డిసెంబర్ 11, 12 తేదీలలో హైదరాబాద్‌లోని ‘డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణా కేంద్రం’లో ‘శీతాకాల కథా ఉత్సవం’ పేరుతో రైటర్స్ మీట్ జరిగింది. ఖదీర్, సురేష్ ఈ రైటర్స్ మీట్ కన్వీనర్లు. అక్కిరాజు భట్టిప్రోలు, కరుణ కుమార్, కూనపరాజు కుమార్, రaాన్సీ పాపుదేశి, వెంకట్ సిద్ధారెడ్డి, మహి బెజవాడ, కోడూరి విజయ్‌కుమార్‌లు కోర్ కమిటీ.
హైదరాబాద్‌కు నా రాకపోకలు మొదలై 50 ఏళ్ళకు పైనే అయింది. నా కాలంలో… స్థలంలో… చెన్నారెడ్డి నుంచి ఇప్పటిదాకా ఒక అమాయకపు అడివంచు పిల్లవాడిగా నేను పక్కపక్కనే ఉన్నాను. రెండేళ్ళ కింద ఇదే హైదరాబాద్‌లో యువ సినిమా దర్శకులు, స్క్రీన్‌ప్లే రచయితలు, పాటల రచయితలు వందమందికి పైగా పాల్గొన్న ఒకరోజు కలయికలో ‘పూర్తిగా కుళ్ళిపోయిన సినిమా మాధ్యమం’ గురించి, వాటి కారణాలను, ఆ యువ కిశోరాలు అనేక ఉద్వేగాలతో చర్చించారు. అందులో పాల్గొనడం నాకు ఒక కొత్త ఊపిరిని పోసింది.
మళ్ళీ ఇప్పుడు ఈ రైటర్స్ మీట్‌లో నలభై మందికి పైగా రచయితలు, దర్శకులు, చిత్రకారులు, చరిత్ర పరిశోధకులు, ప్రచురణకర్తలు, పాఠకులు… వివిధ అధికార యంత్రాంగాలలో పనిచేసిన వారినుంచి మొదలుకొని పదకొండేళ్ళ సీతాకోకచిలుక సైరా వరకు ఉన్నారు. సైరా అందరికంటే చిన్నది. అనేక సినిమా కథలకు ఊపిరి పోసిన వేమూరి సత్యనారాయణ, నేను బహుశా వయసులో పెద్దవాళ్ళం. విచిత్రంగా వేమూరి, నేను, సైరా ఎక్కడో కొత్త కలలకు ఊపిరి పోసుకుంటున్నాం.
ప్రపంచంలోని అన్ని రకాల పరిణామక్రమాలు… భూస్వామ్యం, పెట్టుబడిదారి, సామ్రాజ్యవాద, సోషలిస్టు సమాజాల నిర్మాణ క్రమంలో… ప్రజలు తమ సాహిత్యాన్ని కూడా నిర్మించుకున్నారు. వర్తమానంలో ఆ సాహిత్యం సమాజ విధ్వంసక స్థితిని ఎలా చర్చించిందో… కథ, నవల ఎలా ఆ మేరకు స్పందించాయో ఆ కథల బడిలో నిర్దాక్షిణ్యంగా చర్చించారు. అనంత్ చింతలపల్లి, అక్కిరాజు, సురేశ్, మధురాంతకం నరేంద్ర, ఉణుదుర్తి సుధాకర్, చిలుకూరి ఉమామహేశ్వర శర్మ, వారి సహచరి శాంత గారు, మధ్యలో అత్యంత దుర్భర జీవన యానాన్ని చార్లి చాప్లిన్ కంఠస్వరంలో వివరించిన కరుణకుమార… రెండు తెలుగు ప్రాంతాల మర్మర ధ్వనులు.
