ప్రేమిస్తున్నాననుకుంది
కానీ,
ప్రేమిస్తున్నాననుకున్న భావాన్ని ప్రేమించింది
అందుకే, ఉన్మత్తురాలయింది
ప్రేమరాహిత్యపు అంచులకు ఇక విముక్తి అనుకుంది
స్వచ్ఛమయిన సహజమైన మానవ పరీమళభూతమైంది
ప్రేమనుమించిందేదీ లేదనుకుంది
పాలనురుగులాంటి అమాయకత్వం
పోతపోసిన వ్యక్తిత్వ నిరూపణత్వం
ఏదైనా సాధించగలను
ఎంతైనా ఓర్చుకోగలననుకునే
ఆత్మాభిమాన ఆత్మ విశ్వాసాలు
కరుణాంతరంగం,నిలువెత్తు ప్రేమమూర్తి
కెమెరా ముందు నటించి నటించీ
పాత్రలో జీవించి జీవించీ
నిజజీవితంలో నటించలేకపోయింది
ఆమె కలవరించిన , కల వరించిన
ప్రేమరూపం
శరీరవ్యాపారమని తెలిసేలోపు
జీవితం తెల్లారగట్ట మలుపు తిరిగింది
ఆయువుపట్టు గుచ్చిన గాయం
ఆమె
రక్తాన్ని మరిగించి మరిగించి మద్యపానమైపోయింది
రెట్టించిన రోషం తుఫానులా విరుచుకుపడితే
తనువంతా లావా లాపగిలిపోయింది
కాగితపు ముక్కల వేటగాడని తెల్సి
రాగరహిత నిర్వేదమూర్తి అయింది
ఎందరెందరికో ఇంటి దీపమై
ఎందరెందరికో ఆరాధ్య దేవతై
పిల్లలకు పేరై
సగటు మగవాడి దాష్టీకాల మధ్య
శిరసెత్తి నిలిచిన ధీరోధాత్త అయింది
పొందిన క్షణాల మడతల్లో
పోగొట్టుకున్న బతుకు ఛిద్రమైంది
నిర్మోహపు స్వప్నరాగలీన ఐంది
నీలపు నిప్పురవ్వ నింగి తునకైంది
మరణం ఆమె చిరునామా కాదు
బతుకు రణమే గెలుపు కెరటమైంది
ఆమె
గుండెను చీల్చుకొచ్చిన సముద్రం
అందరి కళ్ళల్లోనూ నీటిచుక్కలైంది.
( సావిత్రి జ్ఞాపకాల్లో………..)