తన అందమే తనకు శత్రువైన అంజనీ బాయ్‌ మాల్పేకర్‌ -రొంపిచర్ల భార్గవి

అంజనీ బాయ్‌ మాల్పేకర్‌ పాత తరానికి చెందిన ప్రసిద్ధ హిందుస్థానీ గాయని. ఆమె పాడుతుంటే ప్రేక్షకులు ఆమె గానానికీ, ఆమె సౌందర్యానికీ పరవశులయ్యేవారు. పెద్ద పెద్ద సంస్థానాధీశులూ, రాజులూ, యువరాజులూ ఆమె సాన్నిహిత్యం కోసం తహతహలాడిపోయే

వాళ్ళు. అంతేకాదు రాజా రవివర్మ, యం.వి.దురంధర్‌ లాంటి చిత్రకారులు ఆమెను మోడల్‌గా పెట్టుకుని చిత్రాలు రూపొందించారు.
ఆమె గానంలో ఉన్న విశిష్టత ఏంటంటే విలంబిత లోయలో అలలు అలలుగా శృతి శుద్ధంగా వినేవాళ్ళ మనసులను ఉయ్యాలలూపడం. అసలు ‘భేండీబజార్‌ ఘరానా’కు చెందిన ప్రత్యేక లక్షణమే అది అంటారు. ఇంతకీ అంజనీ బాయ్‌ ‘భేండీబజార్‌ ఘరానా’కు చెందిన ఉస్తాద్‌ నజీర్‌ ఖాన్‌ శిష్యురాలు మరి. ఈ ఘరానాకు ఆ పేరు సెంట్రల్‌ బొంబాయిలోని భేండీబజార్‌ వలన వచ్చింది. ఈ ఘరానా స్థాపకులలో ఒకరు అంజనీ బాయ్‌ గురువైన ఉస్తాద్‌ నజీర్‌ ఖాన్‌ ఇక్కడే నివసించేవారు.
అంజనీ బాయ్‌ మాల్పేకర్‌ ఎవరు? ఆమె నేపథ్యం ఎలాంటిది? సంగీతంలో ఇంత పట్టు ఎలా సాధించింది? ఆమె జీవన ప్రయాణం ఎంత విచిత్రంగా సాగింది అన్న వివరాలను పరిశీలిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంజనీ బాయ్‌ ఉత్తర గోవాకు చెందిన మాల్పెమ్‌ అనే గ్రామంలో కళాకారుల కుటుంబంలో జన్మించింది. తల్లి నబూబాయ్‌కీ, అమ్మమ్మకీ కూడా సంగీతంలో మంచి ప్రవేశం ఉంది. ఆమె తాత వాసుదేవ్‌ మాల్పేకర్‌ కూడా సంగీతంలో నిష్ణాతుడే.
ఈ కళాకారుల కుటుంబాలన్నీ నృత్యంలోనూ, సంగీతంలోనూ మంచి ప్రతిభ చూపుతూ, గౌడ సారస్వత బ్రాహ్మణ కుటుంబాలు నిర్మించిన దేవాలయాలలో దేవదాసీలుగా జీవనం గడుపుతూ ఉండేవారు. పందొమ్మిదో శతాబ్దం చివరలో చాలా గౌడ సారస్వత బ్రాహ్మణ కుటుంబాలు బొంబాయి చేరడంతో, వారిమీద ఆధారపడిన వారందరూ కూడా బొంబాయి చేరుకున్నారు. అలా చేరుకున్న వారిలో అంజనీబాయ్‌ కుటుంబం కూడా ఉంది. ప్రఖ్యాత గాయని కిషోరి అమన్కర్‌, లతా మంగేష్కర్‌ కూడా ఈ కళాకారుల కుటుంబాలకు చెందిన వారే. వీరిరువురూ అంజనీ బాయ్‌ శిష్యురాళ్ళు కూడా. సుమారు ఎనిమిదేళ్ళ వయసులో (1891) అంజనీబాయ్‌, ఉస్తాద్‌ నజీర్‌ ఖాన్‌ వద్ద గండా బంధనం చేసి శిష్యురాలిగా చేరింది. అప్పటినుండీ రోజుకు దాదాపు పది పన్నెండు గంటలు నిష్టగా సాధన చేసేది. దాదాపు మూడున్నర సంవత్సరాలు రాగ్‌ యమన్‌ నేర్చుకుంటే, ఒకటిన్నర సంవత్సరాలు రాగ్‌ భైరవి నేర్చుకుంది. తర్వాత వరుసగా మిగతా రాగాలూ, ఇతర విషయాలూ నేర్చుకుంది.