రచయిత సదయ్య తన చుట్టుముట్టిన నీలాకాశాన్ని మా అందరి మనసుల్లోకి, రచయిత్రి డా.దేవేంద్ర తాను నడిచిన పల్లెటూరి చీకటి దారులను మా సమక్షంలోకి తమ మాటలతో తీసుకువచ్చారు. కావలి వీథుల నుంచి బయలుదేరిన ఖదీర్ తన కథలతో వర్గ, కుల, మత, లింగ, ప్రాంత వైరుధ్యాలలో నుంచి నడవదలచుకున్న వేలాదిమందిని చేరుకోవడం ఒక సుదీర్ఘ నడక. ఒక నేర్చుకోవడం. తెనాలి నుంచి బయలుదేరిన సురేశ్ లోలోపల ఎన్ని సుడిగుండాల పరంపరలో… ఇవన్నీ ఆ రచయితల కలయికలో అందరూ పంచుకోవడం… అనుభవాలు ఇచ్చి పుచ్చుకోవడం.
షీ టీంలో పనిచేస్తున్న బమ్మిడి అమ్ము నేటి మహిళల ధీరోదాత్త గాథల అధ్యయనం… గోసంగి గంధం విజయలక్ష్మి ప్రయాణం ఆసక్తి రేపాయి. గంధం విజయలక్ష్మి సంచార జాతిలో మొదటి మహిళా డాక్టరేట్, ఉపాధ్యాయురాలు, రచయిత్రి. ఆమె కృషి స్ఫూర్తినిచ్చింది. ఈసారి ఎక్కువమంది మహిళలు తడబడే అడుగులతో స్థిరమైన జీవనపోరాట అనుభవాల్లోంచి వచ్చినవాళ్ళు… వాళ్ళందరూ గతంలో అన్ని రకాల పితృస్వామ్య హింసలో ధీరోదాత్తంగా నిలబడినవారు. విచిత్రంగా వీళ్ళలో చాలామంది పల్లేరుగాయల తొవ్వల్ల నుంచి, అంటరానివాడల నుంచి కలెక్టర్లు మాత్రమే శిక్షణ తీసుకునే మానవ వనరుల కేంద్రంలో జరుగుతున్న కథకుల పాఠశాలకు మట్టికాళ్ళతో వచ్చారు. వాళ్ళను గుర్తించి, ఊరు పేరు లేని సాహిత్యకారులను వెతికి పట్టుకుని, పిలిచి ఆలింగనం చేసుకున్న కోర్ కమిటీకి, ముఖ్యంగా ఖదీర్, సురేష్ లాంటి అందరినీ వాళ్ళు మెరిసే కళ్ళతో చూశారు. తెలంగాణ పల్లె మాదిగవాడ నుంచి వచ్చిన చిత్రకారుడు చంద్రశేఖర్ కొప్పు తనను తాను వెతుక్కుంటూ అందరి చిత్రాలు గీశాడు. ‘నాకు తాత్విక పుస్తకాలు కావాలి’ అని నన్ను అడిగారు.
తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి, సీనియర్ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ కె.రామకృష్ణారావు ఈ మీట్ జరగడానికి పరోక్ష కారకులు. సాహిత్యానికి ఉండే బహుముఖ మానవ ఆచరణను ప్రభావితం చేసే గుణాన్ని గుర్తెరిగి మేము ఎప్పుడూ ఊహించని వసతులు కలిగించారు ఆయన. తాను ఒక సెషన్‌లో పాల్గొని కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో ఎదురయ్యే అనేక సవాళ్ళను వివరించారు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా వచ్చే పుస్తకాలు, అమెరికా, యూరప్, ఆసియా దేశాల నుంచి ఎంపిక చేసుకున్న యాభై పుస్తకాలు ప్రతి సంవత్సరం చదువుతారంటే నాకు ఆశ్చర్యం కలగలేదు. అధ్యయనం లేకుండా ఏ వ్యవస్థ నిలబడదు. దీని మర్మం రచయితలు అర్థం చేసుకోకపోతే… చెహోప్ అన్నట్లుగా… సగం కాలిన ఇటుకలతో పునాది లేని ఇల్లు కట్టే వాళ్ళుగా మిగిలిపోతారు.
