బ్రిటిష్‌ సైనిక బలగాలను సవాల్‌ చేసిన యోధ బేగం హజరత్‌ మహాల్‌ – సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

మాతృభూమి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి, బ్రిటిష్‌ సైనిక బలగాలతో తలపడిన రాణులు స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అరుదుగా కన్పిస్తారు. ఆ అరుదైన ఆడపడుచులలో అగ్రగణ్యురాలు బేగం హజరత్‌ మహాల్‌. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తొలి దశలో ఈస్టిండియా

కంపెనీ పాలకులతో రాజీ బేరాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేసి, అవి విఫలమై చివరకు మార్గాంతరం లేక పోరు మార్గం ఎంచుకున్న రాణుల్లా కాకుండా, ఆది నుండి కంపెనీ పాలకులను శత్రువులుగా పరిగణించి, మాతృదేశ పరిరక్షణార్థం, ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయుధం పట్టక తప్పదని ప్రకటించి, అత్యంత ధైర్య సాహసాలతో రణభూమికి నడిచిన వీర నారీమణి బేగం హజరత్‌ మహాల్‌.
ఆమె ఉత్తర భారతదేశంలోని అత్యంత సంపన్నవంతమైన అవధ్‌ రాజ్యం అధినేత నవాబ్‌ వాజిద్‌ ఆలీషా సతీమణి. ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫైజాబాద్‌. ఆమె చిన్నప్పటి పేరు ముహమ్మద్‌ ఖానం. ఆమె అందచందాలను గురించి విన్న నవాబ్‌ వాజిద్‌ ఆలీ షా ఆమెను కోరి మరీ వివాహమాడాడు. వివాహమయ్యాక ఆమె బేగం హజరత్‌ మహాల్‌ అయ్యారు. వివాహం తరువాత ఆమెకు ఇస్త్రీకారున్నీసా (నారీమణి) అని పేరుపెట్టాడు భర్త. ఆమెకు సుగంధ కన్య అనే బిరుదు కూడా ఇచ్చాడాయన.
ఆమెను ఇస్త్రీకారున్నీసా ఖానం సాహెబా అని కూడా పిలుచుకున్నాడు. ఆ దంపతులకు మిర్జీ బిర్జిస్‌ ఖదిర్‌ బహుద్దూర్‌ అనే కుమారుడు కలిగాడు. ఆ తరువాత ఆమె బేగం హజరత్‌ మహాల్‌ అయ్యారు.
అవధ్‌ రాజ్యం రాజధాని లక్నో. అది మొఘల్‌ రాజ్యంలో ఒక భాగం కాగా, ఆ ప్రభువుల బలాధిక్యత క్షీణిస్తున్న సమయంలో స్వతంత్ర రాజ్యంగా ప్రకటితమైంది. 1801లో అవధ్‌ రాజు నవాబు సాదత్‌ అలీ బ్రిటిష్‌ పాలకులతో సంధి చేసుకుని, అవధ్‌ రాజ్యాన్ని ఈస్టిండియా కంపెనీకి అప్పగించాడు. అవధ్‌ మీద అధికారం కంపెనీ పాలకులది కాగా, నవాబు నామమాత్రుడయ్యాడు. ఆ అవధ్‌ రాజ్యానికి చివరి నవాబు అయినటువంటి వాజిద్‌ అలీషా 1847లో సింహాసనం అధిష్టించాడు.
ఆ సంవత్సరం గవర్నర్‌ జనరల్‌గా డల్హౌసీ భారతదేశం విచ్చేశాడు. రాజ్య విస్తరణ కాంక్షతో ఇండియాలోని ఒక్కొక్క రాజ్యాన్ని అక్రమంగా ఆక్రమించుకుంటున్న అతని చూపు సంపన్నవంతమైన అవధ్‌ రాజ్యం మీద పడిరది. ఫలితంగా ఈస్టిండియా కంపెనీకి చెందిన గవర్నర్‌ జనరల్‌ లక్నోలోని ఒక బ్రిటిష్‌ అధికారి ద్వారా లొంగుబాటు పత్రాన్ని తయారు చేయించి నవాబ్‌ వాజిద్‌ ఆలీషాకు పంపి, ఆ పత్రం మీద సంతకం చేయమని ఆదేశించాడు. ఆ విధంగా సంతకం చేయనట్లయితే కంపెనీ సేనలు అవధ్‌ రాజ్యంతో పాటుగా అంతఃపురాన్ని కూడా స్వాధీనం చేసుకోగలవన్నాడు. ఆ బెదిరింపులకు భయపడిన నవాబు అవధ్‌ను కంపెనీపరం చేయడానికి సిద్ధపడ్డాడు.
భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అవధ్‌ పతాకాన్ని వినువీథుల్లో ఎగరవేసిన బేగం హజరత్‌ మహాల్‌ ఆ సమయంలో రంగప్రవేశం చేశారు. ఆ లొంగుబాటు పత్రం మీద సంతకాలు చేయడమంటే అవధ్‌ రాజ్యాన్ని ఈస్టిండియా కంపెనీకి పూర్తిగా దాసోహం చేయటమేనని భావించిన ఆమె గవర్నర్‌ జనరల్‌ ఆదేశాలను నిరసించారు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన కంపెనీ పాలకులు నవాబ్‌ వాజిద్‌ ఆలీషాను 1856 ఫిబ్రవరి 13న నిర్బంధంలోకి తీసుకుని, మార్చి 13న కలకత్తాకు పంపారు. ఆ పరిణామాలకు భయపడిన నవాబు పరివారంలోని అత్యధికులు నవాబుతో పాటుగా కలకత్తా వెళ్ళిపోయారు. బేగం హజరత్‌ మహాల్‌ మరికొందరు మాత్రం, స్వంత గడ్డను పరుల పరం చేసి కలకత్తా వెళ్ళటం ఇష్టం లేక లక్నోలోని కౌసర్‌ బాగ్‌లో ఉండిపోయారు.