అలా ఎనిమిది సంవత్సరాలు కఠిన సాధన తర్వాత తన పదహారో ఏట 1899లో మొట్టమొదట కచేరీ చేసింది. ఆమె గాన ప్రతిభ, ఆమె రూపలావణ్యమూ సంగీతాభిమానులనే కాదు, సంస్థానాధీశులనూ, వ్యాపార ప్రపంచాన్నీ కూడా ఆకర్షించింది. మొదటి కచేరీలో వచ్చిన సంపాదన అయిదు వేల రూపాయలను గురువు నజీర్‌ ఖాన్‌కి సమర్పించి నమస్కరించింది. ఆమె అనేక ప్రాంతాలలో కచేరీలు చేయసాగింది. ఆమె కీర్తి దేశమంతటా వ్యాపించింది. పెద్ద పెద్ద వ్యాపారస్తులూ, సంస్థానాధీశులూ, కళాపోషకులూ ఆమె సాన్నిహిత్యం కోసం పరితపించేవారు.
1899లోనే ఆమె ప్రముఖ వ్యాపారస్థుడూ, తన అభిమానీ అయిన సేఠ్‌ వాసన్‌ జీ భగవాన్‌ దాస్‌ వేద్‌ అనే ఆయన్ని పెళ్ళాడిరది. 1901`1904 సంవత్సరాల్లో చిత్రకారులు ఎం.వి.దురంధర్‌, రాజా రవివర్మలు ఆమెను మోడల్‌గా పెట్టుకుని చిత్రాలను రూపొందించారు. దురంధర్‌ ఒక తైలవర్ణ చిత్రాన్ని చిత్రిస్తే, రవివర్మ ‘లేడీ ఇన్‌ ద మూన్‌ లైట్‌, లేడీ ప్లేయింగ్‌ స్వరబత్‌, మోహినీ ఆన్‌ ఎ స్వింగ్‌, ది హార్ట్‌ బ్రోకెన్‌’ అనే చిత్రాలను చిత్రించారు.
1904 ప్రాంతంలో అసూయాపరులెవరో ఆమెమీద విషప్రయోగం చేశారు. తమలపాకులో విషం పెట్టి చుట్టి ఇచ్చారు. ఆమెకు అనుమానం వచ్చి ఉమ్మేసింది. ప్రాణాపాయం తప్పింది, కానీ గొంతు పోయింది. సంవత్సరంపాటు పాడలేకపోయింది. ఎన్నో గుళ్ళూ, గోపురాలూ తిరిగింది. ఎంతోమందికి మొక్కింది. చివరికి ఆధ్యాత్మిక గురువు నారాయణ మహారాజ్‌ కెడగావ్‌ ఇచ్చిన ప్రసాదం తిన్నాక ఆమె తిరిగి పాడగలిగింది. అప్పటినుండీ ఆయన్ని తన ఆధ్యాత్మిక గురువుగా ఎంచుకుంది. ఆమె కేవలం కచేరీలకే పరిమితం కాకుండా, పండితులైన కళాకారులతోనూ, వాగ్గేయకారులతోనూ జరిగే చర్చలలో పాల్గొని తాను నేర్చుకున్న విద్యలో లోతునీ, గాఢతనీ సాధించింది. అందుకే పండిట్‌ విష్ణునారాయణ్‌ భాత్కండే ఏదైనా అరుదైన రాగాలలో రచనలు చేసేటప్పుడు ఈమెను సంప్రదించేవారట. అయితే ఆమె అందమే ఆమెకు శాపమైంది. కచేరీ చేసిన చోటల్లా కొంతమంది మగవారు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించడం ఆమెను మానసికంగా క్రుంగదీసింది. సంగీతానికి ప్రాధాన్యతనివ్వాలనీ, హుందాగా ప్రవర్తించాలనీ ఆమె కోరుకునేది.
