెట్టి న్యాయము? పతియే దైవమనియు, అతడెంత దుర్మార్గుడైనను సతి కొలువలెననియు. అట్లొనర్చినచో ఆమెకు స్వర్గము కరతలామలమనియు, అట్లు చేయనిచో ఆమెకు విడుమరలేని నరకప్రాప్తి గలుగుననియు – వ్రాయబడియున్న పురుష స్పష్టములను గ్రంథములతో భారతదేశ వాజ్ఞయము దుష్టమై యున్నది… పూర్వపుటౌన్నత్యము నొంది పురుషుడు స్వాతంత్య్రము- బడయగోరెనేని ముందు స్త్రీకి స్వాతంత్య్రమీయవలెను. ఇచ్చునా – భగవానుడాతనికి స్వాతంత్య్రమిచ్చును. ఈయడా భగవానుడాతనికి స్వాతంత్య్రమీయడు. ఇది నిశ్చయము.”
”స్త్రీ స్వాతంత్య్రము”లో సరస్వతి వెలిబుచ్చిన అభిప్రాయాలు బెంగుళూరు నాగరత్నమ్మకు మింగుడు పడలేదు. సరస్వతి వ్యాసానికి సమాధానమిస్తూ ”ప్రస్తుత కాలమున మన స్త్రీలు అభివృద్ధి చెందుచున్నారను నాయూహ మీ వ్యాసమును గాంచిన తోడనే యంతరించినది” అన్నది. ”భారత పురుషుడు మిక్కిలి స్వార్థపరుడు” అన్న సరస్వతితో విభేదించిన నాగరత్నమ్మ ”భారత పురుషుడు తన కాంతను అర్ధాంగిగా మన్నించినాడు; మన్నించుచున్నాడు; మన్నింపగలడు” అనీ, హిందూ పురాణములు ఆ విధంగా వ్యవహరించమని అతన్ని శాసించినాయనీ, భారత పురుషుడు స్త్రీకి ఎలాంటి లోటూ చేయడం లేదనీ, ”ఏదియో యొక దుర్మార్గుని మనమునందిడుకొని భారత పురుషులనందఱిని స్వార్థపరులుగా జమకట్టుట సాహసమేయగును” అనీ విమర్శించింది. ”మగని ప్రయాసమునెఱుంగక నూతన వస్త్రాలంకరణముల” కొరకు అతన్ని పీడించే స్త్రీలున్నారనీ, ”అట్టి వారిని ఉదాహరణముగ తీసుకొని భారత స్త్రీలెల్ల నిట్టివారేయనుట లెస్సకాదు” అనీ హితవు చెప్పింది. ”మంచివారు, చెడ్డవారు” స్త్రీ పురుఫులిద్దరిలో ఉంటారనీ, అలాంటి సందర్భంలో ”ఒక్కరినే దూషించి ఒక్కరినే పొగడుట
ఉచితమైన పద్ధతి కాదు” కాబట్టి ఈ విషయం గూర్చి ఆలోచించమని సరస్వతికి సూచిస్తూ సమాధానం ఇవ్వమని కోరింది.
నాగరత్నమ్మకు సమాధానమిస్తూ ”భారత పురుషుడే కాదు, ప్రపంచమునందంతటను పురుషుడు స్వార్ధపరుడే” అని నొక్కి వక్కాణించింది సరస్వతి. స్త్రీల అభివృద్ది గురించి మాట్లాడినప్పుడు ”భారతదేశమునందుండు స్త్రీలందరిని గురించి’ చర్చించాలే కాని ”అచ్చటచ్చట” కనిపించే విద్యావంతులై ఉద్యోగాలు చేస్తూ, పత్రికల్లో వ్యాసాలు రాస్తూ, సభల్లో ఉపన్యసించే కొద్దిమందిని గూర్చి కాదని చెప్పింది. ”ఇప్పటికినీ స్త్రీలకు విద్యయనవసరమని వాదించు మూఢులెందరు లేరు?” అని ప్రశ్నించింది. ”స్త్రీలు మునుపటికంటె ఇప్పుడు అభివృద్ధి నొందుతున్న మాట నిజమే” కాని విదేశ స్త్రీలతో పోల్చి చూచినప్పుడు ”మనయభివృద్ధి చెప్పుకొనదగినంత విపులముగా లేదని తెలియగలదని” భారత స్త్రీలింకా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటికీ వితంతు పునర్వివాహాలు సరిగ్గా జరగడం లేదనీ, దానికి కారణం ”సంఘమును తిరస్కరించునంతటి ధైర్యము (ఎశీతీaశ్రీ షష్ట్రaఅస్త్రవ)” లేకపోవడమేననీ, శారదా చట్టం
ఉన్నప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయనీ వాపోయింది.