ఆంగ్లేయుల ఈ చర్య వలన ప్రజలలో అసంతృప్తి రగులుకుంది. అవధ్‌ చుట్టుప్రక్కల గల స్వదేశీ పాలకులు, స్వదేశీ యోధులు కంపెనీ పాలకుల దుశ్చర్యల పట్ల తీవ్రంగా ప్రభావితులయ్యారు. కుతకుతలాడుతున్న హృదయాలతో ఆంగ్లేయుల చర్యల పట్ల మండిపడసాగారు. ఆ సమయంలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఆరంభమైంది. కంపెనీ చర్యల పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్న అవధ్‌లోని ప్రజలు, సైనికులు స్వదేశీయుల పాలన కోసం కంపెనీ పాలకుల ఆధిపత్యాన్ని నిరాకరిస్తూ తిరుగుబాటు ప్రకటించారు. 1857 మే 31న లక్నోలోని ఛావనీలో తిరుగుబాటు ఫిరంగులు పేలాయి. ఆంగ్లేయాధికారులను, ఈస్టిండియా కంపెనీ సమర్థకులను లక్నో నుండి, అవధ్‌ రాజ్యంలోని ఇతర ప్రాంతాల నుండి తరిమివేశారు. అవధ్‌ రాజ్యంలోని అత్యధిక ప్రాంతాలు తిరుగుబాటు వీరుల ఆధిపత్యంలోకి వచ్చాయి. కంపెనీ పాలనాధికారుల ఆనవాళ్ళు కూడా కన్పించకుండా తుడుచుకుపోయింది.
ఆ పరిస్థితులతో హడలిపోయిన ఆంగ్లేయులు బేగంతో కాళ్ళబేరానికి వచ్చారు. ఆమె కనుక కంపెనీకి సైనిక సహాయం అందజేస్తే వాజిద్‌ ఆలీషా పూర్వీకుడు షజా ఉద్దేలా కాలంలో అవధ్‌ పాలన క్రింద ఉన్న అన్ని ప్రాంతాలను తిరిగి ఆమెకు ఆప్పగిస్తామని, తద్వారా అవధ్‌ రాజ్యం విస్తరించగలదని రాయబారానికి దిగారు. ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే కంపెనీ రాజ్య విస్తరణ కాంక్షకు తాను తోడ్పాటును అందించినట్లు కాగలదు కనుక, స్వేచ్ఛా స్వాతంత్య్ర కాంక్ష గల స్వదేశీ పాలకులకు వ్యతిరేకంగా ఆంగ్లేయుల పక్షాన నిలవడం ఏ మాత్రం సహించని బేగం హజరత్‌ మహాల్‌ ఆ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.
1857 జూన్‌ 30న చిన్హట్‌ వద్ద కంపెనీ బలగాలతో జరిపిన పోరాటంలో తిరుగుబాటు వీరులకు లభించిన విజయం ఇటు ప్రజలలో, అటు తిరుగుబాటుకు సన్నద్ధమవుతున్న స్వదేశీ పాలకులలో, సైనికులలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఆ ఉత్సాహంలో తిరుగుబాటు వీరులు మరింతగా రెచ్చిపోయారు. స్వతంత్ర రాజ్యంగా ప్రకటించారు. ఆ సమయంలో అవధ్‌ పతాకం క్రింద నాయకత్వం స్వీకరించి ఆంగ్లేయుల మీద పోరాటం సాగించేందుకు బలమైన నాయకుడి అవసరం వచ్చింది.
నవాబు వాజిద్‌ అలీషా వంశస్థుల కోసం అన్వేషణ ప్రారంభమైంది. బ్రిటిష్‌ పాలకులంటే ఏర్పడిన భయం వలన లక్నోలో ఉంటున్న నవాబు భార్యలు కొందరు తమ బిడ్డలకు, కలకత్తాలో ఉన్న భర్త బంధువులకు ఎటువంటి ప్రమాదం సంభవించగలదోనని భయపడి కంపెనీ పాలకులు ఆగ్రహానికి తమను బలి చేయవద్దని ప్రాధేయపడుతూ నాయకత్వం స్వీకరణకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ క్లిష్ట సమయంలో హజరత్‌ మహాల్‌ కంటకప్రాయమైన మార్గంలో కూడా చారిత్రక పాత్ర నిర్వహించేందుకు ఎంతో సాహసంతో ముందుకొచ్చారు. ప్రజల అభీష్టం మేరకు బిడ్డడు బిర్జిస్‌ ఖరీదను నవాబుగా ప్రకటించేందుకు అంగీకరించారు. ఆ సందర్భంలో బేగం నిర్వహించిన పాత్ర, ఆమె త్యాగనిరతి, ఆత్మబలిదానం, చిట్టచివరి వరకు శత్రువుకు లొంగని ధీరత్వం చరిత్రలో ఆమెకు ప్రత్యేక స్థానం సంతరించి పెట్టాయి.
ఆ సమయంలో అవధ్‌ రాజ్యంలోని ఫైజాబాద్‌లో కంపెనీ పాలకుల బందీగా ఉన్న తిరుగుబాటు యోధుల నేత మౌల్వీ అహమ్మదుల్లా షాను, తిరుగుబాటు యోధులు విడుదల చేయించి ఆయనను తమ నాయకునిగా స్వీకరించారు. మౌల్వీ తన బలగాలతో లక్నో చేరుకుని కంపెనీ పాలకులను ఎదుర్కొన్నారు. ఆ సందర్భంగా బేగం హజరత్‌ మహాల్‌ బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా మరింత చొరవ తీసుకున్నారు. ఆ కారణంగా తిరుగుబాటు మరింత ప్రజ్వరిల్లింది. పది రోజుల్లో లక్నో అంతా పూర్తిగా తిరుగుబాటు సేనల పరమైంది.
బేగం హజరత్‌ మహాల్‌ తన బిడ్డ బిర్జిస్‌ ఖదీర్‌ను 1857 జులై 5న అవధ్‌ నవాబుగా ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు బలపర్చారు. తిరుగుబాటు యోధులలో ఆనందం వెల్లివిరిసింది. బిర్జిస్‌ ఖదీర్‌ పేరిట బేగం హజరత్‌ మహాల్‌ పాలన ప్రారంభమైంది. ఆమె అధికార పగ్గాలను చేపట్టగానే పాలనా పరమైన చర్యలను చేపట్టారు. అన్ని సాంఘిక జనసముదాయాలకు పాలనాధికారంలో భాగం కలిగించే విధంగా సమష్టి నిర్ణయాలకు అనుకూలంగా పాలనా వ్యవస్థను రూపొందించారు. బహిర్గత శత్రువును ఎదుర్కొనడానికి ప్రాణాలు పణంగా పెట్టే సైనికులకు అధిక ప్రాధాన్యత కల్పించారు. స్వదేశీ పాలకులు, నమ్మకమైన సైనికాధికారులకు, తిరుగుబాటు వీరులకు, స్వదేశీ భక్తులకు ప్రతిభా సామర్ధ్యాల ఆధారంగా పలు విభాగాల బాధ్యతలను అప్పగించారు.
