యెంత ద్వేషం
యెంత కడుపు మంట!
పచ్చని చెట్లలో పసిరిక పాము కులం
చూస్తూ వూరుకుంటుందా !
మా మూతికీ ముడ్డికీ
యింకా వేలాడాలని దాని కోరిక
పసిరిక పాముకి నువ్వంటే
అంత పగ వుండదా మరి!
యెందుకంటే నువ్వు
దాని కోరలు పీకి
నెత్తిమీది కిరీటాలు
నేలపాలు చేసినోడివి
వూరిముందు
చెప్పులు చేతబట్టుకుని
వొంగి వొంగి నడిచిన కాళ్ళని
ఆకాశ వీధిలో నిలిపావు
పసిరిక పాముకి నువ్వంటే
ఆమాత్రం కడుపుమంట
వుండదా మరి!
విలాస పురుష్ పసిరిక పాముకి
నువ్వే తన విలాసమైతే యింకేముంది!
కడుపులో దేవినట్టు వుండదూ!
యిన్నాళ్ళూ వూరూ వాడా
అన్నదమ్ముల్లా వున్నాం
యిప్పుడీ బొమ్మ వల్లే పొరపొచ్చాలు
పసిరిక పాము సన్నాయినొక్కులు
యెన్నిసార్లు విన్నాం
బాబాసాహెబ్,
వైరుధ్యాల చౌరస్తాలో నిలబడి
వేలెత్తి చూపించే నిన్ను చూస్తే
కౌటిల్యం సలసల కాగుతుంది
పచ్చని కొబ్బరాకుల మాటున దాగినా
కొండగుహల్లో పొంచినా
కులం పాముని
కలవరపెడుతూనే వుంటావు
నువ్వీదేశం అంతరాత్మవి!
నీపేరు మరవాలంటే అయ్యేపనేనా?
పిచ్చి పాము…