హిందూ శాస్త్రములు పురుషపక్షపాతంగా ఉన్నాయని స్పష్టంగా గ్రహించిన సరస్వతి ”హిందూ శాస్త్ర ప్రకారము పురుషుడెన్ని వివాహములైనను చేసికొనవచ్చును. ఎందరి వనితల పొత్తైనను పొందవచ్చును. అది శాస్త్ర విరుద్ధము గాదు. అతడెంత అనాదరము చేసినను స్త్రీకి మాత్రము మగడే గతి! … ఇట్ల ఒక్క పురుషుల పక్షమునే వహించు శాస్త్రములెంతటి ధర్మశాస్త్రములని నేనాశ్చర్యపడుచున్నాను” అని హిందూ ధర్మశాస్త్రాల పురుష పక్షపాతాన్ని విమర్శించింది. స్త్రీ పురుషుడికి అర్ధాంగి అన్న మాట నిజమేననీ, కానీ పురుషుడు అర్థాంగాన్ని చులకనగా చూస్తున్నాడనీ, దానికి ధర్మశాస్త్ర సమ్మతమున్నదనీ, శాస్త్రకర్తలు పురుషులే కాబట్టి తమకనుకూలంగా వాటిని రూపొందించారనీ ”స్త్రీలే శాస్త్రకర్తలైయుండిన ఎడల శాస్త్రములు తారుమారుగా” ఉండి ఉంటాయనీ అభిప్రాయపడింది. స్త్రీలకు ఆర్థిక విషయంలో స్వాతంత్య్రం లేదనీ, ఆస్తిహక్కుకు స్త్రీలు అనర్హులుగా ఉన్నారనీ, అలాంటి సందర్భంలో పురుషులతో స్త్రీల సమానత్వం ఎలా సాధ్యమనీ ప్రశ్నించింది. ”పురుషులతోడి సమత్వము మనకు లేనే లేదు. పురుషుని గృహమునకు స్త్రీ రాణియనియు, అతని గృహమునకు ఆమె లక్ష్మియనియు రెండు కల్లబొల్లి తీపి మాటలతో నవీన నారీలోకము సమత్వము పొందినట్లుగా తృప్తిపడజాలదు” అని ఆధునిక స్త్రీల డిమాండ్లను స్పష్టం చేసింది. ”స్త్రీలై జన్మించినంత మాత్రమున మనకు స్వాభిమానము లేకపోవునా?” అని ప్రశ్నించిన సరస్వతి ఆనాడు పలువురి స్త్రీలలో స్వాభిమానం లేకపోవడాన్ని గురించి వాపోయింది. ”మన స్త్రీలు పురుషులేమి వ్రాసిన అవియన్ని సరియైనవనియు, అవియే కలకాలమును జనులకు మార్గదర్శకములుగా నుండవలెననియు” తలచి స్వాభిమానం కోల్పోతున్నారనీ, ”ఇది మిక్కిలి పొరపాటు” అనీ వేదశాస్త్ర పురాణాల పట్ల తన అభిప్రాయాన్ని సూటిగా తెలియజేసింది.
వేదశాస్త్ర పురాణాలు ఆయా కాలాలకు అనుగుణంగా రాయబడినవనీ, వాటినే ప్రస్తుత కాలంలో మార్గదర్శకాలుగా భావించుట పొరపాటనీ తెల్పుతూ ”కావున వేదశాస్త్ర పురాణములతో మనకు బనిలేదు. ప్రస్తుత స్థితిగతులతోటి మాత్రమే మనకు పనిగలదు” అని వేదశాస్త్ర పురాణాల సమకాలీన ప్రాసంగికతను ప్రశ్నించింది. ”ప్రస్తుత స్త్రీ మౌఢ్యమునకు పురుషులే కారణమ”ని నొక్కి వక్కాణించిన సరస్వతి బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులను ఎట్లా అణగద్రొక్కారో అలాగే పురుషులు స్త్రీలను అణగద్రొక్కారని నిందించింది. ”వేదశాస్త్ర పురాణముల నెట్లున్ననేమి? హిందూ సంఘమున మాత్రము స్త్రీలకున్నత స్థానము లేదు. స్త్రీ శిశువు పుట్టుటతోడనే ‘ఆడుబిడ్డనా’ అనెదరు. ఆ ‘నా’దీర్ఘమునందే స్త్రీల దుస్థితి తెలియుచున్నది” అని పుట్టుకతోనే ప్రారంభమయ్యే జెండర్ వివక్షను విశదం చేసింది. స్త్రీలు తమకు దక్కాల్సిన హక్కులను గూర్చి తెలుసుకొని వాటిని సంపాదించడానికి ప్రయత్నించాలని కోరిన సత్యవతి ”ఈ ప్రయత్నమునందు మనము పాశ్చాత్య సోదరీరత్నములను మార్గదర్శకులను గానుంచుకొనుట మంచిది” అని భారత స్త్రీలకు సలహా ఇచ్చింది.