మతం, కులం, ప్రాంతాల ప్రసక్తి లేకుండా, పౌర సైనికాధికార ప్రముఖులైన ముమ్మూఖాన్‌, మహారాజ బాలకృష్ణ బాబూ పూర్ణచంద్‌, ముల్టీ గులాం హజరత్‌, మహమ్మద్‌ ఇబ్రహీం ఖాన్‌, రాజా లాలా సింప్‌ా, రాణా జిజియా లాల్‌, రాజా మాన్‌సింగ్‌, రాజా దేశిబక్ష్‌ సింగ్‌, రాజా బేణి ప్రసాద్‌ లాంటి వారితో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతి రోజు సమావేశమయ్యేది. ప్రతి అంశాన్ని కమిటీ సభ్యుల ఎదుట పెట్టి, చర్చించి, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుని వాటి అమలును బేగం పర్యవేక్షించారు. ఆనాటి రాజరికపు రోజుల్లో ఆ విధంగా ప్రజాస్వామికంగా వ్యవహరించటం బేగం హజరత్‌ మహాల్‌ బుద్ధికుశలతకు నిదర్శనం. అన్ని రంగాలు పూర్తిగా ఆమె ఆధీనంలోకి వచ్చాక అవధ్‌ నవాబు బిర్జిస్‌ ఖదీర్‌ పేరిట వెలువడిన ప్రకటనలు అవధ్‌ రాజ్యంలో ఆంగ్లేయుల పాలన అంతటితో అంతమైందని స్పష్టం చేశాయి. అంతటితో ఆమె మిన్నకుండి పోలేదు. స్వయంగా గుర్రం మీద, ఏనుగు మీద సవారీ చేస్తూ ప్రజలను, ప్రముఖులను కలుస్తూ రాజ్యమంతా తిరిగి అందర్నీ ఏకతాటి మీదకు తెచ్చేందుకు ఆమె విజయవంతంగా ప్రయత్నించారు.
బేగం హజరత్‌ మహాల్‌ ఎటువంటి ప్రగతిశీల, సామరస్యపూర్వక విధానాలు చేపట్టినా, ఆమె శక్తి సామర్ధ్యాల మీద విశ్వాసం కలుగని కొందరు స్వదేశీ పాలకులు, జమిందారులు ఆమె నాయకత్వాన్ని తొలుత ఆమోదించలేదు. అవధ్‌ అంతటా అస్తవ్యస్థ పరిస్థితి, క్రమశిక్షణా రాహిత్యం, వ్యక్తిగత స్వార్థంతో కంపెనీ పాలకుల వైపు మొగ్గు చూపుతున్న విద్రోహుల బెడద, బేగం శక్తి సామర్ధ్యాలను శంకించే జమిందారుల రగడ, స్వదేశీ పాలకులు, అధికారుల సమస్యలు ఒకవైపు, అవమాన భారంతో రగిలిపోతున్న కంపెనీ పాలకుల కుయుక్తులు మరొకవైపు బేగం హజరత్‌ మహాల్‌ను చుట్టుముట్టాయి.
ఆ పరిస్థితులలో కూడా ఆమె ఏ మాత్రం అధైర్యపడలేదు. ప్రజలను ఆకట్టుకుంటూ, స్వదేశీ పాలకులకు, తాలూకాదారులకు పలు రాయితీలు ప్రకటించారు. ఆ సమయంలో ఆంగ్లేయాధికారి జనరల్‌ హ్యావ్‌ లాక్‌ తనకు లభించిన రెండు విజయాల తర్వాత కూడా అవధ్‌ నుండి నిష్క్రమించడంతో బేగం శక్తిసామర్ధ్యాల మీద నమ్మకం కుదిరిన స్వదేశీ పాలకులు, జమిందారులు తిన్నగా బేగం నాయకత్వం స్వీకరించి, నజరానాలు సమర్పించుకోవడం ఆరంభించారు. ఢల్లీిలోని మొఘల్‌ చక్రవర్తి బహద్దూర్‌ షా జఫర్‌ ప్రతినిధిగా బిర్జిస్‌ ఖదీర్‌ తనను తాను ప్రకటించుకున్నాడు. ఆయన ప్రతినిధిగా బిర్జిస్‌ ఖదీర్‌ అవధ్‌ పాలకునిగా పాలన చేపట్టారు. కంపెనీ అధికారుల చర్యలతో నష్టపోయి, కంపెనీ పాలకుల పట్ల ఆగ్రహంగా ఉన్న స్వదేశీయులు ఆయనను అవధ్‌ పాలకునిగా అంగీకరించారు. ఈ మేరకు అవసరమైన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. ఆ అనుకూల వాతావరణంలో ప్రజల అవసరాలను తీర్చుతూ, శత్రువు దాడుల నుండి ప్రజలను కాపాడేందుకు లక్నో కోటను పటిష్టపరిచే కార్యక్రమాలను బేగం చేపట్టారు. ఆమె స్వయంగా తన లక్షలాది రూపాయిలను వ్యయం చేసి కోటగోడలను పునర్నిర్మించారు. ప్రతి విషయాన్ని బేగం హజరత్‌ మహాల్‌ స్వయంగా పర్యవేక్షించసాగారు. ఆమె ఏనుగునెక్కి పనులు సాగుతున్న ప్రదేశాలకు చేరుకుని స్వయంగా పర్యవేక్షించడంతో ప్రజలు, సైనికులు ఉత్సాహభరితులయ్యేవారు.