ఒకసారి ఒక గవర్నర్‌ కొడుకు తాగి మీదబడితే తెలివిగా తప్పించుకుంది. ఒక యువరాజు పదివేల పారితోషికం ఇస్తూ చెయ్యి పట్టుకున్నాడు. కిటికీలోంచి దూకి పారిపోయింది. ఇంకోసారి ఒక పెద్ద వ్యాపారవేత్త కచేరీ ముగియగానే ఆమె లేచి వెళ్ళే దోవకు అడ్డంగా నిలబడ్డాడు. ఆమె లొంగకపోయేసరికి పిస్తోలు చూపి బెదిరించబోయాడు. ఈలోగా ఆమె పరిజనం సమయస్ఫూర్తిగా ‘‘పాము పాము’’ అని అరవడంతో జనం పోగయ్యారు. ఆమె అతని డబ్బు అతని మొఖాన కొట్టి తప్పించుకుంది. బొంబాయిలోని మాతుంగాలో జరిగిన ఒక పెద్ద పార్టీలో రాజులూ, యువరాజులూ అందరూ చూస్తుండగానే, కచేరీ ముగింపుకు వచ్చే సమయంలో అతిథుల్లో ఒకరు ఆమె చేయి పట్టుకున్నారు. ఆమె గట్టిగా ‘‘ఇది నీ రాజ్యం కాదు బొంబాయి, గుర్తు పెట్టుకో, నీ ప్రవర్తన సరిగా లేకపోతే ఫలితం అనుభవిస్తావు’ అని లేచి చక్కగా వచ్చేసింది. ఇంటికి తిరిగి వచ్చాక చాలా బాధపడి, ఏడ్చి, తన భర్త పాదాలు తాకి ప్రమాణం చేసింది ‘ఇకపై ప్రజల సమక్షంలో కచేరీలు చేయను’ అని. 1920ల కాలంలో తన గురువు నజీర్‌ ఖాన్‌ మరణం కూడా ఆమెను కుంగదీసింది. కచేరీలు చేయాలనే ఉత్సాహం నశించింది. 1923లో బొంబాయి టౌన్‌ హాలులో పాడినదే ఆమె చివరి కచేరీ. అలా తన నలభయ్యవ యేట ఆమె తన సంగీత కచేరీలకు స్వస్తి చెప్పింది. భర్త చాటు భార్యగా, దేవాలయాలలో పాడుకుంటూ ప్రశాంత జీవనం గడపాలనుకుంది, కానీ విధి వేరుగా తలచింది. 1928లో ఆమె భర్త వాసన్‌ జీ మరణించాడు. ఆయనకి వ్యాపారంలో చాలా నష్టాలు రావడంతో ఉన్న ఆస్తులన్నీ అమ్మి అప్పులు తీర్చవలసి వచ్చింది. అప్పుడు మళ్ళీ సంగీతాన్ని ఆశ్రయించింది. అయితే ఈ సారి సంగీత ప్రదర్శకురాలిగా కాదు సంగీత బోధకురాలిగా ప్రయాణం ప్రారంభించింది. అనేకమంది అద్భుతమైన శిష్యులను తయారుచేసింది. ఒక్కొక్కరూ ఒక్కో వజ్రం. కుమార్‌ గంధర్వకిషోర్‌ అమన్‌ కర్‌, ‘గజల్‌ క్వీన్‌’ అని పిలవబడే బేగం అఖ్తర్‌, నైనా దేవి, లతా మంగేష్కర్‌… వీరందరూ ఆమె శిష్యులే.
కుమార్‌ గంధర్వ తన సంగీత ప్రతిభ అంతా ఆమె భిక్షేనంటాడు. కిషోరి అమన్‌ కర్‌ తన కంఠంలో పలికే మీండ్‌లకి కారణం ఆమేనంటుంది. బేగం అఖ్తర్‌ తన గజల్‌ గానంలో పదాలను ఎలా పలకాలో నేర్పిందామేనని తలచుకుంటుంది. 1958లో హిందుస్థానీ సంగీతానికి ఆమె చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ని ఇచ్చి సత్కరించింది. ఈ పురస్కారం పొందిన మొట్టమొదటి స్త్రీ అంజనీబాయ్‌ మాల్పేకర్‌. అలా హిందుస్థానీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన ఆమె ఆగస్టు 7, 1974లో తన తొంభయ్యవ యేట తనువు చాలించింది. ఆమె యవ్వనంలో ఉండగా పాడిన పాటలేవీ అందుబాటులో లేవు. ఆమె శిష్యులు పాడినవి విని ఆమె గాన సామర్ధ్యాన్ని అంచనా వేసుకోవడమొక్కటే మార్గం. దాదాపు వంద సంవత్సరాల క్రితమే ఈ పురుషాధిక్య ప్రపంచాన్ని ఎదుర్కొని, నిలబడి తన లక్ష్యాన్ని సాధించిన ధీర మహిళ అంజనీ బాయ్‌ మాల్పేకర్‌ గురించి, ఈ నాటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ఆమెకు నా నివాళి.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.