సరస్వతి మరో విశేషం ‘కేథరిన్ మేయో’ని తన వాదనలకు వత్తాసుగా ఉటంకించడం. అమెరికాకు చెందిన పాత్రికేయురాలైన ‘కేథరిన్ మాయో’ 1927లో ”మదర్ ఇండియా” అనే పుస్తకాన్ని ప్రచురించింది. అది తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. తన పుస్తకంలో భారతదేశంలో స్త్రీల పట్ల జరుగుతున్న దురన్యాయాల్ని తీవ్రంగా విమర్శించిన మేయో భారతీయులకు సాంఘిక పరిస్థితుల కారణంగా వారు రాజకీయ స్వాతంత్య్రానికి అనర్హులని తేల్చి చెప్పింది. మేయోపై గాంధీ దగ్గరి నుంచి లాలా లజపతిరాయ్ వరకు అనేకమంది భారత జాతీయవాదులు విరుచుకుపడ్డారు. భారతదేశంలోని వివిధ భాషల్లో ”మదర్ ఇండియా” పుస్తకాన్ని విమర్శిస్తూ అనేక గ్రంథాలు ప్రచురించబడ్డాయి. మేయోని ఆమోదించడమంటే భారత జాతీయ వాదాన్ని కించపరచడమేననే బలమైన అభిప్రాయం ఉన్న సందర్భంలో సరస్వతి మేయోని ఆమోదించడం సాహసమేనని చెప్పాలి. మేయో పుస్తకంలో ”సత్యములగు విషయములు చాలాయున్నవని మాత్రమే చెప్పి తీరెదను. మేయో కన్య వ్రాసిన కొన్ని సంగతులను అభిమానము కొలది ప్రయత్నించియు మనమబద్దమని నిరూపింపలేము” అని ఆ పుస్తకం పట్ల తన సానుకూలతను ప్రకటించింది. సరస్వతికున్న ఇంకో విశేషం భారత స్త్రీలు పాశ్చాత్య స్త్రీలను ఆదర్శంగా తీసుకోమని చెప్పడం. భారత జాతీయవాద భావజాలం ముప్పొంగుతున్న సమయంలో, ఇంగ్లీషు సంస్కృతిని తీవ్రంగా నిరసిస్తున్న చారిత్రక సందర్భంలో ఇంగ్లీషు వనితల్ని రోల్ మోడల్‌గా చెప్పడం నిజంగా సాహసంతో కూడుకొన్న పనే!