ఆ సందర్భంగా అవధ్‌లోని ప్రజలను ఉద్దేశించి బిర్జిస్‌ ఖదిర్‌ పేరిట బేగం హజరత్‌ మహాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ‘‘హిందూ`ముస్లింలకు ధర్మం, ఆత్మగౌరవం, ప్రాణం, ధనం అను నాలుగు అంశాలు ప్రధానం. ఈ అంశాలను కేవలం స్వదేశీ పాలనలో, స్వదేశీ పాలకులు మాత్రమే ప్రసాదించగలరు. కంపెనీ సైనికులు ప్రజలను దోచుకుంటున్నారు. ఆత్మగౌరవాన్ని మంట కలుపుతున్నారు. స్త్రీలమీద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుపుతున్నారు. హిందూ`ముస్లిం పౌరులను హెచ్చరిస్తున్నాం. ఆత్మగౌరవంతో, ధర్మబద్ధంగా ప్రశాంత జీవితం సాగించాలంటే స్వదేశీ పాలన కోసం శత్రువులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టండి. స్వదేశీ సైన్యంలో భర్తీ కండి. మాతృదేశం కోసం సాగుతున్న పోరాటంలో భాగస్వాములు కండి. శత్రువుకు సహకరించకండి. ఆశ్రయం ఇవ్వకండి’ అంటూ బేగం హజరత్‌ మహాల్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పిలుపుతో ఉత్తేజితులైన ప్రజలు, సైనికాధికారులు, అంతవరకు ఆమెకు దూరంగా ఉన్న స్వదేశీ పాలకులు, అధికారులు బేగం పతాకం నీడన చేరుకున్నారు. (భారత్‌ కీ స్వాతంత్య్ర్‌ సంగ్రామ్‌ మే ముస్లిం మహిళావోంకా యోగ్‌ దాన్‌, (హిందీ) ` డాక్టర్‌ ఆబెదా సమీయుద్దీన్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆబ్జెక్టివ్‌ స్టడీస్‌, న్యూఢల్లీి, 1997, పేజి.22)
ఈ మేరకు పరిస్థితులు మరింత అనుకూలించి ప్రశాంత వాతావరణం ఏర్పడడంతో, అవధ్‌ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు బేగం నడుం కట్టారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఫలితంగా పలు ప్రాంతాల నుండి లక్నోకు తరలి వస్తున్న తిరుగుబాటు యోధులకు, వేలాది సైనికులకు ఆమె ఆశ్రయం కల్పించాల్సి వచ్చింది. ప్రముఖ తిరుగుబాటు నాయకులు నానా సాహెబ్‌ పీష్వా, జనరల్‌ బర్త్‌ ఖాన్‌ రోహిల్లా, మొఘల్‌ రాజకుమారుడు ఫిరోజ్‌ షా తమ భారీ సైనిక బలగాలతో లక్నో చేరుకుంటున్నారు. ఈ నేతలకు, ఆ నేతల పరివారానికి, వారి సైన్యాలకు వసతి సౌకర్యాలు సమకూర్చటం బేగంకు కడు భారంగా మారింది. ఈ పరిస్థితులు ఖజానా మీద అధిక భారమయ్యాయి. చివరకు ఖజానా ఖాళీ అయ్యింది. ఆమె వ్యక్తిగత సంపద కూడా ఖర్చయిపోయింది. గత్యంతరం లేని పరిస్థితులలో ధనికులు, సంపన్న వర్గాల మీద ‘యుద్ధ పన్ను’ అంటూ ప్రత్యేక పన్ను విధించారు. ఆ నిర్ణయానికి సహజంగా మిశ్రమ స్పందన లభించింది. ఆ విధంగా సమకూరిన ధనం కూడా సరిపోక పోవడంతో ఆమె అధికారులు, కొందరు తిరుగుబాటు వ్యతిరేక శక్తులుగా వ్యవహరిస్తున్న సంపన్నుల కుటుంబాల నుండి బలవంతంగా ధన సంపదలను వసూలు చేయసాగారు. ఆనాటి క్లిష్ట పరిస్థితులలో కూడా బేగం హజరత్‌ మహాల్‌ ఎంతో బుద్ధి కుశలతతో ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ, ఆంగ్లేయులను ఎదుర్కొనేందుకు సైనికంగా సన్నద్ధులు కాసాగారు. ఈ మేరకు 1,80,000 మంది సైనికులను ఆమె సమకూర్చుకున్నారు. బ్రిటిష్‌ బలగాలను ఢీ అంటే ఢీ అనడానికి సిద్ధమయ్యారు.
ఈ పరిస్థితులను గమనించిన బ్రిటిష్‌ అధికారి విలియం రస్సెల్‌ ‘‘… బేగం మాతో అప్రకటిత యుద్ధం ప్రారంభించింది. ఈ రాణులు, బేగంల శ్లాఘనీయ, శక్తివంత చరిత్రలను గమనించాక, అంతఃపురంలో పరదాల చాటున ఉంటూ కూడా ఎంతటి శక్తియుక్తులు సంతరించుకోగలరో తెలుసుకున్నాం’’ అని వ్యాఖ్యానించాడు. (భారత్‌ కీ స్వాతంత్య్ర్‌ సంగ్రామ్‌ మే ముస్లిం మహిళావోంకా యోగ్‌ దాన్‌, 1997, పేజి.42) మరో ప్రముఖ చరిత్రకారుడు న. దీవఙవతీఱసస్త్రవ 1857 నాటి తిరుగుబాటుకు బేగం ఆత్మలాంటిది’ అని బేగం హజరత్‌ మహాల్‌ ను ప్రస్తుతించాడు. (A comprehensive History of India, H. Beveridge, 1887 Ed. Vol.III Page 842. Quoted by Mr. Srivasthava in his book Freedom Fighters of Indian Ministry 1857 at page 105) ఆమె పర్గానషీ మహిళ కానట్లయితే మిగతా పురుషుల కంటే గొప్ప పోరాట యోధురాలిగా ఖ్యాతి గడిరచేది…’’ అని ప్రముఖ చరిత్రకారుడు Mr. Abdul Harim Sharar వ్యాఖ్యానించాడు. (Freedom Fighters of Indian Mutiny 1857, Mr. Srivasthava, pag105)
అవధ్‌లో పరిస్థితులు కొంతమేరకు మెరుగు పడ్డాక బేగం హజరత్‌ మహాల్‌ తన రాజకీయ కుశలతను చూపనారంభించారు. బ్రిటిషర్లతో మిలాఖత్‌ అయిన నేపాల్‌ పాలకుడు జంగ్‌ బహుద్దూర్‌ను తనవైపునకు తిప్పుకునేందుకు పావులను కదిలించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వదేశీ పాలకులతో చేతులు కలిపినట్లయితే ఆయనకు కంపెనీ పాలకులు ఆశపెట్టిన దానికంటే, ఎక్కువ భూభాగాన్ని ఇవ్వగలనని వర్తమానం పంపారు. అవధ్‌ ఇరుగుపొరుగు స్వదేశీ పాలకులకు రానున్న గడ్డు పరిస్థితుల పట్ల హెచ్చరికలు చేస్తూ, అవసరాన్ని బట్టి ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మలచుకుంటూ, యంత్రాంగం నడుపుతూ బేగం హజరత్‌ మహాల్‌ కంపెనీ పాలకులకు చెమటలు పట్టించారు.
