అదిగో…
అంత దూ‘రాన’
ఆమె నన్ను చూసినా
నేను ఆమెను చూసినా
పలకరించేది మాత్రం ముందుగా ఆమే
అదేమిటో ‘గాని ఎప్పుడూనూ!
ఆమె నా దిక్కుగా…
నడిచి వచ్చేటప్పుడు
ఒక్కత్తే ఎప్పుడూ రాదు?
వెంట…
సిగ్గు ప్రియం వదనూ…
చిరునవ్వు అనసూయనూ…
తెచ్చుకుంటుంది!
ఆపై
ప్రియంవద భుజం తడితే
అనసూయ తోడు రాగా
మందగమనంతో వస్తుందా…
మంద్ర స్వరంతో…
బాగున్నారండీ అని పలకరిస్తుంది!
వరసలున్నా ఏనాడూ
వరసపెట్టి పిలవనేలేదు!
ఏలనో…
ఎల‘నాగ’!
ఎక్కడున్నాం?
‘బాగున్నారండీ’ అని
అంతవరకూ బాగానే ఉంటుంది!
‘చిన్నమ్మాయి’ ‘బాగుందాండీ’ అని
తనని తలవని మనుషుల
బాగోగుల్ని అడగటానికి
ఎంత సంస్కారం కావాలి?
ఎంతటి సంస్కార వంతురాలై ఉండాలి
అంచనాలకెప్పుడూ అందలేదు
చదువు లేదు… ‘సంస్కారం’ ఉంది!
సంస్కారం లేదు ఏదో చదువుంది
ఆ చిన్నమ్మాయికి…
‘బాగున్నారండీ’ అని అంతటితో ఆపేయాలి అనుకున్న
ఆపదే?
సంస్కార! స్నేహలత!! స్వజన ప్రేమి!!!
ఆమె…
కళ్ళల్లో వెన్నెల
సిగ్గులో వెన్నెల
చిరునవ్వులో వెన్నెల
పలకరింతలోనూ వెన్నెలే!
నలుచెరుగులా వెన్నెల…
వెన్నెల యావత్తూ భువికి దిగి వచ్చాక…
దిగిరాక ఏం చేస్తాడు ఏ చంద్రుడు మాత్రం!
ఆమె ఎప్పుడు పలకరించినా
అది వెన్నెల వేళే…
అది మల్లెల మాసమే…!!