సరస్వతి భావజాలం పలువురు సమకాలీనులకు నచ్చలేదు. యన్.కమలావతీదేవి ”స్త్రీ స్వాతంత్య్రమును గూర్చి చర్చించుట ఎంతటి ముఖ్యావసరమో, స్త్రీకెంతవఱకు స్వాతంత్య్రమునీయవలననెడి విషయమును చర్చించుట సయితము అంత ముఖ్యావసరమే” అంటూ స్త్రీ స్వాతంత్య్రానికి పరిమితులుండాలని తెలియజేసింది. ”కార్యవిచక్షణాశీలత” గల ఆడవాళ్ళు ”పురుష ద్వేషము మానవ ద్వేషము మున్నగు దుర్భావముల”కు చోటీయరని పలికింది. రెండు కుటుంబములు లేదా రెండు దేశములు లేదా రెండు ఖండముల మధ్య యుద్ధం వచ్చినప్పటికీ ప్రపంచము నిలకడగానే ఉంటుంది కానీ ఆడవారికీ-మగవారికీ మధ్య పోరాటము సంభవించిన ఎడల సృష్టియే ఆగిపోతుందంది. కమలావతీదేవి ప్రకారం స్త్రీలు అబలలు. కాబట్టి వారికి ”రక్షణ ముఖ్యావసరము. అట్టి రక్షణభారము బలవంతుఁడగు” పురుషుడు తీసుకోవడం స్వార్థం అనిపించుకోదు. పురుషుని రక్షణలో ఉన్నంత మాత్రాన స్త్రీ అతనికి బానిస అని అనుకోకూడదు. స్త్రీలు ఉద్యోగాలు మున్నగు విషయాల్లో పురుషులతో పోటీపడడం సబబు కాదంది. ప్రతి వ్యక్తీ చూసుకోవాల్సిన విషయాలు రెండు అనీ అవి సంసారము, వ్యవహారము అనీ సంసారము ఇంటిలోని పని అనీ, వ్యవహారము ఇంటి బయట పని అనీ, రెండు పనుల్నీ ఒకే వ్యక్తి చూసుకోవడం సాధ్యం కాదనీ తెలియజేసిన కమలావతీ దేవి ”పురుషుఁడుద్యోగమున కర్హుడని ప్రపంచమంతయు నంగీకరించిన విషయమే” అని తేల్చిచెబుతూ స్త్రీ ”ఇల్లాలై యుండవలసిన బాధ్యత”ను గుర్తుచేసింది. ”కాని అటుయిటుగాక యిరువురును ఉద్యోగములలోనికే వ్రాలుపని అవకతవకయైన పనియని ఘంటాపథముగా నొక్కి చెప్పగలను” అంది. స్త్రీలు గ్రంథాలయాలకు పోయి గ్రంథపఠనము చేయవచ్చనీ,
ఉపన్యాసములీయవచ్చనీ, పత్రికలు చదువవచ్చనీ, పునర్వివాహాల్నీ, ఆస్తిలో సమాన హక్కునూ కోరవచ్చనీ, ”కాని ఇల్లు బాసి, శిశుపోషణమును రోసి, సంసారమును వేఱొకని చేతిలోనుంచి మనమును ఉద్యోగములకే పరుగిడితిమా సోలెడు బియ్యమునకు సోదెకు పోగా కుంచెడు బియ్యమును కుక్క దిగమ్రింగినదన్నట్లు” పరిస్థితి తారుమారవుతుందని నిశ్చయముగా చెప్పింది. స్త్రీలు చేసే ఇంటిపనులను ”చాకిరీ”గా భావించినట్లయితే ”రేయింబవళ్ళనక, ఇందుకందుకనక, ఇప్పుడప్పుడనక కష్టపడి గడించి కుటుంబ పోషణమును వహించి పురుషుడు చేయు పని మాత్రము పాపము బానిసత్వము కాదో?” అని పురుషులను సమర్ధించింది. సరస్వతి ఉద్యోగం చేయడం మొదలైన విషయాల్లో పాశ్చాత్య మహిళల్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పడాన్ని ఆక్షేపించింది. ”కావున సరియైన మార్గమును ద్రొక్కిననే మనము విజయమునొందగలము. లేదా మనకిప్పటి గతియే నిశ్చయము” అని ఖండితంగా చెప్పింది కమలావతీదేవి.
సరస్వతి పాశ్చాత్య స్త్రీలను ఆదర్శంగా తీసుకోమని చెప్పడాన్ని కంటగించుకున్న అద్దంకి అనసూయాదేవి ”సోదరీ! భారత నారీమణులందరు మన దృష్టికి వెగటైరి కాబోలు!” అని వ్యంగ్యంగా అంది. భారత పతివ్రతలైన సుమతీదేవి, సావిత్రి, దమయంతి, చంద్రమతి, సీత, అనసూయ, అరుంధతి మొదలైన ‘సత్కాంతలు’ ”ఆంగ్లేయ యువతులకు సాటిరారా?” అని ప్రశ్నించింది. ”శౌర్యసంపన్నులు”, ”అభిమానవతులు”, ”స్వదేశాభిమానరతలు” అయిన సంయుక్త, పద్మిని, దుర్గాదేవి మొదలైన వారిని ఆదర్శంగా తీసుకోకుండా ఆంగ్ల స్త్రీలను ఆదర్శంగా తీసుకోమని చెప్పడం ”ఆశ్చర్యము”గా ఉందన్నది. ”మనము బిడ్డలకు ఉగ్గుపాలతోనే స్వదేశాభిమానరత నేర్పవలసిన మాతలము. నేడు ఆంగ్లేయుల నడవడి మెచ్చుకొనుచు, వారి వలనే మనము ప్రవర్తించవలసినదని చెప్పుట చాలా శోచనీయము” అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన అనసూయాదేవి ”ముందువెనుకలు” చూడకుండా మనకు ఏది తోస్తే అది రాసి మన భావితరాల్ని వక్రమార్గము పట్టించవద్దని హితవు చెప్పింది.