ఈ విధంగా బేగం తన పాలనా దక్షతతో స్వదేశీ పాలకుల మద్దతుతో అవధ్‌లో పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటున్న దశలో ఢల్లీిలో తిరుగుబాటు విఫలమైంది. బహదూర్‌ షా జఫర్‌ను ఆంగ్లేయులు అరెస్ట్‌ చేశారు. తిరుగుబాటుకు కేంద్రంగా భావించిన ఢల్లీి ఆంగ్లేయుల వశమైంది. ఈ వార్తలు తిన్నగా లక్నో చేరాయి. ఆ ప్రతికూల పరిస్థితులలో కూడా ఆమె అధైర్యపడలేదు. ప్రజలు, స్వదేశీ యోధుల అండదండలతో కంపెనీ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు.
బేగం హజరత్‌ మహాల్‌ సుమారు 10 మాసాల పాటు ప్రత్యక్షంగా పాలన చేశారు. ఆంగ్లేయులు లక్నోలోని ఆలంబాలోని రెసిడెన్సీలో దాగి ఉండడం, ఆ రెసిడెన్సీ నుండి బయటపడి లక్నోను స్వాధీనం చేసుకోవడానికి కంపెనీ అధికారులు వేస్తున్న ఎత్తులను గమనించిన ఆమె రెసిడెన్సీ మీద దాడికి తన సైనికులను పురికొల్పారు. ఈ చర్య కోసం 1857 డిసెంబరు 22న సైనిక యోధుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఉత్తేజపూరితంగా ప్రసంగిస్తూ ‘‘ఎందుకీ నిరీక్షణ? శత్రువుతో తలపడేందుకు భయపడుతున్నారా? బ్రిటిషర్లు తమ సైన్యాన్ని రప్పించేంతవరకు మీరు కూర్చునే గడుపుతారా? ముందుకు సాగండి. మీరు పోరాడుతారా? లేదా? చెప్పండి. పోరుబాటన నడువలేమంటే నేను ఆంగ్లేయులతో మంతనాలు జరిపి నా ప్రాణాలను కాపాడుకుంటాను. ఏ విషయం చెప్పండి?’’ అంటూ సైనికులను, సైన్యాధిపతులను నిగ్గదీశారు. ఈ సందర్భంగా సైనికుల మీద తూటాల్లా ప్రయోగించిన ఆమె మాటలు తిరుగుబాటు యోధులలో ఆత్మ బలిదానానికి సన్నద్దులను చేసి, పోరుకు ప్రేరేపించాయి. (Encyclopaedia of women Biography Vol.II Ed. by Nagendra K. Singh, APH publishing corporation, New Delhi, 2001, Page.64) ఆ తరువాత బ్రిటిష్‌ రెసిడెన్సీని బేగం సేనలు చుట్టుముట్టాయి. విజయమో, వీర స్వర్గమో అంటూ పోరాటం ప్రారంభించాయి. ఈ పోరాట సమయంలో బేగం అపూర్వ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఆమె కుమారుడు బిర్జిస్‌ ఖదీర్‌ను వెంటపెట్టుకుని ఏనుగు మీద ఆమె స్వయంగా రణభూమికి విచ్చేశారు. (Hazrath Mahal riding on an elephant encouraged her army by her presence on the field of batle, History of Freedom Movement in India, Dr. Tara Chand, page. 85)మాతృభూమి కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికులను, ప్రజలను తన ప్ర సంగాలతో ఉత్తేజపర్చారు. పోరాటం భయంకరంగా సాగింది. ఆ పోరాటం గురించి తెలుసుకున్న లక్నో కమిషనర్‌, బ్రిటిష్‌ అధికారి హెన్రీ లారెన్స్‌ వ్యాఖ్యానిస్తూ, ‘‘ఎక్కడా కూడా ఇంతకు మించిన శౌర్య ప్రతాపాలను మేము చూడలేదు’’ అంటూ బేగం నాయకత్వంలో సాగిన పోరాటాలను ప్రశంసించాడు. ఈ పోరులో పలువురు కంపెనీ అధికారులు మృత్యువాత పడ్డారు. స్వదేశీ యోధులు ఎంతగా పోరాడినా రెసిడెన్సీ మాత్రం బేగం హజరత్‌ మహాల్‌ వశం కాలేదు.