చెన్నై నుంచి వచ్చిన వెణ్ణిల తమిళ రచయిత్రి గారు… అక్కడ చాలా ప్రముఖ రచయిత్రి, కవి. ద్రవిడ మున్నెట్రకజగం రాజకీయాలలో కార్యకర్త. ప్రచురణ కర్తగా అనేక చరిత్ర పుస్తకాలను ప్రచురించారు. మహిళా రచయిత్రిగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని, తమిళ సాహిత్యాన్ని వివరించారు. కర్నాటకలోని కూర్గ్ పల్లెలో జనావాసాలకు దూరంగా హ్యారీపాటర్‌లాగా ఒక ఇంటిలో ఒంటరితనంలో తన ప్రయాణాన్ని సాగించిన కన్నడ రచయిత్రి శాంతి అప్పణ్ణ తన తల్లి నుంచి ఎలా స్ఫూర్తి పొందిందో తెలిపింది. వీరితోపాటుగా దక్షిణ భారతదేశ సాహిత్య సారాంశంతో స్థిరంగా, ధీరోదాత్తంగా కృషి చేస్తున్న అనువాదకుల గురించి వివరించారు అజయ్‌వర్మ, అవినేని భాస్కర్.
ఒకరా, ఇద్దరా… శ్రీకాకుళం నెత్తుటి అనుభవాల నంచి ‘యారాడ కొండ’ పునాది తవ్విన ఉణుదుర్తి సుధాకర్, దేవదాసీల లోలోపలికి నడిచి దుఃఖాన్ని అనుభవించి మనకందించిన మధురాంతకం నరేంద్ర, నిరంతరం సతమతమయ్యే పూడూరి రాజిరెడ్డి, ఫోన్ సిగ్నల్ కూడా చొరబడని విశాఖ మారూమూల అడవి గ్రామంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మిథున… ఏమాలోచిస్తారు? ఏమి నేర్చుకుంటారు? అక్కిరాజు భట్టిప్రోలు తన క్లాస్‌లో ‘పెయిన్, ట్రెండ్, వేస్ట్’ల థీమ్ గురించి వివరిస్తే అనంత్ ఆ నిర్మాణంతో కూడా కథ ఎలా రాయొచ్చో చెప్పాడు. తుఫాను గాలి రుబీన్ పర్వీన్, ముస్లిం సాహిత్యంలో మహిళల గురించి వివరించిన సాజిదా, ఆలమూరు మనోజ్ఞ, శ్రీ ఊహ, సుజాత వేల్పురి, ఉమా నూతక్కి, సుజాత మణిపాత్రుని… వీరందరూ పంచుకున్న సాహిత్య జీవన గమన విషయాలు… రేపు సాహిత్య ప్రపంచంలో చోటు కల్పించుకోబోయే యంగ్, డైనమిక్ శ్రీనివాస్ సూఫి, సురేంద్ర శీలం, సాయం వంశీ, మహమ్మద్ గౌస్, చరణ్ పరిమి, షేక్ పీర్ల మొహమ్మద్, అరుణ్‌కుమార్ ఆలూరి, వెంకట కిషన్, బొలిశెట్టి పద్మజలు ఈ సభలకు హైలైట్. కుమార్ కూనపరాజు, కృష్ణమోహన్‌లు ప్రచురణ రంగంలోని సాధకబాధకాలు తెలిపారు.
ఇంతకూ ఈ నేర్చుకోవడంలో సరైన భావాలు ఎక్కడి నుంచి వస్తాయి? సామాజిక ఆచరణ నుంచే వస్తాయట. మనిషి సామాజిక జీవనమే ఆ మనిషి ఆలోచనా సరళిని నిర్ణయిస్తాయట. పురోగమిస్తున్న వర్గాలు సాధించిన సరైన భావాలను జన బాహుళ్యం కూడా పుణికి పుచ్చుకున్నప్పుడే ఈ సరైన భావాలు మొత్తం సమాజాన్ని మార్చే భౌతిక శక్తిగా మారుతాయట.
బహుశా ఇక్కడెక్కడో ఈ డిసెంబరు చలిలో మేమందరం ఇదే నేర్చుకునే ప్రయత్నం చేశామా?
అవునేమో.
మరో రైటర్స్ మీట్ వరకు సెలవు.