సరస్వతిని విమర్శించిన వారిలో ఐ.ఎన్.పి.శర్మ అనే పురుషుడు కూడా ఉన్నాడు. హిందూ ధర్మశాస్త్ర కర్తలు పురుప పక్షపాతం వహించారనే సరస్వతి విమర్శలను ఎదుర్కొన్నారు. మొత్తం 12 అంశాలను వివరించి హిందూ ధర్మశాస్త్రవేత్తలు పురుష పక్షపాతం వహించలేదనీ, స్త్రీలను కూడా ఉన్నతస్థానంలో నిలిపారనీ తెలియచేశాడు. ”స్మృతికర్తలు ధర్మరతులు గానిన ఇరువదియవ శతాబ్దపు పాశ్చాత్య భాషామోహితుల వలె పక్షపాతులు గారు” అని నొక్కి వక్కాణిస్తూ ”తిరిగి ఒకసారి దీర్ఘముగ ఆలోచించ”మని సరస్వతిని కోరాడు. సరస్వతిని విమర్శించినవారందరూ నాడు విపరీతంగా పెరిగిన సాంస్కృతిక జాతీయవాదం పరిధిలోనే వాదించారు. సరస్వతి లాంటి వలసాంధ్ర స్త్రీ వాదులు సాంస్కృతిక జాతీయవాదులకు బొత్తిగా మింగుడుపడలేదన్న వాస్తవం ఈ విమర్శలద్వారా స్పష్టమవుతోంది.
”సుధ’ కథలో సరస్వతి వితంతు సమస్యని చర్చించింది. వితంతువుల సజీవమైన లైంగికతపై దృష్టి సారించింది. సుధ పద్దెనిమిది సంవత్సరాల యవ్వనవతియైన వితంతువు. అన్నా వదినల సంరక్షణలో ఉంటుంది. సుధ అన్న రామారావు ”ఇంగ్లీషు చదువుకున్నవాడే గాని స్వతంత్ర అభిప్రాయములు లేనివాడు”. అతనికి ”లోకులేమనుకుందురో అను భయము మెండు. చాలా పిరికి.” సుధ వదిన జానకి అహంభావి, సోమరి. ఎప్పుడూ సూటిపోటి మాటలతో సుధను దెప్పిపొడుస్తూ ఇంటి పనంతా సుధతో చేయిస్తుంటుంది. జానకి తమ్ముడు ఇరవై నాలుగు సంవత్సరాల రాజగోపాలం సెలవుల్లో అక్క ఇంటికి వస్తాడు. అతనికి కావాల్సిన ఏర్పాట్లు చేసే బాధ్యతను సుధకప్పగిస్తుంది జానకి. సుధ, రాజగోపాలంల పరిచయం ప్రేమకు దారితీసి సుధ గర్భవతి అవుతుంది. సుధ గర్భవతి అని తెలియడానికి ముందే సెలవులు ముగియడం వల్ల కాలేజీకి మద్రాసుకు వెళ్ళిపోతాడు రాజగోపాలం. సుధ విషయం తెలుసుకున్న జానకీ, ఇరుగుపొరుగు వారు ఆమెను అనేక విధాలుగా నిందిస్తారు. నీరుగారిపోయిన సుధ తన పరిస్థితిని రాజగోపాలానికి తెలపాలనుకున్నా అతని చిరునామా దొరకని కారణంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటుంది. సుధ విషాదాన్ని విన్న రాజగోపాలం సన్యాసిగా మారతాడు. సుధ ఆత్మహత్యతో ఆమె అన్నకు కనువిప్పు కలిగి ఒక వితంతు పునర్వివాహ సంఘంలో చేరి ”ఐదారు వివాహములు తన చేతిమీదుగా” జరిపిస్తాడు.