ఆ సమయంలో బ్రిటిష్‌ అధికారుల నుండి సంధి ప్రస్తావన వచ్చింది. తిరుగుబాటు దారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తామని, బేగంకు ప్రతినెల 25 వేల రూపాయల పెన్షన్‌ ఇస్తామని, అందుకుగాను బేగం హజరత్‌ మహాల్‌ అవధ్‌ మీద తన అధికారాన్ని పూర్తిగా వదులుకోవాలని కంపెనీ అధికారులు ప్రతిపాదించారు. ఆ ప్రస్తావన పట్ల బేగం మండిపడ్డారు. మా గడ్డ మీద మరొకరి పెత్తనమా? మా ప్రాణాలు పోయినా సరే శత్రువుకు లొంగేది లేదన్నారు. బిడ్డ బిర్జిస్‌ ఖదీర్‌ న్యాయమైన హక్కులను, తన వెంట నడిచిన స్వదేశీ పాలకులను, సైనికులను, సేనాధిపతులను, ప్రజలను కంపెనీ బలగాల దయాదాక్షిణ్యాలకు వదలి పెట్టలేనంటూ ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. నా ప్రాణం మీది తీపితో న్యాయమైన హక్కులను వదులుకునేది లేదని బేగం స్పష్టం చేశారు. భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆరంభమైన తిరుగుబాట్లను అణచివేసిన బ్రిటిష్‌ సైన్యాలు, సేనాధిపతులు చివరకు లక్నోమీద పూర్తిగా దృష్టి సారించారు. లక్నోను వీలయినంత త్వరగా చేజిక్కించుకోవలసిందిగా అధికారులకు గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కానింగ్‌ నుండి ఆదేశాలందాయి. 1858 మార్చి 3`4 తేదీలలో బ్రిటిష్‌ సైన్యాధిపతి కోలిన్‌ భారీ సైనిక బలగాలతో లక్నోను చుట్టుముట్టాడు. ఆయనకు తోడుగా నేపాల్‌ ప్రభువు జంగ్‌ బహుద్దూర్‌ తన బలగాలతో మార్చి 11వ తేదీన ఆంగ్లేయాధికారులతో కలిశాడు. లక్నోను అన్ని వైపుల నుండి శత్రుసైన్యాలు పూర్తిగా చుట్టుముట్టాయి. బేగం హజరత్‌ మహాల్‌ నివాసం కైసర్‌ బాగ్‌ మీద ఆంగ్లేయ సైన్యాల ఫిరంగులు నిప్పుల వర్షం కురిపిస్తుండగా, సైనికుల తుపాకులు గుండ్ల వర్షం కురిపించసాగాయి. ఆ సమయంలో బేగం హజరత్‌ మహాల్‌ తన వెంట తొమ్మిది వేల మంది సైనికులతో మూసాబాగ్‌ వద్ద కంపెనీ సైనికులతో చివరిసారిగా తలపడ్డారు. మిడతల దండులా అన్ని వైపుల నుండి వచ్చిపడిన శత్రు సైనికులను తట్టుకుని నిలవటం బేగం సైన్యానికి అతి కష్టంగా మారింది. పరిస్థితి ప్రమాదంలో పడిరదని గ్రహించిన సహచరులు ఆమెను రక్షిత స్థలానికి వెళ్ళవలసిందిగా సూచించారు. తాను అక్కడినుండి మరో చోటుకు వెళ్తే అది ఆంగ్లేయులకు విజయం లభించినట్లు కాగలదని భావించిన ఆమె పెనుముప్పు చుట్టుముట్టేంత వరకు ఆ ప్రాంతం నుండి కదలలేదు. చివరకు సహచరుల ఒత్తిడి మేరకు తప్పని పరిస్థతులలో మార్చి 16న బేగం హజరత్‌ మహాల్‌ లక్నో నుండి తప్పుకున్నారు. ఈ విధంగా తప్పుకుంటున్నప్పుడు కూడా తన క్షేమం కంటే తన వెంటనున్న వారి క్షేమం గురించి ఓ బాధ్యత గల నాయకురాలిగా ఆమె ఆలోచించారు. ఆ సమయంలో కూడా తన వెంటనున్న ప్రముఖులంతా ఆంగ్లేయుల వలయం నుండి తప్పించుకుని వెళ్ళిన తర్వాత బేగం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. బేగం సంరక్షణలోంచి అవధ్‌ జారిపోయాక కంపెనీ సైనికులు పెచ్చరిల్లిపోయారు. 1857నాటి తిరుగుబాటులో మరెక్కడా ఎదురుకానంత పరాభవాన్ని చవిచూసిన ఆంగ్లేయాధికారులు, ఆంగ్ల సైనికులు అవధ్‌ రాజ్యం మీద పడి దోచుకున్నారు. సంపన్నవంతమైన లక్నోను పూర్తిగా ఛిద్రం చేశారు. అవధ్‌ పౌరులను దోచుకోవడమే కాకుండా భయంకర హింసలకు గురిచేశారు. యధేచ్ఛగా హత్యాకాండ సాగించారు. ఈ మేరకు తాము చేసిన కిరాతక చర్యలను తమ వారికి ఉత్తరాల ద్వారా ఆంగ్లేయాధికారులు తెలుపుకున్నారు.
ఆ తర్వాత అవధ్‌ రాజ్యంలోని స్వదేశీ పాలకుల ఆధీనంలో ఉన్న పలు ప్రాంతాలు తిరుగుతూ పలు చోట్ల శత్రువును ఎదుర్కొంటూ, మరికొన్ని చోట్ల మిత్రుల ఆతిథ్యం పొందుతూ, బ్రిటిషర్ల దాడుల నుండి తప్పించుకుంటూ ఆమె ముందుకు సాగారు. ఆమె ఎక్కడకు వెళ్ళినా బ్రిటిష్‌ సైన్యాలు ఆమెను వెంబడిరచసాగాయి. ఆమెకు ఒక్క క్షణం కూడా విశ్రమించే తీరిక లేకుండా చేశాయి. ఆమెకు ఆశయ్రమిచ్చినన వారిని ఇక్కట్ల పాలు చేయసాగాయి. ఆ సమయంలో విద్రోహుల కుట్ర ఫలితంగా యోధుడు మౌల్వీ అహమదుల్లా షాను శత్రువులు బలి తీసుకున్నారు. ఈ వార్త ఆమెను బాధించింది. పలు ప్రాంతాలలో తిరుగుబాటు యోధులు సాగిస్తున్న పోరాటాలలో అపజయాలు చవిచూడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆమె సహచరులు, స్వదేశీ పాలకులు రాజా బేణి మాధవ్‌ సింగ్‌ తదితరుల పరాజయాలు బేగంను బాగా కృంగదీశాయి. ఈ వాతావరణంలో బేగం తన పరివారంతో పాటుగా అక్కడ కొన్నాళ్ళు, ఇక్కడ కొన్నాళ్ళు తలదాచుకుంటూ గడపసాగారు. బేగం పరివారాన్ని వెంటాడుతున్న కంపెనీ బలగాలు ఆమె తలదాచుకున్న చోటల్లా ప్రవేశించి కసికొద్దీ భీభత్సం సృష్టించసాగాయి. ఆమెను, ఆమె బలగాలను నీడలా వెన్నంటి కంపెనీ సైనికులు వస్తున్నా ప్రజల అండదండలతో, అత్యంత విశ్వాసపాత్రులైన సైనికాధికారులు, సైనికుల రక్షణలో ఆమె ప్రమాదాన్ని అధిగమిస్తూ సురక్షితంగా సంచరించసాగారు.
బేగం హజరత్‌ మహాల్‌ ప్రవాసంలో ఉన్నప్పుడు 1858 నవంబరు 1న విక్టోరియా మహారాణి ఈస్టిండియా కంపెనీ పాలనను రద్దుచేసి, పాలనాధికారాన్ని స్వయంగా స్వీకరించింది. ఈ సందర్భంగా విక్టోరియా రాణి ప్రకటనగా ఖ్యాతి చెందిన ఒక ప్రకటనను ఆమె చేసింది. అందులో స్వదేశీ పాలకులకు, ప్రజలకు ఆమె పలు హామీలు కుమ్మరించింది. పలు ఆకర్షణీయమైన ఆశలను చూపింది. తిరుగుబాటు వీరులకు, నేతలకు క్షమాభిక్ష ప్రసాదిస్తానంది. తిరుగుబాటులో పాల్గొన్న స్వదేశీ పాలకులను, ప్రజలను ఆ ప్రకటన కొంతలో కొంత ఆకర్షించింది. విక్టోరియా రాణి ప్రసాదించే క్షమాభిక్షతో బ్రతికి బయటపడి తమ ప్రాణాలను కాపాడుకోవాలనుకున్న కొందరు సహచరులు, పాలకులు, జమిందారులు, అధికారులు తిన్నగా బేగం పక్షం నుండి తప్పుకోసాగారు. ఈ పరిణామాలు ఆమెను మరింత కలవరపరిచాయి.
ఆ పరిస్థితులలో ప్రజలలో, సహచరులలో ఆత్మవిశ్వాసం కలిగించేందుకు విక్టోరియా ప్రకటనకు ధీటుగా 1858 డిసెంబరు 31న బిర్జిస్‌ ఖదీర్‌ పేరిట బేగం హజరత్‌ మహాల్‌ మరో చారిత్రాత్మక ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో సామ్రాజ్యవాద కాంక్ష కలిగిన ఆంగ్లేయులు భారతదేశంలోని స్వదేశీ సంస్థానాలను ఎలా ఆక్రమించుకుందీ, స్వదేశీ పాలకులను ఎలా మోసగించిందీ, స్వదేశీ పాలకులతో పలు ఒప్పందాలు చేసుకుని వాటిని నిస్సిగ్గుగా ఎలా ఉల్లంఘించిందీ, ప్రజల మత విశ్వాసాల మీద, ఆచార సాంప్రదాయాల మీద ఎటువంటి దాడులు నిర్వహిస్తున్నదీ సవివరంగా పేర్కొన్నారు. స్వదేశీ పాలకులమీద ఎటువంటి దారుణాలకు ఒడగట్టిందీ ఆ ప్రకటనలో వివరించారు. ఆంగ్లేయులు అపరాధాన్ని క్షమించినట్లు కలలో కూడా ఎవరూ చూడలేదంటూ ఆనాడు లొంగుబాటుకు సిద్ధమవుతున్న యోధులను బేగం హెచ్చరించారు. (.. no one has ever seen in a dream that the English gorgave an offence… Encyclopaedia of women Biography Vo.II Ed. by Nagendra K. Singh, APH Publishing corporation, New Delhi, 2001, page.66)
ఆంగ్లేయులు స్వదేశీయుల ఆత్మాభిమానాన్ని ఏ విధంగా దెబ్బకొట్టిందీ, స్వదేశీయుల మతధర్మాలను ఏ విధంగా కించపర్చిందీ, మత మనోభావాలను ఏ విధంగా అవమానపరిచిందీ, తిరుగుబాటుకు భయపడి తిరగబడ్డ సైనికులను, నేతలను మాలిమి చేసుకునేందుకు ఎలాంటి ఆశలు చూపిందీ, గతంలో స్వదేశీ పాలకుల మీద ఎంతటి అఘాయిత్యాలకు పాల్పడిరదీ ఆ సుదీర్ఘమైన, చారిత్రాత్మక ప్రకటన సాక్ష్యాధారాలతో సహా వివరించింది. చివరకు మా ప్రజలు మా దేశాన్ని కోరుతున్నప్పుడు ఆమె మా దేశాన్ని మాకెందుకు వదిలిపెట్టదూ? (Why does her Majesty not restore our country to us. when our people want it.. Encyclopaedia of women Biography Vol. II page66)అని సూటిగా విక్టోరియా రాణిని ప్రశ్నించారు. విక్టోరియా రాణి మభ్యపెట్టే మాటలను నమ్మవద్దని, మోసపోవద్దని ప్రజలకు, స్వదేశీ పాలకులకు ఆమె విజ్ఞప్తి చేశారు. మాతృభూమి నుండి పరాయి పాలకుల పెత్తనాన్ని రూపుమాపేందుకు కంకణబద్ధులై అంతా కదలాలని ఆమె ప్రజలను కోరారు. ఈ పరిస్థితులు ఇలా ఉండగా, ఆంగ్లేయాధికారులు లక్నో తిరుగుబాటును క్రూరంగా అణచివేయడానికి, తిరుగుబాటు నాయకుల.. . ను తుదముట్టించడానికి పథకాలు రూపొందించసాగారు. అన్ని వైపుల నుండి తిరుగుబాటు సైన్యాలను తరుముతూ, వారంతా నేపాల్‌ దిశగా సాగిపోయేందుకు పథకం ప్రకారంగా అనుకూలతను సృష్టించారు. లక్నో నుండి తప్పుకున్న తర్వాత బేగం హజరత్‌ మహాల్‌ కూడా మిగతా యోధులతో పాటుగా మరో మార్గం లేక నేపాల్‌ దిశగా సాగాల్సి వచ్చింది. ఆ నిర్ణయం వలన ఆమె రక్షణ కూడా ప్రమాదంలో పడిరది. బ్రతికుండగా తాను కానీ, మరణించాక తన శవం కానీ ఈస్టిండియా కంపెనీ పాలకుల చేతుల్లో పడరాదని నిర్ణయించుకున్నాక ఆమె నానా సాహెబ్‌, ఇతర తిరుగుబాటు నేతలతో కలిసి నేపాల్‌ అడవుల్లోకి వెళ్ళిపోయారు.