”సుధ” కథ ద్వారా భారతదేశంలో స్త్రీలు, మరీ ముఖ్యంగా వితంతువుల దైన్య స్థితిని బట్టబయలు చేసింది వి.సరస్వతి. గర్భవతియై, పలువురితో నిందించబడుతున్నపుడు సుధ ఇలా అనుకుంటుంది ”ఏల స్త్రీగా పుట్టవలెను? అయ్యో! ఇంకే దేశమునందైన పుట్టరాదా? భారతభూమి పుణ్యభూమియందురే? మహా పాపము చేసినవారే ఈ దేశమునందు బ్రాహ్మణ స్త్రీగా విధవగా జన్మింతురు.” సుధ, రాజగోపాలంల సంభాషణ ద్వారా ఇంగ్లీషు సంస్కృతిని వేనోళ్ళ కొనియాడింది సరస్వతి. తనకు ఫలహారం ఇవ్వడానికి వచ్చిన సుధను కుర్చీలో కూర్చోమంటూ ”ఇంగ్లీషు వారు స్త్రీలు నిలుచుచుండిన యెడల పురుషులు లేచి తమ స్థానములు వారికిత్తురు. మనవారిలోనే పురుషుల ఎదుట స్త్రీలు కూర్చోరాదను క్రూరాచారమున్నది” అంటాడు. ”మీ తండ్రి పూర్వాచారపు మనిషిగదా, మీకు పూర్వాచారములన్న గిట్టలేదేమి?” అని ప్రశ్నించిన సుధతో ”పూర్వాచారములను పేరిట జరిగెడి క్రూరాచారములను జూచి నేను సహించలేను. పూర్వాచారములైన కులాచారముల త్యజింపవలయును. విదేశాచారములైనను సదాచారములన నుష్టింపవలయుననుట నా మతము. మరియు వారిలో (ఇంగ్లీషు వారిలో) విధవలు తిరుగు వివాహము చేసుకోకూడదని లేదు. నిర్బంధ వైధవ్యము వంటి ఘోరాచారము మన దేశమునందేయున్నది. ఇంకెచ్చటను లేదు” అంటాడు రాజగోపాలం. ఇన్ని విషయాలు నీకెట్లా తెలిసాయని ప్రశ్నించిన సుధతో ఇంగ్లీషు పుస్తకాలు చదవడం ద్వారా అని సమాధానమిస్తాడు. ఇంగ్లీషువారు ఆడపిల్లల్ని, మగపిల్లల్నీ సమానంగా పెంచుతారనీ, సమానంగా చదివిస్తారనీ, ఇంగ్లాండులో స్త్రీలు ఉద్యోగాలు కూడా చేస్తారనీ, వయస్సు వచ్చిన తర్వాత వరించి వివాహమాడుతారనీ ఇంగ్లీషు సాంఘిక సంస్కృతిని కీర్తిస్తాడు. ఈ విషయాలన్నీ విన్న సుధకు ”ఇంగ్లాండు స్వర్గతుల్యముగను అచటి స్త్రీలు దేవతా సమానములుగను” తోచి రాజగోపాలం దగ్గర ఇంగ్లీషు నేర్చుకోవడానికి సిద్ధపడుతుంది.
”సుధ” కథ అనేక విధాలుగా విశిష్టమైనది. వితంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయనీ, వారూ ప్రేమించడానికీ, ప్రేమించబడడానికీ అర్హులేననీ, అది వారి హక్కు అని స్పష్టం చేస్తుంది రచయిత్రి. సమకాలీనంగా సాగుతున్న వితంతు పునర్వివాహోద్యమానికి స్వాగతం పలికింది. ఎల్లెడలా జాతీయోద్యమ సాంస్కృతిక భావజాలం తీవ్రమై విదేశీయమైన ప్రతిదాన్నీ… మరీ ముఖ్యంగా ఆంగ్లేయ సంస్కృతిని తిరస్కరిస్తున్న చారిత్రక సమయంలో ఇంగ్లీషు సంస్కృతిని వేనోళ్ళ కొనియాడిన వి.సరస్వతి ఏటికి ఎదురీదింది.
వలసాంధ్రలో వి.సరస్వతి లాగా ఆలోచించిన స్త్రీ వాదులు ఇంకొంతమంది ఉన్నారు. సరైన పరిశోధన ద్వారా వారినందర్నీ వెలుగులోకి తీసుకురావలసిన అవసరం ఉంది.