అక్కడ కూడా ఆమెకు ప్రమాదం తప్పలేదు. ప్రమాదాల నుంచి తప్పించుకుంటూ రాత్రి, పగలు అని తేడా లేకుండా ఆమె గడపాల్సి వచ్చింది. చివరకు నేపాల్‌ రాజ్యం లోనికి ప్రవేశించిన ఆమెకు నేపాల్‌ పాలకుడు జంగ్‌ బహుద్దూర్‌ నుండి సహకారం లభించకపోగా నేపాల్‌ అడవులను వదిలి వెళ్ళిపోవాల్సిందిగా అతను ఆదేశించాడు. అనివార్య పరిస్థితులలో ప్రమాదకర వాతావరణాన్ని ఎదుర్కొంటూ బేగం హజరత్‌ మహాల్‌, బిర్దిస్‌ ఖదీర్‌ నేపాల్‌ అడవుల్లో సంచరించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఒకవేళ పోరాడి నేలకొరిగే అవకాశం తనకు లభించకుంటే ఆత్మార్పణ చేసుకునేందుకు బేగం ఎల్లప్పుడూ విషంతో కూడిన పాత్రను తన వెంట ఉంచుకుని ఆంగ్లేయుల మీద పోరాటం సాగించేందుకు ప్రయత్నాలను సాగించారు. ఆ సమయంలో నేపాల్‌ అడవుల్లోకి బేగం హజరత్‌ మహాల్‌ ఛాయా చిత్రం గీసేందుకు వచ్చిన ఒక బ్రిటిష్‌ చిత్రకారుని ద్వారా, వ్యక్తిగతంగా ఆమెకు ఏడాదికి లక్ష రూపాయలు, ఆమె కుమారుడు బిర్జిస్‌ ఖదీర్‌కు 15 లక్షలు అందచేస్తామని ఆశ చూపుతూ బ్రిటిష్‌ పాలకులు, బేగంను లొంగదీసుకునేందుకు విఫల యత్నం చేశారు. ఈ విధంగా ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ సాగుతుండగా, ఆమె వెంట వచ్చిన యోధులు ఒక్కొక్కరే ఆ కారడవుల్లో, మంచు కొండల్లో మృత్యువాత పడసాగారు. కాలం గడిచేకొద్దీ సంపదతో పాటుగా, సహచరులు తరిగిపోసాగారు.
ఆ పరిస్థితులలో కూడా శత్రువుకు ఏ మాత్రం తలవంచడానికి బేగం ఇష్టపడలేదు. ప్రధాన సహచరులు, అనుంగు అనుచరులు మృత్యువాత పడి అదృశ్యమైపోయారు. ఆ సమయంలో ఒంటరిగా మిగిలిన ఆ అసమాన పోరాటయోధురాలు, అతి నిస్సహాయ పరిస్థితులలో సామాన్య జీవితం గడపసాగారు. చివరకు ఆ మంచు కొండల శిఖరాల మీద రెపరెపలాడుతున్న అవధ్‌ రాజ్యం ఛత్ర ఛాయలో 1874 ఏప్రిల్‌ మాసంలో బేగం హజరత్‌ మహాల్‌ కన్నుమూశారు. ఆమె భౌతిక కాయాన్ని ఖాట్మండులో ఒక హిందుస్థానీ మసీదులో ఒక ప్రక్కన ఖననం చేశారు. ప్రస్తుతం ఆ ఇమాంబారా శిథిలమైపోయింది. అక్కడ బేగం హజరత్‌ మహాల్‌ స్మృతి చిహ్నంగా ఆమె సమాధి మాత్రమే మిగిలింది. అది కూడా ఆక్రమణలకు గురవుతోంది. ఆ సమాధి నూటపాతికేళ్ళుగా అక్కడ ఉన్నా దాన్ని పట్టించుకున్న వారు లేకపోయారు. 1957లో ప్రథమ స్వాతంత్య్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా, బేగం హజరత్‌ మహాల్‌ సమాధికి ఏర్పడిన దుస్థితి గురించి ఆమె వంశజుడు మిర్జా అజం ఖదీర్‌ ఆనాటి ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రును కలిసి ఓ మహాజరు ద్వారా అక్కడున్న పరిస్థితిని ఆయన దృష్టికి తెచ్చారు. ఆ మహాయోధురాలి స్మృతిగా మిగిలి ఉన్న ఆమె సమాధి నిర్లక్ష్యానికి గురికావడం గురించి తెలుసుకున్న ప్రధాని నెహ్రు తన బాధను వ్యక్తం చేస్తూ తగిన శ్రద్ధ తీసుకుంటానని హామీ ఇచ్చారు. తర్వాత ఆ సమాధిని ఫోటో తీయించి, వాటిని ఆజం ఖదిర్‌కు కూడా పంపారు. ఆ ఫోటోలతో పాటుగా, నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ఆ సమాధి సంరక్షణ బాధ్యతను తీసుకుంటుందని ప్రధాని నెహ్రు హామీ కూడా ఇచ్చారు.
బేగం హజరత్‌ మహాల్‌ పార్కు: ఆ సంవత్సరం ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఉత్సవాలలో ఆ మహాయోధ బేగం హజరత్‌ మహాల్‌ ప్రస్తావన కూడా రాలేదు. ఈ విషయమై ప్రిన్స్‌ అజం భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఉత్తరాలు రాయడంతో 1958 మే 9న భారత ప్రభుత్వం లోక్‌సభలో 1857 నాటి పదిమంది యోధుల పట్ల ప్రత్యేక గౌరవాన్ని ప్రకటిస్తూ ఆ జాబితాలో బేగం హజరత్‌ మహాల్‌కు అగ్రపీఠం వేసింది. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అప్పటివరకు లక్నోలో ఉన్న విక్టోరియా పార్కు పేరును మార్చి బేగం హజరత్‌ మహాల్‌ పార్కుగా నామకరణం చేసింది.
(కొలిమి వెబ్‌ మ్యాగజైన్‌ నుండి)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.